ట్రంప్ పుతిన్‌లా ఆలోచిస్తున్నారా, ఈ ప్రపంచం మారిపోతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్రిగర్ అటానేసియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడేళ్ల కిందట యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలయినప్పుడు...అమెరికా, ఇతర యూరప్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆంక్షలతో రష్యాను కట్టడి చేసే ప్రయత్నం చేశాయి.
రష్యా తీరును అంతర్జాతీయ వేదికలపై అమెరికా పదే పదే ఎండగట్టింది. ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నం చేసింది. ప్రచ్ఛన్నయుద్ధం మొదలయినప్పటినుంచీ అమెరికా, రష్యా వైరిపక్షాలుగానే ఉన్నప్పటికీ...యుక్రెయిన్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం జరిగింది.
కానీ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. యుక్రెయిన్, రష్యా వ్యవహారాలను ఆయన చూస్తున్న విధానం సరికొత్త చర్చలకు కారణమవుతోంది.
ఈ పరిణామాలు చూశాక, రెండో ప్రపంచయుద్ధ కాలంలోలా అమెరికా, రష్యా మిత్రదేశాలకూటమిలా మారిపోయాయా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
ప్రచ్ఛన్నయుద్ధ కాలం మొదలయిన తర్వాత అమెరికా, రష్యా మధ్య ఈ స్థాయిలో సయోధ్య ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ప్రపంచ క్రమంపై రాజకీయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
రష్యాతో అమెరికా సంబంధాలకు కొత్త నిర్వచనమిస్తున్నట్లు కనిపిస్తున్న ట్రంప్, రష్యాను ఆక్రమణదారని, యుక్రెయిన్‌ను యుద్ధ బాధిత దేశమని పేర్కొనేందుకు నిరాకరిస్తున్నారు.
గత శుక్రవారం (ఫిబ్రవరి 28) డోనల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యుక్రెయిన్ యుద్ధం గురించి, దాన్ని ఎలా ముగించాలనే దాని గురించి బహిరంగ చర్చ జరిగింది.
ట్రంప్, జెలియెన్‌స్కీ మధ్య వాడీవేడీ చర్చ తర్వాత 'ఉదారవాద ప్రపంచ క్రమం' (లిబరల్ వరల్డ్ ఆర్డర్) మారుతోందని కొందరు భావిస్తున్నారు. ఇంత పెద్ద మార్పు జరిగిందనుకోవడం సరైనదేనా?


ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
ఉదారవాద నాయకత్వ కాలం
ఉదారవాద ప్రపంచ క్రమం అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన వ్యవస్థ. అనేక నిబంధనలు, పరిస్థితులు, హామీల ఆధారంగా ఇది ఏర్పడింది. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి దీనికి కీలకం.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో), అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య విలువలకు కూడా ఉదారవాద ప్రపంచ క్రమం ప్రాతినిధ్యం వహిస్తుంది.
పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానానికి ప్రతీకగా ఉంటుందన్నది సాధారణమైన నమ్మకం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో, అంతర్జాతీయ న్యాయస్థానంలో తీర్మానాల ద్వారా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన గురించి అధికారికంగా ప్రస్తావిస్తారు.
అలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు. మరింత తీవ్రమైన సందర్భాల్లో మిలటరీ చర్యకు ఆదేశాలివ్వొచ్చు.
అయితే ఆంక్షలు, మిలిటరీ జోక్యాలు తరచుగా ఐక్యరాజ్య సమితి ఆమోదం లేకుండా జరుగుతున్నాయి. చాలా కాలంగా రష్యా దీనిపై విమర్శలు చేస్తోంది.
''ఐక్యరాజ్య సమితి ఆమోదం ఉంటేనే బలగాలు ప్రయోగించడాన్ని చట్టబద్దమైనదిగా పరిగణించాలి. ఐక్యరాజ్య సమితికి ఇచ్చినంత ప్రాముఖ్యత నాటో, యూరోపియన్ యూనియన్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని 2007లో మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐరాస ఆమోదం లేకుండా..
యుక్రెయిన్‌ను ఆక్రమించడం ద్వారా చాలా దేశాల దృష్టిలో రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రపంచ వ్యవహారాల తీరును కూడా సవాల్ చేసింది.
2014 నుంచి పుతిన్ స్వయంగా, ఐక్యరాజ్య సమితి ఆమోదం లేకుండా బలగాలను ప్రయోగిస్తున్నారు. పాశ్చాత్య దేశాల దృష్టిలో, యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రదర్శించిన దూకుడు ప్రచ్ఛన్నయుద్ధం తర్వాతి నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడం లాంటిది.
''ఈ వ్యవస్థలో మూడు రకాల ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించడం చూశాం'' అని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ జీ జాన్ ఐకెన్‌బెర్రీ ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు.
