‘ప్రభుత్వం మా బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తొంగిచూస్తోంది?’

ఉత్తరాఖండ్, యూసీసీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుమేధా పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సహజీవనం చేస్తున్న జంటలను నియంత్రించే దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2025 జనవరి 27న కొన్ని చర్యలను ప్రకటించింది.

మతం, లైంగిక గుర్తింపు వంటివాటికి అతీతంగా ఉత్తరాఖండ్ ప్రజలందరినీ ఒకే చట్టం కిందకు తెచ్చే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)లో సహజీవనం నియంత్రణ చర్యలు కూడా భాగం.

ఉమ్మడి పౌర స్మృతిని అమలుచేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్.

దేశమంతా ఈ చట్టం అమలు చేయాలన్న ప్రతిపాదన ఉంది.

ఇది చరిత్రాత్మక అడుగుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల సమాజంలో మహిళలకు భద్రత పెరుగుతుందని అంటోంది.

అయితే చట్టంలోని అనేక నిబంధనలను చాలామంది ప్రజలు, లాయర్లు, సామాజిక కార్యకర్తలు కోర్టులో సవాల్ చేస్తున్నారు.

ఈ చట్టం వల్ల ప్రజలపై నిఘా పెరుగుతుందని, ఉత్తరాఖండ్ పోలీసు రాష్ట్రంగా మారుతుందని వాదిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం, సహజీవనం చేయాలనుకునే జంటలు తమ వివరాలను రిజిస్ట్రార్‌కు సమర్పించాలి.

30రోజుల్లో రిజిస్ట్రార్ దీనిపై విచారణ జరుపుతారు. దర్యాప్తు సమయంలో అదనపు సమాచారం లేదా సాక్ష్యాలను కావాలని సహజీవనం చేస్తున్న జంటలను రిజిస్ట్రార్ అడగొచ్చు.

సహజీవనం చేయాలనుకునే జంట సమాచారాన్ని రిజిస్ట్రార్ స్థానిక పోలీసులకు పంపిస్తారు. జంటలో ఎవరన్నా 21 ఏళ్ల కన్నా తక్కువ వయసుంటే వారి తల్లిదండ్రులకు విషయం తెలియజేస్తారు.

బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు ఒకటి. అయితే కొత్త నిబంధనలను సహజీవనం చేస్తున్న, చేయాలనుకునే జంటలతో పాటు లాయర్లూ వ్యతిరేకిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తరాఖండ్, యూసీసీ
ఫొటో క్యాప్షన్, బీజేపీ నేత దేవేంద్ర భాసిన్

వ్యక్తిగత సంబంధాలపై నిఘా

మృణాళిని, ఫయాజ్‌లు నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నారు. వారి మతాలు వేరు. వారి అనుబంధాన్ని కుటుంబాలు వ్యతిరేస్తుండడంతో వారికి పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. ఫయాజ్‌తో కలిసి జీవించడం కూడా ఇప్పుడు సమస్యవుతుందని మృణాళిని ఆందోళన చెందుతున్నారు.

''మేం భాగస్వాములుగా ఉండేలా చేయగల మార్గం అదొక్కటే కాబట్టి మేం కలిసి జీవిస్తున్నాం. కొత్త నిబంధనలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నా తల్లిదండ్రుల అంగీకారం లేకుండా నేను సంప్రదాయరీతిలో పెళ్లిచేసుకోలేను. ఇక ఇప్పుడు ఆయనతో కలిసి జీవించడం కూడా కష్టంగా మారొచ్చు'' అని మృణాళిని అన్నారు.

సహజీవన సంబంధాన్ని నమోదు చేసుకోకపోతే జంట జరిమానా కట్టాలని కూడా నిబంధనలున్నాయి. సహజీవనం ప్రారంభించిన రెండు నెలల్లోపు జంట రిజిస్టర్ చేసుకోకపోతే వారు 10 వేల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. లేదా ఇద్దరూ మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాలి.

సంబంధిత అధికారికి ఓ స్టేట్‌మెంట్ సమర్పించడం, భాగస్వామికి అందుకు సంబంధించిన కాపీ సమర్పించడం ద్వారా తమ సంబంధం నుంచి బయటకురావొచ్చు.

సహజీవనం నుంచి బయటకు రావడం గురించి కూడా పోలీసులకు తెలియజేయాలి.

మతం, చిరునామా, వృత్తికి సంబంధించిన సమాచారం అందించడం ద్వారా జంట ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో తమ సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఇందుకు సంబంధించిన పోర్టల్‌లో సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

పెళ్లి చేసుకోవడం అంత తేలికగా తమకు సాధ్యం కాదని మృణాళిని చెప్పారు. యూసీసీ పోర్టల్‌లో తాము సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే తన కుటుంబం దాన్ని గుర్తిస్తుందని ఆమె భయపడుతున్నారు.

అలాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కావడం లేదని మృణాళిని అన్నారు. సహజీవనం చేస్తున్న చాలా జంటలు ఈ చట్టాన్ని ప్రైవసీని అతిక్రమించడంలానే భావిస్తున్నాయి.

ఉత్తరాఖండ్, యూసీసీ
ఫొటో క్యాప్షన్, హిందూ రక్షదళ్ సభ్యురాలు రిమ్‌ఝిమ్ కంబోజ్

సమాచారం భద్రత, వ్యక్తిగత గోప్యతపై ఆందోళన

63 ఏళ్ల విశ్వరామ్ పెళ్లిచేసుకోకుండా 1990నుంచి తన భాగస్వామితో సహజీవనం చేస్తూ ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు.

తాము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయని ఆయన అంటున్నారు. ''మా వ్యక్తిగత జీవితాల్లో, మా బెడ్‌రూమ్‌ల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎందుకు కల్పించుకుంటోంది''అని విశ్వరామ్ ప్రశ్నిస్తున్నారు.

ఈ చట్టాన్ని విశ్వరామ్ తప్పుపట్టారు. అందరి సమాచారం సేకరించడం, వ్యక్తిగత గోప్యత వంటివాటిపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్‌లో నివసిస్తున్న శీతల్, రోడ్రిక్ కూడా మతాంతర జంట. గత ఏడాది ఉమ్మడి పౌరస్మృతి నిబంధనలు ప్రకటించిన తర్వాత వారు పెళ్లిచేసుకున్నారు.

వారికి కూడా ఇవే తరహా ఆందోళనలు ఉన్నాయి.

''మేం కలిసి జీవిస్తున్న సమయంలో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చి ఉంటే, అది మాకు చాలా సమస్యలను తెచ్చిపెట్టేది. సహజీవనానికి, మతాంతర సంబంధాలకు మద్దతు ఇవ్వని కొన్ని సంస్థలకు మా సమాచారం అందితే అది మాకు ప్రమాదకరంగా మారేది'' అని రోడ్రిక్ చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో హిందూ రక్ష దళ్ వంటి సంస్థలు ఉమ్మడి పౌరస్మృతి అమలుకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నాయి. మహిళల భద్రతకు యూసీసీ అవసరమని వారు నమ్ముతున్నారు.

హిందూ రక్ష దళ్ సభ్యురాలైన రిమ్‌ఝిమ్ కంబోజ్ హిందూ మతానికి చెందని ఓ వ్యక్తితో ఇటీవల మతపరమైన సంభాషణ జరిపారు. ఆ వ్యక్తి హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత కంబోజ్ వారి వివాహాన్ని రిజిస్టర్ చేయించారు. ‘మేం చాలా కేసుల్లో చూశాం. అమ్మాయిలు, ముఖ్యంగా హిందూ మతానికి చెందిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా సహజీవనం ప్రారంభిస్తుంటారు. వారు చాలా ఆధునికంగా ఉంటారు. మతం పెద్ద విషయం కాదని వాళ్లనుకుంటారు. వాళ్లు ప్రలోభాలకు గురైఉంటారు. వారిని ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉంటారు'' అని ఆమె చెప్పారు.

ఉత్తరాఖండ్, యూసీసీ
ఫొటో క్యాప్షన్, లాయర్ చంద్రకళ

విడాకులు తీసుకోవడం కష్టమైన వ్యవహారం

''2005 గృహహింస చట్టం కింద సహజీవనాన్ని చట్టబద్ధమైనదిగా గుర్తిస్తున్నారు. అలాంటి సంబంధాల్లో ఎలాంటి హింస అయినా శిక్షార్హం. దీనివల్ల సహజీవనం బంధంలోని మహిళలకు రక్షణ లభిస్తోంది. కాబట్టి మహిళలకు రక్షణ కోసం యూసీసీ కింద సహజీవనాలను రిజిస్టర్ చేయాలని వాదించడం అసంబద్ధమనిపిస్తోంది'' అని లాయర్ చంద్రకళ చెప్పారు.

యూసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఇష్టంలేని వివాహ బంధాన్ని ముగించడం కూడా అంత తేలిగ్గా అనిపించడం లేదు. వివాహమైన వ్యక్తి మరొకరితో సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తమ భార్య లేదా భర్త నుంచి చట్టబద్ధంగా విడిపోయి ఉండాలి. ''మేం ఇంతకుముందు వేరే వ్యక్తులను పెళ్లిచేసుకున్నాం. విడాకులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. చాలా సమయం పడుతుంది. సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకునేముందు కచ్చితంగా విడాకులు తీసుకుని ఉండాలనడం సరైనది కాదు'' అని శీతల్ చెప్పారు.

వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు ఉంటాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్పింది. ''రిజిస్ట్రేషన్ సమయంలో మూడో వ్యక్తికి ఈ సమాచారం తెలియనివ్వం. జంటకు రక్షణ కల్పించే అన్ని చర్యలూ తీసుకుంటాం'' అని ఉత్తరాఖండ్ శాంతిభద్రతల విభాగం అదనపు సెక్రటరీ నివేదిత కుక్రెటి చెప్పారు.

వివాహంలో వేధింపులకు గురవుతున్న మహిళల సమస్యను ప్రస్తావిస్తూ కొందరు లాయర్లు కొత్త నిబంధనలు వ్యతిరేకిస్తున్నారు. కొత్త నిబంధనలను మహిళల స్వతంత్రత, నిర్ణయాలు తీసుకోవడంలో వారి స్వేచ్ఛపై జరిగే దాడిగా లాయర్ చంద్రకళ ఆరోపించారు. వైవాహిక జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన కేసులను చంద్రకళ వాదిస్తుంటారు.

పెళ్లితో సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు కొంతమంది విడాకులు తీసుకోకుండానే సహజీవనం బంధాల్లోకి వెళ్తుంటారు. విడాకుల ప్రక్రియకు భర్త, అత్తమామలు అడ్డంకులు సృష్టిస్తుండడంతో వారికి అంత తేలిగ్గా వివాహ బంధం నుంచి విముక్తి లభించదు.

ఉత్తరాఖండ్, యూసీసీ
ఫొటో క్యాప్షన్, యూసీసీ నిబంధనలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని లాయర్ రజియా బేగ్ ఆరోపించారు.

యూసీసీ మద్దతుదారులు ఏం చెబుతున్నారు?

యూసీసీ నిబంధనలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేయడానికి చర్యలు తీసుకున్నవారిలో బీజేపీ సభ్యుడు దేవేంద్ర భాసిన్ కూడా ఒకరు. బీజేపీ 2022 మ్యానిఫెస్టోలో యూసీసీ కూడా ఉందని భసీన్ చెప్పారు. చట్టాన్ని అమలుచేసేందుకు అనేక కమ్యూనిటీలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపామని ఆయన చెప్పారు.

''మన సమాజంలో సహజీవన సంబంధాలకు ఆమోదం లేదు. కానీ మనమెవరినీ ఆపలేం. ఆ సంబంధం దెబ్బతింటే, మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి రిజిస్ట్రేషన్ అవసరం. ఏం జరుగుతుందో చాలాసార్లు తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లలు పుడితే పరిస్థితి మరింత సమస్యాత్మకంగామారుతోంది'' అని ఆయనన్నారు.

సహజీవనాన్ని రిజిస్టర్ చేయడం వల్ల కుటుంబాలకు, సమాజానికి రక్షణ లభిస్తుందని ఆయనన్నారు. ''సమాజంలో జీవించడానికి ఓ విధానం ఉంది. స్వేచ్ఛ అవసరమే కానీ పూర్తిగా స్వేచ్ఛే ఉండకూడదు'' అని ఆయనన్నారు.

కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని రాష్ట్రంలో చాలా మంది అంటున్నారు. కోర్టుల్లో వాటిని సవాల్ చేస్తున్నారు. కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో నాలుగు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఉత్తరాఖండ్, యూసీసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సహజీవనం రిజిస్ట్రేషన్‌లో అనేక ఇబ్బందులున్నాయని పలువురు లాయర్లు వాదిస్తున్నారు.

యూసీసీకి న్యాయపరమైన సవాళ్లు

పౌరుల జీవించే హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే రక్షణను అతిక్రమించేలా ఈ నిబంధనలు ఉన్నాయని వాదిస్తూ కార్తికేయ్ హరి గుప్తా అనే వ్యక్తి యూసీసీకి వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ''కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వానికి ప్రజల వ్యక్తిగత జీవితాలపై దర్యాప్తు చేసే అధికారం లభిస్తోంది''అని ఆయన వాదించారు.

పెళ్లి, విడాకులు, ఆస్తులకు సంబంధించిన చట్టాలపై కొత్త చట్టం ప్రభావం ఏంటనేదానిపై స్పష్టత లేదని వాదిస్తూ రజియా బేగ్ అనే లాయర్ పిటిషన్ వేశారు. ''రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కలను తొలగించివేస్తున్నారు. పెద్దవారయిన పిల్లల సంబంధాల గురించి తల్లిదండ్రులకు తెలియజేసేలా ఈ చట్టం ఉంది. ఏ తల్లిదండ్రులయినా దీన్ని అనుమతిస్తారా?'' అని ఆమె ప్రశ్నించారు.

(నోట్ : వ్యక్తుల భద్రత కోసం ఈ రిపోర్టులో ప్రస్తావించిన జంటల పేర్లు మార్చాం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)