ప్లానెటరీ పరేడ్: మళ్లీ 2040 వరకు చూడలేని ఖగోళ దృశ్యం..

ప్లానెటరీ పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మ్యాడీ మొలోయ్
    • హోదా, బీబీసీ క్లైమేట్, సైన్స్

అంతరిక్షంలో ఈ వారం కనిపించే ఒక దృశ్యం కనువిందు చేయనుంది.

అంగారకుడు, గురుడు, వరుణుడు, శుక్రుడు, ఇంద్రుడు (నెఫ్ట్యూన్), బుధుడు, శని అనే ఏడు గ్రహాలు సాయంకాలం వేళ ఆకాశంలో ఒకేసారి కాసేపు కనిపించనున్నాయి.

ఏడు గ్రహాలు ఇలా ఒకే సరళరేఖలో కనిపించడం చాలా అరుదు. దీన్ని 'ప్లానెటరీ పరేడ్' అని పిలుస్తారు. 2040 వరకు, ఇలా ఏడు గ్రహాలను ఒకేసారి ఇంత బాగా చూడగలిగే అవకాశం రాదు.

ఈ ప్లానెటరీ పరేడ్‌లోని వీలైనన్ని ఎక్కువ గ్రహాలను చూడటానికి సరైన సమయం సాయంకాలం. మంగళవారం, బుధవారం ఈ గ్రహాల కూటమి కనిపించింది. గురువారం, శుక్రవారం కూడా భూమి నుంచి ఆకాశంలోకి చూస్తే ఇవి కనిపించనున్నాయి.

బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు అనే నాలుగు గ్రహాలను నేరుగా మన కళ్లతో చూడొచ్చు.

హారిజాన్ (భూమ్యాకాశాలు కలిసినట్టుండే ప్రాంతం)కు దిగువన ఉండటం వల్ల శని గ్రహాన్ని చూడటం కష్టం. ఇక యురేనస్, నెఫ్ట్యూన్‌లను చూడాలంటే టెలిస్కోప్ అవసరం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్లానెటరీ పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ఖగోళ అద్భుతాలు చాలా జరిగాయి. జనవరిలో కనిపించిన దృశ్యం ఇది. ఇందులో ఎడమవైపు అంగారకుడు, మధ్యలో గురుడు, కుడివైపు శని, శుక్ర గ్రహాలు ఉన్నాయి.

మబ్బులు లేకుండా స్పష్టమైన ఆకాశం ఉంటే ఈ గ్రహాలు కనిపిస్తాయి. అయితే, ఈ ఏడు గ్రహాలు కొద్దిసేపు మాత్రమే దర్శనమిస్తాయి.

''మీరు వాటిని చూడగలిగేలా, ఆ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడమనేది చాలా అరుదైన అవకాశం'' అని రాయల్ అబ్జర్వేటరీ గ్రీనిచ్‌లోని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఎడ్వర్డ్ బ్లూమర్ చెప్పారు.

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు శనిగ్రహం, బుధ గ్రహాలు కూడా అస్తమిస్తాయి. కాబట్టి వాటిని చూడటం కష్టం.

''బుధుడు, శనిగ్రహాలను సూర్యాస్తమయం తర్వాత కొన్ని నిమిషాలు మాత్రమే మీరు చూడొచ్చు. తర్వాత అవి హారిజన్‌లో కిందకు వెళ్లిపోతాయి. అయితే శుక్రుడు, గురుడు, అంగారక గ్రహాలను స్పష్టంగా చాలాసేపు చూడొచ్చు'' అని బ్లూమర్ తెలిపారు.

మన సౌర వ్యవస్థలోని గ్రహాలు సూర్యుని చుట్టూ భూమి తిరిగిన తరహాలోనే ఒక కక్ష్యలో తిరుగుతుంటాయి.

సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు వేర్వేరు దూరాల్లో, వేర్వేరు వేగాలతో తిరుగుతుంటాయి. అయితే, భూమి నుంచి చూసినప్పుడు అవి ఒకే వరుసలో ఉన్నట్లు అప్పుడప్పుడు కనిపిస్తాయి. కానీ, అంతరిక్షంలో అవి ఒకదానికకొకటి చాలా దూరంలో ఉంటాయి.

ప్లానెటరీ పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రకాశించే గుణం కారణంగా శుక్రుడు, గురు గ్రహాలను సులభంగా గుర్తించవచ్చు. అంగారక గ్రహానికి ప్రత్యేకమైన ఎరుపు రంగు ఉంటుంది.

‘‘యురేనస్‌ను నేరుగా మన కంటితో చూడొచ్చు. కంటిచూపు సరిగ్గా ఉండటంతో పాటు, అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి’’ అని బ్లూమర్ వివరించారు.

వీలైనన్ని ఎక్కువ గ్రహాలను చూడాలంటే హారిజాన్ వ్యూ స్పష్టంగా, కాంతి కాలుష్యం తక్కువగా ఉండే చోటుకు వెళ్లాలని బ్లూమర్ సలహా ఇచ్చారు.

''గ్రహాలను చూడటానికి కిచెన్‌లో నుంచి గార్డెన్‌లోకి వచ్చినట్లయితే, ఆకాశంలోని కాంతికి తగినట్లుగా మీ కంటి చూపు సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ వెలుతురుకు పూర్తిగా సర్దుబాటు కావడానికి మీ కళ్లకు దాదాపు అరగంట సమయం పడుతుంది.

ఆ సమయంలో ఫోన్‌ను చూడకండి. హారిజన్ వ్యూ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఇది చాలా అరుదైన అవకాశం కాబట్టి రాత్రిపూట ఆకాశం వైపు తదేకంగా చూడటం అలవాటు చేసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి'' అని బ్లూమర్ చెప్పారు.

ప్లానెటరీ పరేడ్

ఫొటో సోర్స్, Getty Images

ఆకాశం, గ్రహాలను చూసేంత స్పష్టంగా ఉంటుందా?

బుధవారం రాత్రి ఆకాశం కాస్త మేఘావృతమై ఉంది. గురువారం రాత్రి నాటికి ఆకాశం కాస్త పొడిగా, స్పష్టంగా అంచనా వేశారు. రాత్రి అయ్యేసరికి కాస్త పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున గ్రహాలను చూడటానికి సాయంకాలం వేళలు ఉత్తమం.

శుక్రవారం అధిక పీడనం ఎక్కువగా ఉంటుందని, ఆకాశం మరింత క్లియర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ప్లానెటరీ పరేడ్‌‌ను సూర్యాస్తమయం అయిన వెంటనే చూడటం అత్యుత్తమ సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత సమయం గడిచినకొద్దీ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)