''భౌగోళిక సరిహద్దులు మార్చడానికి బలగాలను ప్రయోగించకూడదన్నది మొదటి సూత్రం. యుద్ధంలో సాధారణ ప్రజలపై హింసకు పాల్పడకూడదన్నది రెండో నిబంధన. అణ్వాయుధాలు ఉపయోగిస్తామని బెదరించకూడదన్న రూల్ మూడోది. పుతిన్ మొదటి రెండూ చేశారు. మూడోది చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది నిజంగా, నిబంధనలకు కట్టుబడి ఉండడమనే దానికి సవాల్ లాంటిది'' అని ఆయన చెప్పారు.
దీనిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. పాశ్చాత్య దేశాలకు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలపై గౌరవం లేదని వాదించారు.
నాటో 1999లో యుగోస్లేవియాపై వేసిన బాంబులు, అమెరికా నేతృత్వంలో ఇరాక్ ఆక్రమణ, 2008లో కొసావో స్వాతంత్య్రం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతూ, అవి ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఆమోదం లేకుండా పాశ్చాత్య దేశాలు తీసుకున్న చర్యలుగా రష్యా ఆరోపిస్తుంటుంది.
అలాంటి చర్యలు ఐక్యరాజ్య సమితి విధించిన నిబంధనలను ఉల్లంఘించడమేనని రష్యా వాదిస్తోంది.
ఉదారవాద ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి ఇజ్రాయెల్-హమాస్ విషయంలో అమెరికా భిన్న వైఖరి.
ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతు అందించడంపై బైడెన్ యంత్రాంగాన్ని చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి. వేలాది మంది పాలస్తీనియన్ల మరణంపై ఉదాసీనంగా వ్యవహరించిందన్న ఆరోపణలను అమెరికా ఎదుర్కొంది.
''ఇది కపటత్వం, ద్వంద్వ ప్రమాణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఓ రకమైన వివక్ష. పాలస్తీనా బాధితులను యుక్రెయిన్ బాధితులతో సమానంగా చూడకపోతే మానవత్వంలో ఓ రకమైన విభజన మీరు కోరుకుంటున్నారని అర్ధం. ఇది ఆమోదయోగ్యం కాదు'' అని తుర్కియే పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్ముల్మస్ వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించారు.
'ఉదారవాద ప్రపంచం' అమెరికాతో, అమెరికా డాలర్‌తో, అమెరికా ఆర్థిక వ్యవస్థతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉందని ఐకెన్‌బెర్రీ అంటున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కన్నా ఎక్కువగా అది నాటో, దాని మిత్రపక్షాలతో సంబంధం కలిగి ఉందని విమర్శించారు.
సరిగ్గా చెప్పాలంటే అమెరికా ఉదారవాద ఆధిపత్యంగా దాన్ని అర్ధం చేసుకోవాలి అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images
ట్రంప్ దౌత్యవిధానంపై అమెరికన్లు ఏమనుకుంటున్నారు?
ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రపంచ క్రమాన్ని సవాలు చేయాలనుకుంటున్న దేశాలను సంప్రదాయకంగా 'రివిజనిస్టు శక్తులు'గా పిలుస్తున్నారు.
అమెరికా విశ్లేషకులు, విధానాల రూపకర్తలు చైనా, రష్యాను ఉద్దేశించి ఈ పదాన్ని ప్రయోగిస్తుంటారు. అమెరికా ప్రపంచంపై చూపే ప్రభావాన్ని తగ్గించాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయని వారు నమ్ముతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత రివిజనిస్టు శక్తిగా ఇటీవలి నెలల్లో అమెరికా మారిందని ప్రొఫెసర్ ఐకెన్‌బెర్రీ అంటున్నారు. వాణిజ్యం, మానవ హక్కుల రక్షణ, పొత్తుల నుంచి ప్రజాస్వామిక సంఘీభావం వరకూ ఉదారవాద ప్రపంచానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ధ్వంసం చేయడానికి ట్రంప్ యంత్రాంగం శ్రమిస్తోందని ఆయన ఆరోపించారు.
''గత ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యాల నుంచి, ఇతర వైఫల్యాల నుంచి తన ప్రభుత్వం పక్కకు తప్పుకుంటోంది'' అని ట్రంప్ ఇటీవల చెప్పారు.
ట్రంప్ బృందం చేస్తున్న ఈ విప్లవాత్మక మార్పులను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు, న్యాయ విభాగానికి కష్టమవుతుంది. విదేశాంగ విధానం పూర్తిగా అధ్యక్షుని పరిధిలో ఉంటుంది.
అమెరికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానం రూపొందిస్తున్నామని ట్రంప్ యంత్రాంగం చెప్పుకుంటోంది. రష్యాతో సయోధ్య దిశగా తీసుకుంటున్న చర్యలను సమర్థించుకుంటోంది.
