కాల్ సెంటర్ స్కాం: అమెరికన్లను మోసగించి,డాలర్ల కొద్దీ సొమ్ము దోచిన హైదరాబాద్ కంపెనీ, పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ఫొటో సోర్స్, X/TGCyberBureau
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నకిలీ కాల్ సెంటర్ ద్వారా అమెరికన్లను మోసగిస్తున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. వీరు హైదరాబాద్‌లో ఉంటూ అమెరికాలో ఉండేవారిని మోసగిస్తున్నారు.
మాదాపూర్‌లో ఓ అనుమానిత కాల్ సెంటర్ నడుస్తోందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ సెంటర్‌పై దాడిచేసి పలు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు.
తెలంగాణతో పాటు గుజరాత్, అమెరికా, దుబయిలో ఉండే వారు ఈ సైబర్ దోపిడీలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 63 మందిని అరెస్టు చేయగా, వీరిలో చాలావరకు ఈశాన్య రాష్ట్రాల యువత ఉన్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన చందా మనస్విని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాక, అమీర్‌పేట్‌లో కాల్ సెంటర్ నిర్వహించారు. అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసివేశారు.
కాల్ సెంటర్‌కు డేటా సహకారం కోసం మనస్విని గుజరాత్‌కు చెందిన అజాద్‌ను సంప్రదించేవారు. కాగా, అజాద్‌కు గుజరాత్‌కే చెందిన కైవాన్ పటేల్ రూపేశ్ కుమార్ అలియాస్ జద్దూతో పరిచయాలున్నాయి. ఆయన తమ్ముడు విక్కీ దుబయిలో ఉంటున్నారు. వీరందరూ కలిసి మోసాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు.
2025 జనవరిలో హైదరాబాద్ మాదాపూర్ వేదికగా ఎగ్జిటో సొల్యూషన్స్ పేరిట ఒక కాల్ సెంటర్ కంపెనీ(బీపీవో) తెరిచారు. దీనికి మనస్విని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సంజూ, జేమ్స్, ప్రవీణ్ అనే వ్యక్తులు టీమ్ లీడర్లుగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు


ఫొటో సోర్స్, X/TGCyberBureau
పేపాల్ కస్టమర్లే లక్ష్యంగా..
అమెరికాలో ఆన్‌లైన్ పేమెంట్స్‌కు 'పే పాల్' ఒక ప్రధాన గేట్ వేగా ఉంది. దీంతో, అమెరికన్లు, ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుని డాలర్లు కాజేయాలని ఈ ముఠా నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కైవాన్ పటేల్, విక్కీ, అజాద్ పేపాల్ కస్టమర్ల వివరాలు తెలుసుకొని ఇచ్చేవారు, అమెరికాలో మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసేవారు. మ్యూల్ అకౌంట్ అనేది మనీ లాండరింగ్, మోసం, అక్రమంగా నిధులు బదిలీ చేసేందుకు ఉపయోగించే ఖాతా.
ఈ మ్యూల్ అకౌంట్లలోకే ఖాతాదారుల నుంచి దోచుకున్న సొమ్మును బదిలీ చేసేవారని, అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీగా మార్చేవారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ చెప్పారు.
''కైవాన్ పటేల్, విక్కీ, అజాద్ పరారీలో ఉన్నారు. వారి అరెస్టుకు ప్రయత్నిస్తున్నాం. వారు చిక్కితే మరిన్ని వివరాలు తెలుస్తాయి'' అని బీబీసీతో శిఖా గోయల్ చెప్పారు.
ఎంత మందిని మోసం చేశారు, ఎంత సొమ్ము కొట్టేశారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని శిఖా గోయల్ అన్నారు. అలాగే ఈ ఫోన్ నంబర్లు ఎగ్జిటో సోల్యూషన్స్ కంపెనీకి ఏవిధంగా చేరాయన్నది తెలియాల్సి ఉందని ఆమె చెప్పారు.
