యుక్రెయిన్ యుద్ధం: అమెరికా లేకుండా రష్యాను యూరప్ అడ్డుకోగలదా?

యుక్రెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని తగ్గించుకుంది. కేవలం 70 వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు.
    • రచయిత, జొనాథన్ బేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ తన సొంత జనరల్స్ లేదా చాలామంది రిటైర్డ్ బ్రిటిష్ సైనిక నాయకుల కంటే బ్రిటన్ సైన్యాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో డోనల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

యుక్రెయిన్ భద్రతకు అమెరికా ఎలాంటి హామీ ఇస్తుందని డోనల్డ్ ట్రంప్‌ను విలేఖరులు ప్రశ్నించగా.. "బ్రిటన్‌లో సమర్థులైన సైనికులు ఉన్నారు, అద్భుతమైన సైన్యం ఉంది, వారు తమను తాము రక్షించుకోగలరు'' అని ఆయన బదులిచ్చారు.

రష్యాను బ్రిటిష్ సైన్యం ఎదుర్కొంటుందా? అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికన్ సీనియర్ సైనిక అధికారులు బహిరంగ ప్రదేశాల్లో బ్రిటిష్ సైన్యాన్ని ప్రశంసిస్తుంటారు. కానీ, ప్రైవేట్ సంభాషణలలో విమర్శిస్తుంటారు. ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని తగ్గించుకుంది. కేవలం 70 వేల మంది సాధారణ సైనికులు మాత్రమే ఉన్నారు. దీనిపై అమెరికన్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు.

బ్రిటన్ పర్యటన సందర్భంగా ఓ సీనియర్ అమెరికన్ ఆర్మీ అధికారి ప్రైవేట్ సంభాషణలో బ్రిటన్ సైన్యం గురించి 'ఇది చాలా తక్కువ' అని అన్నారు.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం.. రష్యా మిలటరీ బడ్జెట్ యూరప్ డిఫెన్స్ వ్యయం కంటే ఎక్కువ. రష్యా మిలటరీ బడ్జెట్ ఇపుడు 41 శాతం పెరిగింది, అంటే మొత్తం జీడీపీలో ఇది 6.7 శాతంగా ఉంది. మరోవైపు, 2027 నాటికి బ్రిటన్ దాని జీడీపీలో 2.5 శాతం మాత్రమే సైన్యం కోసం ఖర్చు చేయనుంది.

కీర్ స్టార్మర్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు.

అమెరికా లేకుండా బ్రిటన్ ఎదుర్కోగలదా?

యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ అమలుకు తన సైన్యాన్ని మోహరించడం లేదన్న వాస్తవాన్ని ట్రంప్ ప్రకటన వెల్లడిస్తోంది. అక్కడ అమెరికా ప్రమేయం అనేది ఆర్థికపరమైన, మైనింగ్ విషయాలతో ముడిపడి ఉంటుంది.

ఈ ప్రమేయం రష్యాను మళ్లీ దాడి చేయకుండా నిలువరించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. కానీ, ట్రంప్ ప్రభుత్వం కూడా అక్కడ సైనిక శక్తి అవసరమని, అది ఇతర దేశాల నుంచి రావాలని ఆశిస్తోంది.

యూరోపియన్ దేశాలే ఈ పాత్రను చేపట్టాలి. అయితే, దీనికి ఐరోపా సిద్ధంగా ఉంటే మాత్రమే సరిపోదు, దానికి తగిన సైనిక బలం ఉందా? అనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం లేదనే చెప్పాలి.

అందుకే కీర్ స్టార్మర్ అదనపు భద్రతా హామీ కోసం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా మిలిటరీపై ఒత్తిడి చేస్తున్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సైనిక బలాన్ని తగ్గించుకున్న దేశాల్లో బ్రిటన్‌తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. కానీ, యూరప్‌లోని ఇతర దేశాల్లో ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది. కొన్ని దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచుతున్నాయి.

రష్యాపై దాడిని ఆపేందుకు తనకు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అంతర్జాతీయ సైనికులు అవసరమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ చెప్పారు. కానీ, యూరప్ సొంతగా అంతమంది సైనికులను సమకూర్చలేదు.

