ఆ ఊళ్లో పిల్లలు యూట్యూబ్ చూస్తున్నా, వీడియోలు చేస్తున్నా పేరెంట్స్ ఏమీ అనరు

You Tube, చత్తీస్‌గఢ్, తులసి, వీడియోలు, Social Media, యూట్యూబ్

ఫొటో సోర్స్, Estudio Santa Rita

ఫొటో క్యాప్షన్, తులసి గ్రామంలో యూట్యూబ్ పెద్ద మార్పు తెచ్చింది.
    • రచయిత, షాకిబ్ మగలూ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు వేల మంది నివసించే తులసి అనే గ్రామానికి సంబంధించి సోషల్ మీడియా అంటే ఆర్థిక, సామాజిక విప్లవం.

ప్రపంచం మీద యూట్యూబ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఊరు ఒక ఉదాహరణ.

2024 సెప్టెంబర్‌లో ఒక రోజు ఉదయం.. గ్రామస్థులు పొలాల వైపు వెళుతున్న సమయంలో, 32 ఏళ్ల యూట్యూబర్ జై వర్మ వారిని కలిశారు.

తాను చిత్రీకరిస్తున్న వీడియోలో నటించాలని ఆయన గ్రామంలోని మహిళలను అడిగారు.

వెంటనే ఆ మహిళలు తమ కట్టుబొట్టు సరి చేసుకుని చిరునవ్వుతో అందులో నటించారు.

ఆ మహిళల్లో ఓ వృద్ధురాలిని కుర్చీలో కూర్చోబెట్టి, మరో మహిళ ఆమె పాదాలను తాకుతూ ఆశీర్వాదం తీసుకోవడం, మరో మహిళ ఆ వృద్ధురాలికి నీళ్లు ఇవ్వడం వంటి దృశ్యాలను చిత్రీకరించారు.

గ్రామంలో జరిగే పండుగలు, వేడుకలు, గ్రామీణుల సంప్రదాయాలను జై వర్మ తన యూట్యూబ్ చానల్‌లో ప్రపంచానికి చూపిస్తున్నారు.

ప్రస్తుతం గ్రామంలో మహిళలు వీడియోల్లో నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారంతా వీడియోల్లో నటిస్తూనే పొలాల్లో పని చేసుకుంటున్నారు.

అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో గ్రూప్ తమ వీడియో చిత్రీకరణకు అవసరమైన ఏర్పాట్లలో బిజీగా ఉంది.

చేతిలో ఫోన్ పట్టుకుని ఒకరు హిప్ హాప్ ‌డాన్స్ చేస్తుంటే 26 ఏళ్ల రాజేష్ దివార్ ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'యూట్యూబ్ విలేజ్'

ఛత్తీస్‌గఢ్‌లోని తులసి అనే ఈ గ్రామం దేశంలోని అనేక ఇతర గ్రామాల లాంటిదే. ఈ ఊళ్లో ఎక్కువగా అన్నీ మిద్దెలు ఉన్నాయి.

దాదాపు అన్ని ఇళ్ల మీద నీటి ట్యాంకులు కనిపిస్తాయి. ఈ ఊరికి చేరుకోవడానికి మంచి రహదారి కూడా ఉంది.

చాలా గ్రామాల్లో కనిపించినట్లే ఊరి మధ్యలో మర్రి చెట్టు ఉంది. గ్రామస్థులంతా ఇక్కడే కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటారు.

అయితే మిగతా గ్రామాలతో పోలిస్తే ఈ ఊరిని ప్రత్యేకంగా మారుస్తున్నది మాత్రం "యూట్యూబ్ విలేజ్" అనే పేరు.

ఊళ్లో ఉన్న 4 వేల మందిలో వెయ్యి మంది ఏదో ఒక రూపంలో యూట్యూబ్‌తో కనెక్ట్ అయ్యారు.

ఊరంతా తిరిగి చూస్తే.. ఈ ఊళ్లో యూట్యూబ్ వీడియోలలో కనిపించని మనిషి ఎవరైనా ఉన్నారా అని గుర్తించడం కష్టం.

యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బుతో ఈ గ్రామం ఆర్థికంగా లాభపడింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల ఊరు ఆర్థికంగా ప్రయోజనం పొందడంతో పాటు, గ్రామ ప్రజల్లో సమానత్వం, సామాజిక మార్పు వచ్చింది.

గ్రామ ప్రజలు సొంతంగా యూట్యూబ్ చానల్స్ ప్రారంభించి ఆదాయం సంపాదిస్తున్నారు.

యూట్యూబ్ చానల్స్ వల్ల గ్రామంలో మహిళలకు డబ్బు సంపాదించుకునే మార్గాలు పెరిగాయి.

ఊళ్లో మర్రిచెట్టు కింద జరిగే సంభాషణలు, సరదా సన్నివేశాలను సాంకేతికత జోడించుకుని యూట్యూబ్‌లోకి వస్తున్నాయి.

యూట్యూబ్ ఇటీవలే 20 వసంతాల్ని పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 250 కోట్ల మంది యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారని అంచనా.

యూట్యూబ్‌కు భారత్‌లో భారీ మార్కెట్ ఉంది.

You Tube, చత్తీస్‌గఢ్, తులసి, వీడియోలు, Social Media, యూట్యూబ్

ఫొటో సోర్స్, Suhail Bhat

ఫొటో క్యాప్షన్, యూట్యూబ్ వీడియోల్లో నటించి డబ్బులు సంపాదిస్తున్న మహిళలు

ఉద్యోగాలను వదిలేసి యూట్యూబ్ వీడియోలు

గత పదేళ్లలో యూట్యూబ్ ప్రపంచాన్నే కాకుండా సామాజికంగా చాలా ప్రభావం చూపించింది.

యూట్యూబ్ ప్రభావం ఏ స్థాయిలో చెప్పడానికి తులసి గ్రామమే ఉదాహరణ.

"ఇది పిల్లలను చెడు అలవాట్లు, నేరాల నుంచి దూరంగా ఉంచుతోంది. యూట్యూబర్లు సాధించిన విజయాల పట్ల ఊరంతా గర్విస్తోంది" అని గ్రామానికి చెందిన రైతు నేత్రమ్ యాదవ్ చెప్పారు.

2018లో వర్మ, అతని స్నేహితుడు జ్ఞానేంద్ర శుక్లా 'బీయింగ్ ఛత్తీస్‌గఢియా' అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన తర్వాత తులసి గ్రామంలో మార్పు ప్రారంభమైంది. "మా దైనందిన జీవితం అంత సంతోషకరంగా లేదు. మాలో ఉన్న క్రియేటివిటీని ప్రపంచానికి చూపించేందుకు ఏదైనా చేయాలని అనుకున్నాం" అని జైవర్మ చెప్పారు.

అతను చిత్రీకరించిన మూడో వీడియోలో ప్రేమికుల దినోత్సవం రోజున బజరంగ్‌దళ్ సభ్యులు ఒక యువజంటను వేధిస్తున్నట్లు చూపించారు.

ఇది వైరల్‌గా మారింది. ఇందులో వ్యంగ్యంతో పాటు సమాజానికి సందేశం ఉంది.

"ఆ వీడియో సరదాగా ఉంది. అయితే అందులో సందేశం ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే అంశాన్ని ప్రేక్షకులకే వదిలేశాం" అని వర్మ చెప్పారు.

జై వర్మ, శుక్లా ప్రారంభించిన యూట్యూబ్ చానల్ నెల రోజుల్లనే వేల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకుంది. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రస్తుతం ఈ చానల్‌కు లక్ష 25వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారి వీడియోలను చూస్తున్న వారి సంఖ్య 26 కోట్లు దాటింది.

పిల్లలు ఎక్కువ సమయం యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే వారి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అయితే తర్వాతి కాలంలో అది ఆదాయ వనరుగా మారడంతో వారి ఆందోళన దూరమైంది.

"మా సంపాదన నెలకు రూ. 30వేల కంటే ఎక్కువగా ఉంది. మాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నాం" అని శుక్లా చెప్పారు.

You Tube, చత్తీస్‌గఢ్, తులసి, వీడియోలు, Social Media, యూట్యూబ్

ఫొటో సోర్స్, Suhail Bhat

స్టూడియో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం

యూట్యూబ్ చానల్ కోసం జై వర్మ, శుక్లా తమ ఉద్యోగాలను వదిలేశారు. వారి విజయం గ్రామంలో మిగతా వారిలో స్ఫూర్తి నింపింది.

