హైపర్‌లూప్ టెక్నాలజీ: అరగంటలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణం, ఎలా సాధ్యమంటే..?

ఫొటో సోర్స్, Virginhyperloop
ఆరేడు గంటలు పట్టే ప్రయాణం అరగంటలోనే పూర్తయిపోతే... విజయవాడ నుంచి హైదరాబాద్ ఓ అరగంటలో చేరిపోతే.. చెన్నై నుంచి బెంగళూరులోనూ ముప్పైనిమిషాల్లో వాలిపోతే..ఇలాంటివి ఊహించగలమా? కానీ హైపర్ లూప్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడల్లా ఇలాంటి ఉదాహరణలు వినిపిస్తుంటాయి.
హైపర్‌లూప్ అంటే రైలు ప్రయాణం కంటే కొద్దిగా ఖర్చుతో కూడుకుని, భూమిపైనే ప్రయాణించే వ్యవస్థ. అయితే ఇది విమాన ప్రయాణం కంటే కూడా వేగంగా ఉంటుంది. (గంటకు సుమారు 1000 కిలోమీటర్ల వేగం)
ఎలాన్ మస్క్ 2013లోఈ హైపర్ లూప్ అనే టెక్నాలజీని ప్రతిపాదించారు. దీని గురించి 'హైపర్ లూప్ ఆల్ఫా' పేరుతో 58 పేజీలతో ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించారు.
మస్క్ ప్రతిపాదించిన హైపర్ లూప్ ప్రాజెక్ట్ లాస్ ఏంజిల్స్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో (563 కిలోమీటర్లు) దూరాన్ని కేవలం 35 నిమిషాల్లో పూర్తి చేస్తుందని, ఈ ప్రాజెక్టుకు 6 బిలియన్ అమెరికన్ డాలర్లు ( 52,266 కోట్లు) ఖర్చవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న రైలు, రోడ్డు, జల, వాయు రవాణా వ్యవస్థల కంటే ఈ హైపర్ లూప్ ప్రజలను, వస్తువులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయగలదని మస్క్ పరిశోధన తెలిపింది.
మస్క్ ఈ టెక్నాలజీని ఓపెన్ సోర్స్ టెక్నాలజీగా అభివర్ణించాడు. కానీ ఇందులోని సవాళ్ల కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ సాంకేతికతపై ఆసక్తిని ప్రదర్శించాయి.


ఫొటో సోర్స్, Boringcompany
హైపర్ లూప్ అంటే ?
భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో ఐఐటీ మద్రాస్ 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఏర్పాటు చేసింది. చెంగల్పట్టు జిల్లా తైయూర్‌లోని ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్‌లో ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు.
ఈ ట్రాక్ పూర్తిగా ఉక్కుగొట్టాల నెట్‌వర్క్‌తో ఉంటుంది. ఇందులో రైలు బోగీల మాదిరిగా పాడ్స్ ఉంటాయి. ఇవి అల్పపీడన ఉక్కుగొట్టాల వాతావరణంలో వేగంగా ప్రయాణిస్తాయి.
"హైపర్ లూప్ అనేది ఒక ఆధునిక రవాణా వ్యవస్థ, ఇక్కడ హై-స్పీడ్ పాడ్లు తక్కువ పీడన గొట్టాల ద్వారా గాలి ఘర్షణ లేకుండా ప్రయాణిస్తాయి. అంటే వాక్యూమ్ టన్నెల్‌లో, విమాన వేగంతో కదులుతున్న రైలు లాంటిది" అని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, హైపర్ లూప్ టీమ్ సలహాదారు సత్య చక్రవర్తి చెప్పారు.
‘‘చక్రాలకు బదులు మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) అనే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పాడ్స్ తేలుతూ ప్రయాణిస్తాయి. అవి విద్యుత్తుతో నడుస్తాయి. దీనివల్ల హైపర్ లూప్ అధిక వేగంతో, తక్కువ శక్తితో, తక్కువ ఘర్షణతో పనిచేస్తుంది" అని సత్య చక్రవర్తి చెప్పారు.
మాగ్నెటిక్ లెవిటేషన్, అంటే అయస్కాంత శక్తితో పాడ్‌లను ట్రాక్ పై కొద్దిగా పైకి తేలేలా చేసి, ఆపై వాటిని అధిక వేగంతో నడిపించే మాగ్లెవ్ టెక్నాలజీ ఇప్పటికే ఉపయోగంలో ఉంది.
ఉదాహరణకు, ప్రపంచంలోని 'హైస్పీడ్ రైలు సేవల్లో' ఒకటైన చైనాకు చెందిన 'షాంఘై మాగ్లెవ్' రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే హైపర్ లూప్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెప్పారు.
మాగ్లెవ్ రైళ్లలో ఒకేసారి వందలాది మంది ప్రయాణించవచ్చని, హైపర్ లూప్ టెక్నాలజీలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి ప్రజారవాణాకు అందుబాటులోకి తెస్తే కచ్చితంగా ఎక్కువ మంది ప్రయాణించగలుగుతారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, IIT-Madras
ఎలాంటి సవాళ్లున్నాయి?
సుదూర ప్రాంతాలకు సీల్డ్ చేసిన 'వాక్యూమ్ ట్యూబ్ సిస్టమ్'ను సృష్టించడం లేదా దాని కోసం ప్రత్యేక మాగ్లెవ్ మార్గాలను ఏర్పాటు చేయడం ఆర్థికంగా సవాలుతో కూడుకున్నది.
