బ్లూ ఘోస్ట్: చంద్రుడి మీద అడుగుపెట్టిన ఈ ప్రైవేట్ వ్యోమనౌక ఎవరిది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జార్జ్ శాండ్‌మన్
- హోదా, బీబీసీ న్యూస్
మరో ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్(వ్యోమనౌక) చంద్రుని మీదకు చేరుకుంది. జాబిల్లి ఉపరితలం చేరిన రెండో వాణిజ్య వాహనం ఇది.
జనవరి 15న బ్లూ ఘోస్ట్ భూమిని వీడింది. అమెరికా సంస్థ ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ దీన్ని ప్రయోగించింది. సముద్రాలపై అన్వేషణ కోసం ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇటీవల ఈ ప్రాజెక్టును చేపట్టింది.
ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ అనే మరో సంస్థకు చెందిన అథెనా స్పేస్‌క్రాఫ్ట్ రానున్న కొన్నిరోజుల్లో చంద్రుని దక్షిణ ధ్రువంపైన ల్యాండ్ కానుంది.

అపోలో శకం నాటి సాంకేతికతతో...
చంద్రునిపైన ల్యాండ్ అయిన మొదటి ప్రైవేట్ కంపెనీయే ఇన్‌ట్యూటివ్. ఆ సంస్థకు చెందిన ఒడిస్సియస్ గత ఏడాది ఫిబ్రవరి 22న చంద్రుడి మీదకు చేరుకుంది.
అయితే ఆ మిషన్ ఎక్కువకాలం పనిచేయలేదు. బిలం ఏటవాలుప్రాంతంపై స్పేస్‌క్రాఫ్ట్ దిగడంతో ల్యాండింగ్ గేర్ విరిగింది. దీంతో అది బోల్తాపడింది.
గత రెండువారాలుగా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ బ్లూ ఘోస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా చందమామ ఉపరితలాన్ని తాకింది.
స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా ల్యాండ్ అయిన వెంటనే టెక్సస్‌లోని ఫైర్‌ఫ్లై హెడ్‌క్వార్టర్స్‌లోని సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు.
చంద్రునిపైకి విజయవంతంగా చేరుకుని, ఏమాత్రం చెక్కుచెదరకుండా, రెస్పాండ్ అవుతున్న తొలి ప్రైవేట్ వ్యోమనౌక బ్లూ ఘోస్ట్ అని ఓపెన్ యూనివర్శిటీలో ప్లానెటరీ సైన్స్ పరిశోధకులు డాక్టర్ సైమన్ బార్బర్ చెప్పారు.
చంద్రుని ఉపరితలంపైకి వ్యోమగాములు వెళ్లిన అపోలో శకం తర్వాత మనం మర్చిపోయిన ఆ తరహా సాంకేతికతను ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్‌కు ఫైర్‌ఫ్లే ఉపయోగించిందని డాక్టర్ సైమన్ బార్బర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రానున్న రోజుల్లో చవకగా ప్రయోగాలు
చాలా ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష అన్వేషణకు చంద్రునిపై ప్రయోగాలను వేదికగా భావిస్తున్నాయని డాక్టర్ బార్బర్ చెప్పారు.
''చంద్రునిపైకి వెళ్లడం ద్వారా అంతరిక్షంలో రోబోటిక్ పరికరాలు ఎలా ఉపయోగించవచ్చో మనం తెలుసుకోవచ్చు. చంద్రునిపై చాలా కఠినమైన వాతావరణం ఉంటుంది. కొన్నిసార్లు బాగా వేడిగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు బాగా చల్లగా ఉంటుంది. చాలా దుమ్ము ఉంటుంది. రేడియేషన్ బాగా ఎక్కువ'' అని ఆయన తెలిపారు.
చందమామపైకి వ్యోమగాములను పంపే ప్రయోగాలు కూడా మళ్లీ జరుగుతాయని, చాలా కాలంగా ఈ ప్రయోగాలు ముందుకు వెళ్లకపోవడానికి నిధుల సమస్య కారణమని ఆయనన్నారు.
అపోలో 17 మిషన్ సమయంలో 1972 డిసెంబరు 19న చంద్రునిపై చివరిసారిగా మనుషుల అడుగులు పడ్డాయి.
''అపోలో ప్రయోగాలు భారీగా విజయవంతమయ్యాయి. కానీ అవి చంద్రునిపైకి వెళ్లి, తిరిగి రావడానికే పరిమితమయ్యాయి'' అని ఆయనన్నారు.
''వ్యోమగాములు మూడురోజుల పాటు చంద్రునిపై ఉండొచ్చు. కానీ దానికయ్యే ఖర్చు వందలకోట్ల డాలర్లలో ఉంటుంది. అంత ఖర్చు వల్ల ఉపయోగం లేదు'' అని ఆయన వివరించారు.
చంద్రునిపైకి వ్యోమగాములను పంపొచ్చన్న నమ్మకం ప్రస్తుతం అనేక ప్రైవేట్ కంపెనీలను ఇందులో ప్రవేశించేలా చేసిందని, వ్యాపారాత్మక పోటీ ప్రయోగాల వ్యయాన్ని తగ్గించవచ్చని బార్బర్ చెప్పారు.
''తక్కువ ఖర్చులో ల్యాండింగ్ జరపడానికి, చంద్రునిపై ఆవిష్కరణలకు, వ్యోమగాములు తాగేందుకు మంచినీళ్లు వంటి వనరుల సేకరణకు ఇది దారితీయొచ్చు'' అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పోటీపడుతున్న ప్రైవేట్ కంపెనీలు
చంద్రునిపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన మొదటి ప్రైవేట్ కంపెనీ మరో అమెరికా సంస్థ అయిన అస్ట్రోబొటిక్ టెక్నాలజీ.
2024 జనవరిలో ఆ కంపెనీ చంద్రుణ్ని చేరుకునేందుకు ప్రయత్నించింది. కానీ దాని ల్యాండర్ జాబిల్లిని చేరుకోలేకపోయింది. భూమిపై కూలిపోయింది. ఇంధనం లీకేజీ దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయే చివరిక్షణాలు ముందు ఆ వ్యోమనౌక ముక్కలైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














