రష్యా-యుక్రెయిన్ వార్: పుతిన్ అనుకున్నదే జరుగుతోందా?

ట్రంప్, పుతిన్, జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచ రాజకీయాల్లో గతవారం బిజీబిజీగా గడిచింది. డోనల్డ్ ట్రంప్, వోలోదిమిర్ జెలియెన్ స్కీ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు యూరప్ వెళ్లారు. అక్కడి నాయకులు కూడా వారి రక్షణను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో, రష్యన్ బాంబులు యుక్రెయిన్‌పై పడ్డాయి.

అయితే, ఈ వారంలో సౌదీ అరేబియాలో అమెరికా, యుక్రెయిన్ దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.

మరి, ఈ చర్చలకు ముందు ప్రధాన దేశాలలో ఏం జరుగుతోంది? ఆ దేశాల నేతలు ఏం ఆలోచిస్తున్నారు?

ఐదుగురు బీబీసీ రిపోర్టర్లు గత వారం ఘటనలను పరిశీలించి తమ ఆలోచనలను పంచుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా: మాస్కోపై విమర్శలు

టామ్ బాటెమాన్, స్టేట్ డిపార్ట్‌మెంట్ కరస్పాండెంట్, వాషింగ్టన్ డీసీ

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యుక్రెయిన్‌కు సైనిక, నిఘా సహాయం పంపడం ఆపాలని సోమవారం నాడు నిర్ణయించుకున్నారు. దీర్ఘకాలంలో యుక్రెయిన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ నిర్ణయం ప్రభావితం చేయనుంది.

అదే సమయంలో ఇది రష్యాకు డోనల్డ్ ట్రంప్ మద్దతుగా ఉన్నట్లు నిరూపిస్తోందని ఆయన ప్రత్యర్థులైన డెమొక్రటిక్ నేతలు వాదిస్తున్నారు. అయితే, ఖనిజాలపై ఒప్పందానికి, త్వరిత గతిన కాల్పుల విరమణను అంగీకరించడానికి జెలియెన్ స్కీపై ఒత్తిడి తీసుకురావడానికే ఈ నిర్ణయమని అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు కోరుకున్నది చేయడం ఇప్పుడు యుక్రెయిన్ బాధ్యత అని ట్రంప్ రాయబారి జనరల్ కీత్ కెల్లాగ్ అన్నారు.

అయితే ట్రంప్ విదేశాంగ విధాన బృందంలోని కొందరు రాజీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈవారం సౌదీ అరేబియాలో యుక్రెయిన్ అధికారులతో సమావేశమవుతున్నారు.

శుక్రవారం నాడు మాస్కోపై ట్రంప్ విమర్శలు చేశారు. రష్యాపై ఇప్పటికే భారీగా ఆంక్షలున్నప్పటికీ, మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. యుక్రెయిన్‌పై రష్యా నుంచి పెరుగుతున్న దాడులను ఆపడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు.

ఇదే అమెరికా దాని మిత్రుడిగా భావిస్తున్న దేశాన్ని తరుచుగా విమర్శిస్తూ, నిజమైన శత్రువైన రష్యాపై వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.

యూరోపియన్ శాంతి పరిరక్షక దళాలను యుక్రెయిన్‌కు పంపకూడదని ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ సూచించారు. ఇది, పశ్చిమ దేశాల శత్రు లక్ష్యం అని ఆయన అభివర్ణించారు. "రాజీకి అవకాశం లేదు" అని అన్నారు.

కాగా, లావ్‌రోవ్ ప్రకటన గురించి యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్‌ను గురువారం అడిగాను.

అయితే, లావ్‌రోవ్ ప్రకటనపై వ్యాఖ్యానించకూడదని బ్రూస్ నిర్ణయించుకున్నారు. విదేశీ నాయకుల వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం తన పని కాదన్నారు.