పశ్చిమ దేశాలు 30,000 మంది సైనికులను పంపే యోచన చేస్తున్నాయి. ఇక, యూరప్‌కు చెందిన జెట్‌లు, యుద్ధనౌకలు యుక్రెయిన్ గగనతలం, సముద్ర మార్గాలను పర్యవేక్షిస్తాయి. ఈ సైన్యం లక్ష్యం యుక్రెయిన్ నగరాలు, ఓడరేవులు, అణు విద్యుత్ కేంద్రాలను రక్షించడం. అయితే, తూర్పు యుక్రెయిన్‌లో ఫ్రంట్ లైన్‌లో వారు ఉండరు.

అయితే, ఇది సరిపోదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అందుకే అమెరికా నుంచి బ్యాకప్ డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతీకార చర్యల్లో యూరోపియన్ దళాలకు సహాయం చేయడానికి కనీసం అమెరికా ఎయిర్ జెట్‌లను పోలాండ్, రొమేనియా వైపుగా మోహరించాలని వారు భావిస్తున్నారు.

యుక్రెయిన్, బ్రిటన్, అమెరికా, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైనికులు ఇటీవల బ్రిటిష్ సైనిక శిక్షణలో పాల్గొన్నారు.

భారీ సైనిక ఆపరేషన్ చేయగలదా?

ఇటీవల, యుక్రెయిన్‌కు అమెరికా ఇచ్చిన దానికంటే యూరప్ కొంచెం ఎక్కువ ఆయుధాలను ఇచ్చింది. కానీ, యుక్రెయిన్‌కు అమెరికా సుదూర క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలను అందించిందనేది విశ్వసనీయ సమాచారం.

యూరప్ దేశాలకు తమంతట తాముగా భారీ సైనిక ఆపరేషన్లను చేపట్టేందు అవసరమైన సహాయకులు లేరు. యుక్రెయిన్‌కు అందించే యూరప్ దేశాల ఆయుధాల సరఫరా కూడా అమెరికాపైనే ఆధారపడి ఉంది.

2011లో లిబియాపై నాటో చేసిన బాంబు దాడి అనేక లోపాలను బయటపెట్టింది. ఐరోపా దేశాలు ముందు నిల్చున్నప్పటికీ, వారు యూఎస్ సాయం, ట్యాంకర్లపై ఆధారపడవలసి వచ్చింది.

కాగా, స్టార్మర్ ఎటువంటి సైనిక హామీ లేకుండా అమెరికా నుంచి తిరిగి వచ్చారు.

"నాటో ఆర్టికల్ 5కి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. దీనిలో ఒక మిత్రదేశంపై దాడిని అన్ని ఇతర మిత్రదేశాలపై దాడిగా పరిగణిస్తారు" అని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ వీస్ బీబీసీతో చెప్పారు.

అయితే, యుక్రెయిన్‌కు పంపిన ఏ దళాలు అయినా నాటో ఒప్పందం కిందకు రావని, వారికి నాటో తరహా భద్రతా హామీలు ఇవ్వబోమని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హేగ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

అటువంటి పరిస్థితిలో, ఈ పరీక్ష యూరప్ బలానికి సంబంధించినది. మరి ట్రంప్ మాటలతో స్టార్మర్ తనవెంట మరికొందరిని తీసుకురావడంలో సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి.

ఇప్పటివరకు, యూరప్‌లో బ్రిటన్‌తో కలిసి నిలబడటానికి సిద్ధంగా ఉన్న ఏకైక దేశం ఫ్రాన్స్. ఉత్తర ఐరోపాలోని డెన్మార్క్, స్వీడన్ వంటి కొన్ని ఇతర దేశాలు కలిసి నిలబడతామనే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. అయితే, అవి యూఎస్ సెక్యూరిటీ గ్యారెంటీని ఆశిస్తున్నాయి. అదే సమయంలో స్పెయిన్, ఇటలీ, జర్మనీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

స్టార్మర్ ఇప్పటికీ యూరోప్ సైన్యానికి అమెరికా మద్దతునిచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే, బ్రిటన్ సైన్యం రష్యాతో పోటీ పడగలదా? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. రష్యా సైన్యం బలహీనపడినప్పటికీ, ఈ ప్రశ్నకు సమాధానం పోటీ పడలేదనే చెప్పొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)