టీ తాగుదామని రైలు దిగి, 20 ఏళ్లు మగ్గిపోయిన విజయనగరం వాసి, అసలేమైందంటే..

తమిళనాడు, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, అప్పారావు రైల్వేస్టేషన్‌లో టీ తాగేందుకు దిగారు. తిరిగి రైలు ఎక్కలేకపోయారు.
    • రచయిత, వి.శారద
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ తాగేందుకు రైల్వేస్టేషన్‌లో దిగిన ఓ వ్యక్తి జీవితం ఊహించని మలుపు తిరిగింది. తిరిగి రైలు ఎక్కలేకపోవడం ఆయన్ను 20ఏళ్ల పాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయేలా చేసింది.

పేరూ, ఊరు అన్నీ చెప్పగలిగే స్థితిలో ఉన్నా, అన్ని విషయాలూ గుర్తున్నా, ఆ వ్యక్తి స్వస్థలానికి తిరిగి ఎందుకు వెళ్లలేదు? వెట్టిచాకిరీనుంచి బయటపడే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఆయన్ను ఎవరు అడ్డుకున్నారు? జీవిత కాలంలో 20 ఏళ్ల పాటు అయినవారందరికీ దూరంగా ఆయన ఎందుకు గడపాల్సివచ్చింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

20 ఏళ్లు... రూపాయి జీతం లేదు

తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇటీవల కార్మిక సంక్షేమ శాఖ అధికారులు అప్పారావు అనే వ్యక్తికి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. ఆయన స్థానికుడు కాదు. కనీసం తమిళనాడుకు చెందిన వ్యక్తీ కాదు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన వ్యక్తి. 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్న అప్పారావు తమిళనాడుకి చెందిన అన్నాదురై దగ్గర గొర్రెల కాపరిగా పనిచేశారు. ఇందుకుగానూ అప్పారావుకు రూపాయి జీతం కూడా దక్కలేదు. ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా అప్పారావుతో వెట్టిచాకిరీ చేయించుకున్న యజమాని అన్నాదురైను పోలీసులు అరెస్టు చేశారు.

అప్పారావును కుటుంబం దగ్గరకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులతో కలిసి తమిళనాడు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అప్పారావు 20 ఏళ్లకు పైగా ఎలాంటి జీతం లేకుండా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. శివగంగ జిల్లాలోని కలైయార్కోయిల్ తాలూకా కదంబంకుళం ప్రాంతంలో ఆయన గొర్రెల కాపరిగా పనిచేస్తున్నారు.

అప్పారావు, తమిళనాడు, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, 20 ఏళ్లపాటు రూపాయి జీతం లేకుండా తమిళనాడులోని యజమాని దగ్గర అప్పారావు గొర్రెల కాపరిగా పనిచేశారు.

అప్పారావును రక్షించిన అధికారులు

జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారుల సాధారణ తనిఖీల్లో భాగంగా కదంబంకుళం వెళ్లినప్పుడు అప్పారావు గొర్రెలు మేపుతూ కనిపించారు. అధికారులు అప్పారావుతో మాట్లాడగా అనేక విషయాలు తెలిశాయి.

అప్పారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, తన గ్రామానికి వెళ్లకుండా 20 ఏళ్లకు పైగా ఆయన అక్కడే మేకలను మేపుతున్నారని అధికారులు తెలుసుకున్నారు.

అప్పారావు పరిస్థితి అర్థం చేసుకున్న కార్మిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిముత్తు తక్షణమే ఆయన్ను విడిపించాలని ఆదేశాలిచ్చారు.

టీ తాగుదామని రైలు దిగి..

దాదాపు 20 ఏళ్ల క్రితం బంధువులతో కలిసి పాండిచ్చేరి వెళ్తూ అప్పారావు టీ కోసం రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆయన రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. ఆయనక్కడే చిక్కుకుపోయారు. ఈ దురదృష్టకర ఘటన చివరకు ఆయన్ను కలైయార్కోయిల్ ప్రాంతానికి వెళ్లేలా చేసింది. అక్కడే ఆయన వెట్టిచాకిరీలో మగ్గిపోయారు.

