బీబీసీ వెతుక్కుంటూ వెళ్లిన 'అప్పారావు కుటుంబం ఆచూకీ దొరికింది'

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెట్టిచాకిరీ, కోనేరు అప్పారావు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, అప్పారావు రైల్వేస్టేషన్‌లో టీ తాగేందుకు దిగారు. తిరిగి రైలు ఎక్కలేకపోయారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

కోనేరు అప్పారావు కుటుంబం ఆచూకీ దొరికిందని పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

టీ తాగుదామని దిగినప్పుడు రైలు వెళ్లిపోవడంతో, అక్కడే 20 ఏళ్లు చిక్కుకుపోయిన అప్పారావు తమిళనాడులో వెట్టిచాకిరీలో మగ్గిపోవడం గురించి బీబీసీ కథనం ప్రచురించింది. ఆయన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఏపీ, ఒడిశా బోర్డర్‌లోని పలు గ్రామాలకు వెళ్లింది.

కలెక్టర్ మాట్లాడుతూ, ''ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్లుగా కుటుంబానికి దూరమయ్యారని, తమిళనాడుకి చెందిన అన్నాదురై అనే యజమాని వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్లు తమిళనాడు కార్మిక శాఖ అధికారులు గుర్తించారు'' అని కలెక్టర్ చెప్పారు.

అప్పారావు చెబుతున్న ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

అప్పారావు కుమార్తె దొంబుదొర సాయమ్మ, అల్లుడు దొంబుదొర చందు పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ, మునక్కాయ వలస గ్రామంలో నివసిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

అప్పారావుది ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, బంధుగావ్ బ్లాక్, పెదవల్లాడ పంచాయతీ పరిధిలోని చినవల్లాడ (జుబు) గ్రామమని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'మా అన్నయ్యే అంటూ ఒకరు ఫోన్ చేశారు'

అప్పారావు తమ్ముడినంటూ తమను ఒక వ్యక్తి సంప్రదించారని మార్చి 10న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చెప్పారు.

''బీబీసీలోని స్టోరీ చూసి కోనేరు అప్పారావు మా అన్నయ్యే అంటూ ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్‌లో సంప్రదించారు. అయితే, అతని పేరు కోనేరు అప్పారావు కాదని, కొండగొరి సుఖ అని, అతనిది కొరాపూట్ జిల్లాలోని జుబు అనే గ్రామమని చెప్పారు'' అని కలెక్టర్ తెలిపారు.

ప్రొసీజర్ పూర్తైన తర్వాత.. తమిళనాడులో ఉన్న కోనేరు అప్పారావు/కొండగొరి సుఖని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ బీబీసీతో చెప్పారు.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జమ్మిడి వలస
ఫొటో క్యాప్షన్, కోనేరు అప్పారావు గురించి బీబీసీ ప్రతినిధి శ్రీనివాస్ లక్కోజు జమ్మిడి వలసలో ఆరా తీశారు.

గతంలో ఏం జరిగింది?

దాదాపు 20 ఏళ్ల కిందట ఉత్తరాంధ్రలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పని కోసం పుదుచ్చేరికి రైలులో బయలుదేరారు కోనేరు అప్పారావు. అప్పుడు ఆయన వయసు సుమారు 40 ఏళ్లు.

ఆ రైలు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక స్టేషన్‌లో ఆగినప్పుడు, అప్పారావు టీ తాగుదామని దిగారు. తిరిగి ఎక్కేలోపు ఆ రైలు కదిలిపోయింది.

రైలు మిస్సయిన అప్పారావుకు సాయం చేస్తానని ముందుకొచ్చిన ఓ వ్యక్తి, ఆయనను తన మేకల మందకు కాపరిగా మార్చేశారు.

అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 ఏళ్లు అప్పారావును సొంత గ్రామానికి వెళ్లకుండా చేసి, మేకలను కాయిస్తూ వెట్టిచాకిరీ చేయించుకున్నారు.

తమిళనాడు కార్మిక శాఖ చేపట్టిన తనిఖీలతో కోనేరు అప్పారావు వెట్టిచాకిరీ నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయనకు 60 ఏళ్లు.

తెలుగు భాషను దాదాపు మర్చిపోయారు. తమిళం మాట్లాడగలుగుతున్నారు.

20 ఏళ్ల పాటు ఎక్కువ సమయం మేకలు కాయడంలోనే గడపడంతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు.

మూడుపూటలా తిండి పెట్టిన యజమాని జీతంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అప్పారావు బీబీసీతో చెప్పారు.

కోనేరు అప్పారావు ప్రస్తుతం తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈయన కుటుంబీకులు ఎవరో కనుక్కునేందుకు అటు తమిళనాడు, ఇటు ఆంధ్రపదేశ్ అధికారులు ప్రయత్నించారు.

