బియావోవియేజా: ఈ అడవి దాటి యూరప్‌లోకి అక్రమ వలసలు, కానీ ఈ దారిలో కుక్కలు 'వెంబడిస్తాయి'

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
- రచయిత, జాస్మిన్ డయర్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
దావిత్ (పేరు మార్చాం) ఒక యువకుడు. ఇథియోపియాకు చెందినవారు.
పోలాండ్‌లోని ఒక పెద్ద నగరంలో ఉన్న పచ్చటి, ప్రశాంతమైన పార్క్‌లో మేం ఆయనను కలిశాం. ఆయన చాలా సిగ్గరి, మృదువుగా మాట్లాడతారు. చల్లటి వాతావరణానికి తగినట్లుగా పసుపు, నలుపు రంగులతో ఉన్న ఒక హుడీని వేసుకున్నారు.
నిర్బంధ సైనిక శిక్షణ నుంచి తప్పించుకోవడానికి తన ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు ఆయన నాకు చెప్పారు. పోలాండ్‌కు వెళ్లడానికి స్మగ్లర్లకు 7000 డాలర్లు (సుమారు రూ. 6 లక్షలు) చెల్లించినట్లు తెలిపారు. రష్యా, బెలారస్‌ల మీదుగా పోలాండ్ చేరుకోవడానికి వారు తనకు సహాయపడ్డారని చెప్పారు.
2021లో సంక్షోభం మొదలైనప్పటి నుంచి బెలారస్-పోలాండ్ సరిహద్దును అక్రమంగా దాటిన లక్షల మందిలో దావిత్ కూడా ఒకరు.


ఫొటో సోర్స్, Jack Garland, BBC News
ఆ సరిహద్దు నుంచి వెళ్లడం అంటే, ఒకప్పుడు యూరప్‌ను కప్పేసిన ఒక విస్తారమైన అటవీ అవశేషాల గుండా నడవడం.
ఆ విస్తారమైన అడవి పేరు బియావోవియేజా. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. పర్యావరణపరంగా రక్షిత ప్రదేశం. ఇప్పుడు దీన్ని ప్రజలు యూరప్‌కు వెళ్లడానికి ఒక అక్రమ మార్గంగా వాడుతున్నారు.
అడవిలో దాదాపు 120 మైళ్ల దూరం కంచెను నిర్మించారు. తమ సరిహద్దులను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2022లో పోలాండ్ ప్రభుత్వం ఈ కంచెను నిర్మించింది.

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
పోలాండ్ గస్తీ దళాలు నిత్యం, రాత్రింబవళ్లు సాయుధ వాహనాలలో, కాలినడకన గస్తీ కాస్తుంటాయి. డ్రోన్లతో ఆకాశాన్ని పర్యవేక్షిస్తుంటాయి.
అధికారిక యూనిఫాం ధరించిన సరిహద్దు దళ అధికారి మిచెల్ బురా, 5.5 మీటర్ల ఎత్తున్న ఆ కంచె వెంట నాతో పాటు నడిచారు.
''మనం స్మగ్లర్ల కంటే కచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. శత్రువుల కంటే కూడా ఒక అడుగు ముందు ఉండాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అన్నారు.
బురా ఇప్పుడు బెలారస్ సరిహద్దు దళ సభ్యులను కూడా ఈ శత్రువుల జాబితాలో చేర్చారు.
''బెలారస్ సరిహద్దు దళ సభ్యులు అక్రమ వలసదారులతో కలిసిపోయారు. అక్రమంగా సరిహద్దు దాటగలిగే ప్రదేశాలు ఎక్కడున్నాయో వలసదారులకు వారు చూపిస్తున్నారు. వలసదారులకు నిచ్చెనలు, కట్టర్లు వంటి పరికరాలను అందిస్తున్నారు'' అని బురా వివరించారు.
అయితే, వలసదారులపై చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ పోలాండ్ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.
వలసదారులపై పోలాండ్ అధికారులు చట్టవిరుద్ధంగా, కొన్నిసార్లు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారంటూ 2024 డిసెంబర్ నాటి హ్యుమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ పేర్కొంది.
తమ దేశంలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వలసదారులను బలవంతంగా, వారి రక్షణను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ బెలారస్‌కు పంపిస్తున్నారని పేర్కొంది.

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
వలసదారులు సరిహద్దులు దాటడానికి సహాయం చేస్తున్నారనే వాదనలను బెలారస్ సరిహద్దు అధికారులు ఖండించారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన సమస్యలపై గతంలో వారు చేసిన ప్రకటనల గురించి బీబీసీకి చెప్పారు.
''వలసలు తీవ్రమైనప్పటి నుంచి స్టేట్ బోర్డర్ కమిటీ ఈ విషయాన్ని పదే పదే ఈయూ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. నిర్మాణాత్మక చర్చలు, నిలిచిపోయిన క్రాస్ బోర్డర్ సహకార ప్రాజెక్టులను మళ్లీ మొదలుపెట్టడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందులో అక్రమ వలసలను ఎదుర్కోవడానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
దురదృష్టవశాత్తు, నిర్మాణాత్మక చర్చలు జరుపడానికి బదులుగా పొరుగున ఉన్న ఈయూ దేశాలు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం, ఘర్షణలు, సరిహద్దు సహకారాన్ని పట్టించుకోకపోవడం వంటి మార్గాన్ని ఎంచుకున్నాయి. వలస సమస్యను పరిష్కరించడానికి వారు రాడికల్ పద్ధతులను అవలంబిస్తున్నారు'' అని వారు వివరించారు.

