ఆటిజం మహిళను అన్యాయంగా 45 ఏళ్లు మెంటల్ హాస్పిటల్‌లో బంధించారు, చివరకు..

ఆటిజం, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కసిబ్బాను విడుదల చేయించడానికి తొమ్మిదేళ్ల సమయం పట్టింది.
    • రచయిత, కరోలిన్ అట్కిన్‌సన్, బెన్ రాబిన్‌సన్
    • హోదా, ఫైల్ ఆన్ 4 ఇన్వెస్టిగేట్స్

ఆటిజం(లెర్నింగ్ డిజబులిటీ - అభ్యాస లోపం)తో బాధపడుతున్న మహిళను అన్యాయంగా 45 ఏళ్ల పాటు పిచ్చాసుపత్రిలో బంధించారని, ఏడేళ్ల వయసు నుంచే ఆమెను మానసిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారని బీబీసీకి తెలిసింది.

ఆమె ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగం కసిబ్బా అని పిలుస్తున్నారు. ఆమె సియెర్రా లియోన్‌కు చెందినవారని భావిస్తున్నారు.

కసిబ్బా మాట్లాడలేరు, ఆమెతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. ఆమెను విడిపించడానికి తన 9 ఏళ్ల పోరాటం ఎలా ప్రారంభమైందో క్లినికల్ సైకాలజిస్ట్ 'ఫైల్ ఆన్ 4 ఇన్వెస్టిగేట్స్‌'తో చెప్పారు.

వైకల్యం ఉన్న చాలా మంది ఇప్పటికీ మానసిక చికిత్స ఆస్పత్రుల్లో ఉంటున్నారని, అది ఆమోదయోగ్యం కాదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ బీబీసీతో చెప్పింది. మానసిక ఆరోగ్య చట్టంలో సంస్కరణలు ఇలాంటివాటికి అడ్డుకట్టవేస్తాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆటిజం, మానసిక ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, కసిబ్బా విడుదల కోసం తొమ్మిదేళ్ల పాటు ప్రయత్నించిన డాక్టర్ స్టైట్

ఆటిజం, ఇతర వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు వేల మందికి పైగా బాధితులు ఇప్పటికీ ఇంగ్లండ్‌లోని మానసిక చికిత్స ఆస్పత్రుల్లో నిర్బంధంలో ఉన్నారు. వారిలో 200 మంది పిల్లలు. మానసిక అనారోగ్యం లేని వారిని కమ్యూనిటీ కేర్‌కు తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

బ్రిస్టల్ దగ్గరలోని వింటర్ బోర్న్ వ్యూ ప్రైవేట్ ఆస్పత్రిలో లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న వారిపై నేరాలు జరుగుతున్నాయని 2011లో బీబీసీ అండర్ కవర్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దీనిపై చర్యలు తీసుకుంటామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కానీ, ఆ లక్ష్యాలేవీ నెరవేరలేదు.అయితే, కొద్దివారాల కిందట ఎన్‌హెచ్‌ఎస్ విడుదల చేసిన 2025-26 ప్రణాళికల్లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్‌పేషంట్లను తగ్గిస్తామని, కనీసం 10 శాతం తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొంది.

''వందలాది మంది ఇప్పటికీ బాధలు పడుతున్నారు. నిర్బంధంలో ఉన్నారు. వారికి స్వేచ్ఛ కల్పించాలి.అండగా నిలవాలి. మనకు హామీ ఇచ్చినట్టుగా పురోగతి కనిపించడం లేదు'' అని చారిటీ మెన్‌కాప్‌లో విధానాలు, పబ్లిక్ వ్వయహారాల అధిపతి డాన్ స్కోరర్ చెప్పారు.

క్లినికల్ సైకాలజిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో, సాధారణ సమీక్షలో భాగంగా డాక్టర్ పాత్సీ స్టైట్ 2013లో కసిబ్బా ఖైదు గురించి తెలుసుకున్నారు. కానీ, ఆమెను విడిపించడానికి తొమ్మిదేళ్లు పట్టింది.

''తను జీవిస్తున్నలాంటి పరిస్థితుల్లో ఇంకెవ్వరినీ నేను చూడలేదు. అన్నింటికన్నా నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం అదంతా చట్టబద్ధంగా జరుగుతోంది'' అని డాక్టర్ స్టైట్ బీబీసీతో చెప్పారు. ''కసిబ్బా కొన్నిసార్లు రోజులో 23 గంటలు సంకెళ్లతోనే ఉండేవారంటే, చట్టబద్ధమైన ఆస్పత్రి వాస్తవంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు'' అని ఆమె అన్నారు.

కసిబ్బా గుర్తింపును బయటపెట్టకుండా రక్షణ కల్పించే క్రమంలో ఆస్పత్రి పేరు చెప్పడం లేదు. ఆ ఆస్పత్రి ప్రదేశం ఎలా ఉండేదంటే, అక్కడ ఒక కంచె ఉండేది. ఆ కంచెకు ఒక రంధ్రం ఉంది. దీంతో తనను నిర్బంధించిన గది నుంచి కసిబ్బా బయటకు చూడగలిగేవారు. బయట ప్రజలు నడుస్తుండడం ఆమెకు కనిపించేది.