తనది పార్వతీపురం సమీపంలోని జమ్మిడివలసని ఒకసారి, ఒడిశాలోని కొరపుట్ జిల్లా అలమండ మండలంలోని జమ్మడవలస అని మరోసారి, అదే మండలంలోని జంగిడివలసని ఇంకోసారి చెప్పారు.

ఆయన కుటుంబీకుల అచూకీ కోసం ప్రయత్నిస్తూ... బీబీసీ ముందుగా పార్వతీపురం జిల్లా జమ్మిడివలస గ్రామానికి వెళ్లింది.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జమ్మిడి వలస
ఫొటో క్యాప్షన్, కోనేరు అప్పారావు ఆచూకీ కనుక్కునేందుకు బీబీసీ ముందుగా పార్వతీపురం జిల్లా జమ్మిడివలస గ్రామానికి వెళ్లింది.

పార్వతీపురం జమ్మిడివలసలో

అప్పారావు కుటుంబం ఎక్కడుందో కనుక్కునేందుకు అటు తమిళనాడు, ఇటు ఆంధ్రపదేశ్ రాష్ట్రాల అధికారులు, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు, సోషల్ మీడియా...ఇలా అనేకమంది ప్రయత్నాలు చేశారు.

బీబీసీ ముందుగా పార్వతీపురం జిల్లా జమ్మిడివలస గ్రామానికి వెళ్లింది.

బీబీసీ: పెద్దోడా...ఈ ఫోటోలో ఉన్నాయన్ని గుర్తుపట్టావా?

స్థానికులు: లేదు, నేను ఎప్పుడూ చూడలేదు.

బీబీసీ: అతను తనది జమ్మిడివలసే అని చెప్తున్నాడు.

స్థానికులు: ఏమో మరైతే...మాకైతే తెలియదు.

బీబీసీ: మీ ఊరు వచ్చినట్లు అనిపిస్తుందా...

స్థానికులు: మా ఊర్లో ఈ మనిషిని చూడలేదు కానీ...ఇక్కడ నుంచి ఓ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో జమ్మడవలస అనే మరో గ్రామముంది. అక్కడ మనిషి కావొచ్చు.

బీబీసీ: ఈయనేమో...పార్వతీపురం జమ్మిడివలసే అంటున్నాడు...

స్థానికులు: కాదన్నయ్య...ఒడిశా సైడ్ ఒక జమ్మడవలస ఉంది. ఒడిశా ఆయనలా ఉన్నారీయన.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జమ్మిడి వలస
ఫొటో క్యాప్షన్, తమ గ్రామంలో కోనేరు అనే ఇంటిపేరు గలవారు లేరని కొరాపుట్ జిల్లాలోని జమ్మడవలస గ్రామస్థులు చెప్పారు.

ఒడిశా జమ్మడవలసకు

పార్వతీపురం జమ్మిడివలసకు కోనేరు అప్పారావుకు సంబంధం లేదని గ్రామస్థులు చెప్పడంతో...వారు చెప్పిన సమాచారంతో అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని అస్తవ్యస్తంగా ఉన్న మట్టి రోడ్లపై ప్రయాణిస్తూ కొరాపుట్ జిల్లాలోని జమ్మడవలసకు మేం చేరుకున్నాం.

బీబీసీ: ఈయన పేరు కోనేరు అప్పారావు...ఈ ఊరే...జమ్మడవలసే.

స్థానికులు: మేం తాడినోళ్లం, నాసికోళ్లం, బీడికోళ్లం...ఇంతే ఉన్నాం...కోనేరోళ్లు లేరు. జమ్మడ వలస కాకుండా జంగిడి వలసేమో !

బీబీసీ: జంగిడివలస ఎక్కడుంది?

స్థానికులు: అటుకాసీ...చాలా దూరం.

జంగిడివలసకూ వెళ్లాం, కానీ..

అక్కడ నుంచి మరో 18 కిలోమీటర్లు ప్రయాణించి జంగిడివలస చేరుకున్నాం. అక్కడ కూడా కోనేరు అప్పారావుని ఎవరూ గుర్తుపట్టలేదు, తమకు తెలుసునని ఎవరూ అనలేదు.

ముందుగా చెప్పుకున్నట్లు, అనుకోని పరిస్థితుల్లో అప్పారావు తమిళనాడులో 20 ఏళ్లుగా మేకలను కాస్తూ జీవితం గడిపారు. క్రమంగా తన మాతృభాషని మర్చిపోయారు. పుట్టిన ప్రదేశం, సొంత మనుషుల వివరాలు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు.

20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్న అప్పారావు తమిళనాడుకి చెందిన అన్నాదురై వద్ద పని చేశారు. జీతంగా అప్పారావుకి ఎప్పుడూ నగదు ఇవ్వలేదు. జీతభత్యాలు ఇవ్వకుండా అప్పారావుతో వెట్టిచాకిరి చేయించుకున్న యజమాని అన్నాదురైని పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జిమ్మడి వలస
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం కోనేరు అప్పారావు తమిళనాడులోని ఒక పునరావాస కేంద్రంలో ఉన్నారు.

