బస్‌స్టాండ్‌లో యువతిపై అత్యాచారం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వ్యాఖ్యలపై వివాదమేంటి

స్వార్‌గేట్ బస్ స్టేషన్, మహిళపై లైంగిక దాడి

పుణెలోని స్వార్‌గేట్ బస్‌స్టాండులో యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని గుర్తించినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది.

నిందితుడిపై కేసు నమోదు చేశామని, అతని కోసం గాలిస్తున్నమని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చాకణ్‌కర్ చెప్పారు.

అమ్మాయిలు అపరిచితులతో మాట్లాడవద్దంటూ ఆమె సలహా ఇవ్వడంపై ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. "కేవలం చట్టాలు చేస్తే సరిపోదు" అని ఆయన అన్నారు.

"నిర్భయ ఘటన తర్వాత, చట్టంలో చాలా మార్పులు చేశారు. అయితే, చట్టాల ద్వారా మాత్రమే మనం ఇలాంటివి జరక్కుండా ఆపలేం. సమాజానికి కూడా బాధ్యత ఉంది" అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

"మహారాష్ట్రలో మహిళలపై దాడులు జరుగుతున్నట్లు తరచు వార్తలు వస్తున్నాయి. ఫడణవీస్ హయాంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి. మనమంతా ఇందులో బాధితులుగా మిగిలాం. స్వార్‌గేట్ రేప్ కేసులో దోషులకు కఠినశిక్ష విధించాలి" అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

ఈ ఘటనకు కారణమైన నిందితుడిని వదిలిపెట్టేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అన్నారు.

"దోషి ఎవరైనా సరే, వారిని వదిలేది లేదు. అతనికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది" అని ఆయన చెప్పారు.

స్వార్‌గేట్ బస్ స్టేషన్, మహిళపై లైంగిక దాడి
ఫొటో క్యాప్షన్, పుణె డిప్యూటీ పోలీస్ కమిషనర్ స్మార్తనా పాటిల్

అసలేం జరిగింది?

ఫిబ్రవరి 25 ఉదయం పుణె నుంచి ఫల్తాన్ వెళుతున్న 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిందని పోలీసులు చెప్పారు.

"బాధితురాలు పుణెలో పని చేస్తోంది. ఆమె తన ఊరికి వెళ్లేందుకు ఉదయం ఐదున్నర, ఆరు గంటల ప్రాంతంలో స్వార్‌గేట్ బస్టాండుకు వచ్చింది. ఆ సమయంలో నిందితుడు ఆమెతో పరిచయం చేసుకున్నాడు" అని పుణె నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ స్మార్తనా పాటిల్ చెప్పారు.

"ఆమెను మాటల్లో పెట్టి ఆమె ఎక్కడకు వెళుతుందో తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి తాను ఫల్తాన్‌కు వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత నిందితుడు ఫల్తాన్ వెళ్లే బస్సు వేరే చోట ఆగుతాయని చెప్పాడు. ఆమెకు బస్సు చూపిస్తానని చెప్పి వేరే చోటకు తీసుకెళ్లాడు" అని డిప్యూటీ కమిషనర్ వివరించారు.

వారిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు బాధితురాలిని బస్టాండులో ఆపి ఉంచిన ఓ బస్సు వద్దకు తీసుకెళ్లాడు. అయితే బస్సులో ఎవరూ లేరని, అక్కడంతా చీకటిగా ఉందని బాధితురాలు చెప్పడంతో, బస్సు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులందరూ నిద్రపోతున్నారని నిందితుడు ఆమెను నమ్మించాడు" అని పోలీసులు చెప్పారు.

"కావాలంటే స్వయంగా చూడండి అంటూ అతను టార్చ్ వెలిగించి ఆమెను చూడమని అడిగాడు. బాధితురాలు బస్సు లోపలకు ఎక్కగానే, నిందితుడు తలుపు మూసివేసి ఆమెపై అత్యాచారం చేశాడు" అని పోలీసులు వివరించారు.

నిందితుడు పారిపోయిన తర్వాత, బాధితురాలు ఇంటికి వెళ్తుండగా తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలియజేసిందని, ఆమె సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

నిందితుడిని గుర్తించామని, అతని పేరు దత్తాత్రేయ రాందాస్ గడే అని పోలీసులు చెబుతున్నారు.

అతనికి గతంలోనూ నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నారు.

Swargate bus stand, Pune, rape case, అత్యాచారం, మహారాష్ట్ర

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

ఈ సంఘటనకు సంబంధించి, ప్రతిపక్ష పార్టీలు శాంతిభద్రతల అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టాయి.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే ఇది చాలా అవమానకరమైన ఘటన అని ట్వీట్ చేశారు.

"స్వార్‌గేట్ బస్‌స్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాంటి చోట యువతిపై లైంగిక దాడి కేసు వెలుగులోకి వచ్చింది. బస్ స్టాండ్‌కు వంద మీటర్ల దూరంలోనే పోలీసు పోస్ట్ కూడా ఉంది. పోలీసులు అప్పుడప్పుడు బస్ స్టాండ్‌లో గస్తీ తిరుగుతారు. అయినప్పటికీ నిందితుడు ఇంత దారుణమైన నేరం చెయ్యడానికి తెగించడం చూస్తే చట్టాలంటే నేరస్థులకు భయం లేదని తెలుస్తోంది" అని ఆమె తన సందేశంలో రాశారు.

రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. తీవ్రమైన నేరాలను అరికట్టడంలో హోం శాఖ విఫలమైందని ఆరోపించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఆరోపించారు.

"అమాయక యువతిపై ప్రభుత్వ బస్సులో అత్యాచారం జరిగింది. ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయా" అని ఆయన అన్నారు.

"మీరు బేటీ బచావో, బేటీ పడావో, నారీ సమ్మాన్ గురించి మాట్లాడుతారు. కానీ రాష్ట్రంలో ఆడపిల్లలు సురక్షితంగా లేరు. ఇలాంటి పథకాల వల్ల ఉపయోగం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.

"స్వార్‌గేట్ బస్ స్టేషన్ అధికారులు, ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలి. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణికులు ఈ బస్‌స్టేషన్‌కు వస్తారు. ఆ బస్ స్టేషన్‌లో మహిళలకు అవసరమైన సౌకర్యాలు లేవు" అని కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర దంగేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

రాత్రిపూట బస్ స్టేషన్‌లో చీకటిగా ఉండటంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ బస్ స్టేషన్‌లో చీకటి పడితే మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, బస్‌ స్టేషన్‌ చుట్టు పక్కల తాగుబోతులు, నేరగాళ్లు కూర్చుని కనిపిస్తున్నారని అన్నారు.

"పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అలాంటి వారిని దూరంగా పంపించాలి. గత వర్షాకాలంలో బస్‌స్టేషన్ చెరువులా కనిపించింది. ఇప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)