టాయిలెట్‌కు వెళ్తూ ఫోన్ తీసుకెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ ఫోన్‌ను చేతి నుంచి దూరంగా ఉంచలేకపోతున్నారా? తినేటప్పుడు, నిద్రకి ముందు, నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా?ఆఖరికి టాయిలెట్‌కు వెళ్లేప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్తున్నారా? ఇది కచ్చితంగా ఆందోళన చెందాల్సిన అంశం.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, మెసేజులు, రీల్స్ వంటి వాటితో మొబైల్ ఫోన్‌ను టాయిలెట్‌కి కూడా తీసుకెళ్లాలని అనిపిస్తుంది. ఆ సమయంలో, అక్కడ ఫోన్ చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలకు దగ్గరవుతున్నామని చాలా మంది గ్రహించడం లేదు.
టాయిలెట్‌కి వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలు సమస్య ఏమిటి?
మనలో చాలామందికి, ముఖ్యంగా యువతీయువకులకు టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. అయితే, అరగంట కంటే ఎక్కువసేపు టాయిలెట్‌లో గడిపేవారు వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువ.
ఎవరైతే మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వాడుతుంటారో వారు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుంటారు. ఇది మలవిసర్జనలో సాయపడే పాయువు (మలద్వారానికి పైన ఉండే భాగం - యానస్) దగ్గర కండరాలపై మరింత ఒత్తిడికి కారణమవుతుంది.
మలవిసర్జన చేయడానికి కష్టపడాల్సి రావడం కూడా అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిలో హెమరాయిడ్స్ (పైల్స్), మలబద్దకం, ఫిస్టులా, ఫిషర్ వంటివి ఉంటాయి.
ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. మలవిసర్జన కోసం ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలబద్దకం, మలం గట్టిగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఈ ఒత్తిడి మలద్వారం వద్దనున్న రక్తనాళాలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీంతో అవి ఉబ్బిపోయి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి, కమోడ్ రకం టాయిలెట్ సహజంగానే యానస్ చుట్టూ ఉన్న ప్రాంతం, అక్కడి కండరాలపై ఒత్తిడికి కారణమవుతుంది.
దానికితోడు, మనం అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. మలవిసర్జన ఆలస్యం కావడం లేదా విసర్జనలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఎక్కువ మంది మరింత బలవంతంగా విసర్జన చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో సమస్యల్లో చిక్కుకుంటారు.
అందువల్ల, వీలైనంత తక్కువ సమయంలో మలవిసర్జన చేసేందుకు ప్రయత్నించడం, టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించకపోవడం వంటివి గుర్తుంచుకోవడం ముఖ్యం.
టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చుని ఫోన్ చూడడం వల్ల మెడ, వెన్నుపూస శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది.
ఒకే స్థితిలో కదలకుండా ఉండటం వల్ల చేతులు, పాదాలకు తిమ్మిర్లు, కాళ్లు భారంగా అనిపించడం, కొద్దిసేపు ఇతర అవయవాలను కదలించలేకపోవడం వంటివి జరుగుతాయి.
వంగి కూర్చుని, ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగి అది మెడనొప్పికి, వెన్నునొప్పికి కారణం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ తర్వాత లైఫ్‌స్టైల్‌లో మార్పులు
కోవిడ్ మహమ్మారి తర్వాత, గత ఐదేళ్లలో జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రాకపోవడం, వ్యాయామాలు, యోగా లాంటివి చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వంటివి పెరిగాయి.
అలాగే, వీటికి సంబంధించిన చాలా లావాదేవీలు మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతాయి కాబట్టి, ఫోన్ వినియోగం పెరిగింది. నిరంతరం ఫోన్లను వాడడం వల్ల వాటిని టాయిలెట్‌కు తీసుకెళ్లే అలవాటు కూడా పెరిగింది.
ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం, మెడనొప్పి, వెన్నునొప్పి, కండరాల బలహీనత, నరాలు ఉబ్బడం, స్ట్రోక్ రావడం, కండరాలు, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఉబ్బరం, బరువు పెరిగిపోవడం, జీర్ణప్రక్రియ మందగించడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి.
ఈ సెడెంటరీ లైఫ్‌స్టైల్ (నిశ్చల జీవనశైలి) యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడితో పాటు అతిగా తినడం వంటి రుగ్మతలకు దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కదలకుండా ఒకేచోట కూర్చోవడం వల్ల ఏమవుతుంది?
సెడెంటరీ లైఫ్‌స్టైల్, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వంటివి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుకునే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీయొచ్చు. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఊబకాయం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, స్ట్రోక్, గుండెజబ్బులకు దారితీస్తుంది.
ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల వెన్ను కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి. ఈ నిశ్చల జీవనశైలి వెన్నునొప్పి, మెడనొప్పి, ఆస్టియోపోరోసిస్, వెరికోస్ వెయిన్స్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
టాయిలెట్‌కి ఫోన్ తీసుకెళ్లే అలవాటు మానేయడం ఎలా?
మేం ఇదే ప్రశ్నను ముంబయిలోని లీలావతి హాస్పిటల్‌లో జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర నికమ్‌ను అడిగాం.
ఆయన సమాధానమిస్తూ, ''టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన పెల్విక్ కండరాలు (నాభి నుంచి పిరుదుల వరకు) బలహీనపడతాయి. ఇది మూత్రం, మలాన్ని నియంత్రించడంలోనూ సమస్యకు దారితీస్తుంది. అందుకే టాయిలెట్‌లో 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. శరీరంలోని ఆ ప్రదేశంపై మరింత ఒత్తిడి పడొద్దు. దీన్ని నివారించేందుకు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి'' అన్నారు.
రెండు రోజులకు మించి కడుపునొప్పి, లేదా కడుపులో సమస్యగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిదని డాక్టర్ నికమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫోన్ ఫ్రీ జోన్'
డోంబివ్లిలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ షాహిద్ పర్వేజ్ మరికొన్ని విషయాలను ప్రస్తావించారు.
''పైల్స్ వంటి వ్యాధులకు ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తినడం మాత్రమే కాకుండా, టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, అక్కడే కూర్చుని ఫోన్ వాడడం వంటివి కూడా కారణమవుతాయి. యానస్ సమీప రక్తనాళాలపై అధిక ఒత్తిడి కారణంగా ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైల్స్ వల్ల రక్తం కారడం మొదలైతే, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే, మొబైల్ ఫోన్‌పై ఉండే క్రిములు మీ చేతులు, ముఖం ద్వారా శరీరంలోకి చేరి, ఇన్ఫెక్షన్లు ఉదరంలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది'' అని అన్నారు.
ఇంట్లో తప్పనిసరిగా ఫోన్ ఫ్రీ జోన్ ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ షాహిద్ పర్వేజ్ సూచిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఫోన్ వాడకూడదు. భోజనం చేసే ప్రదేశం, నిద్రపోయే ప్రదేశాలు కూడా ఈ ఫోన్ ఫ్రీ జోన్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే, టాయిలెట్‌లో ఫోన్ వాడకూడదనే నియమాన్ని పాటించాలని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














