విడాకులు తీసుకుంటే భార్య నుంచి కూడా భరణం కోరవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
నా స్నేహితురాలు స్నేహ (పేరు మార్చాం) విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ, 'విడాకులు తీసుకుంటే తన జీవితం ఎలా?' అని ఆలోచిస్తోంది. ఆమెకు 35 ఏళ్లు. పెళ్లై 12 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఒకరికి పదేళ్లు. మరొకరికి ఏడేళ్లు.
పిల్లల్నిఎలా చదివించాలి? పెళ్లిళ్లు ఎలా చేయాలి? కేవలం పోషిస్తున్నాడనే కారణంతో భర్తతో ఒక హింసాత్మక బంధంలో ఉండాలా, వద్దా? అనే సందిగ్ధంలో ఉంది స్నేహ.
విడాకులు తీసుకుని, తన పోషణ, పిల్లల కోసం భరణం అడగవచ్చు కదా అని నేను సలహా ఇచ్చాను.
స్నేహ చదువుకుంది, కానీ ఉద్యోగం చేయడం లేదు. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. తిరిగి ఉద్యోగంలో చేరేంత నైపుణ్యం ఉన్నా అర్హతలు లేవని అనుకుంటోంది. తను ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేసింది.
కోర్టుకు వెళ్లేందుకు కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. కానీ, భర్త హింస తట్టుకోలేనంతగా ఉందని చెబుతోంది. తనకు సంపాదన లేదని, ఏమీ రాదని, పల్లెటూరు మొద్దువి అంటూ ఒక పని మనిషిలా చూస్తారని చెప్పింది. భర్తకు మరో అమ్మాయితో సంబంధం ఉందేమోననే అనుమానం కూడా వ్యక్తం చేసింది.
చదువుకుని, ఉద్యోగం చేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఉంటే, విడాకులు తీసుకునే సమయంలో ఎక్కువ భరణం అడగకూడదంటూ ఇటీవల ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె గుర్తు చేసింది. ఒకవేళ విడాకులు కోరితే, ఉద్యోగం చేసి సంపాదించుకోమని కోర్టు చెబుతుందేమో అని భయపడింది.
ఇంత విరామం తర్వాత ఉద్యోగం ఎవరిస్తారు? ఇప్పటికిప్పుడు జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని ఆమె నన్ను అడిగింది.
సొంత కాళ్లపై నిలబడటం పక్కన పెడితే, జీవితాంతం కలిసి ఉంటూ తనను చూసుకుంటాడనే నమ్మకాన్ని, గడిచిన కాలాన్ని, జీవితాన్ని కోల్పోయినందుకు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.
కోర్టుకు వెళ్లాలా, వద్దా? ఓపిక పట్టాలా, సర్దుకుపోవాలా? అన్ని బంధాల్లో హింస సహజమే అని ఊరుకోవాలా? భవిష్యత్తు ఎలా? అనే సందిగ్ధంలో పడిపోయింది.

ఒడిశా హైకోర్టు తీర్పేమిటి?
ఒడిశా కేసు వివరాలు పరిశీలించి చూస్తే, ఒడిశాకు చెందిన ఓ మహిళ విడాకుల సమయంలో భర్త నుంచి నెలకు రూ. 8,000 మెయింటెనెన్స్ కావాలని డిమాండ్ చేశారు. ఆమె జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె కోరిన మొత్తం ఇవ్వడం తన శక్తికి మించిన పని అని ఆమె భర్త కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, ఒడిశా హైకోర్టు నెలకు రూ. 5,000 ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పు వెలువరిస్తూ, "కేవలం భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడం కోసం చదువుకుని ఖాళీగా ఉండటాన్ని చట్టం సమర్థించదు" అని జస్టిస్ గౌరీ శంకర్ శతపతి వ్యాఖ్యానించారు.
"సీఆర్‌పీసీ సెక్షన్ 125ను అనుసరించి భార్యకు సంపాదించుకునే శక్తి లేనప్పుడు, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భరణం ఇవ్వాలని చెప్పడం చట్టం ఉద్దేశం" అని పేర్కొన్నారు.
ఈ తీర్పు చాలా ప్రశ్నలను లేవనెత్తింది. భరణం ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇస్తారు? భార్య చదువుకుంటే కచ్చితంగా ఉద్యోగం చేయాలా? భరణం మొత్తాన్ని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి? స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా భరణం ఇస్తారా?
భరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న శ్రీకాంత్ చింతలతో బీబీసీ న్యూస్ తెలుగు మాట్లాడింది. ఈయన వివాహ సంబంధాల వివాదాలకు చెందిన కేసులు చూస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
భరణం ఇచ్చేందుకు కోర్టులు పరిగణించే అంశాలు ఏంటి?
