పోసాని కృష్ణమురళి: ఈ ‘జగన్ ఫ్యాన్’ను ఎందుకు అరెస్ట్ చేశారంటే..

ఫొటో సోర్స్, facebook.com/PosaaniKrishnaMurali
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
సినీ నటుడు, వైసీపీలో పనిచేసిన పోసాని కృష్ణ మురళీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు.
మాటల రచయితగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన పోసాని.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై అభ్యంతకరమైన భాషతో విరుచుకుపడ్డారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
పోసాని కృష్ణ మురళి సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో, వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం వంటి అభియోగాలపై భారత న్యాయ సంహితలోని 196, 353(2) 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 8.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారి పల్లె పోలీసులు పోసానిని అదుపులో తీసుకున్నారు.
గురువారం రాజంపేట కోర్టులో ఆయన్ని హాజరపరచనున్నట్టు అన్నమయ్య జిల్లా ఎస్‌పీ వి.విద్యాసాగర్ నాయుడు బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, facebook.com/PosaaniKrishnaMurali
నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన పోసాని
"బుధవారం రాత్రి 8.45 నిమిషాలకు ఏపీ పోలీసులమంటూ నలుగురు వచ్చారు, ఇద్దరు పోలీస్ డ్రస్‌లో, మరో ఇద్దరు సివిల్ డ్రస్‌లో ఉన్నారు. అరెస్టు చేస్తున్నామంటూ నోటీసులు తీసుకోవాలని కోరగా పోసాని నిరాకరించారు" అని పోసాని భార్య కుసుమలత చెప్పారు.
నోటీసులు ఇస్తున్న సమయంలో పోలీసులకు, పోసానికి మధ్య జరిగిన సంభాషణలు, వాగ్వాదాల వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆ సందర్భంగా కేసు ఉంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణ మురళి ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
ఆ ఐదేళ్ల కాలంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
చంద్రబాబును పరుష పదజాలంతో అవమానించారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది.
2021లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పోసాని.. పవన్ కల్యాణ్‌ని దూషించారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వెంకటరమణమూర్తి ఫిర్యాదుపై పాతపట్నం పోలీస్ స్టేషన్‌లో.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పోసానిపై కేసులు నమోదు చేశారు.
ఇవే కాకుండా చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరు, అనంతపురం, బాపట్ల, మంగళగిరి పోలీస్‌స్టేషన్లలోనూ పోసానిపై కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, UGC
2021లో పవన్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలతో వివాదం ముదిరి..
2021లో రిపబ్లిక్ సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో థియేటర్లలో టిక్కెట్ల ధరపై అప్పటి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ పవన్ కల్యాణ్ ఘాటుగా మాట్లాడారు.
దీనిని ఖండిస్తూ పోసాని మీడియా సమావేశం పెట్టి పవన్ కల్యాణ్ తీరును తప్పు పట్టారు.
ఆ తర్వాత పవన్ అభిమానులు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ పోసాని మరుసటి రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు.
అప్పటి నుంచే పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శల జోరు పెంచారని, ఆ తర్వాత 2022లో ఆయన్ను ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా అప్పటి ప్రభుత్వం నియమించడంతో ఇంకా ధాటిగా విమర్శించారని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.

ఫొటో సోర్స్, facebook.com/PosaaniKrishnaMurali
కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయాలకు దూరం
రాష్ట్రంలో 2024 మేలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళి పలు సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చారు.
ఇక రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
అయితే తాను ఎప్పటికీ జగన్ అభిమానిగా ఉంటానని అన్నారు.
కూటమి అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ, జనసేన శ్రేణులు గతంలో పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే పోసాని రాజకీయాల్లోకి వచ్చారు.
2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీకి మద్దతు ప్రకటించారు. 2019లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, x.com/AmbatiRambabu
కక్ష పూరితమన్న వైసీపీ
పోసాని అరెస్టుపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఆయనను కక్షపూరితంగా అరెస్టు చేశారని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, జనసేన మాత్రం ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని అంటోంది.
తప్పు చేస్తే చట్టపరంగా ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ అరెస్టుతో రుజువైందని టీడీపీ వ్యాఖ్యానించింది.
ప్రశ్నించినందుకే చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారని, పోసాని అరెస్టే దీనికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
పోసాని అనారోగ్యంతో ఉన్నా తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నానని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంబటి వ్యాఖ్యానించారు.
"అధికారంలో ఉన్నాం కదా అని తప్పు చేస్తే చట్టపరంగా ఎప్పటికైనా శిక్షలు తప్పవని పోసాని అరెస్టు రుజువు చేసింది" అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బీబీసీతో చెప్పారు.
"గత ఐదేళ్లలో పోసాని మాటలను, ఆయన తీరును సభ్యసమాజం మొత్తం గమనించింది. ఆయన చేసిన దారుణమైన తప్పులకే ఇప్పుడు చట్టపరంగా అరెస్టు చేశారు. ఇందులో కక్ష ఏముంది?" అని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు.
చేసిన తప్పులకు శిక్ష పడుతోందే తప్పించి ఇందులో రాజకీయం ఏముందని బొలిశెట్టి ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














