కుంభమేళాలో మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోల అమ్మకం, ఇదెలా బయటికొచ్చింది, పోలీసులు ఏమంటున్నారు?

కుంభమేళా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తున్న సమయంలో తీసిన మహిళల వీడియోలను టెలిగ్రామ్‌లో విక్రయించారు
    • రచయిత, కీర్తి రావత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు సంగమ్ వద్ద స్నానాలు ఆచరించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ కుంభ్ స్నానమాచరించారు.

అయితే మహిళలు, యువతులు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు అనేకం ఇటీవల పలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అయ్యాయి.

ఈ వీడియోలు ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌లలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, అనేక టెలిగ్రామ్ చానెళ్లలో ఈ వీడియోలను అమ్ముకున్నారు.

మీడియా కథనాల ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారం మరోసారి మహిళల గోప్యత, భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాకు చెందిన 27 ఏళ్ల అమిత్ కుమార్ ఝా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఫిబ్రవరి 27న ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎక్స్‌ వేదికగా తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వీటన్నింటి మధ్య, గుజరాత్ నుంచి కూడా ఒక దిగ్భ్రాంతికర రిపోర్ట్ బయటకు వచ్చింది.

రాజ్‌కోట్‌లోని ఒక ప్రసూతి ఆసుపత్రిలో మహిళల వీడియోలు చిత్రీకరించి వాటిని టెలిగ్రామ్ చానెళ్లలో అమ్ముతున్నట్లుగా ఆ నివేదిక పేర్కొంది.

సీసీటీవీ నుంచి సేకరించిన మహిళల ఫోటోలను షేర్ చేసిన రెండు టెలిగ్రామ్ గ్రూపుల స్క్రీన్‌షాట్లు కూడా బీబీసీ వద్ద ఉన్నాయి.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ, వీటికి సంబంధించిన పూర్తి వీడియో ఎవరి దగ్గర కొనుగోలు చేయవచ్చో కూడా అందులో ప్రస్తావించారు.

ఈ టెలిగ్రామ్ చానెళ్లలో కేవలం కుంభమేళా సమయంలోనే కాకుండా, ఇతర మతపరమైన ఉత్సవాల్లో కూడా మహిళలు స్నానాలు చేస్తోన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు.

కుంభమేళా

ఫొటో సోర్స్, Getty Images

పోలీసుల విచారణలో ఏం తేలింది?

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో కుంభమేళాలో స్నానం ఆచరిస్తున్న మహిళల వీడియోలను అమ్ముతున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ వీడియోలను 'మహాకుంభ్ గంగ స్నానం ప్రయాగ్‌రాజ్' అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేశారు.

అలాగే, కొన్ని పోస్టులకు కుంభమేళాతో సంబంధమున్న కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు.

మీడియా కథనాల ప్రకారం, ఈ వీడియోలను 2 వేల నుంచి 3 వేల రూపాయలకు అమ్ముతున్నారు.

మహిళల వీడియోలను అమ్ముతున్నారనే సంగతి వెలుగులోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టారు.

ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, టెలిగ్రామ్ చానెళ్లపై చర్యలు తీసుకున్నామని యూపీ పోలీసులు చెప్పినట్లుగా వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

''కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో కుంభమేళాలో మహిళలు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటున్నట్లుగా ఉన్న వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయనే విషయం సోషల్ మీడియా పర్యవేక్షణా బృందం దృష్టికి రావడంతో మేం చర్యలు తీసుకున్నాం. ఇది వారి గోప్యతకు, గౌరవానికి భంగం కలిగించడమే'' అని యూపీ పోలీసులు పేర్కొన్నారు.

మహిళల వీడియోలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ ఫిబ్రవరి 17న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై కేసు నమోదు చేశారు. మరో వ్యవహారంలో, ఫిబ్రవరి 19న కొన్ని టెలిగ్రామ్ చానెళ్లపై కూడా కేసులు రిజిస్టర్ చేశారు.

ఈ రెండు కేసులు, ప్రయాగ్‌రాజ్‌లోని 'కొత్వాలి కుంభ్‌మేళా' పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనికి సంబంధించి ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

''కుంభమేళాకు వచ్చిన మహిళా భక్తులు స్నానాలు ఆచరిస్తుండగా అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ, అలాంటి వీడియోలను సోషల్ మీడియా ద్వారా అమ్ముతున్నారనే సమాచారం తెలియగానే కుంభమేళా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ పనికి పాల్పడుతున్న 17 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు'' అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

కుంభమేళాకు వెళ్లిన ఒక మహిళతో బీబీసీతో మాట్లాడింది.

కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తోన్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి అమ్ముతున్నారనే విషయం తెలియగానే చాలా బాధగా అనిపించిందని బీబీసీతో ఆమె అన్నారు. తన వివరాలు గోప్యంగా ఉంచాలని ఆమె కోరారు.

''ఇది మహిళల గౌరవానికి సంబంధించిన విషయం. స్నానం చేస్తున్నటువంటి చిత్రాలను మార్కెట్‌లో అమ్మితే మహిళల పరువుకు భంగం కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి ప్రదేశాల్లోనే మహిళలకు రక్షణ లేకపోతే, ఇక వేరే ప్రదేశాల్లోని పరిస్థితుల గురించి ఏం చెప్పగలం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

రాజ్‌కోట్ ప్రసూతి ఆసుపత్రి సీసీటీవీ హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

రాజ్‌కోట్‌లో ఏం జరిగింది?

