శానిటరీ ప్యాడ్స్, ప్యాంట్స్, మెన్‌స్ట్రువల్ కప్స్: పీరియడ్స్ సమయంలో ఏవి వాడితే మంచిది, పర్యావరణానికి ఏవి అనుకూలం?

పీరియడ్స్, మహిళలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పీరియడ్స్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
    • రచయిత, అనా శాంటీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలో ప్రతి ఏటా దాదాపు 2000 కోట్ల రుతుక్రమం ఉత్పత్తులను వాడి పడేస్తున్నారు. అయితే, ప్రస్తుత మార్కెట్లో తిరిగి వాడుకునే అవకాశమున్న ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్యాడ్స్, ప్యాంట్స్ నుంచి మెన్‌స్ట్రువల్ కప్స్ వంటివి ఉన్నాయి.

ఈ కథనంలో, ప్రస్తుతం వినియోగిస్తున్న ఏ ఉత్పత్తులు పర్యావరణానికి సానుకూలం, మహిళల ఆరోగ్యానికి ఏవి సురక్షితమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొన్నేళ్ల కిందట, నా స్నేహితులతో కలిసి వీకెండ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు, ఫ్రెండ్స్‌లో ఒకరు పీరియడ్ ప్యాంట్స్ గురించి చెప్పారు.

ఒక్కసారి వాడి పడేసే ప్యాడ్స్‌ను పక్కనపెట్టి పర్యావరణానికి తనవంతు సాయం చేయాలని అప్పుడామె నిర్ణయించుకున్నారు.

నేను వాటి గురించి విన్నాను కానీ, ఎవరూ వీటిని వేసుకున్నట్లు నాకు తెలియదు. పీరియడ్స్ సమయంలో రుతుస్రావం వల్ల అయ్యే తడిని ఇవి ఆపుతాయా? అనేది కూడా నాకు తెలీదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉత్పత్తులను వాడమని నా స్నేహితులు నన్ను ఒప్పించారు. అప్పటి నుంచి నాకు మెన్‌స్ట్రువల్ ప్రోడక్ట్ (పీరియడ్స్‌లో సమయంలో వినియోగించే వస్తువు) అంటే, పీరియడ్ ప్యాంట్సే.

కానీ, ఇవాళ స్థానిక సూపర్‌మార్కెట్లలో పీరియడ్స్ ఉత్పత్తులు ఉండే ప్రదేశానికి వెళ్తే అక్కడ ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

చాలా రకాల ప్యాడ్స్, టాంపూన్స్ (ఆర్గానిక్, చాలా వరకు నాన్-ఆర్గానిక్), మెన్‌స్ట్రువల్ కప్స్, పీరియడ్ ప్యాంట్స్ కనిపిస్తున్నాయి.

అయినప్పటికీ, యూరప్‌లో ఒక సంవత్సరానికి, ఒక్కసారి వాడి పడేసే 49 బిలియన్ (4,900 కోట్లు) ఉత్పత్తులను వాడుతున్నారు.

అమెరికాలో 2,000 కోట్ల ఉత్పత్తులను బయట పడేస్తుండగా.. 2,40,000 టన్నుల వ్యర్థాలను ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వాడి పడేసే శానిటరీ ప్యాడ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో 90 శాతం ఇవే. ఈ ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోెంది.

మెన్‌స్ట్రువల్ కప్, మహిళల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెన్‌స్ట్రువల్ కప్

మెన్‌స్ట్రువల్ కప్ ఎందుకు ఉత్తమం?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 180 కోట్ల మందికి పీరియడ్స్ వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు రకాల పీరియడ్స్ సంబంధిత ఉత్పత్తులపై ఫ్రాన్స్, అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

  • వాడి పడేసే ప్యాడ్స్, టాంపూన్స్ (ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్)
  • తిరిగి వాడుకోదగిన ప్యాడ్స్
  • పీరియడ్ ప్యాంట్స్
  • మెన్‌స్ట్రువల్ కప్స్

ఎనిమిది రకాల పర్యావరణ ప్రభావాలను ఈ అధ్యయనం పరిశీలించింది. వాటిలో గ్లోబల్ వార్మింగ్, శిలాజ ఇంధనాల వినియోగం, భూమి, నీటి వినియోగం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం, పర్యావరణానికి కలిగే హాని, ఎసిడిటీ, గాలి కాలుష్యం ఉన్నాయి.

