ఆస్కార్స్: 5 అవార్డులతో టాప్‌‌లో నిలిచిన ‘అనోరా’, ప్రియాంకా చోప్రా నిర్మించిన ‘అనూజ’కు దక్కని చాన్స్

ఆస్కార్, అనోరా, ది బ్రూటలిస్ట్, డ్యూన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనోరా చిత్రంలో నటించిన మికే మాడిసన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

లాస్ ఏంజలెస్‌లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం వేడుకగా సాగింది. వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. అనోరా చిత్రానికి ఆస్కార్ అవార్డుల పంట పడింది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు అవార్డులు గెలుచుకుంది.

సీన్ బేకర్ ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు అందుకున్నారు. అనోరా చిత్రంలో నటించిన 25 ఏళ్ల మికే మాడిసన్ నామినేషన్‌కు ఎంపికయిన తొలిసారే ఉత్తమనటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

ఓ సెక్స్ వర్కర్ కథ ఆధారంగా అనోరా తెరకెక్కింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్కార్, ది బ్రూటలిస్ట్, డ్యూన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌) ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు.

‘ది బ్రూటలిస్ట్‌’ చిత్రానికి గానూ అడ్రియాన్‌ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రఫీతోపాటు ఒరిజినల్ స్కోరుకు కూడా ఆస్కార్ అవార్డు దక్కింది.

‘ఎమిలియా పెరెజ్‌’లో నటించిన జోయా సాల్దానా ఉత్తమ సహాయక నటిగా ఎంపికయ్యారు. ‘ది రియల్ పెయిన్’ యాక్టర్ కిరెన్ కల్కిన్ ఉత్తమ సహాయక నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.

బ్రెజిల్ చిత్రం ‘ఐ యామ్ స్టిల్ హియర్’ సినిమా ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు దక్కింది.

ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన 'అనూజ'చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయినప్పటికీ ఆస్కార్ అవార్డు దక్కించుకోలేక పోయింది.

ఈ కేటగిరీలో ‘ఐ యామ్ నాట్ ఏ రోబో’ చిత్రానికి అవార్డు దక్కింది.

దిల్లీలోని ఓ టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే 'అనూజ' చిత్రం. వారి జీవితంలోని సవాళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య సంభాషణల ద్వారా కథ ముందుకు సాగుతుంది.

'అనూజ' చిత్రానికి ఆడమ్ జె. గ్రేవ్స్ దర్శకత్వం వహించారు.

ఆస్కార్, ది బ్రూటలిస్ట్, డ్యూన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లాస్ ఏంజలెస్ కార్చిచ్చు సహాయక సిబ్బందిని ఆస్కార్ అవార్డుల వేదికపైకి పిలిచి గౌరవించారు.

లాస్‌ ఏంజలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమం సాగింది.

జనవరిలో లాస్ ఏంజలెస్‌లో చెలరేగిన భీకర కార్చిచ్చు తర్వాత ఈ వేడుక నిర్వహించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందిని ఆస్కార్ వేదికపైకి పిల్చారు. అవార్డుల కార్యక్రమానికి హాజరైన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వారిని అభినందించారు.

ఆస్కార్, 2025, డ్యూన్, అనోరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎ రియల్ పెయిన్ చిత్రానికి గానూ కిరెన్ కల్కిన్ ఉత్తమ సహాయక నటుడిగా ఎంపికయ్యారు.
ఆస్కార్, 2025, డ్యూన్, అనోరా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మికే మాడిసన్

అవార్డుల జాబితా

ఉత్తమ సినిమా - అనోరా

ఉత్తమ డైరెక్టర్‌ - సీన్ బేకర్ (అనోరా)

ఉత్తమ నటి - మికే మాడిసన్‌ (అనోరా)

ఉత్తమ నటుడు - అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

ఉత్తమ సహాయక నటి - జోయా సాల్దానా – ఎమిలియా పెరెజ్

ఉత్తమ సహాయక నటుడు – కిరెన్ కల్కిన్ – ది రియల్ పెయిన్

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ – ఐ యామ్ స్టిల్ హియర్(బ్రెజిల్)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – ఫ్లో

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – అనోరా – సీన్ బేకర్

ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లే - కాంక్లేవ్ – పీటర్ స్ట్రాన్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్- ఎమిలియా పెరెజ్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – ద బ్రూటలిస్ట్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ – నో అదర్ ల్యాండ్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – విక్‌డ్

ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – విక్‌డ్

ఉత్తమ సౌండ్ – డ్యూన్: పార్ట్ 2

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – అనోరా

ఉత్తమ సినిమాటోగ్రఫీ – ద బ్రూటలిస్ట్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్: పార్ట్ 2

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ – ఐ యామ్ నాట్ ఏ రోబో

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రెస్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ – ద వోన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా

ఆస్కార్, 2025, డ్యూన్, అనోరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్కార్ అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ఉంది.

ఆస్కార్ అవార్డులు పుట్టుక

అకాడమీ అవార్డులనే ఆస్కార్ అవార్డులు అంటారు. అకాడమీ అవార్డులకు ఆస్కార్ అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

అకాడమీ అవార్డుల పుట్టుపూర్వోత్తరాల గురించి వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, 1927లో హాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ (ఎం-జీ-ఎం) చీఫ్ లూయిస్ బీ మేయర్ ఇంట్లో ఓ సాయంత్రం విందు భోజన సమయంలో అకాడమీ అవార్డుల ఆలోచనకు పునాది పడింది. చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా ఒక వ్యవస్థీకృత సమూహాన్ని సృష్టించాలని లూయిస్ మేయర్, విందుకు వచ్చిన అతిథులతో చర్చించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అంటే అమెరికా చలనచిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోవాలి.

