గిన్నెలు కడగడానికి స్పాంజ్ మంచిదా, బ్రష్ మంచిదా? దేనిపై తక్కువ బ్యాక్టీరియా ఉంటుంది? ఎన్నాళ్లకు ఒకసారి మార్చాలి

గిన్నెలు కడగడం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ

మనం తిన్న అన్నం పేట్లను, వంట చేసిన గిన్నెలను, గ్లాస్‌లను శుభ్రపరుచుకునేందుకు చాలా వరకు కిచెన్ స్పాంజ్‌లను వాడుతూ ఉంటాం. కానీ, ఎప్పుడూ తడిగా, చిన్నచిన్న రంధ్రాలతో ఉండే మీ కిచెన్ స్పాంజ్‌నే బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనువైన స్థలమని మీకు తెలుసా?

చాలా రకాల బ్యాక్టీరియాలకు కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎలా బతకాలో తెలుసు. కొన్ని బ్యాక్టీరియాలు భూమి ఉపరితలం కింద మరిగే హైడ్రోథెర్మల్ వెంట్స్‌‌లో కూడా జీవించగలవు.

అలాగే, కొన్ని చల్లని ప్రాంతాల్లో ఎలా వృద్ధి చెందాలో కనుగొంటూ ఉంటాయి. అయితే, ఈ కిచెన్ స్పాంజ్‌లపైనా బ్యాక్టీరియాలు ఉంటాయి.

అవును, ఈ స్పాంజ్‌లనే మనం ప్లేట్లు, గ్లాస్‌లను శుభ్రపరిచేందుకు వాడుతుంటాం. స్పాంజ్‌లు బ్యాక్టీరియాలకు స్వర్గధామం లాంటివి. బ్యాక్టీరియాలకు కావాల్సిన ఆహారమంతా ఈ స్పాంజ్‌లపైనే ఉంటుంది.

జర్మనీలోని ఫర్ట్‌వాంగెన్ యూనివర్సిటీ మైక్రోబయోలజిస్ట్ మార్కస్ ఎగర్ట్ ప్రచురించిన కొత్త డేటాలో కిచెన్ స్పాంజ్‌లపై 362 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు వెల్లడైంది.

కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియాల సాంద్రత ఒక్కో చదరపు సెంటీమీటర్‌కు 5,00 కోట్లుగా పేర్కొంది.

ఇది చాలా పెద్ద మొత్తం అని ఎగర్ట్ అన్నారు. ఇంతే మొత్తంలో బ్యాక్టీరియా మానవుల మలంపై ఉంటుందని గుర్తించారు.

ఈ స్పాంజ్‌లు చిన్నచిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. క్రిములు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందేందుకు ఈ రంధ్రాలు దోహదం చేస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కిచెన్ స్పాంజ్

ఫొటో సోర్స్, Getty Images

డ్యూక్ యూనివర్సిటీలోని సింథటిక్ బయాలజిస్ట్ లింగ్‌చాంగ్ యు, ఆయన బృందం 2022లో స్పాంజ్‌ల క్లిష్టమైన వాతావరణాన్ని రూపొందించేందుకు కంప్యూటర్లను ఉపయోగించారు.

స్పాంజ్‌లపై ఉండే రంధ్రాలు, ప్యాకెట్లు మైక్రోఆర్గానిజాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయని గుర్తించారు.

స్పాంజ్‌లపై ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాలను తీసుకుని వీటిని విశ్లేషించారు. కిచెన్ స్పాంజ్‌లపై ఉండే రంధ్రాల సైజు బ్యాక్టీరియాల వృద్ధికి కీలకమైందని ఎగర్ట్ చెప్పారు.

''కొన్ని బ్యాక్టీరియాలు సొంతంగా వృద్ధి చెందగలవు. కొన్నింటికి ఎదిగేందుకు ఒక వాతావరణం కావాల్సి ఉంటుంది. స్పాంజ్‌ల లోపల ఉండే నిర్మాణాలు అన్ని బ్యాక్టీరియాల వృద్ధికి సరైన స్థలం.'' అని ఎగర్ట్ తెలిపారు.

బ్యాక్టీరియాలకు అనువైన స్థలంగా స్పాంజ్‌లు ఉంటున్నాయన్నది వాస్తవం. అయితే, ఈ స్పాంజ్‌ల ద్వారా కడిగిన పాత్రలు మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని అర్థం కాదు. ప్రతి దగ్గరా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. మీ చర్మంపై, మన చుట్టూ ఉన్న మట్టిపై. అన్ని బ్యాక్టీరియాలు ప్రమాదకరం కాదు. కొన్ని మాత్రమే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి.

అయితే, ఇక్కడ ప్రశ్నేంటంటే.. స్పాంజ్‌లపై ఉండే ఏ బ్యాక్టీరియా గురించి మీరు భయపడాలి?

2017 ఎగర్ట్ అధ్యయనంలో, సాధారణ బ్యాక్టీరియా జాతుల డీఎన్‌ఏను సీక్వెన్స్ చేశారు. ప్రతి బ్యాక్టీరియా జాతులను కనుగొనడం అన్ని సమయాల్లో సాధ్యం కాదు. ఎగర్ట్ అధ్యయనంలో, పది బ్యాక్టీరియా జాతుల్లో ఐదు ప్రజలకు ఇన్‌ఫెక్షన్లు కలగజేసేవిగా ఉంటున్నాయని గుర్తించారు.

మరగబెట్టిన నీరు వంటి ఇతర విధానాలను కూడా అధ్యయనంలో వాడారు. కొన్ని బ్యాక్టీరియాలు మరగబెట్టిన నీటిలో చనిపోగా.. మరికొన్ని బతకగలిగాయి. దీన్ని బట్టి చూస్తే, మైక్రోవేవ్‌లో మరగబెట్టినా లేదా వేడి నీటితో కడిగినా లేదా సోప్ వాటర్ అయినా.. అంత సాయం చేయకపోవచ్చు.

