వందకోట్ల మంది భారతీయుల దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
140 కోట్ల మంది ఉన్న భారత దేశంలో కొన్ని వస్తువులు, సేవల మీద ఖర్చు చెయ్యడానికి వంద కోట్ల మంది వద్ద డబ్బు లేదని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది.
దేశంలో వ్యాపార సంస్థలు లేదా స్టార్టప్‌లకు అత్యంత కీలకమైన వినియోగదారులు 13 లేదా 14 కోట్ల మంది మాత్రమే ఉన్నారని బ్లూమే వెంచర్స్ అనే పెట్టుబడుల సంస్థ అధ్యయనంలో తేలింది.
మరో 30 కోట్ల మంది ఔత్సాహిక వినియోగదారులు ఈ మార్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారుగానీ పర్సులు తెరిచేందుకు ఇబ్బంది పడుతున్నారనీ, డిజిటల్ పేమెంట్స్ విషయంలో వారు చెల్లింపుల దగ్గరకు వచ్చే సరికి ఆఫ్ బటన్ నొక్కుతున్నారనీ పేర్కొంది.
ఈ నివేదికలో ఇంకా ఏముందంటే, ఆసియాలో అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల వర్గం ఇంకా విస్తరించడం లేదు. దీనర్థం ఏంటంటే భారతదేశంలో సంపన్నులు, సంపాదిస్తున్న వారి సంఖ్య వాస్తవంగా పెరగడం లేదు. బాగా డబ్బున్న వారి సంపద మాత్రమే పెరుగుతోంది.
ఇవన్నీ దేశంలో వినియోగదారుల మార్కెట్‌ను వివిధ మార్గాల్లో రూపొందిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రీమియర్ ఉత్పత్తుల ధోరణి పెరుగుతోంది. ఇందులో బ్రాండ్లు మార్కెట్‌లో భారీగా ఆఫర్లు ఇవ్వడం కంటే, తమ ఉత్పత్తులను మెరుగుపరిచి, ఖరీదైన ఉత్పత్తుల్ని రెట్టింపు చెయ్యడం ద్వారా సంపన్నులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న అల్ట్రా లగ్జరీ గేటెడ్ హౌసింగ్, ఖరీదైన ఫోన్లు అమ్మకాలు పెరగడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇళ్లు, ఫోన్లు, ఇతర వస్తువుల దిగువ శ్రేణి బ్రాండ్లు మార్కెట్‌లో నిలబడేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.

ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ పెరుగుతోంది.
భారతదేశంలో అందుబాటులో ఉన్న నివాస గృహాల మార్కెట్ ఐదేళ్ల కిందట 40 శాతం ఉండేది. అది ప్రస్తుతం 18 శాతానికి పడిపోయింది.
బ్రాండెడ్ వస్తువుల అమ్మకాల మార్కెట్ వాటా బాగా పెరిగింది.
భారతదేశంలో ఆనందాన్ని జుర్రుకుని, చిరకాలం గుర్తుండిపోయే కార్యక్రమాలకు ఖర్చు చేసే "ఎక్స్‌పీరియన్స్ ఎకానమీ" మరింతగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ కళాకారులైన ఎడ్ షీరన్ లాంటి వారు నిర్వహించే కచేరీలకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఈ మార్పును అనుసరిస్తున్న సంస్థలు అభివృద్ధి చెందుతాయని ఈ నివేదిక రూపొందించిన రచయితలలో ఒకరైన సజిత్ పాయ్ బీబీసీకి చెప్పారు.
"తమ ఉత్పత్తులు ఎక్కువ మందికి చేరాలనుకునేవారు, ప్రీమియం బ్రాండ్లలో ఒకటిగా కనిపించని ఉత్పత్తుల్ని తయారు చేసేవారు మార్కెట్లలో తమ వాటాను నష్టపోతారు" అని ఆయన అన్నారు.
కోవిడ్ తర్వాత భారతదేశంలో ఆర్థిక పునరుత్తేజం 'K' ఆకారంలో ఉందన్న దీర్ఘకాలపు అభిప్రాయాలను ఈ నివేదికలో అంశాలు బలపరుస్తున్నాయి. ఇక్కడ ధనికులు మరింత ధనికులు అయ్యారు. పేదలు కొనుగోలు శక్తిని కోల్పోయారు.
