చాంపియన్స్ ట్రోఫీ: ఇండియా చేతిలో తమ జట్టు ఓటమిపై పాక్ ప్రజలు, ఫ్యాన్స్ ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఓటమి తర్వాత, పాకిస్తాన్ జట్టుపై అక్కడి మాజీ క్రికెటర్ల నుంచి సామాన్య ప్రజల దాకా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాతో పాటు పాకిస్తాన్ టీవీ, వార్తాపత్రికల్లో ఆ దేశపు జట్టుపై చాలా కోపం కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా, భారత్ సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, పాకిస్తాన్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించడం దాదాపు అసాధ్యంగా మారింది.
పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయం ఆ జట్టుకు అంత అనుకూలించలేదని మ్యాచ్ ఫలితం తెలియజేస్తోంది.

పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగినప్పుడు, భారత బౌలర్లు పరుగులిచ్చిన తీరు చూస్తే పాకిస్తాన్ పైచేయి సాధిస్తుందని అనిపించింది. తొలి ఓవర్లోనే భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ ఐదు వైడ్ బంతులు వేశాడు. తొలి ఓవర్లో షమీ 11 బంతులు వేశాడు. పాకిస్తాన్‌కు 17 అదనపు పరుగులు ఇచ్చింది భారత్. దీంతో సోషల్ మీడియాలో భారతీయులు షమీని విమర్శించడం కూడా మొదలుపెట్టారు.
కానీ, 9వ ఓవర్ రెండో బాల్‌కు హార్దిక్ పాండ్యా బాబర్ ఆజమ్‌ను ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఏదీ అనుకూలించలేదు.
50 ఓవర్లలో ఇంకా రెండు బంతులు మిగిలి ఉన్నప్పుడు, 241 పరుగులకు పాకిస్తాన్ జట్టు ఆలౌట్ అయింది. పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో ఛేదించింది. పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి చేరింది. పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది. గ్రూప్ Aలో భారత్ మొదటి, న్యూజిలాండ్ రెండు, బంగ్లాదేశ్ మూడు, పాకిస్తాన్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీని ఔట్ చేయగలరని అనిపించిందా: వసీం అక్రమ్
''అయిపోయిందేదో అయిపోయింది. మనం కఠిన చర్యలు తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా మనం వైట్ బాల్ క్రికెట్‌లో ఓడిపోతున్నాం. ఏ జట్టుతోనైనా ఓడిపోతున్నాం. ఇప్పుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. ధైర్యంగా ఆడే యువ క్రికెటర్ల అవసరం జట్టుకి ఉంది. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాలి. ఇక చాలు'' అని పాకిస్తాన్ ప్రముఖ క్రికెట్ షో, స్పోర్ట్స్ సెంట్రల్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యానించారు.
''పాకిస్తాన్ ఆడిన ఐదు మ్యాచుల్లో, బౌలర్లందరూ 60 సగటుతో 24 వికెట్లు తీశారు. అంటే, వికెట్‌కు 60 పరుగులు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే సెలక్షన్ కమిటీ, కెప్టెన్, కోచ్‌తో పీసీబీ చైర్మన్ సమావేశం కావాలి. ఆడడానికి ఎవరికి అవకాశం ఇచ్చారో వారిని పరిశీలించుకోమనాలి? కుష్‌దిల్ షా, సల్మాన్ ఆఘా వంటి వారు విరాట్ కోహ్లీలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయగలరని మీకు అనిపించిందా?'' అని వసీం అక్రమ్ ప్రశ్నించారు.
''ఈ 11 మంది ఆటగాళ్ల జట్టు సరైనది కాదని మేం గగ్గోలు పెడుతూనే ఉన్నాం. మీరు మార్పులు చేయాలనుకుంటే చేయొచ్చు అని చైర్మన్ కూడా అన్నారు. కానీ, అదే 11 మందిని తుదిజట్టుకు ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్ కూడా దోషే. ఎందుకంటే, జట్టుకు కెప్టెనే నాయకుడు కాబట్టి.
మ్యాచ్ గెలిచేందుకు ఏ ఆటగాళ్లతో ఆడాలో కెప్టెన్‌కే తెలియకపోవడం సిగ్గుచేటు. 20 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ అభిమానులు దుబయి స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు'' అని వసీం అక్రమ్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ అక్కడే ముగిసింది: వఖార్ యూనిస్
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ వఖార్ యూనిస్ తమ జట్టును తీవ్రంగా విమర్శించారు.
"పాకిస్తాన్ క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్ విషయంలోనూ అదే పరిస్థితి. బాబర్ బాగా ఆడతాడనిపించింది.. కానీ, అతను తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. రిజ్వాన్ లోపలికి వచ్చిన వెంటనే ఫోర్ కొట్టాడు. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు'' అని వఖార్ యూనిస్ అన్నాడు.
