IndvsPak: భారత్ చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ టీమ్‌కు సమస్యలు ఎలా పెరుగుతాయంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విమల్ కుమార్
- హోదా, బీబీసీ కోసం, దుబాయ్ నుంచి..
పాకిస్తాన్ జట్టుకు డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి లాంటి కోచ్ అవసరం ఉందని ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఇప్పుడా లోటు లేనట్లే. ఎందుకంటే వారి కోచ్ ఆకిబ్ జావెద్.
తన మాటలతో శవానికి కూడా ప్రాణం వచ్చేలా చేస్తాడని రవిశాస్త్రికి పేరుంది. ఆకిబ్ జావెద్ కూడా అలాంటి వాడే.
కొత్త తరానికి ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ 1990లలో, పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు, ఆకిబ్ జావేద్ తన వేగం, దూకుళ్లతో భారత్‌ను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీమ్ ఇండియాపై చిరస్మరణీయ హ్యాట్రిక్ సాధించిన ఆకిబ్, కొన్ని నెలల కిందటే పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత ఆ జట్టు కొన్ని మంచి ఫలితాలను కూడా సాధించింది.
కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే, స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పే కోచ్ ఉన్నా, పేపర్ మీద చాలా సాదాసీదాగా కనిపిస్తున్న పాకిస్తాన్ జట్టు, చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మీద మెరుగైన ఫలితాలను సాధించగలదా? అన్నది.


ఫొటో సోర్స్, Getty Images
దుబాయ్ వచ్చిన తర్వాత జావెద్ మొదటగా తన పాత సహచర ఆటగాడు, మాజీ ఓపెనర్ ముదస్సర్ నాజర్‌తో మాట్లాడాడు. ‘‘మీకు దుబాయ్ పిచ్ మీద ఉన్న సందేహాలన్నింటినీ ముదస్సర్‌ను అడగండి’’ అని ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లకు సూచించాడు.
ఐసీసీ క్రికెట్ అకాడమీ ద్వారా కొన్నిసార్లు పాకిస్తాన్ జట్టు ప్రధాన కోచ్‌గా మూడు దశాబ్దాలపాటు క్రికెట్ ఫీల్డ్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు ముదస్సర్. అందువల్ల పాకిస్తాన్ జట్టుకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ, పాకిస్తాన్ జట్టులో ఓ స్టార్‌కు స్పిన్ బౌలింగ్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. 2021 వరకు స్పిన్‌పై సగటు 89.94 ను, స్ట్రైక్ రేట్ 89ని నమోదు చేసిన ఈ ఆటగాడు ఇప్పుడు తనకు తానే ఓ నీడలా మారిపోయాడు. ఆయన ఆ స్టార్ ఆటగాడు మరెవరో కాదు, బాబర్ ఆజం.
టీవీ చానళ్లు, యూట్యూబ్‌లలో బాబర్ ఆజంను నిరంతరం విమర్శిస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు. ఒక మ్యాచ్ ఒక ఆటగాడి భవిష్యత్తును మార్చగలిగితే, ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్ బాబర్ ఆజం విషయంలో అదే అవుతుంది.
భారత జట్టు కచ్చితంగా బాబర్ మీద స్పిన్ వల పన్నడానికి ప్రయత్నిస్తుంది.
2022 ప్రారంభం నుండి, బాబర్ అజామ్ స్పిన్ సగటు 31.80కి పడిపోయింది.స్ట్రైక్ రేట్ కూడా 67.65కి దిగజారింది. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్‌కు భారత్ అవకాశం ఇస్తే, పాకిస్తాన్‌కు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
విరాట్, రోహిత్‌లకూ ఈ మ్యాచ్ కీలకమే
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోతే, అది చాంపియన్స్ ట్రోఫీ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మ, అనుభవజ్ఞుడైన ఆటగాడు విరాట్ కోహ్లీకి తెలుసు. ఓటమి అంటూ ఎదురైతే, ఆ భారాన్ని ఈ జంట మోయాల్సి రావచ్చు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ అతిపెద్ద గేమ్ చేంజర్ అవుతాడని నాతో మాట్లాడుతూ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
రోహిత్ శర్మ మాదిరిగా ఏ ఆందోళన లేకుండా షాట్లు ఆడి, క్రికెట్‌ను ఆస్వాదించినట్లుగా విరాట్ కోహ్లీ కూడా ఏదో ఒకటి చేయాలని అశ్విన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఖర్చయినా పర్వాలేదంటున్న ఫ్యాన్స్
ఇటీవలి కాలంలో చాలా తరచుగా కనిపిస్తున్న విషయం, డబ్బున్న క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడకపోవడం.