అయితే, జెలియెన్ స్కీ 'శాంతికి సిద్ధంగా లేరు' అని ట్రంప్ తరచూ చెప్పే మాటలను ఆమె గతంలో పునరావృతం చేశారు.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా: పాశ్చాత్య దేశాల చీలికపై సంతోషం

విటాలి షెవ్‌చెంకో, బీబీసీ మానిటరింగ్ రష్యా ఎడిటర్

రష్యాపై ఆంక్షలు విధిస్తామని చెప్పేవరకు, యుక్రెయిన్ పైనే ఒత్తిడి అంతా ఉన్నట్లు అనిపించింది. వెనక్కి తగ్గడానికి రష్యాకు పెద్దగా కారణం కూడా లేదు.

అమెరికా సైనిక సహాయం, నిఘా సేవలను నిలిపివేయడమనేది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బలలో ఒకటి. ఇది రష్యాకు పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చింది.

ఆ తర్వాత యుక్రెయిన్‌లో ఘోరమైన దాడులు జరిగాయి. యుద్ధంలో రష్యా తన వ్యూహాన్ని కొనసాగిస్తున్నట్లుగానే ఈ దాడులు సూచిస్తున్నాయి.

రష్యా ఇప్పటికీ తన "ప్రత్యేక సైనిక చర్య" అసలు లక్ష్యాలను సాధించాలని పట్టుబడుతోంది, ఇందులో యుక్రెయిన్ భూభాగాన్ని మరింతగా స్వాధీనం చేసుకోవడం కూడా ఉంది.

కాల్పుల విరమణకు పిలుపునివ్వడం లేదా శాంతి పరిరక్షక దళాలను పంపడం వంటి యుక్రెయిన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలను కూడా రష్యా తిరస్కరించింది.

ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఇకపై "మా వైపు" ఉండకపోవచ్చు అని గత వారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేసిన ప్రకటన, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రయోజనం చేకూర్చే అంశం.

పాశ్చాత్య కూటమిలో బీటలు కనిపించడాన్ని పుతిన్ ఆనందిస్తున్నారు, ఈ పరిస్థితి కోసం ఆయన సంవత్సరాలుగా ప్రయత్నించారు. ఆయన యుద్ధభూమిలో పోరాడితే ఇది జరగలేదు, యుక్రెయిన్ అతిపెద్ద మిత్రదేశమైన అమెరికా ఆశ్చర్యకరమైన యూటర్న్ తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ మంగళవారం యుక్రెయిన్, యుఎస్ ప్రతినిధులు సౌదీ అరేబియాలో చర్చల కోసం సమావేశమవుతున్నారు. దీనిని రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. అయితే, నమ్మకంగానూ ఉంది.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ

యుక్రెయిన్: చర్చలకు సిద్ధమవుతున్న జెలియెన్ స్కీ

మిరోస్లావా పెట్సా, బీబీసీ యుక్రెయిన్, డేనియల్ విట్టెన్‌బర్గ్, బీబీసీ వరల్డ్ సర్వీస్

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీకి గతవారం కఠినమైన, భావోద్వేగంతో కూడినది.

పాశ్చాత్య సైనిక మద్దతును కొనసాగించడానికి కృషి చేస్తూనే శాంతి పట్ల తన నిబద్ధతను నొక్కి చెప్పారు.

ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో ఘర్షణ తర్వాత అమెరికా సైనిక సహాయం, నిఘా భాగస్వామ్యాన్ని కోల్పాయారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది.

ద్రోహం కనిపిస్తోందని యుక్రెయిన్ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. "అధ్యక్షుడు, ఆయన బృందంతో సహా మొత్తం దేశం దానిని అనుభవిస్తుంది" అని అభిప్రాయపడ్డారు.

"స్పష్టమైన బహిరంగ క్షమాపణ" చెప్పాలనే ట్రంప్ డిమాండ్‌ను జెలియెన్ స్కీ తిరస్కరించారు. బదులుగా అమెరికా అధ్యక్షుడికి ఒక లేఖ రాశారు, వైట్‌హౌస్ ఘర్షణ "విచారకరం" అని తెలిపారు.

