ప్రోటీసోమ్: రోగ నిరోధక వ్యవస్థలో కొత్త ఆయుధం - పాత ప్రొటీన్‌లను విచ్ఛిన్నం చేసి బ్యాక్టీరియాలపై దాడి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లఘర్
- హోదా, హెల్త్ కరెస్పాండెంట్
రోగ నిరోధక వ్యవస్థకు చెందిన ఒక కొత్త భాగాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పొటెన్షియల్ యాంటీబయాటిక్స్‌కు ఇదొక గోల్డ్ మైన్ వంటిదని శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రోటీన్లను రీసైకిల్ చేసే ఒక శరీర భాగానికి బ్యాక్టీరియాను చంపే రసాయనాలను వెదజల్లే ఒక సీక్రెట్ మోడ్ ఉందని వారు చూపించారు.
ఇన్ఫెక్షన్ల నుంచి మనం ఎలా రక్షణ పొందుతున్నామనే దానిపై మన అవగాహనను ఈ ఆవిష్కరణ మార్చేస్తుందని ఇజ్రాయెల్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు.
పెరుగుతున్న సూపర్‌బగ్‌ల సమస్యను పరిష్కరించడానికి యాంటీబయాటిక్స్ వైపు చూసేలా చేస్తుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న ఔషధాలకు ఈ సూపర్‌బగ్‌లు నిరోధకతను కలిగి ఉన్నాయి.

శరీరంలోని ప్రతీ కణంపై కనిపించే ఒక చిన్న నిర్మాణమైన ప్రోటీసోమ్‌పై ఈ ఆవిష్కరణ ఆధారపడి ఉంది.
ప్రోటీసోమ్ ప్రధాన విధి పాత ప్రోటీన్లను చిన్న ముక్కలుగా చేయడం. ఇలా ముక్కలైన ప్రొటీన్లు రీసైకిల్ ప్రక్రియ ద్వారా కొత్త ప్రొటీన్లుగా తయారవుతాయి.
ఒక కణానికి బ్యాక్టీరియా సోకినప్పుడు ఈ ప్రోటీసోమ్ గుర్తిస్తుందని నేచర్ జర్నల్‌లో పేర్కొన్న కొన్ని ప్రయోగాలు చూపుతున్నాయి.
తర్వాత ఇది నిర్మాణం, పాత్రను మార్చుతుంది. పాత ప్రోటీన్లను ఆయుధాలుగా మార్చడం మొదలుపెడుతుంది. ఆయుధాలుగా మారిన ఈ ప్రోటీన్లు బ్యాక్టీరియా బయటి పొరలను చీల్చి వాటిని చంపగలవు.

ఫొటో సోర్స్, Weizmann Institute of Science
దీని గురించి వీమన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ ఈఫత్ మెర్బల్ బీబీసీతో మాట్లాడారు.
''ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు. ఇమ్యూనిటీకి సంబంధించిన ఒక కొత్త ప్రక్రియను మేం కనుగొన్నాం. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా మనం రక్షణ పొందేలా చేస్తుంది. శరీరమంతా ఉన్న అన్ని కణాల్లో ఈ ప్రక్రియ జరిగి ఒక కొత్త సహజ యాంటీబయాటిక్స్‌ను ఉత్పత్తి చేస్తుంది'' అని ఈఫత్ వివరించారు.
'డంప్‌స్టర్ డైవింగ్' అనే ఒక ప్రక్రియ ద్వారా పరిశోధక బృందం ఈ సహజ యాంటీబయాటిక్స్‌ను కనుగొంది.
ప్రయోగశాలలో పెరుగుతున్న బ్యాక్టీరియాపై, న్యుమోనియాతో పాటు సెప్సిస్ ఉన్న ఎలుకలపై వారు ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో ఇప్పటికే రుజువైన యాంటీబయాటిక్స్‌తో సరిపోలే ఫలితాలు వస్తున్నట్లు వారు చెప్పారు.
పరిశోధకులు ప్రయోగశాలలోని కణాలను తీసుకొని అందులోని ప్రోటీసోమ్‌ను నిర్వీర్యం చేసినప్పుడు, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా సంక్రమణం చాలా సులభం అయింది.

ఫొటో సోర్స్, Weizmann Institute of Science
పరిశోధనా ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ హెడ్, ఇమ్యూనాలజిస్ట్ ప్రొఫెసర్ డేనియల్ డేవిస్ అన్నారు. ఇన్ఫెక్షన్లపై మన శరీరం ఎలా పోరాడుతుందనే దానిపై మనకున్న అవగాహనను ఇవి మార్చేశాయని వ్యాఖ్యానించారు.
''ఇది పూర్తిగా ఎప్పుడు ఆవిష్కృతం కాని ప్రక్రియ. అందుకే చాలా ఉత్తేజకరంగా ఉంది. మన కణాల్లో యాంటీ జెర్మ్ అణువులు తయారయ్యే ప్రక్రియను ఇప్పటివరకు ఎవరూ ఆవిష్కరించలేదు. ఈ పరిశోధనతో అది ఆవిష్కృతం కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది'' అని ఆయన అన్నారు.
యాంటీ బయాటిక్స్‌కు కొత్త వనరుగా ఈ పరిశోధనను మార్చడం అనే అంశంపై ఇంకా పరీక్షించాల్సిన అవసరం ఉందని, దీనికి సమయం పడుతుందని సూచించారు.
యాంటీబయాటిక్స్ వంటి ఔషధాలకు నిరోధకత కలిగి ఉండే ఇన్ఫెక్షన్ల వల్ల ఏటా పది లక్షల మందికి పైగా చనిపోతున్నారని అంచనా.
యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నప్పటికీ, డిమాండ్‌కు సరిపడా కొత్త యాంటీబయాటిక్స్ అభివృద్ధి జరుగట్లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఆవిష్కరణ కొంతమంది శాస్త్రవేత్తల్లో ఆశలను రేకెత్తిస్తుంది.
''కొత్త యాంటీబయాటిక్స్‌కు ఇదొక బంగారుగని లాంటిది. కొత్త యాంటీబయాటిక్స్‌ను కనుగొనేందుకు గతంలో ప్రయత్నించారు. కానీ, మనలోనే ఇది ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది'' అని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన మైక్రోబయాలజీ సీనియర్ లెక్చరర్ డాక్టర్ లిండ్సే ఎడ్వర్డ్స్ అన్నారు.
ఇవి మానవ శరీరంలోనే ఉండటంతో వాటిని ఔషధాలుగా అభివృద్ధి చేయడంలో తక్కువ సమస్యలు ఉండొచ్చని ఆమె అంచనా వేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














