పింక్ ఫారెస్ట్: హిమాలయాల్లోని ఈ చెట్లు పాడేరుకు ఎలా వచ్చాయి?

pink forest
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్రలోని పర్యటక ప్రాంతాల జాబితాలో తాజాగా ‘పింక్ ఫారెస్ట్’కూడా చేరింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఉప్ప చెట్లు ఉన్న ప్రాంతాన్ని 'పింక్ ఫారెస్ట్' అని పిలుస్తున్నారు.

సుగంధం వెదజల్లుతూ కేవలం 16 ఎకరాల్లో ఉన్న ఈ పింక్ ఫారెస్ట్‌కు పర్యటకులు క్యూ కడుతున్నారు.

మూడు నెలల కాలంలో ఆరు రంగులు మార్చే ఈ చెట్లను గిరిజనులు అమ్మవారి రూపంగా భావిస్తున్నారు.

రంగురంగులతో పింక్ ఫారెస్ట్ గా పేరుపొందిన ఈ ఉప్ప మొక్కలను పాడేరుకు తీసుకుని వచ్చింది ఒడిశాలోని జైపుర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ.

ఏపీలో మరెక్కడ ఇలాంటి చెట్లు లేవని వీటిపై పరిశోధన చేసిన వృక్షశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

హిమాలయాల్లో ఉండే ఈ చెట్లు పాడేరులో ఎలా పెరుగుతున్నాయి? వీటి ప్రత్యేకత ఏమిటో వృక్షశాస్త్ర నిపుణులు ‘బీబీసీ’కి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
pink forest

రంగులు మార్చే ఉప్ప చెట్లు

ఉప్ప మొక్కలు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దానికి కారణం ఇవి రంగులు మార్చడం.

"జనవరి నుంచి మార్చి వరకు కాలంలో ఈ ఆకులు రంగులు మారుతాయి. మార్చి నుంచి మే వరకు సువాసన ఇచ్చే తెల్లని పువ్వులు పుస్తాయి. జూన్ నుంచి జులై వరకు కాయలు కాస్తాయి. ఈ కాయల నుంచి నూనె తయారు చేస్తాం" అని స్థానిక గిరిజనులు చెబుతున్నారు.

చుట్టుపక్కల జిల్లాలలో ఇంకెక్కడా లేని ఈ ఉప్ప చెట్లను స్థానిక గిరిజనులు తాము పూజించే గుణాలమ్మ అమ్మవారి రూపంగా భావిస్తున్నారు.

ఉప్ప చెట్ల తోటల్లో గుణాలమ్మ గుడి కూడా ఉంది.

ఈ చెట్లకు స్థానిక గిరిజనులు ఏ చిన్న హాని కూడా తలపెట్టరని ఉప్ప గ్రామానికి చెందిన నాగేంద్ర బీబీసీతో చెప్పారు.

"ఈ చెట్లు మా తరతరాల సంపద. ఇప్పుడు వీటికి గుర్తింపు వచ్చింది. ఉప్ప చెట్ల ఆకులు శీతాకాలంలో బంగారు రంగులో మెరుస్తాయి. అలా క్రమంగా మారుతూ ఎరుపు, పింక్ (లేత గులాబీ) రంగులోకి మారతాయి. అందుకే వీటిని పింక్ ఫారెస్ట్ అంటున్నారు. అలా క్రమంగా ఆకుపచ్చగా నుంచి..ఉప్ప చెట్ల ఆకులు తెల్లగా మారుతాయి. ఆ తర్వాత పూసే ఉప్ప పూలతో చుట్టుపక్కల చాలా దూరం వరకు సువాసన వస్తుంది" అని నాగేంద్ర చెప్పారు.

పాడేరు, పింక్ ఫారెస్ట్, అరకు, లంబసింగి, ఉప్ప చెట్లు
ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య

ఇవి దివిటీ చెట్లు: రిటైర్డ్ ఫ్రొఫెసర్ వెంకయ్య

వీటిని ఉప్ప చెట్లు అని పిలుస్తున్నాం కానీ వీటిని పాడేరులోని పూర్వీకులు నాగకేసరి అని పిలిచేవారు.