వెట్టిచాకిరీ నుంచి ఎలా బయటపడ్డారంటే..

శివగంగ జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారుల సాధారణ తనిఖీల్లో భాగంగా కదంబంకుళం వెళ్లినప్పుడు అప్పారావు గొర్రెలు మేపుతూ కనిపించారు.

అప్పారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, తన గ్రామానికి వెళ్లకుండా 20 ఏళ్లకు పైగా ఆయన అక్కడే మేకలను మేపుతున్నారని అధికారులు తెలుసుకున్నారు.

అప్పారావు పరిస్థితి అర్థం చేసుకున్న కార్మిక సంక్షేమ శాఖ ఆయన్ని అక్కడ నుంచి విడిపించి...ఒక ఓల్డేజ్ హోం సంరక్షణలో ఉంచింది.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జమ్మిడి వలస

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, తమిళనాడులో తనతో చాకిరీ చేయించుకున్న యజమాని డబ్బులు ఇవ్వలేదని అప్పారావు చెప్పారు.

'20 ఏళ్లలో డబ్బులు కంటితో చూడలేదు'

సొంత ఊరికి వెళ్లాలంటే డబ్బులు తన యజమాని ఇచ్చేవారు కాదని అప్పారావు బీబీసీతో చెప్పారు.

మూడుపూటలా తిండి, బట్టలు ఇచ్చేవారు కానీ...డబ్బులు ఇవ్వలేదని అన్నారు.

తనకి ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో తెలియదు, చెప్పేవారు కూడా లేకపోవడంతో అలాగే కాలం గడిపేశానని తెలిపారు.

"ఏదీ అడిగినా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అలాగే తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయినట్లుగా అనిపిస్తోంది. తమిళంలో మాట్లాడటం అవసరం కాబట్టి అది నేర్చుకుని తెలుగు మర్చిపోయినట్లున్నారు." అని గిరిజన సంఘం నాయకులు పీఎస్ అజయ్ కుమార్ బీబీసీతో అన్నారు. అజయ్ కుమార్, విజయవాడలోని ఒక ఎన్జీవోతో కలిసి కోనేరు అప్పారావు కుటుంబీకుల అచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

తనకి రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఉందని, అది అలమండలో ఉందని కోనేరు అప్పారావు చెప్పారు. అయితే, కోనేరు అప్పారావు చెబుతున్న అలమండ ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఉంది.

అలాగే, తాను ఏ అవసరానికైనా పెద్ద టౌన్ పార్వతీపురానికే వెళ్లేవాడినని చెప్తున్నారు. ఇది ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. కోనేరు అప్పారావు చెబుతున్న ఊర్లు, గ్రామాలు, టౌన్ పేర్లు అన్నీ కూడా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులకు చెందినవే. ఆయన చెప్పిన గుర్తులతో ఆ గ్రామాలకు వెళ్తే ఎవరు కూడా ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నారు.

కోనేరు అప్పారావు చెబుతున్న ప్రాంతాల నుంచి దూరంగా తమిళనాడులో 20 ఏళ్లుగా ఉండిపోయారు. ఈ 20 ఏళ్లలో ఆంధ్ర, ఒడిశా గిరిజన గ్రామాల్లో చాలా మౌలికమైన మార్పులు వచ్చాయి. పైగా అప్పారావు చెప్తున్న గ్రామాలలో ఈయన్ని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు.

ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, తెలిసిన వారి అచూకీ కోసం స్థానికంగా ఉన్న గిరిజనులు కూడా ప్రయత్నిస్తామన్నారు. దాంతో కోనేరు అప్పారావు ఫోటోలు కొన్నింటిని బీబీసీ వారికి ఇచ్చింది.

తమిళనాడు, కోనేరు అప్పారావు, జమ్మిడి వలస
ఫొటో క్యాప్షన్, అప్పారావు కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చెప్పారు.

ఈ విషయంపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ గతంలో బీబీసీతో మాట్లాడుతూ, ‘‘అతనిని గుర్తు పట్టేవారి కోసం మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, మా ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. ఆయన గిరిజనుడో కాదో కూడా తెలియడం లేదు. కోనేరు అప్పారావు చెప్పిన వివరాలు ప్రకారం ఆయన్ని బంధువులు, స్వస్థలం కనుగొనే ప్రయత్నం కొనసాగిస్తాం" అని చెప్పారు.

అయితే, ఆయన మా అన్నయ్యేనంటూ కృష్ణ అనే వ్యక్తి ఫోన్ ద్వారా సంప్రదించారని మార్చి 10న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ దొరికిందని, మార్చి 11న కలెక్టర్ ధ్రువీకరించారు. అప్పారావు కూతురు, అల్లుడు పార్వతీపురం సమీపంలోని గ్రామంలోనే నివసిస్తున్నారని కలెక్టర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)