దుబాయ్‌లో చాలామంది క్రికెట్ అభిమానులు తమ పరిచయాల ద్వారా ఎలాగైనా టిక్కెట్లు సంపాదించడానికి ప్రయత్నించారు.
ఈ మ్యాచ్‌లో టీం ఇండియా గెలిస్తే, సెమీఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం వెచ్చించిన డబ్బు వృథాపోదని, పైగా చాంపియన్స్ ట్రోఫీలో ఇదొక థ్రిల్‌ను మిగుల్చుందని భారత అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దేశంలో ఒక ప్రధాన ఐసీసీ టోర్నీని నిర్వహిస్తోంది ఆ జట్టు. అలాంటి పరిస్థితుల్లో టోర్నీ మొదలైన నాలుగు రోజులకే కేవలం ఒక హోస్ట్ కంట్రీగా మిగిలిపోయే పరిస్థితి రావడం ఆ జట్టుకు ఇబ్బందికరమే.
బహుశా ఈ భయమే ఏదో ఒక అద్భుతం చేయాలని పాకిస్తాన్ జట్టు మీద ఒత్తిడి తీసుకురావచ్చు.
చారిత్రక దృక్కోణం నుంచి చూస్తే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటికీ టీమిండియా మీద ఆధిక్యంలో ఉంది. కానీ ప్రస్తుత ఫామ్, గత రెండు దశాబ్దాల ఆటతో పోల్చి చూస్తే, ఆ జట్టు చాలా సాదాసీదా జట్టులాగా కనిపిస్తోంది.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన చివరి 135 మ్యాచ్‌లలో, భారతదేశం 57 మ్యాచ్‌లలో గెలిచింది, 73 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొంది.
ఇప్పుడు ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు డూ ఆర్ డై లాగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే టోర్నమెంట్ నుండి నేరుగా బయటకు వెళ్లిపోవడమే.

ఫొటో సోర్స్, Getty Images
ఇక టీమిండియాకు ఇలాంటి పెద్ద సమస్యలేమీ లేవు. ఆ జట్టు ఏకైక ఆందోళన ప్లేయింగ్ ఎలెవెన్‌లో జరిగిన ఒక మార్పు గురించే.
గత మ్యాచ్‌లో ఆడిన ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌కు అవకాశం ఇవ్వాలా లేక చాలా కాలం తర్వాత నలుగురు స్పిన్నర్లతో మైదానంలోకి ప్రవేశించాలా అనేది జట్టుకు ఉన్న ఏకైక చిక్కుప్రశ్న.
యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టడం ద్వారా వరుణ్ చక్రవర్తికి టీమిండియాలో స్థానం లభించింది. పెద్ద మ్యాచ్‌లలో ఈ షాకింగ్ ఆయుధంతో ప్రత్యర్థి జట్టును ఓడించడమే టీం ఇండియా వ్యూహం.
క్రికెట్‌లో ఇటీవలి గణాంకాలు, చరిత్ర మాత్రం పాకిస్తాన్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 11 వన్డే మ్యాచ్‌లలో భారత్ 9 మ్యాచుల్లో గెలిచింది. అది వన్డే ప్రపంచ కప్ అయినా, చాంపియన్స్ ట్రోఫీ అయినా, టీ20 ప్రపంచ కప్...ఇలా ఏదైనా సరే. పాకిస్తాన్ జట్టు భారత్‌పై కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