విడాకుల సమయంలో భరణం ఇప్పించేందుకు కచ్చితమైన నియమాలు ఏమీ లేవు. భరణం విషయంలో కోర్టులు ఇద్దరి జీవన శైలి, ఆదాయం, వైవాహిక బంధంలో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిపై ఉంటే ఆమె చదువుకున్నప్పటికీ మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులు తీర్పులు చెప్పిన సందర్భాలున్నాయి.
చదువుకుని, సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలకు భరణం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దీంతో, భరణం ఎంత ఇవ్వాలని నిర్ణయించడానికి కచ్చితమైన నియమాలేమీ లేవు.
పురుషులు కూడా భరణం డిమాండ్ చేయవచ్చా?
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 (మెయింటెనెన్స్), సెక్షన్ 25 (భరణం)ను అనుసరించి భర్త కూడా భరణం డిమాండ్ చేయవచ్చు.
ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 36లో కాని, ఇతర మతాలకు సంబంధించిన చట్టాల్లో కానీ భర్త భరణం కోరే అవకాశం లేదు. ఈ అవకాశం ఒక్క హిందూ వివాహ చట్టంలో మాత్రమే ఉంది. భర్తలు భరణం పొందిన కేసులు కూడా ఉన్నాయి. అయితే తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
2022 ఏప్రిల్ లో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానిక కోర్టు ఇచ్చిన ఒక తీర్పులో భర్తకు భార్య నెలకు రూ.3000 మెయింటెనెన్స్ ఇవ్వాలని తీర్పు చెప్పింది. వీళ్లు 23 ఏళ్లు వివాహ బంధంలో ఉండి, విడిపోయారు. ఈ తీర్పును బొంబాయి హైకోర్టు కూడా సమర్థించింది.
ఈ కేసులో భార్య యూనివర్సిటీలో టీచర్. వీళ్లిద్దరికీ 1992లో వివాహమైంది. 2015లో విడిపోయారు. భర్త చేతిలో హింసకు గురవుతున్నట్లు భార్య కోర్టులో పిటిషన్ వేశారు. భర్తకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో, తనకు నెలకు రూ.15,000 ఇవ్వాలని భర్త కోర్టును కోరారు. ఇంటి బాధ్యతలు తాను చూసుకుంటూ, భార్య చదువుకోవడానికి ప్రోత్సహించానని ఆయన కోర్టుకు చెప్పారు. భర్తకు వ్యాపారం ఉందని ఆమె వాదించారు. రూ.15,000 భరణంపై తుది తీర్పు వెలువరించే వరకు నెలకు రూ.3000 ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో వీళ్లిద్దరూ 2015లో విడాకులు తీసుకున్నారు. కానీ, ఆయన 2017లో భరణం ఇవ్వాలని కోరడంపై భార్య తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే విడాకులు తీసుకున్న ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా భరణం కోసం కోర్టును కోరవచ్చని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మెయింటెనెన్స్‌కి, భరణానికి తేడా ఏంటి?
కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు భార్య పోషణకు వీలుగా ఇవ్వాలని కోర్టు చెప్పేది మెయింటెనెన్స్. దీన్ని కోర్టు ఎప్పుడైనా రద్దు చేయొచ్చు.
విడాకుల సమయంలో భాగస్వామి తనను తాను పోషించుకోవడానికి అవతలి వ్యక్తి ఇచ్చే పరిహారం ఇది.
అయితే ఇది ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది కేసు పూర్వాపరాలను బట్టి కోర్టు నిర్ణయిస్తుంది.
భరణం అనేది విడాకుల మంజూరు సమయంలో ఒకేసారి ఇస్తారు. మెయింటెనెన్స్ పొందిన ప్రతి ఒక్కరూ విడాకుల సమయంలో భరణం పొందుతారనే గ్యారంటీ లేదు. భరణం మొత్తాన్ని ఒక్కొక్కసారి కోర్టులు నిర్ణయిస్తాయి లేదా విడాకులు తీసుకునేవారి పరస్పర అంగీకారంపై ఆధారపడి మంజూరు చేస్తారు.
ఒకేసారి పెద్దమొత్తంలో భరణం చెల్లించే అవకాశం లేకపోతే నెలనెలా మెయింటెనెన్స్ కొనసాగించే అవకాశాన్ని కూడా కోర్టులు కల్పిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
భరణం ఇవ్వనని తిరస్కరించవచ్చా?
భర్తకు భరణం ఇవ్వగలిగే ఆర్థిక స్థాయి లేనప్పుడు తిరస్కరించే అవకాశం ఉంది. ఇది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ లో భర్తకు భార్య భరణం ఇవ్వడం లేదా ఇమ్మని కోర్టులు చెప్పిన కేసులు చాలా తక్కువ.
భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు, భార్య మతం మార్చుకున్నప్పుడు, భర్తకు మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్నప్పుడు భార్యకు భరణం ఇవ్వడాన్ని తిరస్కరించే అవకాశం ఉంది.
