ఫ్రిజ్, టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్స్‌కు బీమా చేస్తే క్లెయిమ్ ఎంత వస్తుంది? ఎలా ఇస్తారు...

టీవీ ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

వేల రూపాయలు పెట్టి ఫ్రిజ్ కొనుక్కుంటాం. బాగా ఖర్చుచేసి అల్ట్రా మోడ్రన్ ఎల్‌ఈడీ టీవీ కొంటాం. కానీ, వీటికి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం వందసార్లు ఆలోచిస్తాం.

ఏదైనా సమస్య వస్తే వారంటీ ఉంది కదా, అనుకుంటాం.

మధ్య తరగతి వాళ్లయితే డబ్బులు దాచుకునో, లేదా ఈఎంఐలోనో వస్తువులను కొంటారు. సాధారణంగా ఇన్సూరెన్స్‌ను మరొక అదనపు ఖర్చుగా చూస్తాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఇటీవల వచ్చిన వరదల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది ఇంట్లో సమస్తం కోల్పోయారు. ఫ్రిజ్‌లు, టీవీలు, ఖరీదైన వాషింగ్ మెషీన్లు...ఇలా సమస్తం నీళ్ల పాలయ్యాయి.

ఇలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ (పరికరాలు) ఇన్సూరెన్స్ ఉంటే చాలా సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ద్వారా వస్తువు పూర్తి విలువను తిరిగి పొందలేకపోయినా, కొంత వరకు ప్రయోజనం పొందవచ్చు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఏయే సమయాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడుతుందనే విషయాలను వైట్ మౌంట్ ఫిన్ సర్వ్‌‌కు చెందిన ఎం.వి.వి.ఎన్ పాత్రుడు, బీబీసీ న్యూస్ తెలుగుకు వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న వారంటీ పని చేయని సందర్భాల్లో ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు మీ ఫోన్ దొంగతనానికి గురైతే లేదా ప్రమాదవశాత్తు నీళ్లలో పడితే ఇలాంటి సందర్భాల్లో వారంటీ పని చేయదు.

కానీ, దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది.

ఈ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వస్తువు విలువకు తగినట్లుగా క్లెయిమ్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పాలసీ ఏయే వస్తువులకు ఇస్తారు?

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐప్యాడ్‌లు, రేడియో, టీవీ, కెమెరా, డ్రోన్లు, గేమింగ్ కన్సోల్స్‌కు ఇన్సూరెన్స్ లభిస్తుంది.

వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ లాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆఖరికి మీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్‌కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.

ఎప్పుడు తీసుకోవాలి?

ఖరీదైన వస్తువులను కొన్న వెంటనే ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ వస్తువు విలువకు అనుగుణంగా ఉంటుంది.

కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా వాటి డిప్రిసియేషన్ (తరుగుదల)ను అంచనా వేసి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే అవకాశం ఉంది.

విడివిడిగా ఒక్కొక్క వస్తువుకు ఇన్సూరెన్స్ తీసుకోవడం కంటే, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులకు అన్నిటికీ కలిపి తీసుకుంటే మంచిదని పాత్రుడు సూచించారు.

అయితే, ఖరీదైన ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌కు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం లేదా అని అడిగినప్పుడు, ఒక వస్తువుకు కూడా తీసుకోవచ్చన్నారు. కానీ, ఆ వస్తువులు బ్రాండెడ్ అయి ఉండాలి.

బిల్ లేదా ఇన్ వాయిస్ లేకుండా లోకల్ మార్కెట్లలో కొన్న వస్తువులకు, సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉండదు.

ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి?

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీతో రిజిస్టర్ అయిన సంస్థలు, ఏజెన్సీలు, ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో పేరున్న ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలు ఈ గాడ్జెట్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తున్నాయి.

ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ముందు లిస్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్‌లో ఉన్న వస్తువులన్నీ పేరున్న కంపెనీ నుంచి కొన్నవి అయి ఉండాలి. వాటి బిల్ ఉండటం తప్పనిసరి.

అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయించే సంస్థలతో కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు టై అప్ అవుతూ ఉంటాయి. వస్తువులు కొనేటప్పుడే బీమా సేవలను వినియోగదారులకు ఆఫర్ చేస్తుంటాయి.

ఎంత ఖరీదు ఉంటుంది?

వస్తువు విలువకు అనుగుణంగా ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది.

వస్తువును కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా పని చేసే పరిస్థితిలో ఉంటే, ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ, వస్తువు డిప్రిసియేషన్‌ని అంచనా వేసి ఆ రోజున వాటికున్న విలువకు అనుగుణంగా ఇన్సూరెన్స్ ఇస్తారు.

పాలసీల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. తీసుకున్న పాలసీకి అనుగుణంగా క్లెయిమ్ వస్తుంది.

బేసిక్ ప్లాన్‌లో వస్తువు విలువను పూర్తిగా పొందేందుకు అవకాశం ఉండదు.

ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, అన్ని వివరాలు అర్థం చేసుకుని, పాలసీ తీసుకోవడం మంచిదని సూచించారు పాత్రుడు .