తర్వాత యూరోపియన్ మద్దతును పెంచుకోవడానికి జెలియెన్ స్కీ బ్రస్సెల్స్‌కు వెళ్లారు . అక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడికి బహిరంగ సంఘీభావం దక్కినప్పటికీ, ఆశించిన బలమైన సైనిక నిబద్ధతను పొందలేకపోయారు.

అయితే, సముద్రం, గగనతలంలో తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వాలని యురోపియన్ నాయకులను కోరారు జెలియెన్ స్కీ. దీనికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మద్దతుగా ఉన్నారు.

యుక్రెయిన్, యుఎస్ ప్రతినిధులు ఈవారం సౌదీ అరేబియాలో సమావేశమవుతారు. కానీ, శాంతికి ఎలా చేరుకుంటారనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.

ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ జెలియెన్ స్కీ బలంగా నిలబడ్డారని ఆయనకు దగ్గరిగా ఉన్న ఒక వ్యక్తి అన్నారు.

మూడేళ్ల కిందట ఆయనను చంపేస్తారని తెలిసినా, కీయెవ్‌లోనే ఉండాలనుకున్నారని, జెలియెన్ స్కీ ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారో అంత కఠినంగా మారుతారని అన్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్

యూరప్: ఫ్రాన్స్ అణ్వస్త్ర సాయాన్ని విస్తరించగలదా?

పాల్ కిర్బీ, యూరప్ డిజిటల్ ఎడిటర్

ఇటీవల చాలా యూరోపియన్ సమావేశాలు జరిగాయి, మరిన్ని జరగబోతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి తాము ఆధారపడిన భద్రతకు ఇకపై హామీ ఉండకపోవచ్చని యూరోపియన్ నాయకులు గ్రహించారు. కొత్త ప్రతిపాదనలూ వస్తున్నాయి.

యుక్రెయిన్‌కు యూరప్ మద్దతు ఇవ్వాలనే సాధారణ ఒప్పందం ఉంది. శాంతి ఒప్పందం కుదిరితే ఫ్రాన్స్, యూకే వాటి దళాలను పంపడానికి సుముఖంగా ఉన్నాయి.

మేక్రాన్ మంగళవారం ఆర్మీ చీఫ్‌లతో సమావేశమై ప్రణాళికను చర్చించనున్నారు. కానీ, రష్యాకు ఈ ఆలోచన నచ్చలేదు.

అమెరికా ఇకపై సహాయం చేయలేకపోతే యూరప్ తనను తాను ఎలా రక్షించుకుంటుందనే దానిపై ఇప్పుడు పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ దీనిని "స్పష్టమైన, ప్రస్తుత ప్రమాదం" అని అభివర్ణించారు.

ఒకవేళ అమెరికా సాయం చేయకపోతే "మనం సిద్ధంగా ఉండాలి" అని మేక్రాన్ పిలుపునిచ్చారు. ఈయూ ఇప్పుడు తన రక్షణను బలోపేతం చేయడానికి బిలియన్ యూరోల ప్రణాళికను పరిశీలిస్తోంది.

ఫ్రాన్స్, యూకే తమ అణు నిరోధక శక్తిని యూరప్ అంతటా విస్తరించవచ్చని త్వరలో జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టబోయే ఫ్రెడరిక్ మెర్జ్ సూచించారు.

మేక్రాన్ ఈ ఆలోచనకు సానుకూలంగా ఉన్నారు, కానీ ఫ్రాన్స్ అణు రక్షణకు పరిమితులు ఉంటాయి, తుది నిర్ణయాలు పారిస్‌లోనే జరుగుతాయి.

ఇంతకీ, అమెరికా లేకుండా యూరోపియన్ దేశాలు వాటికవే వనరులను పంచుకోగలవా, ఒకదానిపై ఒకటి ఆధారపడగలవా?

లిథువేనియా వంటి చిన్న దేశాలకు, వేరే మార్గం లేదు. చర్చ అయితే ప్రారంభమైంది.

పోలాండ్‌కు చెందిన డోనల్డ్ టస్క్ "మనకు సొంత అణ్వాయుధ ఆయుధశాల ఉంటే" అది రక్షణగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)