''ఈ ప్రాంతంలో వెట్టిచాకిరీలో ఉన్న కార్మికులను గతంలో మేం రక్షించాం. కొంత సమాచారం ఆధారంగా, అవే పరిస్థితుల్లో ఇంకొందరున్నారా? అని వెతికేందుకు తనిఖీలు జరిపాం. మేకలను మేపుతూ మాకు అప్పారావు కనిపించారు. ఇక్కడెందుకున్నారని అడిగినప్పుడు ఆయన కొన్నిసార్లు తమిళ్‌లో సమాధానం చెప్పారు. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్ కలిపి మాట్లాడారు'' అని ఆదిముత్తు బీబీసీతో చెప్పారు.

అప్పారావు, తమిళనాడు, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, సాధారణ తనిఖీల్లో భాగంగా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు అప్పారావును గుర్తించారు.

యజమాని అరెస్టు, బెయిల్‌పై విడుదల

అప్పారావును అధికారులు రక్షించారు. అప్పారావు యజమాని అన్నాదురైని ప్రశ్నించారు. 20 ఏళ్ల పైనుంచి ఎలాంటి జీతం లేకుండా అప్పారావు పశువుల కాపరిగా వెట్టిచాకిరీ చేస్తున్నట్టు ప్రాథమిక పరిశీలనలో నిర్ధరించారు. అన్నాదురైని అరెస్టు చేశారు. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976, బీఎన్ఎస్ 143 కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అన్నాదురై బెయిల్‌పై విడుదలయ్యారు.

వెట్టిచాకిరీలోనే జీవితం

సొంత ఊరికి వెళ్లాలంటే డబ్బులు కావాల్సి ఉండడం, అవి ఇచ్చేందుకు యజమాని తిరస్కరించడంతో అప్పారావు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన సొంత ఊరు వెళ్లాలని ఎప్పుడూ అప్పారావు అడుగుతుండేవారు.

మళ్లీ అదే పనిలోకి వెళ్లాలనుకుంటున్నారా? అని అప్పారావును అధికారులు అడిగినప్పుడు.. అసలు వెళ్లను అని ఆయన సమాధానమిచ్చారు.

మేకలు మేపే దగ్గర నుంచి అధికారులు అప్పారావును రక్షించడంతో తన దుస్తులు, ఇతర వస్తువులను ఆయన తెచ్చుకోలేకపోయారు. వాటిని తెచ్చుకోవడానికి కూడా తాను వెళ్లనని అప్పారావు అన్నట్టు ఆదిముత్తు చెప్పారు.

అప్పారావు, తమిళనాడు, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తాను తిరిగి వెళ్లలేదని అప్పారావు చెప్పారు.

మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న అప్పారావు

అప్పారావు ప్రస్తుతం మధురైలోని నర్సింగ్ హోమ్‌లో ఉన్నారు. మాట్లాడడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు. తెలుగు, తమిళ్ కలిపి మాట్లాడుతూ, తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు.

తనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారని, తాను వ్యవసాయం చేసేవాడినని ఆయన చెప్పారు. చాలా ఏళ్లపాటు ఒంటరిగా ఉండడం, ఎవరితోనూ మాటలు లేకపోవడంతో.. ఇప్పుడు మట్లాడడానికి ఆయన ఇబ్బందులు పడుతున్నారు.