వస్తువు పోయిన తర్వాత ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ ఇవ్వలేదని బాధపడేకంటే, ముందుగానే పాలసీ కవర్ చేసే అంశాలను తెలుసుకోవడం మంచిదని ఆయన అన్నారు.

వరదల్లో మునిగిన కారు

క్లెయిమ్ పొందేందుకు అర్హత ఏమిటి?

అగ్ని ప్రమాదం, వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు, షార్ట్ సర్క్యూట్, అల్లర్లు, విధ్వంసం లాంటివి జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైనప్పుడు ఈ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

వస్తువులను తరచుగా వాడటం వల్ల, సహజంగా వస్తువు పాడైనప్పుడు, కావాలని నీళ్లలో వేసినప్పుడు ఇన్సూరెన్స్ లభించే అవకాశం లేదని పాత్రుడు స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని వస్తువుతో అజాగ్రత్తగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

అలాగే అన్ని కంపెనీల నిబంధనలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి, పాలసీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండీషన్స్‌తో పాటు మీ అవసరాలకు తగినట్లుగా పాలసీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

క్లెయిమ్ ఎలా చేయాలి?

ఇన్సూరెన్స్ చేసిన వస్తువు దొంగతనం జరిగితే 24 గంటల లోపు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా జత చేయాలి.

పాలసీలో కవర్ అయ్యే ఇతర కారణాల వల్ల వస్తువులు పోయినట్లయితే, ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం అందించాలి. సదరు అధికారి నష్టాన్ని పరిశీలించి క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తారు.

క్లెయిమ్ ఫామ్‌తో పాటు వస్తువును కొన్న బిల్ ఉండాలి. ఇన్సూరెన్స్ సంస్థ అడిగిన మిగిలిన వివరాలు, ఆధార్ లాంటి ప్రూఫ్‌లు ఇవ్వవలసి ఉంటుంది.

క్లెయిమ్ ఎన్ని రోజుల్లో వస్తుంది?

వస్తువు పూర్తిగా పోయినట్లయితే, వస్తువును బీమా చేసిన విలువకు డిప్రిసియేషన్ తీసేసి, మిగిలిన పూర్తి విలువను లబ్ధిదారులకు ఇస్తారు.

వస్తువును రిపేర్ ద్వారా సరిచేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే, రిపేరు చేయించేందుకు అయ్యే విలువను ఇస్తారు.

ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్సూరెన్స్ పై అవగాహన అవసరం

తెలంగాణాలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపడుతున్న ఒక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, ఖమ్మం వరదల్లో కొన్ని వందల మంది ఇళ్లతో పాటు ఫ్రిజ్‌, వాషింగ్ మెషీన్, టీవీలాంటి విలువైన వస్తువులను కోల్పోయారని చెప్పారు. వీళ్లకెవరికీ గాడ్జెట్ ఇన్సూరెన్స్ లేకపోవడం విచారకరమని అన్నారు.

ఇండియాలో మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో 16% , పరికరాలపై కేవలం 7% మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఇన్సూరెన్స్ మార్కెట్ సైజ్ & షేర్ అనాలిసిస్ - గ్రోత్ ట్రెండ్స్ & ఫోర్‌కాస్ట్స్ (2024-2029) నివేదిక పేర్కొంది.

ఇండియాలో 2025 నాటికి 500 మిలియన్ డాలర్ల( రూ.41.94 వేల కోట్లు) విలువైన గాడ్జెట్ ఇన్సూరెన్స్ మార్కెట్ తయారయ్యే అవకాశముందని ఈ నివేదిక అంచనా వేసింది.

అయితే, ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇన్సూరెన్స్ విషయంలో పెద్దగా అవగాహన లేదని, ఎడెల్వైజ్‌లో సీనియర్ డెవలప్‌మెంట్ మేనేజర్ గా పని చేస్తున్న అనిత మళ్ల అన్నారు. కోవిడ్ తర్వాత లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యం పెరిగింది. కానీ, గాడ్జెట్ ఇన్సూరెన్స్‌పై అవగాహన మాత్రం 1% కూడా లేదంటారామె.

"అభివృద్ధి చెందిన దేశాల్లో మనిషి ప్రాణం నుంచి ఇంట్లో ఉండే అతి చిన్న పరికరం వరకు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు" అని ఆమె అన్నారు.

"గాడ్జెట్లకు ఇన్సూరెన్స్ తీసుకొమ్మని ఒత్తిడి చేస్తారు తప్ప వివిధ పాలసీల వల్ల కలిగే ప్రయోజనాలను ఏజెంట్లు వివరించరు. దీంతో, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలామంది ప్రాధాన్యమివ్వరు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

"పన్నులు కట్టకపోతే జరిగే పరిణామాల గురించి అవగాహన ఉన్నట్లే, ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏమి జరుగుతుందో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది" అని అనిత అంటారు.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే వీటి అవసరం, ప్రాముఖ్యత తెలుసుకుంటారు. లేదంటే, ఏమీ జరగదనే ధీమాతో ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు అన్నీ పోయినా కూడా, ఫోన్ నంబర్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని అనిత చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)