తయారీ నుంచి వాడి పడేసే వరకు.. ఈ ఉత్పత్తి ప్రభావమెంత అనేది తెలుసుకునేందుకు ఏడాది పాటు భారత్, ఫ్రాన్స్, అమెరికాల్లో ఈ అధ్యయనం చేపట్టారు.

పర్యావరణంపై చూపే ప్రభావపరంగా మెన్‌స్ట్రువల్ కప్ అనేది అత్యంత సుస్థిరమైన ఎంపికగా ఈ అధ్యయనంలో నిరూపితమైంది. ఆ తర్వాత పీరియడ్ ప్యాంట్స్, ఆ తర్వాత తిరిగి వాడుకునే ప్యాడ్స్, చివరికి ఒక్కసారి వాడి పడేసే ప్యాడ్స్, టాంపూన్స్ నిలిచాయి.

చిన్న, తేలికైన మెన్‌స్ట్రువల్ కప్‌ను సుమారు పదేళ్ల పాటు వాడుకోవచ్చు.

వాడి పడేసే ప్యాడ్స్, అవి ఆర్గానిక్ లేదా నాన్ ఆర్గానిక్ అయినా పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాయి.

గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం వీటిని తయారీ చేసే ప్రక్రియ. వీటిలో సగానికి పైగా ఉత్పత్తులను పాలిథిన్ (ప్లాస్టిక్ ఆధారిత పెట్రోలియం) ద్వారా తయారు చేస్తున్నారు.

ఆర్గానిక్ కాటన్ ప్యాడ్స్‌ ఐదు కేటగిరీల్లో కూడా పర్యావరణానికి అత్యంత హానికరంగా ఉన్నాయి.

పీరియడ్స్ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో ప్రతి ఏటా 2000 కోట్ల ఉత్పత్తులను వాడి పడేస్తూ ఉంటారు.

నిపుణులు ఏమంటున్నారు?

''ఇది ఎక్కువగా ముడిసరుకు, సేంద్రియ ఉత్పత్తులకు తయారీకి సంబంధించినది. పర్యావరణంపై ఇది పెద్దయెత్తున ప్రభావం చూపుతుంది'' అని ఈ అధ్యయనానికి సహ రచయితగా వ్యవహరించిన మైన్స్ పారిస్ – పీఎస్ఎల్ యూనివర్సిటీ రీసర్చర్ మెలానీ డజిచ్ చెప్పారు.

సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయంలో తక్కువ రాబడి వస్తుంది. ఆర్గానిక్, నాన్-ఆర్గానిక్ టాంపూన్స్ విషయంలో కూడా అంతే.

ప్రతి వస్తువు తయారీ చక్రంలోని వివిధ భాగాలు పర్యావరణంపై భిన్నమైన ప్రభావం చూపుతాయి.

''వాడి పడేసే వస్తువుల్లో ఉపయోగించే ముడిసరుకుల తయారీ, వాటి ఉత్పత్తి పర్యావరణంపై పెద్దయెత్తున ప్రభావం చూపుతుంది. వాటిలో ప్లాస్టిక్ ఉంటుంది. ఇవి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతాయి'' అని మెలానీ డజిచ్ అన్నారు.

తిరిగి వాడుకోెదగిన వస్తువులను శుభ్రం చేసేందుకు నీరు, విద్యుత్ అవసరం అవుతుంది. కానీ, తిరిగి వాడుకునే ప్యాడ్స్‌తో పోలిస్తే పీరియడ్ ప్యాంట్స్ మరింత మెరుగైనవి. ఎందుకంటే, ఒకవేళ అవి అందుబాటులో లేకపోయినా వేరే లోదుస్తులను వేసుకుని, వాటిని వాష్ చేసుకోవచ్చు.