తమ వీడియోల్లో నటించే తాము జీతం చెల్లిస్తున్నామని, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్‌లో శిక్షణ అందిస్తున్నట్లు శుక్లా చెప్పారు.

వీరి నుంచి స్ఫూర్తి పొందిన గ్రామస్తులు తమ సొంత యూట్యూబ్ చానల్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. మరి కొంతమంది వాటి కోసం కంటెంట్, ప్రొడక్షన్‌లో సహకరిస్తున్నారు.

తులసి గ్రామస్థుల వీడియోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకర్షించాయి. దీంతో 2023లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్టేట్ ఆర్ట్ స్డూడియోను నిర్మించింది.

గ్రామస్తుల యూట్యూబ్ వీడియోలను చూసిన జిల్లా మాజీ అధికారి సర్వేశ్వర్ భూరే, గ్రామాలు, పట్టణాలకు మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని పరిష్కరించడానికి గ్రామంలోనే స్టూడియోను నిర్మించాలని అనుకున్నారు.

"స్టూడియోను నిర్మించడం ద్వారా గ్రామీణ, నగర జీవితాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించాలని కోరుకున్నాను" అని ఆయన అన్నారు.

"వారి వీడియోలు చాలా ప్రభావవంతమైనవి. అవి లక్షల మందికి చేరువయ్యాయి. వాళ్లకు అండగా నిలిచేందుకే స్డూడియో కట్టాం" అని సర్వేశ్వర్ భూరే చెప్పారు.

27 ఏళ్ల పింకీ సాహు తులసి గ్రామంలో అతిపెద్ద యూట్యూబ్ స్టార్. వాళ్లది వ్యవసాయ కుటుంబం.

తాను నటిస్తాను అన్నప్పుడు కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు, ఆడపిల్లలు నటించడం అదో పెద్ద నేరం అన్నట్లు చెప్పడంతో ఆమె కల కరిగిపోయింది.

అయితే విమర్శనలన్నింటినీ తట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వీడియోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. బీయింగ్ ఛత్తీస్‌గఢియా ఛానల్ ఆమె వీడియోలను చూసి అవకాశం ఇచ్చారు..

"ఒక కల నిజమైంది. వాళ్లు నా ప్రతిభను గుర్తించి నా నైపుణ్యాలను మెరుగుపరిచారు" అని సాహు చెప్పారు.

You Tube, చత్తీస్‌గఢ్, తులసి, వీడియోలు, Social Media, యూట్యూబ్

ఫొటో సోర్స్, Suhail Bhat

ఫొటో క్యాప్షన్, యూట్యూబ్ వీడియోల ద్వారా గ్రామస్థులకు సినిమాల్లోనూ నటించే అవకాశం లభిస్తోంది.

సినిమాల్లోనూ అవకాశాలు

బీయింగ్ ఛత్తీస్‌గఢియాలో సాహు నటనను గుర్తించిన నిర్మాతలు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె 7 సినిమాల్లో నటించారు.

బిప్లాస్‌పూర్ సమీపంలో నివసించే దర్శక నిర్మాత ఆనంద్ మాణిక్‌ పురిని సాహు వీడియోలు ఆకర్షించాయి.

"నేను కొత్త నటీనటుల కోసం చూస్తున్నాను. సాహుతో నా అన్వేషణ ముగిసింది" అని ఆయన చెప్పారు.

తులసి గ్రామస్థుడు ఆదిత్య బాఘేల్, కాలేజ్‌లో చదివేటప్పుడే సొంతంగా చానల్ ప్రారంభించాలని అనుకున్నారు. ఆయన చానల్ ప్రారంభించిన ఏడాది లోపే 20వేలకు పైగా ఫాలోవర్లు వచ్చారు. ఆయనకు ఇప్పుడు యూట్యూబ్‌ నుంచి ఆదాయం వస్తోంది.