వాస్తవానికి, ఈ పరిణామం కోవిడ్ కంటే ముందే ప్రారంభం అయింది. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. 1990లో జాతీయ ఆదాయంలో 10 శాతం మంది దగ్గర 34 శాతం సంపద మాత్రమే ఉండేది. అది ప్రస్తుతం 57.7 శాతానికి చేరుకుంది. మిగతా సగం జాతీయ ఆదాయాన్ని పంచుకుంటున్న వారి సంఖ్య 22శాతం నుంచి 15 శాతానికి తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
మధ్య తరగతి ఆదాయం, పొదుపు తగ్గాయి
వినియోగ తిరోగమనం ప్రజల కొనుగోలు శక్తిని ధ్వంసం చెయ్యడమే కాకుండా వారి పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరిగేలా చేసింది.
కోవిడ్ తర్వాత ప్రజలకు తేలిగ్గా అందుబాటులోకి వచ్చిన హమీ అక్కర్లేని రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించింది.
"భారతదేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఆశావహులైన వినియోగదారుల వర్గం అలాంటి రుణాల వల్లనే పుట్టుకొచ్చింది. కేంద్ర బ్యాంకు ఆ రుణాలను కట్టడి చెయ్యడం వినియోగాన్ని ప్రభావితం చేసింది" అని పాయ్ చెప్పారు.
ఈ ఏడాది పంటలు బాగా పండటం, ఇటీవలి బడ్జెట్‌లో పన్ను రాయితీలు స్వల్పకాలంలో కొనుగోలు శక్తిని పెంచడానికి అందుబాటులో ఉన్న రెండు మార్గాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి వల్ల వినియోగం మీద ఆధారపడిన భారతదేశపు జీడీపీని అరశాతానికి పైగా పెంచవచ్చని పాయ్ చెప్పారు.
అయితే దీర్ఘకాలిక ప్రణాళికలకు ఎదురవుతున్న సమస్యలు అలాగే ఉన్నాయి.
భారతదేశపు వినియోగదారుల మార్కెట్‌కు మూల స్తంభంగా ఉన్న మధ్య తరగతి వర్గాన్ని పీల్చి పిప్పి చేశారని, వారి ఆదాయం చాలా కాలం నుంచి ఒకేలా ఉందని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజర్లు రూపొందించిన నివేదిక చెబుతోంది.
"గత పదేళ్లుగా భారతదేశంలో పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం ప్రజల ఆదాయం స్తబ్ధుగా ఉంది. ఇది వాస్తవంలో వారి ఆదాయం సగానికి తగ్గడాన్ని(సవరించిన ద్రవ్యోల్బణ అంచనాల దృష్ట్యా) సూచిస్తుంది" అని జనవరిలో ప్రచురితమన నివేదిక చెబుతోంది.
"ఆర్థికంగా పెరుగుతున్న భారం మధ్య తరగతి ప్రజల పొదుపును దాదాపు ఖాళీ చేసింది. భారత దేశంలో కుటుంబాల నికర పొదుపు 50 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. దీని వల్ల మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునే వస్తువులు, సేవలకు డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పడిపోతుందని" నివేదిక సూచించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల నగరాల్లో క్లరికల్, సెక్రటేరియల్, ఇతర ఉద్యోగాలు క్రమేపీ కనుమరుగవుతున్నాయని మార్సెల్లస్ రిపోర్ట్ పేర్కొంది.
"ప్రముఖ సంస్థలలోని ఉద్యోగస్తులందరిలోనూ సూపర్ వైజర్ల సంఖ్య క్రమేమీ తగ్గుతోంది" అని నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆర్థిక సర్వే కూాడా ఇదే చెప్పిందా?
కేంద్ర బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే 2024-25 కూడా ఇవే అంశాల గురించి ప్రస్తావించింది.
సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో సాంకేతికత అభివృద్ధి వల్ల ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆందోళన కలిగించే అంశమని, అదే సమయంలో ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది స్థిరత్వం లేని, విలువ ఆధారిత సేవల్లో ఉపాధి పొందుతున్నారని ఆర్థిక సర్వే తెలిపింది
"భారతదేశం కూడా వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. శ్రామిక శక్తి వలసల వల్ల కొనుగోలు శక్తి తగ్గి, అది స్థూలంగా ఆర్థిక సమస్యలకు కారణవుతుంది. ఇలాంటప్పుడు అంతిమంగా జరిగే నష్టం గురించిన అంచనాలు వాస్తవ రూపం దాల్చితే, అది దేశ ఆర్థిక వృద్ధిరేటును నిర్ణయించే సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుంది." అని ఆర్థిక సర్వే తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














