ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ : ఎక్కడ తప్పు జరిగింది?

ఫొటో సోర్స్, UGC/BRS Party
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) ప్రాజెక్ట్ సొరంగంలో ప్రమాదంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో ఇంజినీర్లు, కార్మికులు కలిపి ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తున్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


ఫొటో సోర్స్, Youtube/Screenshot
కేసీఆర్ ప్రసంగం చుట్టూ చర్చ
ఈ ప్రమాదం తర్వాత ప్రాజెక్టు గురించి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టు విషయమై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తోంది బీఆర్ఎస్.
సోషల్ మీడియాలోనూ కేసీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 2016 మార్చి 31న తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రాజెక్టుల వివరాలన్నీ వెల్లడించడమే కాదు, వాటిని రీ డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఆ సమయంలో కాళేశ్వరం నిర్మాణం అవసరాన్ని బలంగా వినిపించారు.
అంతకుముందు నుంచి కొనసాగుతున్న ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. ఆ సమయంలోనే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అప్పట్లో చెప్పారు కేసీఆర్.

ఫొటో సోర్స్, PTI
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై కేసీఆర్ ఏమన్నారంటే…
అసెంబ్లీలో ప్రజెంటేషన్‌లో భాగంగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడారు. టన్నెల్ గురించి, టన్నెల్ బోరింగ్ మెషీన్ గురించి, టన్నెల్ తవ్వకంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.
అప్పటికే చాలావరకు పనులు జరిగిన నేపథ్యంలో, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు సాధ్యం కాదని ఆయన చేసిన ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు.
''ఎప్పట్నుంచి వింటున్నాం ఈ ఎస్ఎల్‌బీసీ. ఎన్నేళ్లకు కంప్లీట్ కావాలి? ఇది ఎవరి పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి?'' అని వ్యాఖ్యానించారు కేసీఆర్.
''టన్నెల్ బోరింగ్ మెషీన్ బోరింగ్ చేసుకుంటూ వెనుక లైనింగ్ చేసుకుంటూ పోతుంది. దాన్ని వెనక్కి తీసుకువచ్చి కొత్త పద్ధతిలో పెడదామా.. అంటే వెనక్కి తీసుకురాలేం. అప్పటివరకు చేసుకున్న లైనింగ్ అంతా కూలగొట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్‌బీసీ'' అన్నారు కేసీఆర్.
1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత ఈ ప్రాజెక్టుపై చర్చ మొదలైందని గుర్తు చేశారు కేసీఆర్.
''1969 ఉద్యమం తర్వాత మాకు (తెలంగాణకు) నీళ్లు ఇవ్వాలని అడిగితే, నాగార్జున సాగర్ ఎడమకాల్వ మీద లిఫ్టు పెడతామని, శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి కూడా నీళ్లు తెస్తామని ఆనాడు చెప్పారు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అది మరుగున పడిపోయింది.
మళ్లీ చర్చోపచర్చల తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొకసారి పెడితే, ఇది కాల్వనా, లిఫ్టా, సొరంగమా... అని చర్చ జరిగింది.
చివరికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ వ్యాలీలోనే 44 కిలోమీటర్ల పొడవైన సొరంగం తవ్వాలని ప్రతిపాదన పెట్టారు'' అని కేసీఆర్ చెప్పారు.

ఫొటో సోర్స్, robbinstbm.com
‘టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం).. ముందుకు పోదు.. వెనక్కి రాదు'
ప్రస్తుతం జరిగిన ప్రమాదం తర్వాత, సొరంగం తవ్వుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్‌పై చర్చ నడుస్తోంది.
ఊటనీరు రావడంతోపాటు మట్టిలో కూరుకుపోవడంతో టన్నెల్ బోరింగ్ మెషీన్ పాడైందని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం కారణంగా ఇప్పుడున్న మెషీన్ పనిచేస్తుందా, లేదా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, ఈ టీబీఎం పై కూడా కేసీఆర్ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
''టన్నెల్ బోరింగ్ మెషీన్.. టీబీఎం అని పెట్టారు. దాని పద్ధతి ఎలా ఉంటుందంటే అది ముందుకు పోదు.. వెనక్కి రాదు.
ఒక రంధ్రం పెట్టుకుని టన్నెల్‌లోకి గాలి వచ్చేలా చేసుకుందామంటే వీల్లేకుండా పెట్టారు. ఎందుకంటే అది టైగర్ వ్యాలీ కాబట్టి.
అందుకే రెండువైపులా ఎండ్ పాయింట్ నుంచి గాలి పంపు చేస్తుంటారు. ఆ గాలి పీల్చుకుంటూ టీబీఎం డ్రైవర్లు టన్నెల్ తవ్వాలి. ఇలా ఎక్కడన్నా చేస్తారా? ఇది నీళ్లిచ్చే విధానమేనా?'' అన్నారు కేసీఆర్.

ఫొటో సోర్స్, Getty Images
పనుల ఆటంకానికి కారణమేంటి?
అప్పట్లో ఇంజినీర్లను అడిగితే ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఇంకో మూడేళ్లు పడుతుందని చెప్పారని కేసీఆర్ నాడు అసెంబ్లీ వేదికగా చెప్పారు.
అయితే, ఇది జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు.
ఈ ప్రాజెక్టుకు 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఎడతెగని జాప్యం జరుగుతూ వచ్చింది.
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇప్పటివరకు ఆరుసార్లు గడువు పెంచారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2026 జూన్ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.
తాజా ప్రమాద ఘటనతో ఆలోపు పూర్తి కావడంపై అనుమానాలు నెలకొన్నాయి.
''ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు అయ్యాయి'' అని తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్దన్ బీబీసీతో చెప్పారు.
ప్రాజెక్టులో జరిగిన జాప్యంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
''మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనుల ఆటంకానికి కారణం నీటి ఊట. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటిని బయటకు పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేది. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారా చూశాను.'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Twitter
బీఆర్ఎస్ ఏమంటోంది?
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు ప్రమాదం తర్వాత మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్'లో స్పందించారు.
''ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు'' అని ఆయన ట్వీట్ చేశారు.
నిపుణుల అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించిందని, నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేటీఆర్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండించారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
''పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది'' అన్నారు.
''టన్నెల్ నిర్మాణంలో లీకేజీల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యకు పరిష్కారం చెప్పడానికి బదులుగా, అసంబద్ధమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు" అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కార్మికుల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి కీలక సమయంలో అందరూ సహాయ చర్యలకు మద్దతుగా ఉండాలని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














