భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మాజీలు యువరాజ్, షోయబ్ అక్తర్ ఏమన్నారంటే..

భారత్, పాకిస్తాన్, క్రికెట్, చాంపియన్స్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షోయబ్ అక్తర్, యువరాజ్ సింగ్

''వైట్ బాల్ ఫార్మాట్‌లో, బ్యాటర్లలో ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ రోహిత్. రోహిత్ ఫామ్‌లో లేకున్నా 80 బంతుల్లో సెంచరీ కొట్టగలడు. అదే ఫామ్‌లో ఉంటే, 60 బంతుల్లోనే సెంచరీ కొడతాడు."

''బ్యాటింగ్ కోణంలో చూస్తే ఈ టోర్నీలో భారత్ చాలా బలమైన జట్టు. అయితే భారత్‌ను ఓడించడానికి పాకిస్తాన్ నిజంగా బాగా ఆడాలని కోరుకుంటున్నా''

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలివి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్

మ్యాచ్ ఓడితే సెమీస్ కష్టం

ఆదివారం దుబయి వేదికగా జరగబోయే భారత్-పాక్ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు కూడా ఎదురుచూస్తున్నారు.

ఒకవైపు భారత్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు, న్యూజీలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడింది.

సొంతగడ్డపై ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలను ఎదుర్కొంది. దీంతో తదుపరి ప్రత్యర్థి అయిన భారత్‌పై గెలవాలనే ఒత్తిడి పాక్ జట్టుపై తీవ్రంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాకిస్తాన్ జట్టుకు సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి.

గత గణాంకాలను పరిశీలిస్తే.. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 135 వన్డే మ్యాచ్‌లు జరగ్గా భారత్ 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది, 73 మ్యాచ్‌లలో ఓడింది. 2013లో భారత్ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవగా, 2017లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది.

భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. చివరిసారిగా అమెరికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇరుజట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్.. ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా 2023లో జరిగింది. ఆ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది.

ఆ తర్వాత రెండు జట్ల మధ్య జరగబోతున్న వన్డే మ్యాచ్ ఇదే.

షోయబ్ అక్తర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్

భారత్‌కు దుబయి హోం గ్రౌండ్: అక్తర్

ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించారు. భారత జట్టు అన్ని మ్యాచ్‌లనూ దుబయిలో ఆడుతున్నందున ఆ జట్టుకు దుబయి హోమ్ గ్రౌండ్ లాంటిదని, అక్కడ విజిటింగ్ టీమ్ పాకిస్తాన్ అవుతుందని చెప్పారు.

"భారత్ మిమ్మల్ని(పాకిస్తాన్) ఓడిస్తుందని మీకు తెలుసు. వారి బ్యాటర్లకు అంతం ఉండదు, వారికి బౌలర్లు ఉన్నారు. బ్యాటింగ్ కోణంలో చూస్తే ఈ టోర్నీలో భారత్ చాలా బలమైన జట్టు" అని అక్తర్ అన్నారు.

"పాకిస్తాన్‌పై ఇండియా ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌ను గెలిచే అత్యుత్తమ జట్టు భారతే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే భారత్‌ను ఓడించడానికి పాకిస్తాన్ నిజంగా బాగా ఆడాలని కోరుకుంటున్నా."

బంగ్లాదేశ్ జట్టు చాలా బాగుందని, కానీ విజయాన్ని అందుకోలేకపోయిందని షోయబ్ అక్తర్ అన్నారు.

యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ (ఫైల్ ఫొటో)

మొదటి మ్యాచ్ ఎందుకు గెలవాలంటే: యువరాజ్

స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన సంభాషణలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ "భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ బిగ్ మ్యాచ్. అది ఫైనల్ కావొచ్చు, సెమీ-ఫైనల్ లేదా టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కావొచ్చు. కానీ, మొదటి మ్యాచ్ గెలిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచుతుంది, మీకు ఊపునిస్తుంది" అన్నారు.

"నేను చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాం. ఫైనల్‌లో పాకిస్తాన్ మమ్మల్ని ఓడించింది" అని గుర్తుచేసుకున్నారు యువరాజ్ సింగ్.

రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నాడా? లేదా? అన్నది ముఖ్యం కాదని, బ్యాటర్‌గా తన బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అతనేనని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా పాక్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.

హర్షా భోగ్లే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ తన జట్టులో మరో స్పిన్నర్‌ను చేర్చుకోవాలని హర్షా భోగ్లే సూచించారు.

పవర్ ప్లే కీలకం: హర్షా భోగ్లే

శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ షమీలు ఫామ్‌లోకి రావడంపై భారత్ చాలా సంతోషంగా ఉంటుందని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు.

"భారత్‌పై పాకిస్తాన్ రెండు ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మ్యాచ్‌లు గెలిచినప్పుడల్లా పవర్‌ప్లేలో వికెట్లు తీశారు. నసీమ్ షా, షాహీన్ అఫ్రిది పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోతే ,తర్వాత బౌలింగ్ అటాక్ భిన్నంగా కనిపిస్తుంది" అని భోగ్లే అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)