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
పోలాండ్-బెలారస్ సరిహద్దు సంబంధాలు
వలసదారుల రాక పెరగడంతో సరిహద్దుకు ఇరువైపులా పహారా కాసే వారి మధ్య సంబంధాల్లో మార్పు వచ్చింది.
''కొన్నేళ్ల క్రితం వరకు మేం మాట్లాడుకునేవాళ్లం. కలిసి సిగరెట్ తాగేవాళ్లం. కానీ, ఇప్పుడు మేం ఒకరినొకరం చూసుకుంటాం అంతే, మాట్లాడుకోం. వాళ్లతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు'' అని బురా చెప్పారు.
పోలాండ్ వలసల నియంత్రణ ప్రయత్నాలను ముమ్మరం చేసినప్పటికీ 2024లో సరిహద్దును దాటేందుకు 30 వేల ప్రయత్నాలు జరిగాయి. 2021లో సంక్షోభం మొదలైనప్పటి నుంచి చూస్తే ఈ సంఖ్య రెండో గరిష్ఠం.
ఇలా అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి విజయవంతమైన వారిలో చాలామంది దీనస్థితిలో పోలాండ్‌కు చేరుకుంటారు.

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
'కుక్కలను వదులుతారు'
అటవీ ప్రాంతం చాలా దట్టంగా ఉంది. 5.5 మీటర్ల ఎత్తున్న ముళ్లతీగలతో కూడిన ఈ కంచె వల్ల చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.
వీఆర్ మానిటరింగ్ గ్రూప్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, సరిహద్దు దాటుతూ 89 మంది చనిపోయారు.
సరిహద్దు దాటడానికి తమకు పరికరాలు ఇచ్చినప్పటికీ, బెలారస్ బోర్డర్ దళానికి చెందిన కుక్కలను వదలడం సర్వసాధారణమని, ఎందుకంటే గార్డులు తమ భూభాగం ఈయూలోకి నెట్టేస్తారని వలసదారులు చెప్పారు.
చలికాలంలో పరిస్థితులు మరీ కఠినంగా ఉంటాయి. హైపోథర్మియా, మంచుతుపానులు అక్కడ సర్వసాధారణం.
''ఒకవేళ మనం పరుగెత్తితే, వారు వెనకాల కుక్కను వదులుతారు. కుక్కలు మీదపడి కాళ్లు, మెడపై కొరికేసిన వ్యక్తుల్ని నేను చూశాను'' అని దావిత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Jack Garland, BBC News
ఓల్గా ఒక చారిటీ కోసం పనిచేస్తారు. ఈ చారిటీ సభ్యులు అడవిలోకి వెళ్లి అక్కడికి కొత్తగా వచ్చేవారికి సహాయం చేస్తారు. భయపడుతున్న, వైద్య సహాయం అవసరమున్న వ్యక్తులు తరచుగా తనకు తారసపడుతుంటారని ఓల్గా చెప్పారు.
''రేజర్ వైర్ కారణంగా వారికి చాలా గాయాలు అవుతుంటాయి. కంచె నుంచి దూకడం వల్ల కొన్నిసార్లు వాళ్ల కాళ్లు, చేతులు విరుగుతుంటాయి'' అని ఓల్గా తెలిపారు.
చారిటీ ప్రధాన కేంద్రం వద్ద మేం ఓల్గాను కలిశాం. అదొక మూడు గదుల భవనం. స్థానిక కమ్యూనిటీకి చెందిన ఒక మద్దతుదారుడు ఈ భవనాన్ని వారికి విరాళంగా ఇచ్చారు.
వలసదారుల రాకపై కోపంగా ఉన్నవారు తమపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో ఈ చారిటీ వారు తమ స్థావరాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు.
ఆ భవనంలో ఉన్నిదుస్తులు, ఆహారం, బ్యాండేజీలు, ప్రథమ చికిత్స ఔషధాలు పెద్దయెత్తున ఉన్నాయి. వలంటీర్లు నిద్ర పోవడానికి ఒక మూలన రెండు పడకలు ఉన్నాయి.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా వారు సహాయం చేస్తుంటారు.
''ఇప్పుడు చలికాలంలో ఎక్కువ యువకులే ఉంటారు. సెప్టెంబర్, అక్టోబర్ సమయాల్లో సగం మంది యువతులు, బాలికలు ఉంటారు. అందులో చాలామంది టీనేజర్లే'' అని ఓల్గా చెప్పారు.
సాధ్యమైన చోట వారికి ప్రథమ చికిత్స అందిస్తామని, చెబితే వినేవాళ్లకు ఆశ్రయానికి సంబంధించిన సలహాలు ఇస్తామని ఆమె తెలిపారు.
యూకే వెళ్లడమే లక్ష్యం
అయితే, ఇది చాలామందికి యూరప్‌లోని ఇతర దేశాలకు వెళ్లడానికి ఒక చిన్న అడుగు మాత్రమే.
తనకు ప్రయాణంలో కలిసిన చాలామంది యూకేకు చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నారని దావిత్ చెప్పారు.
దావిత్ పోలాండ్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
''నేను సురక్షితంగా ఉండాలని అనుకుంటున్నా. అందుకే నేను ఇక్కడ ఉంటున్నా'' అని దావిత్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














