చాంపియన్స్ ట్రోఫీ: ఎడారి దేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గౌతమ్ భట్టాచార్య
- హోదా, క్రికెట్ కాలమిస్ట్, దుబాయి
భారత్, పాకిస్తాన్‌లు చివరిసారిగా 2023 ఐసీసీ వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.
ఆ వరల్డ్ కప్‌లో ఫామ్‌లో ఉన్న భారత్, పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా ఛేదించి, అద్భుతమైన విజయాన్ని సాధించింది.
భారత్‌కు రావడానికి పాకిస్తాన్ అభిమానులకు వీసాలు లభించకపోవడంతో క్రికెట్ జట్టుతో పాటు మీడియా సెంటర్‌లో మాత్రమే ఆ దేశం వాళ్లు కొంతమంది కనిపించారు.


ఫొటో సోర్స్, Getty Images
షార్జాలో పాకిస్తాన్‌కు మెరుగైన రికార్డు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ పూర్తి భిన్నమైన వాతావరణంతో ఉంటుంది.
ఈ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 37లక్షలమంది భారతీయులు, 17లక్షలమంది పాకిస్తానీలు ఉంటున్నారు. రెండు దేశాలకు చెందిన ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌కు తరలిరానున్నారు.
అయితే రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో, సవాళ్లను అధిగమించి మహమ్మద్ రిజ్వాన్ జట్టు స్టాండ్స్‌లో పచ్చ జెండాల సముద్రం కనిపించేలా చేయగలదా?
దుబాయ్‌లో పాకిస్తాన్‌కు మంచి రికార్డు ఉంది. ఆడిన 28 వన్డేల్లో 19 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలిచింది. 2021లో దుబాయ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.
భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించిన మ్యాచ్‌లు ఎక్కువగా షార్జాలోనే జరిగాయి. 1980,1990ల్లో వారి ఆధిపత్యం సాగింది. అక్కడ జరిగిన 24 మ్యాచుల్లో పద్దెనిమిదింటిలో పాకిస్తాన్ గెలిచింది.
దుబాయ్‌లో జరిగిన 2018 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను భారత్ రెండుసార్లు ఓడించింది. 2006లో జరిగిన అబుదాబి సిరీస్‌లో రెండు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలిచాయి.
షార్జాలో పాకిస్తాన్ వైభవం ఉన్న సమయంలోనే టీ20లలో విజయాలతో ఆధిపత్యం మారింది. కొత్త మిలీనియంలో పాకిస్తాన్‌పై భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.

ఫొటో సోర్స్, AFP
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి
యూఏఈలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లను గతం కోణంలోనుంచి చూడాల్సిన అవసరం లేదని ప్రముఖ క్రికెట్ రచయిత అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.
''షార్జాలో పాకిస్తాన్‌కు విపరీతమైన మద్దతు లభించిందనడంలో సందేహం లేదు. స్థానికంగా ఉండే పఠాన్ జనాభా వల్ల పాకిస్తాన్‌కు మద్దతుదారులు ఎక్కువగా ఉండేవారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, సయీద్ అన్వర్, అమీర్ సోహైల్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాలు ఆ జట్టులో ఉండేవారు'' అని మెమన్ అన్నారు.
"ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే...అప్పటికప్పుడు కొన్ని అద్భుత ఫలితాలు వస్తుంటాయి. కానీ జట్టులో స్థిరత్వం లేదు" అని ఆయన తెలిపారు.
చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి దుబాయ్‌లో సందడి తక్కువగానే కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టులో వెల్కమ్ బ్యానర్లు లేవు.
ప్రతియేటా జరిగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌కు నగరం సన్నద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. జానిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్ కంపెనీ హోర్డింగ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే దక్షిణం వైపు వెళ్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర హైవే నుంచి క్రికెట్ సందడి కనిపిస్తోంది.
ఎనిమిది మంది కెప్టెన్ల చిత్రాలు మైదానంలో భారీగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల అందరి దృష్టి రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ జట్లపైనే ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP
బంగ్లాదేశ్‌పై విజయంతో ధీమాగా భారత్
ప్రచార సాధనాలు, మార్కెటింగ్ డిమాండ్లను తీర్చడం కోసం ప్రధాన టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్‌లను ఐసీసీ ఒకే గ్రూప్‌లో ఉంచుతుందనేది బహిరంగ రహస్యం. దీనివల్ల టోర్నీలో కచ్చితంగా ఆసక్తికరమైన మ్యాచ్ ఒకటి జరుగుతుంది. నాకౌట్స్‌లో మరో మ్యాచ్ జరగడానికి అవకాశం ఉంటుంది.
క్రికెట్‌పై అందరి దృష్టి ఎక్కువగా ఉండడం, టీ20 ఫ్రాంచైజ్ లీగ్‌ల పెరుగుదలతో అంతర్జాతీయ క్రికెట్‌కు ముప్పు పొంచి ఉన్న సమయంలోనూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌తో కాసుల వర్షం కురుస్తుంది.
బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ తొలి అడ్డంకిని అధిగమించింది . శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీ (భవిష్యత్ వన్డే కెప్టెన్‌గా పునాది సిద్ధం చేసుకున్నాడు), మహమ్మద్ షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు, వన్డేల్లో 11వేల పరుగుల మార్కును దాటిన రోహిత్ శర్మ భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నప్పటికీ, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వికెట్‌పై అందరి దృష్టి స్పిన్లర్ల వైపు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వన్డే మ్యాచుల్లో ఆ రోజు ఏమైనా జరగొచ్చు
టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆధిక్యం అన్నది ఊహించలేని విషయం. ఆ జట్టు ఆడిన చివరి మూడు వన్డేలు దీనికి నిదర్శనం.
పది రోజుల కిందట రిజ్వాన్, సల్మాన్ అలీ అఘాల అద్భుతమైన 260 పరుగుల భాగస్వామ్యంతో కరాచీలో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ రికార్డు స్థాయిలో 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ట్రై సిరీస్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది.
కానీ తర్వాత రెండు రోజుల్లోనే ఆ జట్టు తడబడింది. న్యూజీలాండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. దీంతో టైటిల్ గెలిచి చాంపియన్స్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలన్న పాకిస్తాన్ ఆశ నెరవేరలేదు.
చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు ప్రారంభంలో రాణించినప్పటికీ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు న్యూజీలాండ్ చేతిలో 60 పరుగులు తేడాతో ఓటమి పాలయింది.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఈ ఓటమి పాకిస్తాన్‌ను గందరగోళంలోకి నెట్టింది. అంతేకాకుండా భారత్, పాక్ మ్యాచ్‌ను ఉద్దేశించి కెప్టెన్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు తప్పుబట్టారు. దీన్ని ఒక మామూలు మ్యాచ్‌లాగే చూస్తామని రిజ్వాన్ అన్నాడు.
అయితే 1992 ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగంతో మాట్లాడిన 'పంజరంలోని పులులు' అన్న మాటను గమనిస్తే...ఏ పరిస్థితులనుంచైనా పాకిస్తాన్ జట్టు కోలుకుంటుందని చరిత్ర చెబుతోంది.
పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, యూఏఈ గడ్డపై పాకిస్తాన్‌ను తక్కువ అంచనావేయలేం.
ఇది కొత్త రోజు, సరికొత్త యుద్ధం, ఈ కీలక మ్యాచ్‌లో ఏమైనా జరగొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