''మెన్‌స్ట్రువల్ కప్స్ ఉత్తమమైన ఎంపిక అయినప్పటికీ, పీరియడ్ ప్యాంట్స్ కూడా పర్యావరణానికి మంచి ఎంపికనే. ఎందుకంటే, ఇవి పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి'' అని డజిచ్ చెప్పారు.

ఈ అధ్యయనంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని చేర్చలేదు. కానీ, ప్రతి ప్యాడ్‌లో కూడా రేపర్, వింగ్స్, గమ్ము ఉంటాయి. ఇవి పర్యావరణంలోకి 2 గ్రాముల నాన్-బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను విడుదల చేస్తాయి.

ఈ ప్లాస్టిక్ నాలుగు పాలిథిన్ బ్యాగ్‌లకు సమానం. ఇవి డీకంపోజ్ కావడానికి 500 నుంచి 800 ఏళ్లు పడుతుంది.

ఈ రిపోర్టుకు ముందు, 2021లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఒక పరిశోధనను నిర్వహించింది. దీనిలో, పర్యావరణంపై పీరియడ్స్ సంబంధిత ఉత్పత్తులు చూపించే ప్రభావాన్ని పోల్చిచూసింది.

మెన్‌స్ట్రువల్ కప్‌ను ఉత్తమ ఎంపికగా యూఎన్ఈపీ రిపోర్టు వర్ణించింది. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఇది చాలా మెరుగైందని తెలిపింది.

''మెన్‌స్ట్రువల్ కప్‌లలో కార్బన్ ఫుట్‌ప్రింట్ లేదని కాదు. కానీ, ఇది చిన్న, తేలికైన వస్తువు కావడంతో, ఇతర వస్తువులతో పోలిస్తే తక్కువ ప్రభావం చూపుతుంది'' అని కేప్‌ టౌన్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ టీజీహెచ్ థింక్ స్పేస్ డైరెక్టర్, అధ్యయన సహ రచయిత ఫిలిప్పా నోటెన్ చెప్పారు.

ఈ రెండు అధ్యయనాలు పర్యావరణంపై ప్రభావాన్ని మాత్రమే కాక, పలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఎత్తిచూపాయి.

మెన్‌స్ట్రువల్ కప్

ఫొటో సోర్స్, Getty Images

మెన్‌స్ట్రువల్ కప్‌ సరిగ్గా వాడడం చాలా ముఖ్యం

మెన్‌స్ట్రువల్ కప్ సరిగ్గా పెట్టుకోకపోయినా లేదా సరైన పరిమాణంలో లేకపోయినా అది తీవ్ర సమస్యలకు కారణం కావొచ్చు.

ఉదాహరణకు, ఒక మహిళ కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. కొందరు మహిళలు పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ (పెల్విక్ అవయవాలు వాటి సాధారణ స్థితి నుంచి యోనిలోకి జారిపోవడం) వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డారు.

12 నుంచి 19 ఏళ్ల మధ్యనున్న అమ్మాయిలకు మెన్‌స్ట్రువల్ కప్స్‌ సూచించేందుకు తాను కొంచెం ఆలోచిస్తుంటానని లండన్‌లోని పోర్ట్‌ల్యాండ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ షాజియా మాలిక్ చెప్పారు.

దీన్ని వాడే విషయంలో అమ్మాయిలకు పూర్తి అవగాహన లేకపోయినా, శుభ్రంగా ఉంచుకోలేకపోయినా వాడకుండా ఉండటం మంచిదని ఆమె భావిస్తున్నారు.

''గత ఎనిమిదేళ్లలో, మెన్‌స్ట్రువల్ కప్స్ వాడిన తర్వాత ఇన్‌ఫెక్షన్లు సోకిన మహిళలు, అమ్మాయిలతో పాటు చాలామంది పేషంట్లను చూసినట్లు'' షాజియా మాలిక్ చెప్పారు.