''మేం దేని గురించి మాట్లాడుతున్నామో ఆయన అర్థం చేసుకుంటున్నారు. కానీ, ఆయన పూర్తిస్థాయిలో మాట్లాడలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు కాంటాక్ట్‌లోకి వచ్చినప్పుడు కూడా ఆయన తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోయారు. గొర్రెలను మేపే క్రమంలో ఆయనకు బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువ. అందుకే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతుండొచ్చు. ఇక్కడ ఆయన మౌనంగా ఉంటున్నారు. ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు''అని నర్సింగ్ హోమ్ సూపరింటెండెంట్ అన్నాలక్ష్మి చెప్పారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, ఏపీ పేపర్లలో అప్పారావు వివరాలు

కుటుంబంతో కలిపేందుకు ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్‌లోని తన కుటుంబంతో అప్పారావును కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల పేర్లు మారడం, జిల్లాల పునర్విభజనతో ఇది కష్టంగా మారింది. స్థానిక న్యూస్ పేపర్లలో అప్పారావు ఫోటో, వివరాలు ప్రచురించామని మానవ అక్రమ రవాణా కేసులను వాదించే లాయర్ ఎం. రాజా చెప్పారు.

''ఆయన చెబుతున్న ప్రాంతాలు, పేర్లలో కొన్ని తేడాలున్నాయి. ఏళ్లు గడిచిపోయి, ఆయా ప్రాంతాల్లో చాలా మార్పులు రావడంతో అప్పారావు కుటుంబాన్ని వెతకడం కష్టంగా మారింది. ఆయన చెబుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉంది''అని కార్మిక విభాగం అధికారులు చెప్పారు.

''అప్పారావు చెబుతున్న ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉంది. ఆయన చెబుతున్న ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాయి. చాలా మార్పులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా సమాచారం అందించాం. అప్పారావు కుటుంబం కోసం వారు కూడా వెతుకుతున్నారు'' అని రాజా చెప్పారు.

అప్పారావు, తమిళనాడు, వెట్టిచాకిరీ

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్టు లాయర్ ఎం.రాజా

న్యాయ, ఆర్థిక ఇబ్బందులు

వెట్టిచాకిరీ నుంచి రక్షించిన వారికి కార్మిక సంక్షేమ విభాగం ఆర్థిక సాయం అందిస్తుంది. అప్పారావుకు వెంటనే రూ.30 వేలు సాయం లభిస్తుంది. యజమానికి విధించే శిక్షను బట్టి అదనంగా నష్టపరిహారం అందుతుంది.

అప్పారావుకు అన్నాదురై చెల్లించని జీతం మొత్తం రూ.8,26,000 రూపాయలను ఆయనకు అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

''ఈ ప్రాంతంలో అన్నాదురై పలుకుబడి ఉన్న వ్యక్తి. అప్పారావుకు ఆహారం, దుస్తులు ఇస్తున్నానని, డబ్బులు ఇవ్వడం లేదని గ్రామస్థులతో అన్నాదురై చెప్పారు. తాను చేస్తున్న పనికి అన్నాదురై జీతం ఇవ్వడం లేదని అప్పారావు గ్రామంలోని కొందరు యువకులకు చెప్పారు. వారి ద్వారానే ఇక్కడి స్వచ్ఛంద సంస్థలకు, అధికారులకు అప్పారావు గురించి సమాచారం అందింది'' అని మద్రాస్ హైకోర్టు లాయర్ ఎం. రాజా చెప్పారు.

2018 నుంచి శివగంగ జిల్లాలో 34 మందిని వెట్టిచాకిరీ నుంచి రక్షించారు. వెట్టిచాకిరీ నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

''ఇలాంటి ఘటనలపై సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సవాలుగా మారింది'' అని లాయర్ ఎం రాజా చెప్పారు.

''వెట్టిచాకిరీ కేసుల్లో వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం కిందే కాకుండా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని 2017లో డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు. చాలా కేసుల్లో ఈ సెక్షన్‌ను చేర్చడం లేదు. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. మానవ అక్రమ రవాణా సెక్షన్‌ను కూడా చేరిస్తే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించొచ్చు. ఈ కేసులో కూచా చాలా పోరాటం తర్వాతే ఆ సెక్షన్‌ను చేర్చారు'' అని రాజా తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)