'ప్రతివారం వందలాది పిల్లల అశ్లీల చిత్రాలు చూడాల్సి వస్తుంది'

ల్యాప్‌టాప్ స్క్రీన్ ముందు కూర్చున్న మహిళ
ఫొటో క్యాప్షన్, ఇంటర్‌నెట్‌ను సురక్షితంగా మార్చేందుకు ఆన్‌లైన్‌లోని పిల్లల అశీల్ల చిత్రాలను తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాబెల్ చెప్పారు.
    • రచయిత, జెమ్మా డన్‌స్టన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇంట్లో ఉన్నప్పుడు తన మనవళ్లు, మనవరాళ్లకు ప్రేమను పంచిపెడుతూ చక్కని సయమాన్ని గడిపే మాబెల్ తాను పనిచేసే చోట మాత్రం వేరే అవతారం ఎత్తుతారు. అక్కడ ఆమె అత్యంత దారుణమైన పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను ఇంటర్‌నెట్‌లో చూడాల్సి వస్తుంది.

ఇంటర్‌నెట్‌లో అసభ్యమైన పిల్లల చిత్రాలను గుర్తించి, వాటిని తొలగిచేందుకు పోలీసులకు,టెక్ సంస్థలకు సాయపడేందుకు లైసెన్స్ పొందిన కొన్ని సంస్థలలో ఒకదాంట్లో మాబెల్ పనిచేస్తున్నారు.

ఇంటర్‌నెట్ వాచ్ ఫౌండేషన్ (ఐడబ్ల్యూఎఫ్) కిందటేడాది రికార్డుస్థాయిలో 3 లక్షల వెబ్‌ పేజీల తొలగింపునకు సాయపడింది. వీటిల్లో కృత్రిమ మేథతో తయారైన అశ్లీల ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు ఇటీవల కాలంలో ఐదింతలు పెరిగాయి.

‘‘ఆ కంటెంట్ చాలా దారుణంగా ఉంటుంది’’ అని మాజీ పోలీసు అధికారిణి అయిన మాబెల్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''మీరు ఎన్నిసార్లు చూస్తున్నారనేది అసలు సమస్యే కాదు. అవి ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంటాయి. ఎందుకంటే వారంతా గాయపడిన పిల్లలు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని మాబెల్ అంటారు.

మాబెల్ (నిజమైన పేరు కాదు) ఆన్‌లైన్‌లో అత్యంత నీచమైన, దారుణమైన చిత్రాలను తొలగించేందుకు సాయపడుతున్నారు. తాను ఈ ఉద్యోగాన్ని చేయడానికి స్ఫూర్తి తన కుటుంబమే అంటారు ఆమె.

నార్త్ వేల్స్‌కు చెందిన మాబెల్, తానో 'నిరోధకురాలిని' అంటారు. అసభ్య చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే క్రిమినల్ గ్యాంగులకు అడ్డుగా నిలవడాన్ని ఆమె ఇష్టపడుతున్నారు.

ఈ పనిచేసేవారి గుర్తింపును సంస్థలు బయటపెట్టకపోవడం వల్ల, ఈ పనిని అడ్డుకోవాలనుకునేవారికి, క్రిమినల్ గ్యాంగుల నుంచి ఇబ్బంది ఉండటం లేదు.

‘‘నేను ఈ ఉద్యోగాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ పనిలో మంచి చేస్తున్నాను. చెడ్డవాళ్లను అడ్డుకుంటున్నాను. మంచి చెడుల ప్రపంచంలో నా పనిని సవ్యంగా చేస్తున్నాను’’

'' నేనో చిత్రాన్ని తొలగించానంటే, దాన్ని చూడాలనుకునే చెడ్డ వ్యక్తులను అడ్డుకున్నట్టే’’

‘‘నాకూ పిల్లలున్నారు. మనవలు,మనవరాళ్లున్నారు.ఇంటర్‌నెట్‌ను వారికో సురక్షితమైన ప్రాంతంగా మార్చాలనుకుంటున్నాను’’

'' ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలతో భాగస్వాములమై, వారి విచారణకు సహకరిస్తూ, క్రిమినల్ గ్యాంగ్స్‌ను అడ్డుకుంటాం’’

టామ్సిన్ మెక్‌నాలీ
ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ లాంటి సంస్థలలో పనిచేయడం ఎంతో ముఖ్యమని టామ్సిన్ మెక్‌నాలీ అభిప్రాయపడ్డారు.

కేంబ్రిడ్జ్‌కు చెందిన ఐడబ్ల్యూఎఫ్.. ఆన్‌లైన్‌లో పిల్లల అశీల్ల చిత్రాలను శోధించి తొలగించేందుకు లైసెన్స్‌ పొందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు సంస్థలలో ఒకటి. గత ఏడాది ఈ సంస్థ 2,91,270 వెబ్‌పేజీలను తొలగించింది. దీనిలో, పిల్లల అశీల్ల కంటెంట్‌కు చెందిన వేలాది చిత్రాలు, వీడియోలు ఉన్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏఐతో జనరేట్ చేసిన పిల్లల అశీల్ల చిత్రాలను సుమారు ఐదింతలు ఎక్కువ తొలగించింది.

ఏఐతో రూపొందిన చిత్రాలను అరికట్టేందుకు గత నెలలో బ్రిటన్ ప్రభుత్వం నాలుగు సరికొత్త చట్టాలను తీసుకొచ్చింది.

