'నా తండ్రి మత్తు మందు ఇచ్చి నాపైనా అత్యాచారం చేశాడు' - భార్యపై రేప్ కేసులో జైలులో ఉన్న తండ్రిపై కుమార్తె అభియోగం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లారా గోజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భార్యకు మత్తు మందు ఇచ్చి వేరే మగాళ్లతో ఆమెపై అత్యాచారం చేయించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డొమినిక్ పెలికోపై ఆయన కుమార్తె కరోలిన్ డారియన్ తీవ్రమైన అభియోగాలను మోపారు.
పదేళ్ల క్రితం భార్యకు మత్తు మందు ఇచ్చి 50 మంది పరాయి పురుషుల్ని ఇంటికి పిలిచి వారితో ఆమెపై అత్యాచారం చేసిన కేసులో డొమినిక్ పెలికోకు 2024 డిసెంబర్‌లో 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
భార్యపై పరాయి పురుషులు అత్యాచారం చేస్తున్న సమయంలో ఆయన అదంతా చిత్రీకరించారు. వందల కొద్దీ వీడియోలను హార్డ్ డిస్క్‌లో దాచారు.
ఆ హార్డ్ డిస్క్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలలో రెండు ఫోటోలు ఆయన కుమార్తెవి కూడా ఉన్నాయి.
అందులో తాను స్పృహ లేకుండా పడి ఉన్నానని, తన శరీరంపై కేవలం అండర్‌వేర్ మాత్రమే ఉందని 46 ఏళ్ల డారియన్ చెప్పారు.
ఆ ఫోటోల గురించి డొమినిక్ పెలికో పరస్పరం విరుద్ధమైన వివరణలు ఇస్తున్నారు. కుమార్తెను లైంగికంగా వేధించానన్న ఆరోపణను ఆయన తిరస్కరిస్తున్నారు.
తన తండ్రి తనకు కూడా మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
"ఆయన నాకు మత్తు మందు ఇచ్చారని నాకు తెలుసు. బహుశా నాపై లైంగిక దాడి చెయ్యడానికే కావచ్చు. అయితే నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు" అని ఆమె జనవరిలో బీబీసీతోచెప్పారు.
పోలీసులు మొదటి సారి తనకు ఆ చిత్రాలు చూపించినప్పుడు తాను నిర్ఘాంత పోయానని అన్నారు.
ఆమె ఆరోపణలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించనున్నారు. అయితే ఈ కేసులో విచారణ చేయాలా వద్దా అనే దానిపై ప్రాసిక్యూటర్లు తర్వాత నిర్ణయించనున్నారు.
డారియన్ తన తండ్రి మీద అభియోగాలు మోపడం తమకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని డొమినిక్ పెలికో లాయర్ బెట్రీస్ జవరో చెప్పారు.
పెలికో తన కుమార్తెకు డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశారనేందుకు 'సరైన కారణాలు' కనిపించలేదని గత విచారణలో ప్రాసిక్యూటర్లు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
కోర్టు రూమ్‌లో డొమినిక్ పెలికో ఆయన కుమార్తెకు మధ్య జరిగిన వాదనలు ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచం మొత్తాన్ని నిర్ఘాంతపోయేలా చేశాయి.
"నేను నిన్ను ఎప్పుడూ ముట్టుకోలేదు" అని పెలికో తన కుమార్తెను ప్రాథేయపడ్డారు. అయితే ఆమె "మీరు అబద్దాలు చెబుతున్నారు" అంటూ తండ్రిపై ఆమె గట్టిగా అరిచారు.


ఫొటో సోర్స్, Handout
పెలికో కేసులో తాను 'మర్చిపోయిన బాధితురాలిని ' అని డారియన్ గతంలోనూ చెప్పారు.
"నాపై డ్రగ్స్ కలిపి ఉన్న రసాయన పదార్ధాలను ప్రయోగించారు. అయితే దాన్ని ఎవరూ గుర్తించలేదు" అని అన్నారు.
లాయర్ ఫ్లోరెన్స్ రౌల్ట్‌ను తన కేసు వాదించేందుకు ఆమె ఎంచుకున్నారు.
లాయర్ రౌల్ట్ మహిళల మీద లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు న్యాయం కోసం 1990ల నుంచి పోరాడుతున్నారు.
మారియన్ అనే ఓ యువ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై 1999లో అత్యాచారం జరిగింది. ఈ కేసులో పెలికో దోషిగా తేలారు.
1991లో మరో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కూడా రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో పెలికోపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే ఆయన తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు.
మారియన్‌కు తనకు ఒకే రకమైన పోలికలు ఉన్నాయని డారియన్ చెప్పారు.
"మేమిద్దరం ఒకేలా కనిపిస్తాం. ఆమె లావుగా ఉంటారు. బాబ్డ్ హెయిర్ ఉంది. మేమిద్దరం ఒకే ఏడాదిలో పుట్టాం. నేను ఆమె న్యాయవాదిని కలిసి అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను" అని డారియన్ మీడియాతో చెప్పారు.
డారియన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనకు ఎన్నడూ జననేంద్రియాల పరీక్ష జరగలేదని, తన తల్లి జీసెల్‌కు చేసినట్లు డ్రగ్స్ టెస్ట్ కూడా జరగలేదని పేర్కొన్నట్లు ఫ్రెంచ్ మీడియా రిపోర్ట్ చేసింది. దీనిపై డారియన్ న్యాయవాది రౌల్ట్ విచారం వ్యక్తం చేశారు.
ఈ కేసులో దర్యాప్తు ఎక్కువగా జీసెల్ పెలికో మీద కేంద్రీకృతమైందని తన క్లయింట్ "ప్రాధాన్యం లేని బాధితురాలిగా" మారారని ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని రౌల్ట్ అధికారులను కోరారు.
జీసెల్ పెలికోపై సామూహిక అత్యాచారం కేసులో డొమినిక్ పెలికోతో పాటు 49 మందికి శిక్ష పడింది. వారందరూ లైంగిక దాడి అభియోగాల కింద దోషులుగా తేలారు. 17 మంది తమపై నమోదైన అభియోగాల మీద అప్పీలు చేస్తామని మొదట చెప్పారు. అయితే అందులో ఏడుగురు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
అప్పీలు విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నవారు ఈ ఏడాది చివర్లో దక్షిణ ఫ్రాన్స్‌లోని నైమ్స్‌లో విచారణకు వెళతారు.
జీసెల్ పెలికో సామూహిక అత్యాచారం కేసులో తొలి అప్పీలు మీద విచాచరణ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 2024 మధ్య జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














