'మా వైఖరిలో ఎలాంటి అస్పష్టతా లేదు', జైశంకర్ వ్యాఖ్యలకు బదులిచ్చిన బంగ్లాదేశ్

తౌహీద్ హుస్సేన్, జైశంకర్

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, ఇటీవల ఒమన్ రాజధాని మస్కట్‌లో తౌహీద్ హుస్సేన్, జైశంకర్‌ భేటీ అయ్యారు.

భారత్‌తో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్ అన్నారు.

ఇరుదేశాల మధ్య సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, దానికి సమాధానంగా హుస్సేన్ ఇలా స్పందించారు.

ఫిబ్రవరి 22న దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ ''భారత్‌తో ఎలాంటి సంబంధాలను కోరుకుంటున్నారో బంగ్లాదేశ్ నిర్ణయించుకోవాలి'' అన్నారు.

బంగ్లాదేశ్ తన అంతర్గత సమస్యలకు భారత్‌ను నిందిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నారని ఎలా చెప్పగలమని జైశంకర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్, భారత్

ఫొటో సోర్స్, BSS

ఫొటో క్యాప్షన్, తౌహీద్ హుస్సేన్

తౌహీద్ హుస్సేన్ ఏం చెప్పారు?

"భారత్‌తో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ వైఖరి స్పష్టంగా ఉంది. బంగ్లాదేశ్ పరస్పర గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా మంచి సంబంధాలను కోరుకుంటోంది. మా వైఖరిలో ఎలాంటి అస్పష్టతా లేదు" అని తౌహీద్ హుస్సేన్ విలేఖరులతో అన్నారు.

భారత్‌లో ఉంటోన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా వ్యాఖ్యలను తౌహీద్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలకు హానికరమని ఆరోపించారు. హసీనా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆయన విమర్శించారు.

బంగ్లాదేశ్‌లోని మైనారిటీల సమస్య భారత్‌కు ఆందోళన కలిగించే అంశం కాదని తౌహీద్ అభిప్రాయపడ్డారు.

"జోక్యం లేని విధానం అనుసరించాలి. మైనారిటీల సమస్యను మేం పరిశీలిస్తున్నాం, వారు కూడా బంగ్లాదేశ్ పౌరులే. వారికి నాతో సమానమైన హక్కులున్నాయి. మైనారిటీల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుంది" అని తౌహీద్ చెప్పారు.

షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో కేసులు నమోదయ్యాయని తౌహీద్ గతంలో చెప్పారు. హసీనాపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని, ఆమెను అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరుతోంది.

"భారత ప్రభుత్వం హసీనాను అప్పగించే వరకు, బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ఆవేశపూరిత, తప్పుడు ప్రకటనలు చేయకుండా ఆమెపై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నాం" అని తౌహీద్ అన్నారు.

షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా అభ్యర్థిస్తోందా? అని తౌహీద్ హుస్సేన్‌ను అడిగినప్పుడు "ఇరుదేశాల మధ్య అప్పగింత ఒప్పందం ఉంది. చట్టపరమైన కేసులను ఎదుర్కొనేందుకు మేం చాలామంది నిందితులను భారత దేశానికి అప్పగించాం. వారు కూడా మాకు అప్పగిస్తారని భావిస్తున్నా" అని సమాధానమిచ్చారు.

ఎస్. జైశంకర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎస్. జైశంకర్ (ఫైల్ ఫోటో)

జైశంకర్ ఏమన్నారు?

దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైశంకర్ రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను అంగీకరిస్తూనే, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో బంగ్లాదేశ్‌కు భారత్ చాలా స్పష్టమైన సంకేతం పంపిందని అన్నారు.

"బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న దాడులు తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అంశం. దానిని మేం లేవనెత్తాం" అని ఆయన అన్నారు.

ఒకవైపు భారత్‌తో మంచి సంబంధాలు కావాలంటూనే, మరోవైపు బంగ్లాదేశ్‌లో జరిగే ప్రతి తప్పుకి తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు భారత్‌పై నిందలు వేస్తున్నారని జైశంకర్ గుర్తుచేశారు.

భారత్‌తో ఎలాంటి సంబంధాలు కావాలో బంగ్లాదేశ్‌ నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.

షేక్ హసీనా, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్‌తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి.

మైనారిటీల ఇళ్లపై దాడులు

ఇటీవల ఒమన్ రాజధాని మస్కట్‌లో 8వ ఐఓసీ సదస్సు జరిగింది. ఆ సమయంలో హుస్సేన్, జైశంకర్‌లు భేటీ అయ్యారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన తర్వాత, ఆమె పార్టీ నేతల ఇళ్లపై దాడులు ప్రారంభమయ్యాయి. బాధితుల్లో హిందువులు సహా ఇతర మైనారిటీ వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. దీంతో వారి భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, ఇది తమ అంతర్గత విషయమని బంగ్లాదేశ్‌ బదులిచ్చింది. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం, భారత్ దీనికి దూరంగా ఉండాలని సూచించింది. ఇది ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపుతుందని తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్ 4,000 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)