కోటప్ప కొండ: శివరాత్రికి ఇక్కడ ప్రభలు ఎందుకు కడతారంటే...

ఫొటో సోర్స్, ugc
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంటే..చాలాచోట్ల ప్రభల సంప్రదాయం నడుస్తోంది కానీ అసలు ప్రభల తిరునాళ్లు మొదలైంది మాత్రం పల్నాడులోని కోటప్పకొండ నుంచేనని చాలామంది చెబుతుంటారు.
అందుకే ఇక్కడి ప్రభల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని అంటారు.
సంక్రాంతి, దసరా, దీపావళి అన్నీ కలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుందో ఇక్కడ శివరాత్రికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్వహించే ప్రభల ఉత్సవం అలా ఉంటుంది.
శివరాత్రి నాడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ మీద ఉన్న మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు, గతంలో మొక్కుకున్న కోర్కెలు తీరితే ఆ శివుడికి భక్తిపూర్వక కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ప్రజలు ప్రభలతో తరలిరావడం ఇక్కడ ఎన్నో దశాబ్దాల సంప్రదాయంగా వస్తోంది.

ఫొటో సోర్స్, UGC
మూడు రకాల ప్రభలు
బాలప్రభలు: పిల్లలు పుట్టాలని మొక్కుకున్న దంపతులు,, బిడ్డలు పుట్టిన తర్వాత నాలుగైదేళ్ల ఆ పిల్లలతో కలిసి బాలప్రభలు కట్టుకుని వస్తుంటారు. ఆ బాలిక లేదా బాలుడే ప్రభను లాక్కుని వస్తుండగా, పక్కన తల్లిదండ్రులు, బంధువులు వెంటరావడం ఈ బాలప్రభల ప్రత్యేకత
చిన్న ప్రభలు: ఊళ్లల్లో పది నుంచి పదిహేనేళ్ల వయస్సుగల పిల్లలు కలిసి చిన్న చిన్న ప్రభలు కట్టుకుని ఉత్సాహంగా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో కలిసి రావడం ఈ ప్రభల విశేషం.
భారీ ప్రభలు: ఇక భారీ ప్రభలు, గ్రామాల్లో ప్రజలంతా కలిసి తమ మొక్కులు తీర్చుకోవడానికే, తీరిన మొక్కులు చెల్లింపుకో భారీ ఎత్తున విద్యుత్ ప్రభలు నిర్మించి, మేళ తాళాలతో అత్యంత ఆడంబరంగా తీసుకుని రావడమే ఈ భారీ ప్రభల ప్రత్యేకత.

