వేడి నీరు తాగాలా? ఫిల్టర్ వాటర్ మంచిదా

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

పుణెలో మంచినీటి ద్వారా గీయాన్ -బరే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాపిస్తోందని వెల్లడైంది. దీంతో ఏ నీరు తాగితే మంచిదనే చర్చ మొదలైంది.

కుళాయి నీరు లేదా మరిగించిన నీరు లేదా ఫిల్టర్ చేసిన ఆర్ఓ వాటర్ ఇలా ఏ నీరు తాగితే మంచిది? ఏ నీరు మరింత స్వచ్చమైంది? పోషక విలువల పరంగా ఏ నీరు తాగితే బెటర్? అనేది మనం ఈ కథనంలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం..

హెచ్2ఓ.. అంటే రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షల నీటి అణువులు కలిస్తే నీటి బిందువు ఏర్పడుతుంది.

భూగోళంపై నీరు 71 శాతం ఉంటుంది. అందులో 96.5 శాతం సముద్రాలలోని నీరే. భూగ్రహంపై ఉన్న నీటిలో ఒక్కశాతం మాత్రమే మానవ అవసరాలకు ఉపయోగపడే మంచి నీరు.

మానవ శరీరం కూడా 60-70 శాతం వరకు నీటితోనే నిండి ఉంటుంది. మానవ శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే మనం ఏ నీటిని తాగుతున్నామన్నది కూడా ముఖ్యం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మంచినీరు

ఫొటో సోర్స్, Getty Images

మంచినీటి నాణ్యతను ఎలా పరీక్షిస్తారు?

మంచినీటి నాణ్యతను పరీక్షించేందుకు, ఆ నీరు తాగేందుకు సరైందా కాదా గుర్తించేందుకు కనీసం 60 రకాల పరీక్షలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రతిపాదించింది. వీటిని ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్స్-10500 అంటారు.

నీటి ఆమ్లత్వమే డ్రింకింగ్ వాటర్ పీహెచ్. ఇది డబ్ల్యూహెచ్ఓ, బీఐఎస్ ప్రకారం.. 6.5-8.5 మధ్య ఉండాలి.

నీటిలో ఎన్నో రకాల లవణాలు, పోషకాలు ఉంటాయి. వాటి కచ్చితమైన స్థాయిలను తెలుసుకునేందుకు టీడీఎస్ పరీక్ష చేయాలి.

నాణ్యమైన తాగునీటిలో ఆర్గానిక్ సాల్ట్స్, కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సోడియం, బైకార్బనైట్స్, క్లోరైడ్స్, సల్ఫైట్స్ అలాగే కొద్ది మొత్తంలో కర్బన పదార్థాలు కరిగి ఉంటాయి.

వీటితో పాటు, కాడ్మియం, లెడ్, నికెల్ వంటి లోహాలు కూడా చాలా తక్కువ మోతాదులో కరిగి ఉంటాయి.

ఇలా నీటిలో కరిగి ఉన్న ఈ పదార్థాల మొత్తాన్నే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఇది ఒక లీటరు నీటిలో 500mg/L మించకూడదు. అలాగే 100mg/L తగ్గకూడదని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయించింది.

మనం తాగే నీటిలో టీడీఎస్ 100 కంటే తక్కువ ఉంటే అవసరమైన లవణాలు లేనట్లే. అలాగే 500 కంటే ఎక్కువ టీడీఎస్ ఉంటే ఆ నీరును హార్డ్ వాటర్ (కఠిన జలం) అంటారు. ఈ రెండూ తాగడానికి పనికిరావు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటిని తాగాలంటే దాని టీడీఎస్ 100 నుంచి 500 మధ్య ఉండాలి.

అలాగే, తాగే నీటిలో లవణాలు ఎంత స్థాయిలో ఉండాలో కూడా బీఐఎస్ సూచించింది.

వాటర్

ఫొటో సోర్స్, Getty Images

లీటరు నీటిలో ఉండాల్సిన లవణాలు

బై కార్బోనైట్స్ 200mg/L

కాల్షియం 75mg/L

మెగ్నీషియం 30mg/L

నైట్రేట్ 45mg/L

ఆర్సెనిక్ 0.01mg/L

కాపర్ 0.05mg/L

క్లోరైడ్స్ 250mg/L

సల్పేట్ 200mg/L

ఫ్లోరైడ్ 1mg/L

ఐరన్ 0.3mg/L

మెర్క్యూరీ 0.01mg/L

జింక్ 5mg/L

లవణాలు ఎక్కువగా ఉంటే దుష్ప్రభావాలు ఏంటి?

నీటిలో లవణాలు ఎక్కువైతే, శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలు చూపుతాయి.