‘‘హైపర్ లూప్‌కు అనువైన భూమిని పట్టణ వ్యవస్థలు, ప్రకృతికి భంగం కలగకుండా సేకరించడం అంత తేలిక కాదు. ప్రస్తుతం ఉన్న హైవేలు, రైల్వే లైన్లకు దగ్గరగా హైపర్ లూప్ మార్గాలను నిర్మించడమే దీనికి పరిష్కారం" అని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెప్పారు.
హైపర్‌లూప్ అమిత వేగం, ప్రయాణికుల భద్రతపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి నియమనిబంధనలు రూపొందించలేదు.
''హైపర్ లూప్ టెక్నాలజీ మనకే కాదు ప్రపంచానికి కొత్త. ఇది ఇప్పటి వరకు ఎక్కడా అమలుకు నోచుకోలేదు. అది భారత్ కు రావడానికి సిద్ధమైనప్పుడు, ప్రభుత్వం దాని కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తుంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు
హైపర్ లూప్ అనేది గాలి చొరబడని, సీల్డ్ ట్యూబ్‌ల ద్వారా అధిక వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థ కాబట్టి, అత్యవసర సమయంలో ప్రయాణికుల భద్రతపై సందేహాలు తలెత్తడం సహజం.
పాడ్స్, అధిక వేగంతో కదిలినా, ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే వాటి వేగం క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఢీకొనే అవకాశాలు లేవు. ప్రయాణికుల భద్రత కోసం ట్యూబ్ లోపల ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
"అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలతో, సమస్యలు ప్రమాదకరంగా మారకముందే వాటిని గుర్తించి పరిష్కరించవచ్చు" అని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి చెప్పారు.
ఇది సీల్డ్ ట్యూబ్ ల ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి, హైపర్ లూప్ రవాణా కూడా భారీ వర్షాలు వరదల వల్ల ప్రభావితమయ్యే అవకాశం తక్కువ అని ఆయన చెప్పారు.
ఇక్కడ గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని కొన్ని సెకన్లలో చేరుకోలేం. లోపల ఉన్న ప్రయాణికుల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని, ఆ వేగాన్ని క్రమంగా చేరుకుంటారు. అదేవిధంగా, ఆపేటప్పుడు, వేగం నిర్దిష్ట పద్ధతిలో తగ్గుతుంది. ఈ విధంగా, లోపల ఉన్న ప్రయాణికులు వేగం ప్రకంపనలను అనుభూతి చెందలేరు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆలోచన పాతదే
ఎలాన్ మస్క్ మొదట హైపర్ లూప్ అనే సాంకేతికతను ప్రతిపాదించినప్పటికీ, ప్రజలు ట్యూబ్ ద్వారా ప్రయాణించే ఆలోచన చాలా పాతది.
1829 లో చిత్రకారుడు విలియం హీత్ వేసిన ఒక పెయింటింగ్‌లో బెంగాల్ (భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు) నుంచి లండన్‌కు హైపర్‌లూప్ లాంటి వ్యవస్థలో ప్రజలు ప్రయాణిస్తున్నట్టు చిత్రీకరించారు. అయితే ఇది భవిష్యత్తులో ఇలాంటి రవాణా వ్యవస్థలు ఉండొచ్చనే ఆలోచనను వ్యంగ్యంగా, ఊహాశక్తిని ఆధారం చేసుకున్న పెయింటింగ్ ఇది.
2013లో ప్రచురితమైన ఎలాన్ మస్క్ 'హైపర్ లూప్ ఆల్ఫా' పేపర్ ఆధారంగా ఆయన కంపెనీ 'ది బోరింగ్ కంపెనీ' హైపర్ లూప్ ప్రయోగంలో నిమగ్నమైంది.
ఇందుకోసం 2016లో కాలిఫోర్నియాలో 1287 మీటర్ల టెస్ట్ ట్రాక్ ను రూపొందించింది. కొన్ని పరీక్షల్లో హైపర్ లూప్ పాడ్స్ గంటకు 463 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని కంపెనీ వెబ్ సైట్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ఎప్పుడు ?
హైపర్ లూప్ వన్ అనే సంస్థ 2020లో తన ఇద్దరు ఉద్యోగులను ప్రయాణికులుగా తీసుకుని ప్రపంచంలోనే తొలి హైపర్ లూప్ పరీక్ష నిర్వహించింది. అమెరికాలోని నెవాడా ఎడారిలో ప్రత్యేకంగా నిర్మించిన 500 మీటర్ల పొడవైన ట్రాక్ పై ఈ పరీక్ష నిర్వహించారు.
ఆ పరీక్షలో, హైపర్ లూప్ వన్ పాడ్ గరిష్టంగా గంటకు 172 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. అయితే, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైళ్ల కంటే హైపర్ లూప్ రవాణా 10 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
2022 లో హైపర్ లూప్ ద్వారా వస్తువులను రవాణా చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తామని, ప్రయాణికులపై కాదని కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత 2023 డిసెంబర్లో 'హైపర్ లూప్ వన్' కంపెనీని వివిధ కారణాలతో మూసివేశారు.
హైపర్ లూప్ రవాణాను అమలు చేయడంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, ఐఐటి మద్రాస్ కు చెందిన బృందం, భారతీయ రైల్వే సహకారంతో దీనిని సాధిస్తే, దీనికి ప్రపంచ గుర్తింపు లభిస్తుందనడంలో సందేహం లేదు.
అయితే, అది అంత సులభం కాదని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి కూడా అంగీకరిస్తున్నారు.
'మేం ఇంకా పరీక్షల దశలోనే ఉన్నాం. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే 10-15 ఏళ్లలో భారత్ కు తొలి హైపర్ లూప్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














