డోనల్డ్ ట్రంప్: ''రష్యా కంటే యుక్రెయిన్‌తో వ్యవహరించడమే కష్టం''

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇయాన్ ఐక్మాన్, టామ్ బాట్‌మాన్
- హోదా, బీబీసీ న్యూస్
ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో రష్యా కంటే యుక్రెయిన్‌తో వ్యవహరించడమే కష్టమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
''కీయేవ్‌తో కంటే రష్యాతో అమెరికా వ్యవహారం హాయిగా ఉంది. పైగా చాలా తేలికగానూ ఉంది'' అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు చెప్పారు.
అంతకు కొన్నిగంటల ముందు ట్రంప్ మాట్లాడుతూ.. యుక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి వచ్చేవరకు రష్యాపై పెద్దఎత్తున ఆంక్షలు, సుంకాలు విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే యుక్రెయిన్‌కు ఇప్పటికే ట్రంప్ సైనిక సాయం నిలిపివేశారు. దీంతోపాటుపాటు కొన్ని ఉపగ్రహ చిత్రాలను పంచుకోవడాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు అంతరిక్ష సాంకేతిక సంస్థ మాక్సర్ బీబీసీ వెరిఫైకి చెప్పారు.
అమెరికాపట్ల తగిన గౌరవంతో లేరని జెలియెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు శ్వేతసౌధంలో మాటలయుద్ధానికి దిగిన సరిగ్గా వారం రోజుల తరువాత ఈ చర్య అమల్లోకి వచ్చింది. బహిరంగంగా మాటలయుద్ధానికి దిగిన తరువాత ట్రంప్ అమెరికా అందించే సైనికసాయం మొత్తాన్ని నిలిపివేయడంతోపాటు, కీయెవ్‌తో మేథోపరమైన అంశాలను పంచుకోవడాన్నీ ఆపేశారు.


ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌పై రష్యా దాడులు
మరోపక్క రష్యా యుక్రెయిన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో గురువారం రాత్రి దాడి చేసింది.
అయితే ఈ దాడికి ప్రతిగా రష్యాపై మరిన్ని అంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధభూమిలో రష్యా యుక్రెయిన్‌ను మరింతగా దెబ్బతీస్తున్నందున, రష్యాపై మరిన్ని సుంకాల విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. కానీ ఇంతలోనే ఆ స్థానంలో ఉన్నవారెవరైనా ఏం చేస్తారో పుతిన్ కూడా అదే చేస్తున్నారని ట్రంప్ చెప్పారు.
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారన్న విషయాన్ని తాను నమ్ముతున్నానని, కానీ యుక్రెయిన్ విషయంలో అలా చెప్పలేనని ట్రంప్ అన్నారు.
అయితే కీయెవ్‌కు సాయాన్ని ఎందుకు ఆపేశారని ట్రంప్‌ను ప్రశ్నిస్తే''నేను వారు ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ వారు పరిష్కరించాలనుకుంటున్నారో లేదో నాకు తెలియదు'' అని చెప్పారు.
పుతిన్ తో ట్రంప్ ప్రత్యక్ష దౌత్యం నేటో మిత్రదేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. యుక్రెయిన్‌పై రష్యా 2022 ఫిబ్రవరి24న పూర్తిస్థాయి ఆక్రమణకు దిగిన తరువాత పశ్చిమదేశాలు రష్యాతో సంబంధాలకు దూరంగా ఉంటున్నాయి.
జెలియెన్‌స్కీతో ట్రంప్ విభేదించినా, యుక్రెయిన్‌కు సైనిక, మేథోపరమైన సాయం నిలిపివేసినప్పటికీ, ఆయన విదేశాంగ బృందం స్వరం యుక్రెయిన్ పట్ల సామరస్యంగా వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
ఉపగ్రహ చిత్రాలకు నో
యుక్రెయిన్ నిక్షేపాలలో తమకు ప్రధాన వాటా ఇచ్చే ఒప్పందంపై జెలియెన్‌స్కీ సంతకం చేయాలని, మాస్కోతో సత్వర సంధికి అంగీకరించాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. కానీ ఒప్పందంలో భాగంగా కీయెవ్‌కు కొన్ని బలమైన భద్రతా హామీలు కావాలని జెలియన్‌స్కీ పట్టుబడుతున్నారు. అయితే ఇటువంటి హామీలపై తరువాత చర్చిద్దామని, ఇది చాలా తేలికైన అంశమని ట్రంప్ చెబుతున్నారు.
మరోపక్క అమెరికా ఉపగ్రహాల నుంచి అత్యంత నాణ్యమైన ఫొటోలను యుక్రెయిన్ పొందకుండా అమెరికా తాత్కాలికంగా నిలిపివేసిందని స్పేస్ టెక్నాలజీ కంపెనీ మాక్సర్ శుక్రవారం బీబీసీ వెరిఫైకి తెలిపింది. యుద్ధ సమయంలో ఈ ఉపగ్రహ చిత్రాలు సైన్యానికి ఓ ముఖ్యమైన సాధనంగా పనిచేస్తాయి. ఈ చిత్రాల ఆధారంగా తమ ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టగలుగుతారు.
అమెరికాకు చెందిన మాక్సర్ అనే సంస్థకు వివిధ ప్రభుత్వాలు, కంపెనీలకు ఉపగ్రహ చిత్రాలను అందించే కాంట్రాక్టులు ఉన్నాయి. వాటిలో గ్లోబల్ ఎన్‌హాన్స్‌డ్ జియోఇంట్ డెలివరీ (జిఇజిడి) ప్రోగ్రామ్ ఒకటి. ఈ ప్రోగ్రామ్ కింద యుఎస్ ప్రభుత్వం సేకరించిన అత్యధిక నాణ్యత కలిగిన చిత్రాలను వినియోగదారులకు అందిస్తుంది.
'జీఇజీడీ కింద యుక్రెయిన్ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపచేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది'' అని మాక్సర్ బీబీసీకి తెలిపింది.
యుక్రెయిన్‌కు మద్దతుగాపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ సస్పెన్షన్ విధించినట్లు అమెరికా రక్షణ శాఖలో భాగమైన నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ధృవీకరించింది.

ఫొటో సోర్స్, SAUDI ARABIAN FOREIGN MINISTRY/Getty Images
వచ్చేవారం సౌదీలో భేటీ
ట్రంప్ డిమాండ్లపై సంతకం చేయాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం ట్రంప్ సీనియర్ అధికారులు సౌదీ అరేబియా వెళ్లి జెలియెన్‌స్కీ బృందాన్ని కలవనున్నారు.
ఈ చర్చలు అర్థవంతంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. వీలైనంత త్వరగా శాంతి నెలకొల్పడానికి తమ దేశం సిద్ధంగా ఉందని, దాన్ని సాధించేందుకు పటిష్టమైన చర్యలను ప్రతిపాదించామని ఆయన శుక్రవారం చెప్పారు.
ప్రతిరోజూ రష్యా చేస్తున్న కొత్తదాడులు, వాస్తవ పరిస్థితులే శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని రుజువు చేస్తున్నాయని జెలియెన్‌స్కీ అన్నారు.
ట్రంప్‌తో జరిగిన మాటల యుద్ధంపై జెలియెన్‌స్కీ విచారం వ్యక్తం చేస్తూ అమెరికాతో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేశారు.
జెలియెన్‌స్కీ నుంచి క్షమాపణలు, కృతజ్ఞతాభావంతో కూడిన లేఖ ట్రంప్‌కు అందిందని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చెప్పారు. ''యుక్రెయిన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాం. అంతా సర్దుకుంటుందని'' అని విట్‌కాఫ్ చెప్పారు.
యురోపియన్ నాయకులు భారీ సైనిక వ్యయం కోసం ప్రణాళికలతో ముందుకు సాగుతున్నందున, యుక్రెయిన్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్న "సంకీర్ణంలో" చేరడానికి సుమారు 20 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని యూకే అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