''పేపాల్ కస్టమర్ల వివరాలు డార్క్ నెట్ సాయంతో సంపాదించారా.. మరో మార్గంలో సేకరించారా.. అనే విషయంపై విచారణ జరుగుతోంది'' అన్నారు శిఖా గోయల్.

ఫొటో సోర్స్, X/TGCyberBureau
ముందు మెయిల్స్, తర్వాత కాల్స్
మోసం ఏ విధంగా జరిగిందో శిఖా గోయల్ వివరించారు. ఐబీమ్, ఎక్స్-లైట్ వంటి సాఫ్ట్ వేర్లు ఉపయోగించి పే-పాల్ కస్టమర్లకు ఫిషింగ్ మెయిల్స్ పంపేవారు. ఖాతాల్లో వందల డాలర్ల మేర అనధికారిక లావాదేవీలు జరిగాయని నమ్మించేవారు.
మరిన్ని వివరాలకు ఫోన్ చేయాలంటూ మెయిల్‌లో నకిలీ కస్టమర్ కేర్ సెంటర్ నంబరు ఇచ్చేవారు. ఆ నంబరు ఎగ్జిటో సొల్యూషన్స్‌తో అనుసంధానమై ఉండేది.
మెయిల్స్ చూసి కంగారు పడి, ఫోన్ చేసిన ఖాతాదారుల వివరాలు సేకరించేవారు. వారిని మాటల్లో పెట్టడం, భయపెట్టడం చేసి కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ వివరాలు తెలుసుకుని..డబ్బులు కాజేశారు.
''కొన్ని సందర్భాల్లో ఖాతా హ్యాక్ అయిందని చెప్పి.. డబ్బు(డాలర్ల)ను 'సేఫ్ అకౌంట్స్'లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని చెప్పేవారు. లేకపోతే అనధికారిక లావాదేవీలు జరిగితే డబ్బులు పోతాయని భయపెట్టేవారు. అలా నమ్మి వివరాలు చెప్పిన వారి నుంచి పూర్తి డబ్బు కాజేసేవారు'' అని శిఖాగోయల్ బీబీసీకి చెప్పారు.
మోసాలు చేసేందుకు టెలీకాలర్స్‌ను డయలర్, క్లోజర్స్ అంటూ రెండు బృందాలుగా విభజించారు. నకిలీ ఈమెయిల్స్ పంపించడం, వచ్చిన కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడటం, ఖాతాదారుల వివరాలు తెలుసుకోవడం క్లోజర్స్ పని. క్లోజర్స్ బృందం ఇచ్చిన వివరాల ఆధారంగా కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు అమెరికాలోని మ్యూల్ ఖాతాలకు మళ్లించడం డయలర్స్ పనిగా ఉంది.
అలా వచ్చిన సొమ్ము లేదా డాలర్లను దుబయిలో ఉండే విక్కీ సహా కొందరు క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
''కొందరికి రోజుకు 30 కాల్స్ మాట్లాడాలని లక్ష్యం ఇచ్చారు. అలా కాల్ సెంటర్ తరఫున 600 కాల్స్ చేశారు'' అని సైబర్ సెక్యురిటీ బ్యూరోకు చెందిన అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఈ వ్యవహారంలో పేపాల్ సంస్థను సంప్రదిస్తున్నామని, ఖాతాదారుల వివరాలు బయటకు ఏ విధంగా వెళ్లాయనే విషయంపై ఆరా తీస్తున్నామని శిఖా గోయల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈశాన్య రాష్ట్రాల యువతకు ఉద్యోగాలు
కాల్ సెంటర్‌ను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు.
''అమెరికా సమయానికి తగ్గట్టుగా కాల్ సెంటర్ పనివేళలు ఏర్పాటు చేశారు. అమెరికా పౌరులతోపాటు అక్కడి భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది'' అని శిఖా గోయల్ చెప్పారు.
కాల్ సెంటర్‌లో పనిచేసేందుకు లింక్డిన్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్ ద్వారా కంపెనీ నిర్వాహకులు ప్రకటనలు ఇచ్చారు. 30 వేల రూపాయలు జీతం ఇస్తామని ఉద్యోగులను తీసుకున్నారు. వీరిలో 43 మంది నాగాలాండ్‌కు చెందిన వారున్నారు. వీరంతా 30ఏళ్ల లోపు వారే.