  • ఫ్లోరైడ్స్ ఒక మిల్లీగ్రామ్ మించితే, డెంటల్ ఫ్లోరోసిస్ (Dental fluorosis) వచ్చే అవకాశం ఉంటుంది.
  • సోడియం ఎక్కువగా ఉంటే బ్లడ్ ప్రెజర్ సమస్యలు వస్తాయి.
  • పంట పొలాల ఎరువుల ద్వారా నైట్రేట్ (Nitrate) తాగునీటితో కలిసి శరీరంలోకి వెళ్తే.. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి శ్వాస ఇబ్బందులు, కళ్లు తిరగడం, కనుపాపలు నీలం రంగులోకి మారడానికి కారణమవుతుంది. దీనినే 'బ్లూ బేబీ సిండ్రోమ్' అంటారు. దీని వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.
  • ఆర్సెనిక్ ఎక్కువ ఉంటే చర్మంపై తెల్లని మచ్చలు వస్తాయి.
  • నీటిలో కాల్షియం తక్కువైతే ఎముకల సమస్యలు వస్తాయి.
  • మొత్తంగా టీడీఎస్ తక్కువ ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
మంచినీరు

ఫొటో సోర్స్, Getty Images

నీటి రకాలు, వాటి లాభాలు, నష్టాలు

కుళాయి నీరు

నదులు, చెరువులు, బావుల నుంచి పైప్‌లైన్ల ద్వారా మన ఇళ్లకు వచ్చే నీరు క్లోరినేటెడ్‌గా ఉంటాయి. క్లోరినేషన్ లేదా ఓజోనైజేషన్ చేసి రక్షిత నీరుగా మార్చి కుళాయిలు, ట్యాంకర్లు ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తాయి. నీటి నాణ్యతను పెంచేందుకు ఈ ప్రక్రియలను చేపడుతుంటారు.

అయితే, వీటిలో ఉన్న ప్రమాదాలేంటి? ఈ ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియాలు, వైరస్‌లు అన్ని చనిపోవు. ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.

అంతేకాక, పలు అశుభ్రమైన ప్రాంతాల నుంచి ఈ పైప్‌లైన్లు వెళ్తూ ఉంటాయి. ఒకవేళ అవి పగిలినా లేక లీక్ అయినా, ఆ నీరు కలుషితమవుతుంది. అది చాలా ప్రమాదకరం.

నదులు, బావులు, బోరు బావులు

గ్రామాల్లో, నగరాల్లో తరచూ బావులు లేదా బోరుబావి నీటినే మంచినీటిగా ఉపయోగిస్తుంటారు.

''బావులు లేదా బోరుబావుల నీరు గ్రౌండ్ నుంచి వస్తుంది.'' అని డాక్టర్ అవినాష్ బోంద్వే చెప్పారు. దాని పక్కనుంచే అదే గ్రామంలోని మురికి కాలువల నీరు పోతూ ఉంటుంది.

అక్కడ్నుంచి పెద్ద మొత్తంలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు బావి నీటిలోకి ప్రవేశించగలవని అన్నారు. దీనివల్ల, బావి నీరు కలుషితమవ్వడమే కాకుండా.. భూమి లోపలుండే ఎన్నో రకాల లవణాలు, రసాయనాలు దానిలో కలుస్తాయి. దీనివల్ల, ఎన్నో సమస్యలు లేదా అనారోగ్యాలు వస్తుంటాయి. పొట్టలోని జబ్బులకు కూడా కారణమవుతుంది.

''బావి నీటి వాడే వారు వాటిని మరిగించి, వాడాలి. వాటిని మళ్లీ వాడకూడదు.'' అని అవినాష్ సూచించారు.

మరిగించిన నీరు

ఫిల్టర్ నీటిలో వ్యర్థాలు తొలగిపోతాయి. కానీ, దానిలో ఉన్న వైరస్‌లు, కెమికల్స్ మాత్రం ఫిల్టర్ కావు.

అదే నీటిని మరిగించడం ద్వారా.. దానిలో ఉన్న చాలా వరకు బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ, అమీబా లాంటి ఏకకణ జీవులు, వైరస్‌లు చనిపోవు. మరిగించిన నీటిలో కూడా ఇవి బతకగలవు.

వీటివల్ల వాంతులు, విరోచనాలు, కడుపుకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి.

ఫిల్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఓ – యూవీ – యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్డ్ వాటర్

ఈ పదాలను మీరు తరచూ వ్యాపార ప్రకటనల్లో వింటుంటారు.

ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఇలా చేయడం వలన నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. కానీ, అదే సమయంలో, నీటిలోని లవణాలు, పోషకాలు కూడా పోతాయి.

యాక్టివేటెడ్ కార్బన్ అనే ప్రక్రియను నీటిలోని ఆర్గానిక్ కెమికల్స్ తొలగించేందుకు ఉపయోగిస్తారు. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ నీటి రంగు, రుచిని ప్రభావితం చేసే కాలుష్య కారకాలను, రసాయన ఎరువుల జాడలను, ప్రమాదకర రసాయనాలను తొలగిస్తాయి. అయితే, నీటిలోని ప్రమాదకర మైక్రోబ్యాక్టీరియా మాత్రం ఈ ప్రక్రియలో చనిపోదు.

