ట్రంప్, జెలియెన్‌స్కీ ముఖాముఖి మాటలయుద్ధం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిరోస్లావా పెట్సా, డేనియల్ విటెన్‌బర్గ్
- హోదా, ఓవల్ ఆఫీస్ నుంచి బీబీసీ యుక్రెయిన్ ప్రతినిధులు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ మధ్య చర్చల ప్రక్రియ మాటల యుద్ధంగా మారింది.
రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం, అందుకు బదులుగా యుక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతులిచ్చే అంశాలపై ట్రంప్‌తో చర్చించేందుకు జెలియెన్‌స్కీ శుక్రవారం అమెరికా వచ్చారు.
ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు జెలియెన్‌స్కీతో చర్చలు ప్రారంభించారు. అయితే, కొద్ది నిమిషాల్లోనే ఈ చర్చలు మాటల యుద్ధంగా మారాయి.


ఫొటో సోర్స్, Getty Images
విదేశీ అతిథుల కోసం వైట్‌హౌస్ పాటించే సాదర మర్యాదల ప్రకారమే శుక్రవారం జెలియెన్‌స్కీ అమెరికా పర్యటన ప్రారంభమైంది.
వైట్‌హౌస్ వెస్ట్ వింగ్ వైపు నుంచి ట్రంప్ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో ఎదురెళ్లి జెలియెన్‌స్కీని స్వాగతించారు. ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు.
యుక్రెయిన్ మీడియా బృందంలో భాగంగా మేం చర్చలు జరుగుతున్న ఓవల్ ఆఫీసులోనే ఉన్నాం. జెలియెన్‌స్కీ పర్యటన సందర్భంగా మర్యాదలను, అరగంట పాటు మర్యాదపూర్వక మాటలను చూశాం.
యుక్రెయిన్ బాక్సర్ ఒలెగ్జాండర్ ఉసిక్ సాధించిన చాంపియన్‌షిప్ బెల్ట్‌ను జెలియెన్‌స్కీ ట్రంప్‌కు బహూకరించారు.
అంతేకాదు... జెలియెన్‌స్కీ దుస్తులు బాగున్నాయంటూ ట్రంప్ ప్రశంసించారు.
అంతవరకు అంతా దౌత్య ప్రకారమే సాగింది.
కానీ, అక్కడికి నిమిషం తరువాత పరిస్థితులు మునుపెన్నడూ చూడనంతగా మారిపోయాయి.
స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న గొంతులు ఆవేశంగా మారాయి. అందరూ స్వరం పెంచారు.. కనుగుడ్లు తిప్పుకుంటూ అసహనం వ్యక్తం చేశారు.
రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ ఇంతకాలం ఎదురొడ్డి నిలవగలిగేలా మద్దతిచ్చిన అమెరికాకు ఏమాత్రం కృతజ్ఞతగా లేరని ఆరోపిస్తూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ జెలియెన్‌స్కీని మందలించారు.
దౌత్యంతో యుద్ధాన్ని ఇప్పటికే ముగించి ఉండాల్సిందని వాన్స్ అనడంతో చర్చల్లో ఉద్రిక్తత పెరిగింది.

ఫొటో సోర్స్, EPA
'ఎలాంటి దౌత్యం?' అంటూ జెలియెన్‌స్కీ వాన్స్‌ను ప్రశ్నించారు.
జెలియెన్‌స్కీ ఇంకా మాట్లాడుతుండగానే వాన్స్ ఆయనకు అడ్డు తగిలి ఓవల్ ఆఫీసుకు వచ్చి అమెరికా మీడియా ముందు తమ గోడు చెప్పుకోవడమే 'అగౌరవకరం' అంటూ ట్రంప్ నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ తరువాత కూడా ముగ్గురు నేతల మధ్య వాగ్వాదం కొనసాగింది.
అక్కడే ఉన్న జర్నలిస్టులంతా అసాధరణమైన ఈ వాగ్వాదాన్ని నోరెళ్లబెట్టి అలాగే చూస్తుండిపోయారు.
వాన్స్, జెలియెన్‌స్కీ మధ్య మాటలు వాడీవేడిగా సాగుతుండగా ఒక దశలో ట్రంప్ కల్పించుకుని 'మాట్లాడింది చాలు. మీరు గెలవబోవడం లేదు' అని జెలియెన్‌స్కీతో అన్నారు. 'మీరు కచ్చితంగా కృతజ్ఞత చూపాల్సిందే, మీ ఆట ముగిసింది' అన్నారు ట్రంప్.
దానికి జెలియెన్‌స్కీ కూడా అంతే తీవ్రంగా స్పందించారు.
'నేనేమీ ఆటాడడం లేదు. నేను చాలా సీరియస్‌గా ఉన్నాను మిస్టర్ ప్రెసిడెంట్. యుద్ధం చేస్తున్న అధ్యక్షుడిని నేను' అంటూ జెలియెన్‌స్కీ తీవ్ర స్వరంతో బదులిచ్చారు.
'మీరు మూడో ప్రపంచ యుద్ధం దిశగా జూదం ఆడుతున్నారు. మీకు ఎంతో మద్దతిచ్చిన ఒక దేశాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు' అని ట్రంప్ అన్నారు.
మధ్యలో వాన్స్ కల్పించుకుని 'ఈ సమావేశంలో మీరు ఒక్కసారైనా థాంక్యూ అని చెప్పారా? అస్సలు చెప్పలేదు' అన్నారు.

ఫొటో సోర్స్, EPA
నేతల మధ్య సమావేశం పూర్తిగా బహిరంగమైపోయింది. 'ఇలాంటి చర్చలు మేం ఎప్పుడూ చూడలేదు' అని మా అమెరికన్ జర్నలిస్ట్ సహచరులు చెప్పారు.
వైట్‌హౌస్‌లో ఇలాంటి దృశ్యాన్ని అస్సలు ఊహించలేమన్నారు.
ఇంత గందరగోళంగా సమావేశం సాగడంతో దీని తరువాత మీడియా బ్రీఫింగ్ ఉంటుందా? ఉండదా? మినరల్స్ ఒప్పందంపై సంతకాలు చేస్తారా? చేయరా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
చాలామంది అనుమానించినట్లే మీడియా బ్రీఫింగ్, ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం రద్దయ్యాయి.
జెలియెన్‌స్కీ యుక్రెయిన్ రాయబారి వెంటరాగా తన కోసం బయట సిద్ధంగా ఉన్న కారెక్కి వెళ్లిపోయారు.
అయితే, తరువాత ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో 'జెలియెన్‌స్కీ శాంతికి సిద్ధంగా ఉంటే మళ్లీ రావొచ్చు' అని రాశారు.
మొత్తానికి యుక్రెయిన్, అమెరికా మధ్య చర్చలు ఎలా సాగాయనేది ప్రపంచం మొత్తం చూసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