2024 డిసెంబరులో రింకు బాహేటి, సందేశ్ శారదల విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
రింకు, సందేశ్‌ల వివాహం 2021లో జరిగింది. ఇద్దరికీ రెండో వివాహమే. కానీ, పెళ్లైన ఏడాదికే ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.
ఆయన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సమయంలో కనీసం రూ. 500 కోట్లు భరణంగా ఇచ్చారని , అదే మాదిరిగా తనకు కూడా భరణం ఇప్పించాలని కోరారు. అయితే, వీళ్లిద్దరూ కనీసం 3-4 నెలలు కూడా కలిసి ఉండకపోవడంతో ఆయన రూ.20 నుంచి రూ.40 లక్షలు ఇస్తానని చెప్పారు.
భార్యాభర్తలు కలిసి గడిపినప్పుడు ఉన్న జీవన స్థాయి, శైలికి తగినట్లుగా భరణం ఇస్తారని ఈ కేసులో కోర్టు చెప్పింది. కానీ, విడాకులు తీసుకున్న తర్వాత భాగస్వాముల్లో ఏ ఒక్కరి స్థాయి మారినా వారి స్థాయికి అనుగుణంగా భరణం లేదా మెయింటెనెన్స్ పెంచుకుంటూ పోవాలని ఆశించడం సరైన విషయం కాదని, సుప్రీం కోర్టు బెంచ్ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్ అన్నారు.
ఇలా అడగడం మాజీ భర్త వ్యక్తిగత పురోగతిపై ఒత్తిడి పెట్టడమే అని కూడా వ్యాఖ్యానించారు. పరిస్థితులు అనుకూలించక భర్త తన సంపాదనను, ఆస్తిని కోల్పోతే, భార్య తన సంపాదనను పంచి ఇస్తారా అని కోర్టు ప్రశ్నించింది.
మహిళల సంక్షేమం, సాధికారత కోసం ఏర్పాటు చేసిన చట్టంలోని అంశాలను భాగస్వామిని బెదిరించడానికి, ఆస్తిని కాజేయడానికి, ఆధిపత్యం చెలాయించడానికి వాడకూడదని హెచ్చరించింది.
ఈ కేసులో ఈమె భర్త ఆస్తితో సమానంగా మాత్రమే కాకుండా ఆయన మొదటి భార్య ఆస్తితో కూడా సమానంగా భరణం ఇప్పించమని కోరడం సరైంది కాదని కోర్టు పేర్కొంది. పుణె కోర్టు అంతకు ముందు ఆమెకు రూ.10 కోట్ల భరణాన్ని మంజూరు చేసింది. ఇదే మొత్తాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఆమె అధీనంలో ఉన్న భర్తకు సంబంధించిన ఫ్లాట్లను ఖాళీ చేయమని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
విడాకుల తర్వాత భరణం మొత్తాన్ని మార్చమని కోరవచ్చా?
భరణం ఇచ్చే వ్యక్తి అకస్మాత్తుగా వైకల్యానికి గురైనా, ఆదాయం కోల్పోయినా, భార్య విడాకుల తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నా లేదా మరొకరితో కలిసి జీవిస్తున్నా, భార్య ఆదాయ స్థాయి పెరిగినా… కోర్టును మళ్లీ ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు తిరిగి పరిశీలిస్తాయి.
హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి భాగస్వాముల్లో ఎవరైనా భరణం అడగొచ్చు. కానీ, క్రైస్తవ, ముస్లిం, పార్సీ విడాకుల చట్టాన్ని అనుసరించి భార్య నుంచి భర్త భరణం కోరలేరు. భార్యకు మాత్రమే భరణం కోరే హక్కు ఉంది. భర్త ఆదాయంలో ఐదో వంతును అడిగే హక్కు పార్సీ చట్టం కల్పిస్తుంది.
ఆమె మరో వివాహం చేసుకోనంత వరకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది.
భారత్ లో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం కోసం పోరాటం జరుగుతోంది. ఇద్దరూ సమానమే అంటున్న కాలంలో ఉన్నాం. అయితే, కోర్టులు ఎక్కువగా పురుషులనే భరణం ఇమ్మని చెబుతాయి. పితృస్వామ్య సమాజంలో చాలా మంది స్త్రీలు వివాహం తర్వాత తమ జీవితాన్ని కుటుంబానికే అంకితం చేస్తారు. దీంతో, భర్త భార్యకు భరణం ఇవ్వడం సాధారణంగా మారిపోయింది.
ఈ విషయాలు విన్న తర్వాత నా స్నేహితురాలు కోర్టులో విడాకుల కోసం వెళ్లాలా, వద్దా అనేదానిపై మరోసారి ఆలోచనలో పడింది. విడాకులతో కలిగే లాభనష్టాల గురించి కొంత అవగాహన కలిగిందని ఊపిరి పీల్చుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