యూవీ ప్రక్రియలో, అతినీలలోహిత కిరణాల ద్వారా మైక్రోబ్యాక్టీరియా చనిపోతుంది. కానీ, నీటిలో ఉండే రసాయన కారకాలు పోవు.

అయితే, ఈ ప్రక్రియలన్నింటిలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. చాలా ఫిల్టర్స్ ఈ మూడు రకాల ప్రక్రియలను చేపడతాయి. ఆర్ఓ, యాక్టివేటెడ్ కార్బన్, ఆ తర్వాత యూవీ.

ఇక ఆ నీరు స్వచ్చమైంది. కానీ, ఎలాంటి పోషక విలువలు ఉండవు. మీరు వాడే ఫిల్టర్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం.

''చాలా ఇళ్లల్లో ఆర్ఓ నీటిని వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో పెద్ద బాటిళ్లల్లో ఆర్ఓ నీటిని నింపి కమర్షియల్‌గా విక్రయిస్తున్నారు.'' అని డాక్టర్ అవినాష్ చెప్పారు.

ఆర్ఓ ఫిల్టర్‌లో ఎంత వీలైతే అంత నీటిని ప్యూరిఫై చేస్తారు. దీనిలో చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు చనిపోతాయి. కానీ, కొన్ని వైరస్‌లు దీని ద్వారానే వస్తాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆర్ఓ ద్వారా శరీరానికి అవసరమైన చాలా రకాల లవణాలు, ఖనిజాలు నీటి నుంచి తొలగిపోతాయి.

'' మన శరీరానికి అవసరమైన లవణాలు అందకపోతే, తిమ్మిరి రావడం, నడవలేకపోవడం, కళ్లు తిరగడం వంటివి జరుగుతుంటాయి.'' అని డాక్టర్ చెప్పారు.

బాటిల్‌లోని నీరు

ఆర్ఓ, ఇతర ఫిల్టరేషన్ ప్రక్రియలు చేపట్టిన నీటిని బాటిళ్లలో అమ్ముతుంటారు. వీటికి తరచూ 'యాడెడ్ మినరల్స్' అనే లేబుల్ వేస్తారు. ఎందుకంటే, బ్రాండ్‌ను బట్టి బాటిల్‌లోని నీటి రుచి మారుతుంటుంది.

కానీ, ఈ నీటిని కొనేటప్పుడు, ఇవెక్కడ ప్రాసెస్ అయ్యాయి, ఎప్పుడు ప్రాసెస్ అయ్యాయి, లవణాల శాతం ఎంత, వాటర్ బాటిల్ తయారు చేసేందుకు ఏ రకమైన ప్లాస్టిక్ వాడారు వంటివి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. బాటిల్ వాటర్‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి.

డిస్టిల్డ్ వాటర్

దీనిలో నీటిని మరిగించి, ఆవిరి రూపంలో పట్టి నిల్వచేస్తారు. అది చల్లబడినప్పుడు, నీరుగా మారుతుంది. దీన్నే డిస్టిల్డ్ వాటర్ అంటారు. అత్యంత స్వచ్చమైన నీరు.

ఈ నీటిలో ఎటువంటి మూలకాలు ఉండవు. దీనిని తాగడం వలన దాహం తీరుతుందే తప్పా శరీరానికి ఏ విధమైన ఖనిజ లవణాలు (మినరల్స్), పోషకాలు అందవు. ఈ నీటిని తరచూ ల్యాబ్స్‌లో, పరిశ్రమల్లో వాడుతుంటారు.

ఫిల్టర్

ఏ నీటిని తాగాలి?

''ప్రస్తుతం నీటి కాలుష్యం బాగా పెరుగుతుంది. దీంతో, నీటిలో ఉండే బ్యాక్టీరియాను, వైరస్‌లను, రసాయనాలను ఏ విధానం కూడా పూర్తిగా హరించలేకపోతుంది. ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవాలంటే, వేడి చేసిన, ఫిల్టర్ వాటర్‌ను తాగాలి. ఒకవేళ మీకు వీలైతే, మంచి ఫిల్టర్‌ను వాడాలి.'' అని డాక్టర్ అవినాష్ చెప్పారు.

మీరు తాగే నీరు స్వచ్చమైందో కాదో తెలుసుకోవడమెలా?

  • మీరు తాగే నీటి రుచి ఎలా ఉంది? రుచి తేడాగా ఉందా లేదా మెటాలిక్‌గా అనిపిస్తుందా?
  • నీటి రంగు ఎలా ఉంది? ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి?
  • మురిగిపోయిన గుడ్లు లేదా మరేదైనా వాస వస్తున్నాయా? ఇలా కొన్నింటి ద్వారా తాగే నీరు స్వచ్చమైందో కాదో తెలుసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)