''ఇది అసాధారణమైన విషయమేమీ కాదు. అసలు విషయం ఏమిటంటే, కెప్టెన్ బుర్రకు పనిచెప్పలేదు. ఏం చేయాలో అతనికి తెలియదు. అతనికిప్పుడు మాట్లాడాలని కూడా అనిపించడం లేదు'' అని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విమర్శించారు.
అదే కార్యక్రమంలో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ జట్టులో ప్రతిభ ఉంది. కానీ, ప్లానింగ్ లోపించిందని ఆరోపించారు. హఫీజ్ వ్యాఖ్యలపై స్పందించిన షోయబ్ ''ఏం ప్రతిభ ఉంది.. ప్రతిభ అంటే ఏమిటర్థం'' అని ప్రశ్నించారు.
''మంచి ఓపెనర్ లేడు, మంచి స్పిన్నర్ లేడు, రెండో స్పిన్నర్ లేడు. ఉన్నవారు సక్రమంగా లేరు. జట్టు ఎంపిక సరిగ్గా లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆ పిచ్‌పై 241 పరుగులు చిన్న విషయమని నేను అనుకోవడం లేదు'' అని మొహమ్మద్ హఫీజ్ బదులిచ్చారు.
''బాబర్, విరాట్‌లను పోల్చగలమా? శ్రేయస్ అయ్యర్‌ను, కుష్‌దిల్ షాను ఒకేలా చూడగలమా? రోహిత్ శర్మను, ఫఖర్ జమాన్ లేదా రిజ్వాన్‌లతో పోల్చవచ్చా? ఏ ప్రతిభ గురించి మీరు మాట్లాడుతున్నారు? ప్రతిభ బయటకు కనిపిస్తుంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నక్షత్రం చీకట్లో ఉండదు, ప్రకాశిస్తుంది'' అని షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించారు.
''రిజ్వాన్, సౌద్ షకీల్ మధ్య 104 పరుగుల భాగస్వామ్యం ఉంది. కానీ, వారిద్దరూ 144 బంతుల్లో 104 పరుగులు చేశారు. వన్డే క్రికెట్‌లో ఇలా ఉండకూదు. వారిద్దరూ 24 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. కానీ, వాటిలో 19 ఓవర్లలో ఐదు లేదా అంతకంటే తక్కువ పరుగులు వచ్చాయి.
భారత్ తొలి 10 ఓవర్లలో 11 బౌండరీలు కొడితే, పాకిస్తాన్ తొలి 30 ఓవర్లలో 11 బౌండరీలు కొట్టింది. మ్యాచ్ అక్కడే ముగిసింది. రిజ్వాన్, షకీల్ భాగస్వామ్యం పాకిస్తాన్ ఓటమికి కారణమని నేను నమ్ముతున్నా'' అని వఖార్ యూనిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'అదే మరింత బాధాకరం'
''భారత్ చేతిలో ఓడిపోవడం మనల్ని మరింత బాధిస్తుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, భారత్ ఇప్పుడు దానికంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే, ఏం జరగబోతోందో వారికి ముందే తెలుసు.
భారత్‌తో ఆడితే పాకిస్తాన్ కచ్చితంగా ఓడిపోతుందని ప్రజలు నమ్ముతున్నారు. మ్యాచ్ గెలిచాక భారత్ చాలా హుందాగా స్పందించింది. మనం బంగ్లాదేశ్‌లాగా భారత్‌ను సవాల్ కూడా చేయలేదు. ఎప్పుడు, ఏం చేయాలో భారత్‌కు తెలుసు'' అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్‌లో వ్యాఖ్యానించారు.
''భారత జట్టు భయపడదు. పాకిస్తాన్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. రిజ్వాన్ కెప్టెన్సీ ఇంకా బాగుండాలి. పాకిస్తాన్ స్పిన్ చాలా బలహీనంగా ఉంది. పాకిస్తాన్ జట్టులోని 11మంది ఆటతీరు చాలా దారుణంగా ఉంది. సౌద్ షకీల్ నిర్లక్ష్యంగా ఆడాడు. సల్మాన్ ఆఘా కూడా అంతే. 242 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడం ద్వారా మనం భారత్‌ను గెలవలేం. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన ఫిట్‌నెస్‌తో కనిపించాడు'' అని రమీజ్ రాజా విశ్లేషించాడు.
''ముందు, మనం సెలక్షన్ కమిటీ గురించి మాట్లాడాలి. బాబర్ ఆజమ్‌ను ఓపెనర్‌గా ఎందుకు పంపారు? జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి, స్పిన్నర్ అవసరం గురించి మాట్లాడుతున్నాం. ఓటమికి కారణమయ్యే వారినే జట్టులోకి తీసుకుంటున్నాం.
స్పిన్నర్లతో ఆడుతున్న భారత్ పిచ్చిదా? కోహ్లీ ఆషామాషీగా ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదగలేదు. మన హీరోలు సోషల్ మీడియా సింహాలు'' అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ పాకిస్తాన్ చానల్ ఏఆర్‌వైతో మాట్లాడుతూ విమర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