కాల క్రమంలో ఉప్ప(పనికిరాని) పేరుతో ఈ చెట్లకు ఉప్ప చెట్లు అని పేరు స్థిరపడిపోయింది.

వీటికి ప్రత్యేకమైన గుణాలున్నాయని 2003లో తొలిసారి తన పరిశోధనల్లో తేలిందని ఏయూ, బోటని విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. వెంకయ్య బీబీసీతో చెప్పారు.

వీటి సాంకేతిక నామం మెసువా ఫెర్రియా.

"ఈ చెట్లకు దివిటీల చెట్లు అని పేరు ఉంది. ఎందుకంటే ఈ చెట్ల నుంచి వచ్చే కాయలతో నూనెను తయారు చేసి, దాన్ని దివిటీలు వెలిగించుకునేందుకు వాడేవారు. వీటిని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చింది జైపూర్ ప్రాంతాన్ని పాలించిన మహారాజ్ విక్రమ్ దేవ్ వర్మ" అని రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.

"ఒడిశాలోని జైపూర్ మహారాజ్ విక్రమ్ దేవ్ వర్మ తన రాజ్యంలోని దివిటీలు ఎక్కువ సేపు వెలగడానికి పనికొచ్చే నూనెను ఇచ్చే ఈ మొక్కలను హిమాలయాల నుంచి తీసుకుని వచ్చారు. అవి ఒడిశా సమీపంలోనే ఉన్న మన్యంలోని కొన్ని ప్రాంతాలకు చేరాయి. అయితే కేవలం పాడేరులోనే ఇవి బతికాయి. ఇవి పెరగడానికి శీతల వాతావరణంలో పాటు సారవంతమైన మట్టి అవసరం. ఉప్ప ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రయత్నించవచ్చు కానీ...పరిస్థితులు అనుకూలంగా ఉండాలి." అని వెంకయ్య చెప్పారు.

పాడేరు, పింక్ ఫారెస్ట్, అరకు, లంబసింగి, ఉప్ప చెట్లు, ఆంధ్రా యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, ఉప్ప చెట్ల సాంకేతిక నామం మెసువా ఫెర్రియా.

'గిరిజనులే ఈ చెట్ల రక్షకులు'

జనవరిలో ప్రారంభమై...నెలకో రంగు మారుతూ...ముందు పింక్ కలర్ వచ్చి...ఆ తర్వాత ఎరుపుగా మారుతూ.... పసుపచ్చ, లేతాకుపచ్చ నుంచి క్రమంగా ఆకులు తెల్లగా మారిపోతాయి.

ఇంద్రధనస్సులోని నీలం తప్ప మిగతా రంగులన్నీ ఈ చెట్ల ఆకుల్లో కనిపిస్తాయని ఈ తోటలకు కాపు కాస్తున్న పీబీ శ్రీనివాస్ చెప్పారు.

"ఈ చెట్లు...ఇక్కడ తప్ప ఎక్కడ లేవండి. ఈ మొక్కలను తీసుకుని వెళ్లి పెంచే ప్రయత్నం చేశారండీ. కానీ అక్కడ పెరగలేదు. మేమే 20 వేల మొక్కలను అరకులోని పద్మాపురం గార్డెన్స్ కి ఇచ్చాం. అందులో రెండంటే రెండే మొక్కలు బతికాయి" అని పీబీ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

"గుణాలమ్మే ఈ చెట్ల రూపంలో ఉందని మేం అనుకుంటాం. అందుకే ఈ మొక్కని మేం కొట్టం. అమ్మవారి పేరు మీద ఈ మొక్కలకి రక్షణ కల్పిస్తాం. ఎవరైనా వీటికి హాని చేయాలని చూస్తే ఊరుకోం" అని మరో గిరిజనుడు వంశీ చెప్పారు.

పాడేరు, పింక్ ఫారెస్ట్, అరకు, లంబసింగి, ఉప్ప చెట్లు
ఫొటో క్యాప్షన్, పాడేరులో ఉప్ప చెట్లు ఉన్న ప్రాంతాన్ని 'పింక్ ఫారెస్ట్' అని పిలుస్తున్నారు.

