హిందీ వర్సెస్ తమిళం: తమిళనాడు సీఎం, కేంద్రం మధ్య భాషాయుద్ధం.. చరిత్ర ఏం చెప్తోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నయాజ్ ఫరూఖీ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం నెలకొంది.
ఐదేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రవేశపెట్టింది. దశలవారీగా ఇది అమల్లోకి వస్తోంది.
దీన్ని అమలు చేసేందుకు తమ రాష్ట్రం అంగీకరించకపోవడంతో, నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఆరోపించడంతో ఈ అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. అయితే, ఈ అభియోగాలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది.
ఈ విద్యా విధానంలో విద్యార్థులు మూడు భాషలను నేర్చుకోవాలని సిఫారసు చేశారు. దీనిలో ఏ భాషనూ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, కనీసం రెండు భాషలు భారత్‌కు చెందినవై ఉండాలని తెలిపారు.

ఎన్ఈపీ అమలు చేయకపోవడానికి చాలా కారణాలున్నాయని స్టాలిన్ అన్నారు. మూడు భాషల విధానంతో హిందీని తమపై రుద్దాలని చూస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.
ఉత్తర భారత భాష అయినా హిందీని భారత్‌లో చాలా ప్రాంతాల్లో మాట్లాడుతుంటారు.
హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు సుమారు రెండు డజన్ల అధికారిక భాషలు భారత్‌లో ఉన్నాయి. ఇతర భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయంటూ పలుమార్లు దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేశాయి.
తమిళనాడులో ఇది అత్యంత సున్నితమైన విషయం. ఇలాంటి నిరసనల విషయంలో తమిళనాడు ముందు ఉంటుంది.
స్టాలిన్, ఆయన పార్టీ సభ్యులపై విరుచుకుపడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి పలు ఆరోపణలు చేయడంతో సోమవారం పార్లమెంట్ దద్దరిల్లింది.
''భాషాపరమైన వివాదాలను పెంచడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు అప్రజాస్వామికం, అనాగరికులు'' అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో స్టాలిన్ పార్టీ డీఎంకే తమిళనాడులో తమ ఆందోళనలను వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటి వివాదం?
విద్య అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, విద్యకు సంబంధించి ఏదైనా చట్టాలను రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు అవి ఏ పర్యవేక్షణలో ఉంటే వారి సిలబస్‌లను, నిబంధనలను అనుసరిస్తుంటాయి.
భారత్‌లో విద్యను ప్రోత్సహించాలని, నియంత్రించాలని జాతీయ విద్యా విధానం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడప్పుడు దీన్ని ప్రభుత్వం అప్‌డేట్ చేస్తోంది. ఎన్ఈపీ 2020 అనేది ఈ క్రమంలో నాలుగో వెర్షన్.
1968లో ఎన్‌ఈపీకి చెందిన తొలి వెర్షన్‌లోనే త్రిభాషా సూత్రం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి తరచూ దీనికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిలో చాలా సిఫారసులకు రాష్ట్రాలు నడిపే స్కూళ్లు కట్టుబడి లేవు.
ఉదాహరణకు తమిళనాడులోని స్కూళ్లలో కేవలం ఇంగ్లీష్, తమిళమే బోధిస్తున్నారు. మాతృభాష అయిన తమిళంలో చదువు నేర్చుకోవడం వల్ల పిల్లలు సబ్జెక్టు సబ్జెట్లను పిల్లలు బాగా అర్థం చేసుకుంటారని ఆ రాష్ట్రానికి చెందిన నాయకులు చెబుతున్నారు.
అదేవిధంగా, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారని అంటున్నారు. విద్య అందుబాటు, మౌలిక సదుపాయాల నాణ్యత వంటి పలు పారామీటర్లపై చేపట్టిన సర్వేల్లో కూడా తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగైన ప్రతిభను కనబర్చాయి.
తాజా ఎన్ఈపీలో మూడు భాషల విధానాన్ని అనుసరిస్తామని కేంద్రం చెప్పింది. అంతకుముందు వెర్షన్ల మాదిరిగా కాకుండా, అత్యంత ఫ్లెక్సిబులిటీని ఇది అందిస్తుందని తెలిపింది. ఏ భాషను ఏ రాష్ట్రంపై రుద్దరని తెలిపింది.
తాము హిందీకి వ్యతిరేకులం కాదని చెప్పిన స్టాలిన్, ఆయన పార్టీ... హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో బలవంతంగా దీన్ని రుద్దేలా జాతీయ విద్యా విధానం లక్ష్యంగా పెట్టుకుందని గత కొన్నివారాలుగా ఆరోపిస్తున్నారు.
