రూ.52 కోట్ల విలువైన బంగారపు టాయ్‌లెట్‌ 5 నిమిషాల్లో చోరీ, సుత్తులతో వచ్చి..

బంగారపు టాయిలెట్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019లో బంగారపు టాయ్‌లెట్ దొంగతనం జరిగింది.
    • రచయిత, మార్టిన్ ఈస్టాఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంగ్లండ్‌లో బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌లో దాదాపు రూ.52 కోట్ల విలువైన బంగారపు టాయిలెట్‌ దొంగతనం కేసులో ప్రాసిక్యూటర్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ దొంగతనం ఐదు నిమిషాల్లోనే జరిగిందని తెలిపారు.

2019 సెప్టెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్‌షైర్ ప్యాలెస్‌ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఈ టాయిలెట్‌ను ప్రదర్శనకు పెట్టారు. దీనిని చూడటానికి వచ్చే వారికి టాయిలెట్‌ను ఉపయోగించే అవకాశం ఇచ్చారు. అయితే, అదే ఏడాది దీన్ని చోరీ చేశారు.

చోరీలో తన ప్రమేయంపై వస్తున్నఆరోపణలను ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మైఖేల్ జోన్స్(39) ఖండించారు.

విండ్సర్‌కు చెందిన ఫ్రెడ్ డో (36), వెస్ట్ లండన్‌ వాసి బోరా గుక్కుక్ (41)లపై ఈ టాయ్‌లెట్ తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇద్దరూ వాటిని ఖండించారు.

ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్ జూలియన్ క్రిస్టోఫర్ కేసీ దొంగతనం జరిగిన తీరును కోర్టుకి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌

ఫొటో సోర్స్, Blenheim Palace

ఫొటో క్యాప్షన్, 18వ శతాబ్దానికి చెందిన బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.

అసలేం జరిగింది?

2019 సెప్టెంబర్ 14 తెల్లవారుజామున బ్లెన్‌‌హెమ్ ప్యాలెస్‌లోకి ఐదుగురు వ్యక్తుల ముఠా రెండు వాహనాల్లో వెళ్లిందని ప్రాసిక్యూటర్ క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు.

సుత్తులతో గేట్లు పగలగొట్టి భవనంలోకి చొరబడ్డారని క్రిస్టోఫర్ చెప్పారు. నేరం జరిగిన తర్వాత వాటిని సంఘటన స్థలంలో వదిలేశారని తెలిపారు.

టాయిలెట్ దొంగతనానికి 17 గంటల ముందు మైఖేల్ జోన్స్ దాని ఫొటో తీశారని, చోరీలో ఆయన పాత్ర ఉందని ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు.

ఈ దొంగతనం కేవలం ఐదు నిమిషాల్లో జరిగిందని క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు. ఆ బంగారపు టాయ్‌లెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేశారని, వాటి రికవరీ జరగలేదని చెప్పారు.

ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జేమ్స్ షీన్ టాయ్‌లెట్ దొంగతనం చేసినట్లుగా, దానిని తరలించినట్లుగా అంగీకరించారని కోర్టుకు తెలిపారు.

40 ఏళ్ల జేమ్స్ నార్తాంప్టన్‌షైర్‌లోని వెల్లింగ్‌బరో నివాసి. ఏప్రిల్ 2024లో కూడా ఆయన ఇలాంటి నేరానికి కుట్ర పన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీని బరువు 98 కిలోలు, బంగారపు టాయ్‌లెట్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, టాయ్‌లెట్ బరువు 98 కిలోలు. దీనిపై రూ. 5 కోట్ల బీమా ఉంది.

ఎవరు తయారు చేశారు?

ఈ టాయిలెట్‌ను 18-క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడానికి ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కేటెలన్ దీనిని తయారుచేశారు. అమెరికా అనే పేరుతో పిలిచే ఈ టాయిలెట్ బరువు 98 కిలోలు. దీనిపై రూ. 5 కోట్ల బీమా ఉంది. అయితే, దొంగతనం జరిగిన సమయం(2019)లో ఈ బంగారం విలువ సుమారు 30 కోట్ల రూపాయలని కోర్టుకు చెప్పారు.

జేమ్స్, ఫ్రెడ్, బోరా ఫోన్‌లలో లభించిన సందేశాలు, వాయిస్ నోట్‌లు, స్క్రీన్‌షాట్‌లను పరిశీలించగా, 20 కిలోల బంగారం అమ్మడానికి కిలోకు 25,632 పౌండ్లు (రూ. 28 లక్షలు) చొప్పున బేరసారాలు సాగించినట్లు తేలిందని ప్రాసిక్యూటర్ వివరించారు.

హాటన్ గార్డెన్‌లో పచా ఆఫ్ లండన్ అనే ఆభరణాల దుకాణం నిర్వహించే బోరా గుక్కుక్‌కి ఈ బంగారం అమ్మితే కిలోకు 3 వేల పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 3 లక్షలు) లాభం వస్తుందని కోర్టుకు ప్రాసిక్యూటర్ చెప్పారు.

18వ శతాబ్దానికి చెందిన బ్లెన్‌హెమ్ ప్యాలెస్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఈ ప్యాలెస్‌లోనే పుట్టారు.

కేసు విచారణ కొనసాగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)