భారత్ vs ఆస్ట్రేలియా: మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించిన ఆ రెండు ఓవర్లు, ఎలాగంటే

స్టీవ్ స్మిత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టీవ్ స్మిత్
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'స్మిత్, అలెక్స్ కేరీలలో ఏ ఒక్కరు నిలబడినా ఆసీస్ మరో 30 పరుగులు అదనంగా చేసేది'.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ అనంతరం ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలివి.

స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై 290కి పైగా పరుగులంటే భారత జట్టు ఛేదించడానికి ఇబ్బంది పడేది. కానీ, అలా జరగలేదు. కారణం ఆ రెండు కీలక ఓవర్లు.

ఆ రెండు ఓవర్ల కారణంగానే ఆస్ట్రేలియా జట్టును 264 పరుగులకే కట్టడి చేయగలిగింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటర్లు విరాట్ కోహ్లీ (84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్‌(42) రాణించడంతో భారత జట్టు టార్గెట్‌ను ఛేదించింది.

ఇంతకీ మ్యాచ్ ఎలా భారత్ వైపు తిరిగింది, ఆ రెండు ఓవర్లలో ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొహమ్మద్ షమీ, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత బౌలర్ మొహమ్మద్ షమీ 37వ ఓవర్ బౌలింగ్ చేశాడు.

టీమిండియాలో జోష్ నింపిన ఓవర్లు

ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీలు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. 36వ ఓవర్ వరకు ఆ జట్టు నాలుగే వికెట్లు కోల్పోయి 195 పరుగులతో పటిష్టంగా ఉంది. అప్పటికే కెప్టెన్ స్మిత్ 71 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుని ఉన్నాడు.

ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోందనుకుంటున్న తరుణంలో షమీ భారత జట్టుకు టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు, ఆసీస్ జోరుకు కళ్లెం వేశాడు.

37వ ఓవర్ వేసిన షమీ, నాలుగో బంతిని ఫుల్ టాస్‌ వేశాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్మిత్(73) క్లీన్ బౌల్డ్ అయ్యాడు . దీంతో భారత శిబిరంలో ఉత్సాహం వచ్చింది. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చాడు హిట్టర్ మ్యాక్స్‌వెల్.

ఇక, 38 ఓవర్ వేయడానికి బంతిని అందుకున్నాడు అక్షర్ పటేల్. స్ట్రైకింగ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ ఆ ఓవర్ రెండో బంతిని సిక్సర్ కొట్టాడు. అయితే, మరుసటి బంతికే 'ఆసీస్ సమీకరణాలు' మారిపోయాయి.

అక్షర్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్షర్ పటేల్ కీలక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 27 పరుగులు చేశాడు.

మూడో బంతికి మ్యాక్స్‌వెల్‌(7) ను క్లీన్ బౌల్డ్ చేశాడు అక్షర్. ఇలా, రెండు ఓవర్ల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది ఆసీస్.

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ భారీ స్కోరుకు కళ్లెం పడింది. మ్యాక్స్‌వెల్ ఔటైన తర్వాత ఆ జట్టు కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మైఖేల్ క్లార్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైఖేల్ క్లార్క్

మరో 30 పరుగులు వచ్చేవి: మైఖేల్ క్లార్క్

దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ కూడా స్పందించారు.

'జీయోస్టార్'లో మాట్లాడుతూ.. స్మిత్, అలెక్స్ కేరీ వికెట్లు ఆసీస్ జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేశాయన్నారు.

వారిలో ఏ ఒక్కరు సెంచరీ సాధించినా బాగుండేదని, ఆసీస్ అదనంగా మరో 30 పరుగులు చేసేదని ఆయన అభిప్రాయపడ్డారు.

37వ ఓవర్ గురించి మాట్లాడుతూ.. క్లాస్ బౌలింగ్‌తో స్మిత్ వికెట్ తీశాడని షమీని అభినందించాడు. ఫీల్డింగ్‌లో శ్రేయస్ అయ్యర్ చక్కని త్రో విసిరి కేరీని ఔట్ చేశాడని క్లార్క్ అన్నాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ స్మిత్..తమ బ్యాటర్లు మరికొన్ని పరుగులు చేయాల్సిందని, కీలక సమయంలో వికెట్లు కోల్పోయామని అభిప్రాయపడ్డాడు.

''ఇండియాను అడ్డుకోవడానికి మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడానికి ప్రయత్నించడంతో మ్యాచ్ చివరి వరకు వచ్చింది. బ్యాటింగ్‌లో మేం కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. 280కు పైగా పరుగులు చేస్తే పరిస్థితి మరోలా ఉండేది'' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో షమీ మూడు వికెట్లు తీయగా, జడేజా, వరుణ్ చక్రవర్తి చెరి రెండు వికెట్లు, హార్దిక్, అక్షర్ పటేల్‌లు చెరొక వికెట్ తీశారు.

దుబయి, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ

దుబయిలోనే ఫైనల్

చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. భారత్ తన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. ఇపుడు సెమీస్ కూడా గెలిచింది.

ఇక, రెండవ సెమీ-ఫైనల్ బుధవారంనాడు దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ జట్ల మధ్య పాకిస్తాన్‌లో జరగనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 9న భారత్‌తో తలపడుతుంది. ఫైనల్ కూడా దుబయిలోనే జరగనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)