''బ్రిటీష్ కాలంలో కమ్యూనికేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రామాణిక భాషగా హిందీ ఆవిర్భవించింది. ఉత్తర భారతంలో మాట్లాడే భోజ్‌పురి, అవధి వంటి ఇతర భాషలపై, మాండలికాలపై ఇది ఆధిపత్యం సాధించింది'' అని గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేశారు.
బలవంతంగా మూడు భాషలు నేర్చుకోవాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారంటూ డీఎంకేకు చెందిన ఎంపీ కళిమొళి ప్రశ్నించారు.
''స్కూలు విద్యార్థులకు చాలా భారం ఉంటుంది. ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. దీనికి మించి రెండు కాకుండా, మూడు భాషలు నేర్చుకోవాలని మీరు బలవంతం చేస్తున్నారు'' అని ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
ఈ విధానంలో బలవంతంగా హిందీని రుద్దుతున్నారనే ఆరోపణలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు.
''హిందీ మాత్రమే ఉంటుందని మేమెక్కడా ఎన్ఈపీ 2020లో చెప్పలేదు. విద్య అనేది మాతృభాషలో ఉండాలని మేం చెప్పాం. తమిళనాడులో అది తమిళంలోనే ఉంటుంది'' అని గతవారం రిపోర్టర్లతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌ఈపీ అమలు చేయడానికి రాష్ట్రం నిరాకరించడంతో, సమగ్ర శిక్షా అభియాన్‌కు చెందిన నిధుల్లో తమ వాటాలను ఇవ్వడం లేదని తమిళనాడు ఆరోపించడంతో తాజాగా ఈ వివాదం నెలకొంది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు అందిస్తుంది.
ఈ స్కీమ్‌లో పాలుపంచుకునేందుకు ఎంఓయూ (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్)పై సంతకం పెట్టాలని తమిళనాడును కేంద్ర ప్రభుత్వం అడిగిందని గత ఆగస్టులో హిందూ పత్రిక రాసింది.
ఈ ఎంఓయూ ప్రకారం, ఈ స్కీమ్‌లో పాల్గొనడం అంటే.. రాష్ట్రం పూర్తిగా ఎన్ఈపీ 2020ను అమలు చేయాలి.
రాష్ట్రం తొలుత అంగీకరించినప్పటికీ ఎంఓయూపై సంతకం చేయడం లేదని కేంద్ర సహాయ మంత్రి గత డిసెంబర్‌లో చెప్పారు.
అయితే, తాము అసలు అంగీకరించలేదని డీఎంకే చెప్పింది. సుమారు రూ. 2,150 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్టాలిన్ ఫిబ్రవరిలో నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
భారత్‌లో భాష ఎందుకంత సున్నితమైన అంశం?
ప్రపంచంలో భాషల పరంగా అత్యంత వైవిధ్యభరితమైన దేశాలలో భారత్ ఒకటి. వేల భాషలను భారత్‌లో మాట్లాడతారని కొందరు అంచనావేస్తున్నారు.
అయితే, హిందీతో పాటు కేవలం 22 మాత్రమే అధికారిక భాషలుగా ఉన్నాయి. దేశంలో 46 శాతం మంది జనాభా హిందీని మాట్లాడతారు.
1947లో బ్రిటీష్ వారు భారత్‌ను వీడిన తర్వాత, ఇంగ్లీష్ స్థానంలో హిందీని ప్రమోట్ చేయడానికి కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశం ప్రయత్నించింది.
రాజ్యాంగం సైతం హిందీ భాషను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించింది.
అయితే, దీనికి హిందీ మాట్లాడని రాష్ట్రాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. 1950 తర్వాత 15 ఏళ్ల పాటు ప్రత్యామ్నాయ అధికారిక భాషగా ఇంగ్లీష్‌నే కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది.
1965లో తమిళనాడు వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో, ఇంగ్లీష్‌నే అధికారిక భాషగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చేలా ఇవి ప్రేరేపించాయి.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు పలు విధానాలను, ప్రకటనలు చేశాయి. 1968లో తొలిసారి మూడు భాషల ఫార్ములాతో ఎన్‌ఈపీని తీసుకొచ్చారు.
అదే ఏడాది హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం విధానాలు తీసుకురావడంతో, మళ్లీ నిరసనలు జరిగాయి. ఇలా అనేక ఏళ్లుగా హిందీ వర్సెస్ ఇతర భాషల వివాదం కొనసాగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