కొన్ని బ్యాక్టీరియాలు ఫుడ్ పాయిజనింగ్‌కు లేదా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తున్నాయని ఎగర్ట్ గుర్తించారు. ఆహారం పడక అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన 90 శాతం మందిలో ఐదు పాథోజెన్లను గుర్తించారు. దానిలో మూడు బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి కాంపిలోబ్యాక్టర్, సాల్మొనెల్లా, ఈ.కోలి. ఈ బ్యాక్టీరియాలు స్పాంజ్‌లపై అరుదుగా కనిపిస్తున్నాయి.

''పాథోజెనిక్ బ్యాక్టీరియాను మేం గుర్తించాం. ఈ బ్యాక్టీరియా పిల్లల్లో లేదా పెద్దల్లో రోగనిరోధక వ్యవస్థకు హానికరంగా నిలుస్తుంది.'' అని ఎగర్ట్ అన్నారు.

సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులకు కిచెన్ స్పాంజ్‌లపై ఉండే బ్యాక్టీరియాలు హానికరంగా ఉండవని చెప్పారు. ఫిలాడెల్ఫియాలో వంద ఇళ్ల నుంచి కిచెన్ స్పాంజ్‌లను అమెరికాలోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ ఫుడ్ సేఫ్టీ ప్రొఫెసర్ జెనీఫర్ క్విన్లాన్, ఆమె సహోద్యోగులు సేకరించారు.

కిచెన్ స్పాంజ్

ఫొటో సోర్స్, Getty Images

కిచెన్ స్పాంజ్‌లపై ఉండే కేవలం 1-2 శాతం బ్యాక్టీరియా మాత్రమే ప్రజల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుందని పేర్కొన్నారు. హానికరమైన బ్యాక్టీరియాలు చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయని అన్నారు.

అయితే, స్పాంజ్‌లతో పోలిస్తే బ్రష్‌లపై కాస్త తక్కువ బ్యాక్టీరియాలు ఉంటున్నాయి.

స్పాంజ్‌లపై ఉండే చాలా రకాల బ్యాక్టీరియాలు హానికరమైనవి కావు అని క్విన్లాన్ చెప్పారు. ఇవి చెడు వాసనను కలిగిస్తాయి. అయితే, ఉడికించని మాంసాన్ని లేదా గిన్నెలను తోమ్మినప్పుడు, స్పాంజ్‌పై హానికరమైన బ్యాక్టీరియా ఉండొచ్చని అన్నారు.

మీ స్పాంజ్‌పైకి సాల్మోనెల్లా బ్యాక్టీరియా వస్తే మాత్రం, ఈ హానికరమైన బ్యాక్టీరియా మరింత వేగంగా ఎదుగుతుంది. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి.

సాల్మోనెల్లా బ్యాక్టీరియా స్పాంజ్‌పైకి చేరినప్పుడు, అవి పెరుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. బ్రష్‌తో దాన్ని శుభ్రపరిచినప్పుడు ఈ బ్యాక్టీరియాలు పోతాయని అన్నారు. బ్రష్‌లు తేమగా ఉండవు. దీంతో సాల్మోనెల్లా బ్యాక్టీరియాను ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది.

అయితే, మనం తరచూ స్పాంజ్‌లను మార్చాలా? దీనికి స్పందించిన క్విన్లాన్, వారానికి ఒకసారి స్పాంజ్‌ను మార్చాలని, దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని చెప్పారు.

కిచెన్ బ్రష్

ఫొటో సోర్స్, Getty Images

రెండు మార్గాల ద్వారా కూడా స్పాంజ్‌లను శుభ్రపరుచుకోవచ్చన్నారు. సాయంత్రపూట వాటిని వాడిన తర్వాత డిష్‌వాషర్‌లో పెట్టాలి. లేదంటే, కొన్ని నిమిషాల పాటు మైక్రోవేవ్‌లో అయినా పెట్టాలి. దీనివల్ల, తేమ పోయి, హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుందని తెలిపారు.

స్పాంజ్‌ను డిష్‌వాషర్ లేదా మైక్రోవేవ్‌లో పెట్టడం ద్వారా బ్యాక్టీరియాలను తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే, ఎగర్ట్ అధ్యయనం మాత్రం దీన్ని సమర్థించడం లేదు. స్పాంజ్‌ను మరిగించిన నీటిలో పెట్టినా, కొన్ని హానికరమైన బ్యాక్టీరియాలు మాత్రమే చనిపోతాయని, కొన్ని బతుకుతాయని అన్నారు. అయితే, ఈ విధానం ద్వారా హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియా చనిపోతుంది.

మరో విషయం ఏంటంటే.. స్పాంజ్‌ను సింక్‌లో పెట్టకూడదు. సింక్‌కు వెలుపలే ఉంచాలి. దీనివల్ల, స్పాంజ్‌పై ఉండే తేమ పోయి, బ్యాక్టీరియాలు వృద్ధి చెందవు. వంటపాత్రలను కడిగేందుకు మరేదైనా మార్గం ఉందా అని కొందరు ఆలోచిస్తున్నారు.

''నేనెప్పుడూ కిచెన్ స్పాంజ్‌ను వాడలేదు. బ్రష్ అనేది బెటర్. ఎందుకంటే, దీనిపై కొన్ని బ్యాక్టీరియాలే ఉంటాయి. దీన్ని తేలిగ్గా శుభ్రపరుచుకోవచ్చు కూడా.'' అని ఎగర్ట్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)