''ఒకవేళ మెన్‌స్ట్రువల్ కప్ సరిగ్గా పెట్టుకోకపోతే, బ్లాడర్‌ లేదా రెక్టమ్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆ సమయంలో మెన్‌స్ట్రువల్ కప్‌ సరిగ్గా రుతుస్రావంలోని రక్తాన్ని సేకరించదు'' అని అన్నారు.

ఎక్కువ కాలంపాటు ఒకే మెన్‌స్ట్రువల్ కప్ వాడితే ప్రమాదాలుంటాయని కూడా హెచ్చరించారు.

ప్రతి మహిళ వద్ద రెండు కప్‌లు ఉండాలి. వాటిని ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. వాడిన తర్వాత ప్రతిసారి చాలా శుభ్రంగా కడిగేయాలి. కప్‌ చిరిగిపోయినట్లు కనిపిస్తే, వెంటనే దాన్ని మార్చేయాలి.

''సరైన పరిమాణంలోని మెన్‌స్ట్రువల్ కప్‌ను ఎంపిక చేసుకోవడంపై అవగాహన ఉండాలి. పీరియడ్స్ సమయంలో అయ్యే బ్లీడింగ్ బట్టి మెన్‌స్ట్రువల్ కప్ పరిమాణం ఉండాలి. మెన్‌స్ట్రువల్ కప్ విషయంలో మహిళకు సరైన అవగాహన, సమాచారం ఉంటే, అది వారికి ఉత్తమ వస్తువు అవుతుంది '' అని మాలిక్ చెప్పారు.

పీరియడ్స్, మహిళలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్ యాక్ట్ ఎందుకంత ముఖ్యం?

మహిళల కోసం 'మెన్‌స్ట్రువల్ హెల్త్, డిగ్నిటీ, సస్టైనబుల్ యాక్ట్' తీసుకురావాలని బ్రిటన్‌లో మహిళల కోసం పనిచేసే ఒక లాభాపేక్ష లేని సంస్థ ఉమెన్స్ ఎన్విరాన్‌మెంటల్ నెట్‌వర్క్ (డబ్ల్యూఈఎన్) డిమాండ్ చేస్తోంది.

రుతుక్రమం సమయంలో ప్యాడ్స్, ప్యాంట్స్ వంటి ఉత్పత్తులను కొనలేక పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, పర్యావరణ కాలుష్యం, పీరియడ్ సంబంధిత వస్తువులో ఉన్న హానికరమైన రసాయనాలను అరికట్టడమే ఈ చట్టం లక్ష్యంగా ఉండాలని కోరుతున్నారు. స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతంలో అమలు చేసిన సరికొత్త విధానాన్ని మంచి ఉదాహరణగా డబ్ల్యూఈఎన్ చెబుతోంది.

మార్చి 2024 నుంచి కాటలోనియా ప్రాంతంలో మహిళలందరికీ ఉచితంగా, తిరిగి వాడుకునే పీరియడ్ సంబంధిత ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం.

పీరియడ్ ప్రొడక్టులు

ఫొటో సోర్స్, Getty Images

టాంపూన్స్‌లో 16 రకాల మెటల్స్‌ను వాడతారని ఒక అమెరికా అధ్యయనం వెల్లడించింది. ఈ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు పర్యావరణానికి, మహిళల ఆరోగ్యానికి హానికరమని పీరియడ్స్ సంబంధిత వస్తువుల పర్యావరణ ప్రభావంపై పనిచేసే డబ్ల్యూఈఎన్ క్యాంపెయిన్ మేనేజర్ హెలెన్ లిన్ అన్నారు.

సరికొత్త ఉత్పత్తులు త్వరగా మార్కెట్లోకి వస్తున్నాయని, అయితే, వాటికి సరైన నియమ - నిబంధనలను రూపొందించలేదని చెప్పారు.

''పారదర్శకత లోపించడం వల్ల, శరీరంలో అత్యంత సున్నితమైన ప్రదేశంలో వీటిని వాడుతున్నప్పటికీ, వాటిలో ఏ రసాయనాలను కలిపారో ప్రజలకు తెలియదు '' అని ఆవేదన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,డి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)