ఏపీ అసెంబ్లీ: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా సాధ్యమేనా, నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, APLEGISLATURE.ORG/YSJagan/FB
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి హాజరై ఫలితమేముందని గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు వైఎస్ జగన్.
శాసన సభ సమావేశాలు జరిగిన రోజున తన పార్టీ కార్యాలయం నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తానని గతేడాది నవంబర్‌లో ఆయన మీడియా ఎదుట ప్రకటించారు. చెప్పినట్లుగానే సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు.
దీంతో, సోమవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవుతారా? లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది.
ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శాసన సభా పక్ష సమావేశంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
అయినప్పటికీ, చివరిక్షణం వరకు జగన్ రాకపై సందిగ్ధత నెలకొంది. అయితే, సోమవారం సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యారు.


ఫొటో సోర్స్, APCM/FB
మళ్లీ అదే డిమాండ్
ప్రతిపక్ష హోదా కోరుతూ గతంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, కొన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ సభ్యులు, తిరిగి సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే గళాన్ని వినిపించారు.
సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నినాదాలు చేశారు.
దాదాపు పది నిమిషాలకుపైగా నినాదాలు చేసి.. వైఎస్ జగన్‌తో సహా ఆ పార్టీ సభ్యులందరూ బయటకు వచ్చేశారు.
రేపు పులివెందులకు జగన్
కాగా, బడ్జెట్ ప్రారంభ సమావేశాలకు వచ్చిన వైఎస్ జగన్ ఈ సమావేశాలు ముగిసే వరకూ క్రమం తప్పకుండా వస్తారా అనేది ప్రశ్నార్ధకంగానే ఉంది.
ఎందుకంటే, మంగళవారం ఆయన పులివెందులకు వెళ్లనున్నారని, బుధవారం అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారనీ వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆయన బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, facebook/Somireddy Chandra Mohan Reddy
అనర్హత భయంతోనే వచ్చారు: టీడీపీ
అసెంబ్లీకి వరుసగా 60 రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందనే భయంతోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారని టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
వైఎస్ జగన్‌కు కనీస బాధ్యత, ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి పోవడం కాదు, రోజూ అసెంబ్లీకి రావాలని సోమిరెడ్డి సూచించారు.
జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, తాను ప్రతిపక్ష నాయకుడు కాదనే విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా అడగడం సరికాదని, జగన్‌కి దురాశ పనికిరాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, X/BotchaBSN
సభలో రెండే పక్షాలు: బొత్స
''ఏపీ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షం, మిగిలిన ఏకైక పక్షం వైఎస్సార్‌సీపీ. సభలో రెండే పక్షాలున్నప్పడు మా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే'' అని శాసనమండలిలో విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సమావేశాలను బహిష్కరించిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం. ప్రభుత్వం స్పందించే స్థితిలో లేనందున వాకౌట్ చేసి బయటికొచ్చాం'' అని అన్నారు.
ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటే...
పది శాతం సీట్లు వచ్చిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది రివాజు అని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బీబీసీతో చెప్పారు.
''ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదాతో పాటు అసెంబ్లీ సభా నాయకుడి తర్వాత మాట్లాడే సమయం ఇస్తారు. మిగిలిన సభ్యులకు సహజంగా 2 నిమిషాలిచ్చినా మాట్లాడే విధానం, ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి ఎన్ని నిమిషాలైనా స్పీకర్ ఇవ్వొచ్చు. కానీ, ప్రొటోకాల్ కోసం వైఎస్ జగన్ పట్టుబట్టడం సరికాదు'' అని వేదవ్యాస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, APLEGISLATURE.ORG
1977 తరువాత...
నిజానికి 1977వరకూ ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకూ రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావించారు.
ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికార కూటమిలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
ఇంతకుముందు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ, తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు.
1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్/ శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు.
వాటి ప్రకారం, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి. ఈ మేరకు లోక్ సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు.
2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21 , వైఎస్సార్సీపీకి 11, బీజేపీకి 8 స్థానాల చొప్పున దక్కాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో పాటు, ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నాయి.
కాగా, 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది.
అయితే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.
ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే..
ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. పీఎస్, పీఏ సహా సిబ్బంది, అలవెన్సులతో పాటు ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది.
సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది.
మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు.
వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది.
అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్షనేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది.
ఇక 16,17 లోక్ సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.
దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆ పార్టీ. అయితే, స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
దీంతో లోక్ సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.
1984 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.
పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సీవీసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోక్‌పాల్ వంటి సంస్థల అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














