చికిత్స కోసం వచ్చిన 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, కోర్టులో ఒప్పుకున్న ఫ్రెంచ్ సర్జన్

జోయెల్ లీ స్కౌర్నెక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోయెల్ లీ స్కౌర్నెక్ పై కొనసాగుతున్న కోర్టు విచారణ ( ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, లారా గోజి
    • హోదా, బీబీసీ న్యూస్

(ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు)

మత్తు (అనస్థీషియా)లో ఉన్నప్పుడు వందల మంది రోగులపై వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఫ్రెంచ్ సర్జన్‌, తాను హేయమైన చర్యలకు పాల్పడినట్లు కోర్టు ముందు ఒప్పుకున్నారు. బాధితులు ఎదుర్కొనే వేదన తనకు అర్థమైందని, ఇదంతా తాను తెలిసే చేసినట్లు చెప్పారు.

74 ఏళ్ల జోయెల్ లీ స్కౌర్నెక్ 299 మందిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో చాలామంది 1989 నుంచి 2014 మధ్యలో ఆయన దగ్గర చికిత్స తీసుకున్నవారే. పైగా ఎక్కువమంది అప్పటికి 15 సంవత్సరాలలోపు బాలలే.

''ఈ గాయాలు ఎప్పటికీ చెరిగిపోనివని నాకు తెలుసు.'' అని జోయెల్ లీ స్కౌర్నెక్ అన్నారు.

చిన్నారులపై జరిగిన అతిపెద్ద లైంగిక వేధింపుల కేసుగా పేరు సంపాదించిన ఈ కేసు విచారణ ఫ్రాన్స్‌లోని వేన్స్‌‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ కేసు విచారణలో తొలిరోజు హియరింగ్‌కు స్కౌర్నెక్ హాజరయ్యారు.

''నేను ఈ విషయంలో అబద్ధాలు ఆడలేను. కానీ, నా చర్యల వల్ల వాళ్లు, వాళ్ల కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. వారు జీవితాంతం ఈ బాధతోనే బతుకుతారు.'' అని కోర్టుకు చెప్పారు స్కౌర్నెక్.

పిల్లల వేధింపులను చూపించే వెబ్‌సైట్లను ఆయన తరచూ చూస్తున్నారనీ ఫ్రెంచ్ అథారిటీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు చేసినప్పటికీ, లీ స్కౌర్నెక్‌ను నియమించుకున్న ఆస్పత్రుల యాజమాన్యం, ఆయన సహోద్యోగులు ఆయన్ను కాపాడాలని చూశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పిల్లలపై ఆయన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం వాటిని ఉపయోగించుకోలేదని కూడా తెలుస్తోంది.

లీ స్కౌర్నెక్‌కు పెడోఫిలియా ఉందని ఆయన కుటుంబ సభ్యులకు తెలుసు. కానీ, ఆయన్ను ఆపడంలో వారూ విఫలమయ్యారు.

పెడోఫిలియా అంటే చిన్నారుల పట్ల లైంగికంగా ఆకర్షితులై ఉండడం. ఇలా ఉన్నవారు చిన్నపిల్లల్ని లైంగిక వేధింపులకు గురిచేస్తుంటారు.

''ఆయన కుటుంబం అనుసరించిన మౌనం, దశాబ్దాలపాటు ఆయన వేధింపులు కొనసాగేందుకు కారణమైంది.'' అని ఈ కేసు విచారణలో పాలుపంచుకుంటున్న ఒక న్యాయవాది అంతకుముందు బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లీ స్కౌర్నెక్‌పై తొలిసారి విచారణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా సమయంలో లీ స్కౌర్నెక్‌పై తొలిసారి విచారణ

లీ స్కౌర్నెక్ ఒకప్పుడు ఫ్రాన్స్‌లోని ఒక చిన్నపట్టణంలో పేరున్న సర్జన్. 2017 నుంచి ఆయన జైలులో ఉన్నారు. తన మేనకోడళ్లను, ఆరేళ్ల అమ్మాయిని, ఒక యువ రోగిని అత్యాచారం చేశారన్న ఆరోపణలతో అప్పుడు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మేనకోడళ్లకు 30 ఏళ్లు. 2020లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత లీ స్కౌర్నెక్ ఇంటిని పోలీసులు సోదా చేశారు. అప్పుడు పిల్లల ఆకారంలో ఉండే సెక్స్ బొమ్మలు, 3 లక్షలకు పైగా పిల్లల వేధింపుల చిత్రాలు, 25 ఏళ్లుగా యువ రోగులపై తాను పాల్పడ్డ వేధింపులకు చెందిన విషయాలను డైరీల్లో వేలాది పేజీలలో క్షుణ్నంగా రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

లీ స్కౌర్నెక్ ప్రస్తుతం 100కి పైగా అత్యాచార అభియోగాలను, 150కి పైగా లైంగిక వేధింపు అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

ఆయన మాజీ రోగులలో కొందరు ప్రస్తుతం పెద్దవారు అయ్యారు. వైద్య పరీక్షల్లో భాగంగా సర్జన్ తమను తాకినట్లు గుర్తుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఆ సమయంలో తల్లిదండ్రులు లేదా ఇతర వైద్యులు కూడా గదిలో ఉన్నట్లు తెలిపారు.