నూనె కోసమే పెంచేవారు

కొండ దొర, కొండ రెడ్డి, గదబ, బగత తెగలు ఈ చెట్లు ఉన్న సమీప గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరు ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.

అందుకే ఈ చెట్లకు రక్షణ కల్పిస్తూ వీటిని సంరక్షిస్తుంటారు.

పాడేరులోని బంగారుగరువు ప్రాంతంలో కేవలం 16 ఎకరాల్లో మాత్రమే ఉన్న ఈ పింక్ పారెస్ట్ ఏపీలో ఇంకెక్కడా లేదని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బయట ఒడిశా, బిహార్, హిమాలయాలు, శ్రీలంకలో ఈ చెట్లు కనిపిస్తుంటాయని ఏయూ బోటనీ విభాగం స్కాలర్ డాక్టర్ ప్రకాశరావు బీబీసీతో చెప్పారు.

ఉప్ప చెట్ల గింజలు
ఫొటో క్యాప్షన్, ఉప్ప చెట్ల గింజలు

ఈ మొక్కల్లోని నూనెకు డీజిల్ సామర్థ్యాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చి, దానికి పేటెంట్ హక్కు పొందారు డాక్టర్ ప్రకాశరావు.

ఈ చెట్లను, వీటి ప్రత్యేకతను 2003లో గుర్తించింది ఏయూ బోటని విభాగం.

"ఉప్ప చెట్ల కాయల్లో నూనె ఉంటుంది. స్థానికులు వీటిని దీపాలు వెలిగించేందుకు ఉపయోగించేవారు. అలాగే దోమలు కుట్టకుండా శరీరానికి కూడా రాసుకునేవారు. ఈ చెట్టు ఆకులు రంగులు మారుస్తుండటంతో...ఉప్ప చెట్ల పువ్వుల కంటే దీని ఆకులే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటాయి. పట్టణాల్లో, నగరాల్లో సుందరీకరణ కోసం వాడే కోనోకార్పస్ మొక్క బదులు ఈ ఉప్ప చెట్లు వినియోగించవచ్చు" అని డాక్టర్ ప్రకాశరావు చెప్పారు.

పాడేరు, పింక్ ఫారెస్ట్, అరకు, లంబసింగి, ఉప్ప చెట్లు, ఆంధ్రా యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, జైపుర్ మహారాజ్ విక్రమ్ దేవ్ మెసువా ఫెర్రియా మొక్కను హిమాలయాల నుంచి తీసుకుని వచ్చారు.

ప్రత్యేకమైన అనుభూతి: పర్యటకులు

సుగంధం, నూనె అందించడంతో పాటు ఈ చెట్లకు జౌషధ లక్షణాలు కూడా ఉన్నాయని రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. వెంకయ్య తెలిపారు.

ఈ చెట్లకు హాని చేసినా, నరికినా వారికి గుణాలమ్మ శిక్షిస్తుందని గిరిజనులు భావిస్తారు. వారు ఈ చెట్లను తరతరాలుగా రక్షిస్తున్నారు.

పాడేరు, పింక్ ఫారెస్ట్, అరకు, లంబసింగి, ఉప్ప చెట్లు, ఆంధ్రా యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, ఉప్ప చెట్లను చూసేందుకు పర్యటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు.

ఉప్ప చెట్లు రంగులు మారటం ఎప్పటీ నుంచో ఉన్నప్పటీకి, వాటిని చూసేందుకు వచ్చే పర్యటకుల సంఖ్య ఇటీవల పెరిగిందని ఎం. వెంకయ్య చెప్పారు.

"ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. ఉప్ప పువ్వులు, కాయలు అన్నిటికి ప్రత్యేక గుణాలున్నాయి. ఈ ఉప్ప చెట్ల మధ్య చాలా చల్లగా ఉంది. ఇక్కడంతా నాగమల్లి పువ్వుల వాసన వస్తుంది. రంగులు మారుతున్న విషయాన్ని చెబితే చూసేందుకు వచ్చాం. ఇప్పుడు గులాబీ రంగు నుంచి ఆకుపచ్చగా మారే దశలో ఉంది. ఇదొక ఎక్స్ప్ పీరియన్స్." అని సందర్శకురాలు సునీత బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)