మహిళ

టామ్సిన్ మెక్‌నాలీకి, ఆమె 30 మంది బృందానికి ఈ కంటెంట్‌ను చూడటం అంత తేలికగా అనిపించలేదు. కానీ, తన పని పిల్లలను కాపాడుతుందని టామ్సిన్ మెక్‌నాలీకి తెలుసు.

‘‘ ఆ తేడా తెలుసు కనుకే నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నా.’’ అని టీమ్ లీడర్ తెలిపారు.

'' సోమవారం ఉదయం నేను హాట్‌లైన్‌లోకి నడుచుకుంటూ వెళ్లాను. అసభ్య చిత్రాలతో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రజల నుంచి వచ్చిన 2 వేలకు పైగా రిపోర్టులు వారి వద్ద ఉన్నాయి. ప్రతి రోజూ మా ముందుకు ఇలాంటి వందలాది రిపోర్టులు వస్తుంటాయి.'' అని టామ్సిన్ మెక్‌నాలీ చెప్పారు.

''ప్రతి ఒక్కరూ ఇది ఒక సమస్యగా చూడాలని నేను ఆశిస్తున్నా. ఇది జరగకుండా ఆదిలోనే అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు పాటుపడాలి.'' అని తెలిపారు.

'' నా ఉద్యోగం ఉండకూడదని నేను ఆశిస్తున్నా. కానీ, ఆన్‌లైన్‌లో వీటికి స్థానం ఉన్నంత వరకు, నాలాంటి ఉద్యోగులు అవసర పడతారు. ఇది దురదృష్టకరం.'' అని చెప్పారు.

'' నేను ఎలాంటి పనిచేస్తానో చెప్పినప్పుడు చాలా సందర్భాలలో ప్రజలు ఇలాంటి ఉద్యోగం ఒకటి ఉందా అని నమ్మేవారు కాదు. ఆ తర్వాత, ఇదెందుకు చేయాలనుకుంటున్నావు? అని అడుగుతారు.''

ఇంటర్నెట్
ఫొటో క్యాప్షన్, మాబెల్‌కు నెలవారీ కౌన్సిలింగ్ సెషన్లు, రెగ్యులర్‌గా మానసిక సపోర్టు అందిస్తుంటారు.

చాలా టెక్ సంస్థల మోడరేటర్స్ తమ ఉద్యోగం తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని కేసులు పెడుతున్నారు. కానీ ఫౌండేషన్ మాత్రం తమ మోడరేటర్ల సంరక్షణకు అద్భుతమైన ప్రమాణాలు పాటిస్తున్నామని చెబుతోంది.

అనలిస్టులుగా పనిచేసే వారికి ప్రతినెలా కౌన్సెలింగ్ ఇస్తుంటారు. వారం వారం టీమ్ మీటింగ్స్ ఉంటాయి. రెగ్యులర్‌గా వారికి మానసిక మద్దతు లభిస్తుంటుంది.

'' ఇవన్నీ అధికారికంగా జరిగేవి. అనధికారికంగా కూడా వారు స్వాంతన పొందేందుకు పూల్ టేబుల్ , జిగ్‌సా కార్నర్‌లు ఉంటాయి. నేను జిగ్‌సా గేమ్‌కు పెద్ద అభిమానిని. అవసరమైనప్పుడు నేను అక్కడే బ్రేక్ తీసుకుంటూ ఉంటాను'' అని మాబెల్ చెప్పారు.

ఇవన్నీ తామిక్కడ పనిచేసేందుకు సాయపడుతున్నాయని అన్నారు.

ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ బిల్డింగ్
ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులతో బీబీసీ మాట్లాడింది.

ఐడబ్ల్యూఎఫ్ కఠినమైన మార్గదర్శకాలను అనుసరిస్తుంది. ఆఫీసుల్లోకి లేదా మరేదైనా పని కోసం వ్యక్తిగత మొబైల్ ఫోన్లను కూడా అనుమతించదు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు మానన్, తానసలు ఈ ఉద్యోగం చేయగలుగుతానా? అని ఆలోచించారు.

''నేను కనీసం హర్రర్ ఫిల్మ్స్ కూడా చూడను. ఈ ఉద్యోగం చేయగలుగుతానో లేదో పూర్తిగా నాకు తెలియదు.'' అని మానన్ తెలిపారు. ఆమె ప్రస్తుతం 20ల్లో ఉన్నారు. సౌత్ వేల్స్‌కు చెందిన వ్యక్తి.

కానీ, ఇక్కడ సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

'' ప్రతీది నువ్వు చూడాల్సి ఉంటుంది. ఇంటర్‌నెట్‌ను మీరు సురక్షితమైన స్థలంగా మార్చాలి. '' అని అన్నారు.

యూనివర్సిటీలో మానన్ లింగ్విస్టిక్స్ చదివారు. ఆన్‌లైన్ భాష, గ్రూమింగ్‌పైన ఆమెకు తెలుసు. ఇదే ఫౌండేషన్‌లో పనిచేసేందుకు ఆమెకు ఆసక్తిని కలిగించింది.

'' నేరగాళ్లు తమనో ప్రత్యేక సమూహంగా భావించుకుంటూ ఉంటారు. వారికి సొంతంగా భాష లేదా కోడ్ ఉంటుంది. '' అని మానన్ చెప్పారు.

''నేను యూనివర్సిటీలో నేర్చుకున్న దాన్ని వాస్తవ ప్రపంచంలో ఆచరించడం ద్వారా పిల్లల అశీల్ల చిత్రాలను గుర్తించి, ఈ కమ్యూనిటీని ధ్వంసం చేయడం నిజంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది.'' అని మానన్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)