బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్: ఆ ఔషధాల ఎగుమతులను నిషేధించిన భారత ప్రభుత్వం

భారత్‌కు చెందిన ఏవీయో ఫార్మా కంపెనీపై బీబీసీ ఐ పరిశోధనాత్మక కథనం ప్రచురించిన తర్వాత టాపెంటడాల్, కారిసోప్రొడాల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
సదరు ఫార్మా కంపెనీ డ్రగ్స్ లైసెన్స్ లేకుండా, మనుషులు వ్యసనపరులుగా మారడానికి కారణమయ్యే మందులను నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్లు బీబీసీ ఐ పరిశోధనాత్మక కథనం పేర్కొంది.
ఆ మందును ఆ ఫార్మా సంస్థ పశ్చిమ ఆఫ్రికాకు చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నట్లు కూడా ఈ కథనం పేర్కొంది.
వైద్యపరంగా, ఈ మందులను ఓపియాయిడ్లు అంటారు. వీటిని నల్లమందుతో తయారు చేస్తారు. మత్తు కలిగించే ఈ మందులను వాడినవారు వాటికి బానిసలుగా మారే అవకాశం ఉంటుంది. లైసెన్స్ లేకుండా ఈ మందులను తయారు చేయడం, ఎగుమతి చేయడం చట్ట విరుద్ధం.
బీబీసీ ఐ కథనం ప్రచురించిన తర్వాత, భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) (ఇంటర్నేషనల్ సెల్) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్స్ కంట్రోల్ అథారిటీలకు సూచనలను పంపాయి.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన సర్క్యులర్‌లో బీబీసీ ఐ కథనాలను ప్రస్తావిస్తూ, " టాపెంటాడాల్, కారిసోప్రొడాల్ కాంబినేషన్‌తో తయారయ్యే మందులు దుర్వినియోగం అవుతున్నాయని, ఇవి భారత దేశం నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు చట్టవిరుద్ధంగా ఎగుమతి అవుతున్నాయని బీబీసీ ఐ కథనం పేర్కొంది." అని వెల్లడించింది.
"ఈ ఔషధం దుర్వినియోగానికి గురయ్యే అవకాశం, ప్రజలపై దాని హానికరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, వీటి ఎగుమతి కోసం మంజూరు చేసిన అన్ని ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల) లను టాపెంటాడాల్, కారిసోప్రొడాల్ కాంబినేషన్ డ్రగ్స్ తయారీకి ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నాం.’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
‘‘ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది.’’ అని కూడా ఆ ప్రకటన పేర్కొంది.
మరోవైపు ఇదే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఏవియో ఫార్మాస్యూటికల్ అనే కంపెనీ తమ రాష్ట్రం నుంచే పశ్చిమాఫ్రికా దేశాలకు ఈ మందులు ఎగుమతి చేస్తోందన్న కథనాలపై స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి తమ రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆ ఫార్మా కంపెనీ తయారీ యూనిట్లు, గోదాములపై రెయిడ్లు నిర్వహించి అక్కడ లభించిన ఈ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పేర్కొంది. ఈ మందుల తయారీని తక్షణం నిలిపేయాలని, ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆదేశించినట్లు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.


బీబీసీ ఐ రిపోర్టులో ఏముంది?
ముంబయికి చెందిన ఏవియో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వివిధ బ్రాండ్ పేర్లతో వివిధ రకాల టాబ్లెట్లను తయారు చేస్తుంది. వాటి ప్యాకేజింగ్‌ను చూస్తే చట్టబద్ధమైన మందుల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, వాటిలో హానికరమైన పదార్ధాలు ఉంటాయి. శక్తివంతమైన ఓపియాయిడ్‌లైన టాపెంటాడాల్, కారిసోప్రొడాల్‌ల కాంబినేషన్లు ఈ మందులలో ఉంటాయి. లైసెన్స్ లేకుండా వీటిని తయారు చేయకూడదు, ఎగుమతి చేయకూడదు.
కారిసోప్రొడాల్ చాలా ప్రమాదకరమైన ఔషధం. దీని వాడకంపై ఐరోపాలో నిషేధం ఉంది.
ఇటువంటి కాంబినేషన్ డ్రగ్స్ వాడకానికి ప్రపంచంలో ఎక్కడా లైసెన్స్ లేదు. వీటిని వాడటం వల్ల శ్వాస సమస్యలు, మూర్ఛలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓవర్ డోస్ అయితే మరణానికి కూడా దారితీయవచ్చు.
ఇలాంటి ప్రమాదాలు ఉండటంతో ఓపియాయిడ్లు అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలలో నిషేధిత మందులుగా మారాయి. అయితే, ఆఫ్రికాలోని అనేకదేశాలకు వీటిని అక్రమంగా ఎగుమతి చేసి చౌకగా అమ్ముతున్నారు.
ఘనా, నైజీరియా, ఐవరీ కోస్ట్ దేశాలలో వీటిని ఏవియో ఫార్మా లోగోతో బ్రాండ్ చేసిన ప్యాకెట్లలో అమ్ముడవుతున్నట్లు బీబీసీ ఐ పరిశోధన వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