రాజ్‌కోట్ జిల్లాలోని ఒక క్లినిక్‌కు చెకప్ కోసం వెళ్తున్న మహిళా రోగుల వీడియోలు లీకవుతున్నాయి. యూట్యూబ్‌లో ఈ వీడియోలు అప్‌లోడ్ చేశారు. టెలిగ్రామ్‌లో అమ్ముడయ్యాయి.

దీని గురించి బీబీసీతో గుజరాత్ పోలీస్ సైబర్ క్రైమ్‌ ఏసీపీ హార్దిక్ మకాడియా మాట్లాడారు.

''ఒక మెటర్నిటీ హోమ్‌లోని సీసీటీవీని హ్యాక్ చేసి ఈ వీడియోలను యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోల డిస్క్రిప్షన్‌లో ఒక టెలిగ్రామ్ చానెల్ లింక్‌ను ఉంచారు'' అని ఆయన చెప్పారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఎవరో తన సోషల్ మీడియా అకౌంట్‌ను ట్యాగ్ చేశారని హార్దిక్ తెలిపారు.

తర్వాత ఆ వీడియోను పరిశీలించినప్పుడు అందులోని డాక్టర్, రోగి గుజరాతీలో మాట్లాడుకోవడం గమనించానని, ఆ తర్వాత తన టీమ్ పూర్తి వివరాలను సేకరించడం ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.

''ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నాం. వీరంతా టెలిగ్రామ్ చానెల్స్ ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. హ్యాకింగ్ చేసి ఆ వీడియోలను సంపాదించారు'' అని ఆయన వివరించారు.

కుంభమేళా

ఫొటో సోర్స్, Getty Images

మనస్తత్వంపై ప్రశ్నలు

కుంభమేళా, గుజరాత్ ఘటనలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి.

దీని గురించి సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నిమిష్ జి దేశాయ్ బీబీసీతో మాట్లాడారు.

''ఆధునిక సాంకేతికత సహాయంతో ఇలాంటి వాటిని సులభంగా చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వెనుక డబ్బు సంపాదించాలనే కోరిక కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇలాంటి నేరాలకు కఠినమైన చట్టాలు లేవు. కాబట్టి అలాంటి వారికి భయం లేదు'' అని అన్నారు.

సమాజంలో జెండర్ రోల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని బీబీసీతో సైకాలజిస్ట్ కరిష్మా మెహ్రా అన్నారు.

''మహిళలను ఒక వస్తువులా చూస్తారు. ఈ మనస్తత్వం కారణంగానే మహిళల పట్ల తాము చేస్తున్నది సరైనదనే భావనలో ఉంటారు. చాలాసార్లు పురుషులు చేసే పనులకు మహిళలను దోషులుగా చూస్తుంటారు'' అని వివరించారు.

టెలిగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

టెలిగ్రామ్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి?

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కంటే టెలిగ్రామ్‌లో ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి?

సైబర్ సెక్యూరిటీ నిపుణులు శుభం సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

"టెలిగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. దీంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలను ట్రాక్ చేయడం ప్రభుత్వానికి కష్టం అవుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే, టెలిగ్రామ్‌లోని పెద్ద గ్రూపులపై తక్కువ పర్యవేక్షణ ఉంటుంది. దీంతో సులువుగా కార్యకలాపాలు సాగిస్తుంటాయి.

టెలిగ్రామ్‌లో ఖాతాలను సృష్టించడం, తొలగించడం రెండూ సులభమే. దీనివల్ల నేరస్తులను గుర్తించడం కష్టమవుతుంది'' అని ఆయన అన్నారు.

''టెలిగ్రామ్ దుబయ్ నుంచి పనిచేస్తుంది. ఈ కారణంగా యూరోపియన్ యూనియన్ లేదా అమెరికా విధానాలు ఈ యాప్‌కు వర్తించవు. దీనితో పాటు టెలిగ్రామ్‌లో లక్షల కొద్దీ గ్రూపులు, చానెళ్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడం దాదాపు అసాధ్యం" అని శుభం అన్నారు.

చట్టంలోని నిబంధనలు

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏం చెబుతోంది?

మహిళల గోప్యతకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయమై న్యాయవాది రాధిక థాపర్‌ బీబీసీతో మాట్లాడారు.

''భారత న్యాయ సంహితలో సెక్షన్ 509 ప్రకారం, ఒక మహిళ గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో చేసే నేరానికి మూడేళ్ల వరకూ శిక్ష పడొచ్చు.

సెక్షన్ 509 ప్రకారం, మీరు ఒక మహిళను అభ్యంతరకరంగా చూపిస్తే, అది నేరం కిందకు వస్తుంది.

ఎవరైనా అశ్లీల విషయాలను ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద శిక్ష విధించవచ్చు. ఇది మహిళలకే కాకుండా పిల్లలు, ఇతరుల విషయంలో కూడా వర్తిస్తుంది'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)