కానీ, ఆయన బాధితుల్లో చాలామంది మత్తు ప్రభావంలో (అనస్థీషియాలో) ఉన్నారు. ఆ సమయంలో వారిపై స్కౌర్నెక్ వేధింపులు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

న్యాయవాది ఫ్రాన్సెస్కా సాటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యాయవాది ఫ్రాన్సెస్కా సాటా

''ఈ భయంకరమైన స్టోరీలో ఏదీ సాధారణమైనది కాదు. బాధితులు విచారణాధికారులను ఆశ్రయించలేదు. విచారణాధికారులే బాధితులను గుర్తించారు.'' అని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ స్టీఫానే కెల్లెన్‌బర్గర్ కోర్టుకు చెప్పారు.

''చాలామందికి అసలు ఏం జరిగిందో గుర్తుకు లేదు. కొంతమందికి ఇది తెలియకుండానే జరిగిపోయింది.'' అని అన్నారు.

ఈ వేధింపులు గుర్తున్న వారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తమ మొత్తం జీవితంపై ప్రభావం చూపినట్లు వివరించారు. చాలా కేసుల్లో తీవ్రమైన మానసిక వేదనను బాధితులు ఎదుర్కొన్నారు.

''లీ స్కౌర్నెక్ వేధింపుల వల్ల నా మనువడు మాథిస్ ఆత్మహత్య చేసుకున్నాడు.'' అని ఆయన రోగుల్లో ఒకరి అమ్మమ్మ చెప్పారు.

పలువురు బాధితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఫ్రాన్సెస్కా సాటా అంతకుముందు బీబీసీతో మాట్లాడుతూ.. తన క్లయింట్స్‌లో ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయని, వారు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

బాధితుల సంఘానికి చెందిన ఒలివియా మాన్స్ బాధితులుగా భావిస్తున్న పలువురితో మాట్లాడారు. చాలామందికి ఈ ఘటనల గురించి చాలా తక్కువ గుర్తుందని, అందుకే, సరిగ్గా వివరించలేకపోతున్నారని అన్నారు.

బాధితులుగా గుర్తించినవారిలో చాలామంది తమపై అత్యాచారం లేదా వేధింపులు జరిగినట్లు గుర్తులేదని చెప్పారు.

వారిని పోలీసులు సంప్రదించడానికి ముందు వాళ్లకు ఈ వ్యవహారం గురించి ఏమీ తెలియదని, సాధారణ జీవితం గడిపారని, ఇది తెలిసిన తర్వాత చాలామంది వణికిపోతున్నారని మాన్స్ అన్నారు.

లీ స్కౌర్నెక్ డైరీలో తన పేరును పోలీసులు చూపించిన తర్వాత, ఆనాటి విషయాలన్ని ఒక్కసారిగా గుర్తు వచ్చినట్లు ఒక మహిళ తెలిపారు.

''నా ఆస్పత్రి గదిలోకి ఒకరు వచ్చారు. బెడ్‌షీట్లను పైకి లేపారు. అంతా బాగుందో చెక్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ, ఆయన నాపై అత్యాచారానికి పాల్పడ్డారు.'' అని ఆమె చెప్పారు.

తనపై వచ్చిన అభియోగాలను లీ స్కౌర్నెక్ సోమవారం జరిగిన తొలిరోజు విచారణలోనే ఒప్పుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా పదుల సంఖ్యలో న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.

బాధితులుగా భావిస్తున్నవారంతా ఒక గదిలో కూర్చున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు పలువురు మానసిక వైద్య నిపుణులు కూడా వారికి అందుబాటులో ఉన్నారు.

పిల్లల్ని వేధించడం లేదా అత్యాచారం చేసిన ఆరోపణలను లీ స్కౌర్నెక్ అంతకుముందు ఖండించారు. తన డైరీల్లో తన ఫాంటసీల గురించి రాసుకున్నట్లు చెప్పారు. కానీ, పోలీసుల విచారణలో సేకరించిన వివరాలు, లీ స్కౌర్నెక్ వాడిన పదాలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని, డైరీలోని చాలా విషయాలు నిజమైనవని అర్థమవుతున్నట్లు జడ్జి ఆడ్ బురేసి చెప్పారు.

ఈ కేసు విచారణ ప్రారంభం కావడానికి గంట ముందు, కోర్టు రూమ్ వెలుపల పదుల సంఖ్యలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు.

కేసు ఫైల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా అరెస్ట్ చేశారు?

2005లోనే లీ స్కౌర్నెక్ పిల్లల వేధింపులకు చెందిన వెబ్‌సైట్లను యాక్సస్ చేస్తున్నారని ఫ్రెంచ్ అథారిటీలను ఎఫ్‌బీఐ హెచ్చరించింది.

ఆ సమయంలో కేవలం నాలుగు నెలల సస్పెన్షన్ మాత్రమే విధించారు. ఆయనకు ఎలాంటి వైద్య లేదా మానసిక చికిత్సను ఇవ్వలేదు.

తన తోటి ఉద్యోగి ఒకరు లీ స్కౌర్నెక్‌పై అనుమానం వ్యక్తం చేసి ఈ అభియోగాలపై స్థానిక వైద్య సంఘం విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే, లీ స్కౌర్నెక్ ఎక్కడా డాక్టర్లు పాటించే నైతికత నియమావళిని ఉల్లంఘించలేదంటూ ఒకే ఒక్క డాక్టర్ తప్ప మిగతా అందరూ ఆయనకు అనుకూలంగా ఓటేశారు.

డాక్టర్లు అన్ని సందర్భాల్లో నమ్మకం, సమగ్రతతో వ్యవహరించాలని, విధులకు కట్టుబడి ఉండాలని ఈ నియమావళి చెబుతుంది. దీంతో, ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

చివరకు ఆరేళ్ల బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డట్టు తల్లిదండ్రులు ఆరోపించడంతో లీ స్కౌర్నెక్‌‌ను అరెస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)