చాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్‌పై పాకిస్తాన్‌దే పైచేయి, ఈసారైనా కథ మారుతుందా?

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, ani

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 9న కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
    • రచయిత, జస్విందర్ సిద్ధూ
    • హోదా, బీబీసీ కోసం
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వర్షంతో ఉపశమనమే.

ఈ మాట చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు చూడాలనుకునే భారత క్రికెట్ అభిమానులకు కాస్త శుభవార్తే. ఎందుకంటే.. భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న 2002, 2013లో, రెండుసార్లూ వర్షం కీలకపాత్ర పోషించింది.

మార్చి 9న దుబయ్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసే Accuweather.com వెబ్‌సైట్ తెలిపింది. ఆ రోజు సాయంత్రం వర్షం పడే అవకాశముందని మరికొన్ని వెబ్‌సైట్లు కూడా అంచనావేశాయి.

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ భారత్‌ ఫైనల్‌కు చేరితే మాత్రం పాకిస్తాన్‌లో ఆడే అవకాశం చాలా తక్కువ.

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

వాతావరణం కలిసి రావొచ్చని అంచనాలు చెబుతున్నప్పటికీ, పాకిస్తాన్‌‌ను ఎదుర్కొనేందుకు భారత్ కొత్త ట్రిక్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, 23 ఏళ్ల చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌‌కు పాకిస్తాన్ బాగానే నష్టం కలిగించింది.

ఫైనల్ మ్యాచ్, వర్షం

2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఆ టోర్నమెంట్‌లో, గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచి భారత్ ఫైనల్స్‌కు చేరింది.

ఫైనల్లో భారీ వర్షం కారణంగా, మ్యాచ్‌ను 20-20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కేవలం 124 పరుగులకే ఆలౌటైంది.

అయితే, ట్రోఫీ గెలిచిన అనంతరం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాట్లాడుతూ జట్టును కాపాడేందుకు దేవుడు రాలేదని, ట్రోఫీ గెలవాలంటే పోరాడి తీరాల్సిందేనన్నారు. ధోనీ సారథ్యంలో అంతకుముందు భారత్ 2011 వరల్డ్ కప్, 2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002 చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ

2002లో విజేతలుగా భారత్, శ్రీలంక

2002లో, సౌరవ్ గంగూలీ నాయకత్వంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 10 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఫైనల్స్‌లో శ్రీలంకతో తలపడింది.

కానీ, భారీ వర్షం ఫైనల్స్ ఉత్సాహాన్ని నీరుగార్చింది.

రిజర్వ్ డే రోజు జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్లకు 222 పరుగులు చేసింది.

223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 38 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం మొదలైంది.

చాలాసేపు నిరీక్షణ తర్వాత ఐసీసీ రెండు జట్లనూ ఉమ్మడి విజేతలుగా ప్రకటించింది.

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు తలపడుతున్నాయి.

భారత్ ఆశలను దెబ్బతీసిన పాకిస్తాన్

ఐసీసీ వరల్డ్ కప్‌ మ్యాచ్‌లలో భారత్‌ను పాకిస్తాన్ ఎదుర్కోలేదనేది నిజమే అయినప్పటికీ, చాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే పరిస్థితి వేరే.

2004 చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కారణంగా సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, పాకిస్తాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ కలిసి 19.5 ఓవర్లలో 73 పరుగులు మాత్రమే చేయగలిగారు.

పాకిస్తాన్ పేసర్లు మొహమ్మద్ సమీ, నావెద్-ఉల్-హసన్, షోయబ్ అక్తర్ టీం ఇండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. అంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బ్యాటింగ్‌కు దిగిన మొదట్లో పాకిస్తాన్ కూడా తడబడింది. ఒకానొకదశలో ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 27 పరుగులుగా ఉంది. కానీ, ఐదో స్థానంలో వచ్చిన మొహమ్మద్ యూనస్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. యూనస్ 81 పరుగులు చేయడంతో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. యూనస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గ్రూప్ దశలో కెన్యాపై మాత్రమే గెలిచిన భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

2009లో కూడా భారత్ ఆశలను పాకిస్తాన్ దెబ్బతీసింది.

2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో భారత్ ఓడిపోవడం సమీకరణాలను మార్చేసింది. దీంతో, టీమిండియా సెమీఫైనల్స్‌ చేరుకోలేకపోయింది.

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దుబయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

2017లో ట్రోఫీ గెలిచిన పొరుగు దేశం

2013లో విరాట్ కోహ్లీ సారథ్యంలో ట్రోఫీ గెలిచిన టీమిండియా, 2017లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే, ఈసారి కూడా టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టడంలో పాకిస్తాన్ పైచేయి సాధించింది.

ఇంగ్లండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. సెమీ-ఫైనల్స్ వరకు టీమిండియాకు అంతా అనుకూలంగానే సాగింది.

రోహిత్ శర్మ సెంచరీతో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.

భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.

ఆ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ 114 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

17 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 31 ఓవర్లలో 158 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. 180 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ టీమిండియాపై విజయం సాధించింది.

చాంపియన్స్ ట్రోఫీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది

రోహిత్, కోహ్లీపైనే దృష్టి

అయితే, ఇదంతా గతం.

ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 23న దుబయ్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది.

ఈసారి భారత జట్టు మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. మరీముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై జోరుగా చర్చలు జరుగుతున్న తరుణంలో వారికి ఈ టోర్నమెంట్ చాలా కీలకం.

టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణానికి కొత్త రూపునిచ్చే బాధ్యత ఈ ఇద్దరి ఆటగాళ్లపై ఉంది.

కెప్టెన్ రోహిత్ శర్మ మునుపటి దూకుడుతో కనిపిస్తున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ ఇచ్చిన సమాధానాలు తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడో తెలియజేస్తున్నాయి.

ఇందుకోసం రోహిత్ శర్మ మహేంద్రసింగ్ ధోనీలా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఎలా ఓడించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాల్సిఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)