ఆదిత్య ప్రతిభను గుర్తించిన జై వర్మ తన బీయింగ్ ఛత్తీస్‌గఢియా బృందంలో రచన, దర్శకత్వం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వర్మ, శుక్లాతో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ "ఇది సెలబ్రిటీలను కలిసినట్లే ఉంది" అని భాఘేల్ అన్నారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆదిత్యకు రాయ్‌పూర్‌లోని ఒక సినిమా నిర్మాణ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆయన ఇప్పుడు 'ఖరున్ పార్' అనే భారీ బడ్జెట్ చిత్రానికి స్క్రిప్ట్ రైటర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

"ఏదో ఒక రోజు హాలీవుడ్‌లో పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

మరో యూట్యూబర్ మనోజ్ యాదవ్‌కు కూడా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది. రామాయణంలో ఆయన బాల రాముడి పాత్రను పోషించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సినిమా హాళ్లలో చప్పట్లు వింటానని యాదవ్ ఎప్పుడూ ఊహించలేదు.

చాలా సంవత్సరాలు యూట్యూబ్ వీడియోలలో తన ప్రతిభను చూపించిన తర్వాత, యాదవ్‌కు ఒక ప్రాంతీయ చిత్రంలో పనిచేసే అవకాశం లభించింది. ఆయన నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి.

"యూట్యూబ్ లేకుండా ఇదంతా సాధ్యం అయ్యేది కాదు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను " అని ఆయన అన్నారు.

You Tube, చత్తీస్‌గఢ్, తులసి, వీడియోలు, Social Media, యూట్యూబ్

ఫొటో సోర్స్, Suhail Bhat

మహిళలు ముందుకొచ్చారు.

ఈ గ్రామంలో మహిళలు సాంకేతిక విప్లవంలో ముందుకు సాగడానికి యూట్యూబ్‌ అవకాశం కల్పించింది.

"భారతదేశంలో మహిళలకు గౌరవం, సమానత్వాన్ని తీసుకురావడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోంది" అని తులసి గ్రామ సర్పంచ్ ద్రౌపది వైష్ణు చెప్పారు.

61 ఏళ్ల ద్రౌపది ఈ సమస్యపై ఒక వీడియో రూపొందించారు.

"ఈ వీడియో మహిళల పట్ల గౌరవం, సమానత్వాన్ని చూపిస్తుంది. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు కూడా దీనిని ప్రచారం చేశాను" అని ఆమె చెప్పారు.

పెళ్లిళ్లలో ఫొటోలు తీసే రాహుల్ వర్మ యూట్యూబర్‌గా మారారు. ఇది తన జీవితంలో పెద్ద మార్పు అని చెప్పారు.

"మొదట్లో, మా అమ్మ, అక్కచెల్లెళ్లు నాకు సాయం చేసేవారు. ఇప్పుడు వాళ్లు సొంత చానళ్లు నడుపుకుంటున్నారు. గతంలో ఎన్నడూ మాకు ఇలాంటి ఆలోచన రాలేదు" అని రాహుల్ చెప్పారు.

తులసి గ్రామస్థురాలు రామ్‌కాలి ప్రేమగల తల్లి పాత్రను పోషించడం ద్వారా గ్రామంలో అత్యంత ఇష్టమైన నటిగా మారారు. యూట్యూబ్ వీడియోలలో నటించేందుకు ఆమెకు చాలా అవకాశాలు ఉన్నాయి.

సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత సాహూ తన లాంటి వారికి స్ఫూర్తి ఇవ్వాలని భావిస్తున్నారు.

"నేను నా కలలను నెరవేర్చుకున్నాను. వారు కూడా నెరవేర్చుకోగలరు" అని ఆమె చెప్పారు.

తులసిలో ఒక సాయంత్రం, దివార్ అతని బృందం హిప్ హాప్ బీట్స్‌తో షూటింగ్ చేస్తున్నారు.

"కంటెంట్ సృష్టించడం నుంచి రాక్ సంగీతం వైపు మళ్లడం అంత తేలిక్కాదు" అని దివార్ చెప్పారు.

"హిందీలో ర్యాప్ చేసేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే ఈ పరిస్థితి మారుతుంది. రానున్న రోజుల్లో తులసి వీడియోలతో పాటు సంగీతంలోనూ గుర్తింపు తెచ్చుకుంటుంది" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)