మిగతావారిలో మేఘాలయ, మణిపుర్, అసోం, పశ్చిమ్ బంగాకు చెందినవారున్నారు. వీరంతా ఇంగ్లీష్‌లో మాట్లాడతారనే ఉద్దేశంతో తీసుకున్నారని, అమెరికాలో ఉన్న వారితో ఏ విధంగా మాట్లాడాలనే విషయంపై వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
కాల్ సెంటర్‌లో పనిచేసే వారికి ఏసీ గదులు, ఉచిత భోజనం, ఆఫీసుకు వచ్చి వెళ్లేందుకు క్యాబ్ సదుపాయాలు కల్పించారు.
''ముందుగా కాల్ సెంటర్ ఉద్యోగాలలో చేరారు. ఉద్యోగంలో చేరాక తాము మోసానికి పాల్పడుతున్నామనే విషయం వారికి తెలుసు. అయినా జీతం, సౌకర్యాల కారణంగా కొనసాగారు'' అని చెప్పారు శిఖా గోయల్.
పోలీసులు వీరందరినీ అరెస్టు చేయడంతో పాటు 63 ల్యాప్ టాప్‌లు, 52 సెల్ ఫోన్లు, 27 ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు ఉపయోగించే మోసానికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ మ్యూల్ అకౌంట్?
మ్యూల్ అకౌంట్ అంటే మనీ లాండరింగ్, మోసం, అక్రమంగా నిధులు బదిలీ చేసేందుకు ఉపయోగించే ఖాతాగా చెప్పవచ్చు.
''ఒకరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాను మరొక వ్యక్తి అనధికారికంగా నిర్వహించడం''గా చెప్పవచ్చని ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమళ్ల బీబీసీకి చెప్పారు.
ఇవి మూడు రకాలుగా ఉంటాయని ఆయన తెలిపారు.
''ఖాతాదారులకు తెలియకుండా నిర్వహించేవి, ఖాతాదారులకు తెలిసి నిర్వహించేవి, సైబర్ మోసగాళ్లు ఫిషింగ్, హ్యాకింగ్ ద్వారా నిర్వహించేవి'' అని అనిల్ చెప్పారు.
ఖాతా నిర్వహణ అనేది సదరు ఖాతాదారుడికి తెలిసి లేదా తెలియకుండా వేరొక వ్యక్తి నిర్వహించే వీలుందని వివరించారు. డబ్బు క్రిప్టో కరెన్సీగా మారిన తర్వాత వెనక్కి తీసుకురావడం దాదాపు అసాధ్యమని చెప్పారు.
''ఒక బ్యాంకు ఖాతా నుంచి వేరొక బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయితే తెలుసుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి క్రిప్టోగా మారితే అది ఎవరి ఖాతాలోకి వెళ్లిందో.. ఎక్కడికి వెళ్లిందో తెలిసే అవకాశం ఉండదు'' అని వివరించారు అనిల్ రాచమళ్ల.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సూచనలు పాటించండి
ప్రస్తుతం సైబర్ మోసాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని శిఖా గోయల్ సూచించారు.
అనధికారిక లేదా గుర్తు తెలియని వ్యక్తులకు మెయిల్స్, కాల్స్ ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదు.
ఏదైనా లావాదేవీలు చేస్తున్న సందర్భంలో కస్టమర్ కేర్ నంబర్లను అధికారిక వెబ్ సైట్ల ద్వారా నిర్ధరించుకోవడం మంచిది.
అనుమానిత మెయిల్స్‌ను క్లిక్ చేయడం, అటాచ్ మెంట్స్‌ను తెరవడం చేయకూడదు.
ఏదైనా అనధికారిక లావాదేవీ చేసినట్లుగా భావిస్తే, వెంటనే 1930 నంబరు లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