''ప్రస్తుత సంక్షోభం రష్యాకు, యుక్రెయిన్‌కు, యూరప్, మరీముఖ్యంగా అమెరికాకు చెడు చేస్తోందని మేం నమ్ముతున్నాం'' అని అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ సోషల్ మీడియాలో ఆరోపించారు.
అయితే, ట్రంప్ దౌత్య విధానంలో తెచ్చిన విప్లవాత్మక మార్పు అమెరికన్లకు అంత నచ్చడం లేదు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను అమెరికన్లు ఎంతగానో సమర్థిస్తున్నారని ఇటీవలి సర్వేలో తేలింది. అదే సమయంలో రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై, ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంపై ట్రంప్ వైఖరికి కనీస మద్దతు లభించలేదు.
మూడింట రెండొంతుల మంది అమెరికన్లు యుక్రెయిన్‌ను మిత్రదేశంగా చూస్తున్నారు. వారిలో సగం మంది యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీపై సానుకూల అభిప్రాయంతో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గందరగోళం..
''నిబంధనల ఆధారిత క్రమాన్ని 2025 ఫిబ్రవరి నాటికి రద్దు చేస్తామని బెదిరించింది అమెరికానే'' అని డాక్టర్ జూలీ న్యూటన్ చెప్పారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రష్యా, యురేషియన్ వ్యవహారాల పరిశోధకులు.
యుక్రెయిన్ సహజ వనరులపై నియంత్రణ కోసం ట్రంప్ డిమాండ్లు, రష్యాతో సాధారణ సంబంధాల కోసం చేస్తున్న చర్చలు, జెలియెన్‌స్కీపై బహిరంగంగా విమర్శలు, ట్రంప్ మద్దతుదారులు యూరప్‌లోని అతివాద పార్టీలకు మద్దతు ఇవ్వడం దీనికి నిదర్శనమని జూలీ న్యూటన్ అంటున్నారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసి ఫిబ్రవరి 24కి మూడేళ్లు పూర్తయ్యాయి.
ఆ సందర్భంలో, యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది.
రష్యా, యుక్రెయిన్ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రతినిధులు ఒక సాధారణ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా వాషింగ్టన్, మాస్కో మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు పుతిన్‌తో చర్చలు జరుపుతున్నానని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ దౌత్య విప్లవం హెల్సింకి చార్టర్ సూత్రాలను దెబ్బతీస్తోందని, అమెరికాను దాని మిత్రదేశాల దృష్టిలో ప్రత్యర్థిగా మారుస్తోందని జూలీ న్యూటన్ అంటున్నారు.
అమెరికా, సోవియట్ యూనియన్, యూరోపియన్ దేశాల మధ్య హెల్సింకి ఒప్పందం జరిగింది.
ప్రాదేశిక సమగ్రత, సరిహద్దు హింసను నివారించడం, ఒకదేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోకపోవడం వంటివాటిని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
''ట్రంప్ పుతిన్ లాగా, 19వ శతాబ్దపు సామ్రాజ్యవాద పాలకుడిలా ఆలోచిస్తున్నారు'' అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రష్యా నిపుణుడు సెర్గీ రాడ్చెంకో విమర్శించారు.
''రష్యాపై ఒత్తిడి పెంచడానికి తగిన ఆర్థిక శక్తి యూరప్‌కు ఉంది'' అని రాడ్చెంకో చెప్పారు. ''పుతిన్‌తో తన చర్చలను ట్రంప్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పటికీ...అదే సమయంలో యూరోపియన్ దేశాలు రష్యాతో తమ సంబంధాలను సాధారణంగా మార్చుకుంటాయని భావించడం కష్టం'' అని సెర్గీ అన్నారు.
''ఉదారవాద ప్రపంచ క్రమం ముగిసిందని ప్రకటించడానికి ఇది సమయం కాదు. రష్యాపై అమెరికా ఆంక్షలు ఇంకా అమలవుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ముగించిన తర్వాతే ఆంక్షలను ఎత్తివేస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది'' అని అట్లాంటిక్ కౌన్సిల్ యురేషియా సెంటర్‌కు చెందిన షెల్బీ మాగిడ్ చెప్పారు.
''పరిస్థితులు ప్రమాదకర రీతిలో, పరిణతి చెందని రీతిలో సాధారణీకరణం అవుతున్నాయని నేను అంగీకరిస్తున్నా. అయితే, ఇంకా అది పూర్తిగా జరగలేదు. ప్రపంచ క్రమం తుది ఫలితం, దాని ప్రభావం శాంతిని ఎలా అమలు చేస్తారనే దాని కంటే యుద్ధం ఎలా ముగిసిందనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి''అని మాగిడ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














