‘ఇడ్లీ పాత్రలో ఈ పని మాత్రం చేయొద్దు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
తయారీ విధానాలలో పొరపాట్ల కారణంగా సాధారణ ఇడ్లీలో కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన పదార్థాలు కలుస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది.
కర్ణాటకవ్యాప్తంగా 241 హోటళ్లు, వెండర్లలో జరిపిన దాడుల్లో.. శుభ్రమైన వస్త్రాన్ని కాకుండా ప్లాస్టిక్ షీట్లను వాడుతూ ఇడ్లీలను తయారు చేస్తున్న 52 యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది.
సాధారణంగా, ఇడ్లీ పాత్రలో ఉండే ట్రేలలో శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి దానిపై ఇడ్లీ పిండిని వేసి ఉడికిస్తారు.
కానీ, కొందరు తయారీదారులు వస్త్రానికి బదులు ప్లాస్టిక్ షీట్లను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ దాడుల్లో వెల్లడైంది.
ఈ ప్లాస్టిక్ షీట్లు క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్‌లను ఉత్పత్తి చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో అధికారుల దాడుల్లో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ షీట్ల వాడకం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన వివరాలు, అవగాహన సందేశాలు వాట్సాప్‌లో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
‘‘అధిక ఉష్ణోగ్రతల వద్ద నాన్-ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌ను కరిగించినప్పుడు, ఆ హానికరమైన పదార్థాలు ఇడ్లీలోకి వెళ్తాయి. సంప్రదాయ పద్ధతిలో శుభ్రమైన వస్త్రాన్ని వాడినప్పుడు ఏ రకంగా కలుషితం కాదు'' అని హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ డీన్ డాక్టర్ యూ.ఎస్ విశాల్ రావు బీబీసీతో చెప్పారు.
నీళ్లల్లో పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని, వాటి నుంచి కూడా మనం రక్షించుకోవాల్సినవసరం ఉందని అన్నారు.
ప్లాస్టిక్ షీట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కార్సినోజెన్‌ల విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్లాస్టిక్ వాడకంపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు.
''మీరేం తింటున్నారో తెలుసుకోండి. ఆహార పదార్థాలను విక్రయించే వారు క్లయింట్లకు ఏం వడ్డిస్తున్నారో తెలుసుకోవాలి. చాలాసార్లు ఆహారం అమ్మేవారికి అసలు తమ కస్టమర్ల ఆరోగ్యానికి ఏది చెడు చేస్తుందో తెలియదు.'' అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ రావు బీబీసీతో చెప్పారు.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కనుగొన్న ప్రమాదకరమైన టాక్సిన్లు ఉన్న ఆహార పదార్థం కేవలం ఇడ్లీ మాత్రమే కాదన్నారు. ఇతర పదార్థాలలో కూడా ఈ టాక్సిన్లు ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వేయించిన పచ్చి బఠానీలు చక్కగా కనిపించేందుకు కలర్ వాడుతున్నట్లు ఇదే దాడుల్లో గుర్తించారు.
ఇలాంటివే కొన్ని నెలల క్రితం కాటన్ క్యాండీ, చికెన్ కబాబ్స్, టీ, కేక్స్ సహా ఇతర తినే వస్తువుల్లో కలిసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీల్లో వెల్లడైంది.
పచ్చి బఠానీలలో బ్యాన్ చేసిన కెమికల్స్‌ను వాడుతున్నారని, వాటిని ఆహార పదార్థాల్లో వాడకూడదని గుండూ రావు తెలిపారు.
పలు ప్రాంతాల్లో టాటూ ఇంక్ శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పరిశీలించారు. వీటిల్లో 22 హెవీ మెటల్స్ (సెలీనియం, క్రోమియం, ప్లాటినం, ఆర్సెనిక్ వంటివి) ఉన్నట్లు గుర్తించారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ నిబంధనలను వారు పాటించడం లేదని వెల్లడైందని ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.
దీనివల్ల చాలా చర్మవ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, వైరల్ ఇన్‌ఫెక్షన్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తున్నట్లు తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