ఫొటో సోర్స్, UGC
నెల రోజుల నుంచే భారీ ప్రభల నిర్మాణం
90 నుంచి 100 అడుగుల ఎత్తయిన భారీ విద్యుత్ ప్రభలను శోభాయమానంగా నిర్మిస్తుంటారు. ఒక గ్రామంలోని ప్రజలే కాదు..ఒక్కోసారి చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏకమై రూ.లక్షలు ఖర్చు చేసి దాదాపు నెలరోజులు కష్టపడి సిద్ధం చేసిన ప్రభలను కొండకు తరలిస్తారు. ఒక్కో ప్రభ నిర్మాణానికి రూ. 25 నుంచి రూ. 35 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతుంటారని స్థానికులు చెబుతున్నారు.
ఎక్కడి వరకు తరలిస్తారంటే..
కోటప్పకొండపై ఉన్న కోటయ్య స్వామి ఆలయానికి అభిముఖంగా కొండ కింద ఉన్న విశాలమైన భూముల వరకు తీసుకొస్తారు. అక్కడ ప్రభలు కొలువుదీర్చి పూజలు చేసి అక్కడే రాత్రంతా జాగరణ చేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, UGC
ప్రభలు ఎప్పటి నుంచి అంటే...
ఇక్కడ ప్రభల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందని ఇతమిత్థంగా చెప్పలేమని, కోటప్పకొండ ప్రభలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందని కోటప్పకొండ దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త, నరసరావుపేట జమీందార్ రామకృష్ణ కొండలరావు బీబీసీకి తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రభల సంప్రదాయం మొదలైంది మాత్రం కోటప్పకొండ నుంచేనని తాము కచ్చితంగా చెప్పగలమని, ఆ తర్వాతే మిగిలిన ప్రాంతాలకు ఈ సంస్కృతి విస్తరించిందని రామకృష్ణ వెల్లడించారు.
మొక్కులు తీర్చుకోవడంతో పాటు పంటలు బాగా పండాలని, తాము సుఖంగా ఉండాలని ప్రభలు కట్టుకుని ప్రజలంతా కోటప్పకొండకు తీసుకొస్తారని చెప్పారు.
పురాణకథల ప్రకారం..
కొండపై ఉన్న శివుడు.. తనను వెనక్కి తిరిగి చూడవద్దని గొల్లభామకు చెప్పినా ఆమె చూస్తుంది. దాంతో శివుడు శిలగా మారి లింగావతరం ఎత్తుతాడు. గొల్లభామ తన తప్పును తెలుసుకొని స్వామిని వేడుకుంటుంది. అప్పుడు స్వామి కోటిన్నొక్క ప్రభలతో భక్తులు కొండకు వచ్చినప్పుడు దర్శనం ఇస్తానని చెప్పాడని, అప్పటి నుంచే అంటే ఎన్నో యుగాల నుంచే ఇక్కడ ప్రభల సంస్కృతి ఉందని ధర్మకర్త రామకృష్ణ కొండలరావు బీబీసీకి తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభల రూపాలు మారినా, ఇలా ప్రభలతో వచ్చి మొక్కులు తీర్చుకునే సంప్రదాయం చాలాకాలంగా ఉందని ఆయన చెప్పారు. శివరాత్రి రోజున కనీసంగా 300 నుంచి వెయ్యి వరకు ప్రభలు వస్తాయని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, UGC
కొండపై త్రికోటేశ్వరుడు
ఈ కోటప్పకొండపై ఉన్న పరమశివుడిని త్రికోటేశ్వరుడిగా భక్తులు పిలుచుకుంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా మూడు శిఖరాలు కనపడతాయని, అందుకే కొండపై ఉన్న స్వామిని త్రికూటాచలేశ్వరుడు లేదా త్రికోటేశ్వరుడు అంటారని స్థానికులు చెబుతున్నారు.
భారీ ప్రభలు ఎలా నిర్మిస్తారంటే..
భారీ ప్రభలు నిర్మించే గ్రామాల్లో నెల రోజుల ముందు నుంచే పనులు మొదలుపెడతారు. ప్రభలకు సంబంధించిన ఇరుసులు, భారీ కలప, వెదురు బొంగులను ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం ప్రభ ఎత్తు, బరువును బట్టి.. ఎడ్ల బండ్లపై లేదా ట్రాక్టర్లపై లేదా బాగా ఎత్తయిన ప్రభలైతే లారీలు, భారీ వాహనాల మీదకి ఎక్కిస్తారు.
బాగా ఎత్తున్న ప్రభలను క్రేన్ సాయంతో భారీ వాహనాలపై నిలబెడతారు. ఆ ప్రభకు వందలాది విద్యుత్ బల్బులను అమర్చుతారు. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ప్రభకు నిరంతరంగా విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు జనరేటర్‌ను కూడా అమర్చుతారు.
ప్రభ కొండకు బయలుదేరే ముందు , కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత...ఇలా ప్రభ మహోత్సవాన్ని గ్రామంలో నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, UGC
ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తాయి..
ఎక్కువగా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల మండలాల్లోని గ్రామాల నుంచే ప్రభలు వస్తుంటాయి.
నరసరావుపేట మండలంలోని గురవాయపాలెం, యలమంద, నరసరావుపేట పట్టణం నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ప్రభలను నిర్మిస్తుంటారు.
చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిశాయపాలెం, మద్దిరాల, యడవల్లి, కోమటినేని వారిపాలెం, కేసానుపల్లి, కావూరు, గోవిందాపురం, బొప్పూడి, అప్పాపురం గ్రామాల నుంచి ప్రభలు వెళ్లడం ఆనవాయితీ.
ప్రభలపై సినీ నటులు, నాయకుల ఫోటోలు
ప్రభలపై శివుడి ప్రతిమతోపాటు కిందనే తమ అభిమాన సినీనటుల ఫోటోలు, బ్యానర్లు, రాజకీయ నేతల ఫోటోలను ఏర్పాటు చేయడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