ఇది జరిగిన ఒక వారం తరువాత, సినిమా పరిశ్రమలోని అన్ని సృజనాత్మక శాఖల నుంచి 36 మంది ఆహ్వానితులు లాస్ ఏంజెల్స్ అంబాసిడర్ హోటల్‌లో సమావేశమయ్యారు. వారంతా కలిసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ (AMPAS)ను స్థాపించే ప్రతిపాదనపై చర్చించారు.

ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఈ ఆర్గనైజేషన్‌లో చేర్చాల్సిన అంశాల గురించి ఆర్టికల్స్ సమర్పించారు. అకాడమీ బోర్డు ఏర్పాటైంది. సభ్యులను ఎన్నుకున్నారు. డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1928లో అకాడమీ బోర్డు ఏర్పాటు చేసిన తొలి కమిటీలలో 'అవార్డ్ ఆఫ్ మెరిట్' ఒకటి. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీ, 12 విభాగాల్లో అవార్డులు అందజేయాలని బోర్డుకు సూచించింది.

1929 మే 16న మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రూజ్‌వెల్ట్ హోటల్‌లోని బ్లోసమ్ రూమ్‌లో జరిగిన ఈ వేడుకకు 270 మంది హాజరయ్యారు. అప్పటికి మూడు నెలల క్రితమే అవార్డుల విజేతలను ప్రకటించారు.

ఆ తరువాతి సంవత్సరం, విజేతల పేర్లను ముందే ప్రకటించకుండా అవార్డుల ప్రదానోత్సవం వరకు గోప్యంగా ఉంచారు. అయితే, వేడుక రోజు రాత్రి 11.00 గంటలకల్లా వార్తాపత్రికల్లో ప్రచురించేందుకు వీలుగా మీడియా సంస్థలకు విజేతల పేర్లను ముందే పంపించారు.

1940 వరకు ఈ పద్ధతి కొనసాగింది. ఆ సంవత్సరం లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక సాయంత్రం ఎడిషన్‌లోనే విజేతల పేర్లను ప్రచురించింది. దాంతో, ఆ సాయంత్రం అవార్డుల వేడుకకు వచ్చే అతిథులకు విజేతలెవరో ముందే తెలిసిపోయింది.

అప్పటినుంచి విజేతల పేర్లను కవర్‌లో పెట్టి సీల్ వేసే పద్ధతి ప్రారంభమైంది. అవార్డుల ప్రదానోత్సవం రోజు వేదికపై ప్రకటించేవరకు విజేతల పేర్లు గోప్యంగానే ఉంటాయి. ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

విజేతల వివరాలను గోప్యంగా ఉంచడం అనే ప్రక్రియ ఉత్సుకత రేకెత్తించింది. ఈ పద్ధతి మొదలైన రెండో ఏడాది లాస్ ఏంజిల్స్ టైమ్స్ అకాడమీ అవార్డుల వేడుకను రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

1953 నుంచి అకాడమీ అవార్డుల వేడుకను టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. 1966లో తొలిసారిగా కలర్ టీవీలో అకాడమీ అవార్డుల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

1969 నుంచి అకాడమీ అవార్డులను అంతర్జాతీయంగా ప్రసారం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం 200లకు పైగా దేశాల్లో అకడమీ అవార్డుల ప్రసారం జరుగుతోంది.

ప్రస్తుతం, హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు.

ఆస్కార్ అవార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈసార్ సీన్ బేకర్ డైరెక్ట్ చేసినా అనోరాకు ఐదు ఆస్కార్ అవార్డులు దక్కాయి.

ఆస్కార్ ఎందుకింత ఫేమస్?

ఇది కేవలం హాలీవుడ్ సినిమాలను ఇచ్చే అవార్డు అయినప్పటికీ ఆస్కార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?

సుదీర్ఘకాలంగా, దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా స్థిరంగా ఈ అవార్డులను అందించడం, ఎప్పటికప్పుడు స్థాయిని మెరుగుపరుచుకుంటూ, ఒక క్రమపద్ధతిలో ఓ గొప్ప వేడుకలా నిర్వహించడం ఒక కారణం కావచ్చు.

ఆస్కార్ వేడుక ఇప్పటి యువతరానికి చేరువ అయ్యేలా అకాడమీ ప్రయత్నాలు చేస్తోందని బీబీసీ ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ స్టీవెన్ మెచ్ఇంటోష్ గతంలో అన్నారు.

అలాగే, గత శతాబ్ద కాలంలో అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ప్రపంచ పటంలో పెద్ద దేశంగా అవతరించింది. అమెరికాలో జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరగడం అన్ని రంగాల్లో కనిపించింది. అదే కోవలో ఆస్కార్ అవార్డులు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి అనుకోవచ్చు.

అయితే, ఆస్కార్ అవార్డుల మీద విమర్శలూ ఉన్నాయి. "ఆస్కార్స్ ఆర్ సో వైట్" అన్న విమర్శ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. 2016లో #OscarsSoWhite అనే హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం కూడా నడిచింది. అకాడమీ అవార్డులు తెల్లజాతీయులకే ప్రాధాన్యం ఇస్తాయని, జాతి వివక్ష ఆస్కార్‌కూ తప్పలేదనే వాదనలు ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)