ఆటిజం, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడేళ్ల వయసు నుంచి మానసిక చికిత్సా కేంద్రంలో ఉన్న కసిబ్బా

కసిబ్బా ప్రమాదకరమైన వ్యక్తా?

కసిబ్బా ఇప్పుడు 50ల్లో ఉన్నారు. ఐదేళ్ల వయసులోపే ఆమెను సియెర్రా లియోన్ నుంచి అక్రమంగా తరలించారని భావిస్తున్నారు. కొంతకాలం ఆమె పిల్లల సంరక్షణాలయంలో ఉన్నారు. కానీ, ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు అక్కడి నుంచి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కసిబ్బా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఇతరుల కళ్లపై దాడి చేస్తుందని అక్కడి సిబ్బంది చెప్పారని డాక్టర్ స్టైట్ తెలిపారు.

ఆమెపై ఇలా హింసాత్మక ఆరోపణలు చేయడానికి దారితీసిన ఓ ఘటనను రికార్డుల్లో ఆమె గుర్తించారు. కసిబ్బాను దీర్ఘకాలిక నిర్బంధంలోకి పంపక ముందు, ఆమె వయసు 19 ఏళ్లున్నప్పుడు ఓసారి ప్రమాదాన్ని సూచించే అలారం మోగింది. తాళం వేసి ఉన్న వార్డును ఖాళీ చేయిస్తున్నారు.

అలసటగా, గందరగోళంగా ఉన్న కసిబ్బా మరో రోగిని పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆమెకు గీరుకుపోయింది. ఆ రోగి కంటికి గాయమైంది.

''అప్పటి నుంచి ఇతరుల కళ్లకు హానిచేసే వ్యక్తిగా(ఐ గౌగర్), తోటివారిని గాయపర్చే వ్యక్తిగా ఆమె గురించి చెప్పడం మొదలైంది'' అని డాక్టర్ స్టైట్ చెప్పారు. ''కానీ అది నిజం కాదు. అసలు నిజం ఏంటంటే... లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న ఓ మధ్య వయసు మహిళ ఆస్పత్రిలో దశాబ్దాల పాటు నివసిస్తే ప్రమాదకరంగా మారొచ్చు'' అని ఆమె అన్నారు.

ఆటిజం, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కసిబ్బాను ఆస్పత్రి నుంచి విడుదల చేయించేందుకు ఎస్కేప్ కమిటీ ఏర్పాటైంది.

కసిబ్బా కోసం 'ద ఎస్కేప్ కమిటీ'

నెలలపాటు కసిబ్బాను పరిశీలించిన తర్వాత, ఆమెను ఆస్పత్రిలో ఉంచిన ఉత్తర లండన్‌లోని స్థానిక అధికార యంత్రాంగం అయిన 'క్యామ్‌డెన్ కౌన్సిల్‌'కు డాక్టర్ స్టైట్ 50 పేజీల నివేదిక సమర్పించారు. కసిబ్బాకు మానసిక అనారోగ్యం లేదన్న విషయం ఇప్పటికే తేలిందని, ఆమె ప్రమాదకరమైన వ్యక్తి కాదని, సమాజంలో ఆమె సురక్షితంగా నివసించవచ్చని స్టైట్ నివేదిక సమర్పించారు.

ఆ తర్వాత ఆరోగ్య, సామాజిక భద్రతా నిపుణులతో 2016లో ఓ బృందం ఏర్పాటైంది. ఆ బృందానికి ''ద ఎస్కేప్ కమిటీ'' అని పేరు పెట్టారు. కసిబ్బాకు స్వేచ్ఛ కల్పించడం ఈ బృందం పని.

చేంజింగ్ అవర్ లైవ్స్ అనే హక్కుల సంస్థకు చెందిన లూసీ డన్‌స్టాన్ కసిబ్బా కోసం స్వతంత్రంగా వాదించేందుకు సిద్ధమయ్యారు. కసిబ్బా ఆస్పత్రిని ఎందుకు వీడాలి అనే అంశంపై కేసును బలంగా నిర్మించారు.

అయితే, మానసిక సామర్థ్యంలేని వ్యక్తులపై నిర్ణయం తీసుకునే కోర్టు రక్షణ ద్వారా మాత్రమే కసిబ్బా విడుదల కాగలరు.

కసిబ్బాను తాను మొదటిసారి కలిసినప్పుడు ఆస్పత్రి సిబ్బంది ఆమెను తనకు ''ద ఐ- గౌగర్' అని పరిచయం చేశారని డన్‌స్టాన్ చెప్పారు.

కసిబ్బాను బంధించి ఉంచిన గది తలుపుకు ఉన్న ఒక చిన్న కిటికీ గుండా కసిబ్బాను చూశానని ఆమె గుర్తు చేసుకుంటూ చెప్పారు. ''ఆమె సోఫాలో పడుకుని ఉన్నారు. అది ఖాళీ గది. ఆమె జీవితం చాలా దుర్భరంగా ఉంది''అని డన్‌స్టాన్ తెలిపారు.

‘ఇలా జరిగి ఉండాల్సింది కాదు’

కసిబ్బాను ఆస్పత్రి నుంచి బయటకు పంపించవచ్చని కోర్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ నుంచి డన్‌స్టాన్‌కు కాల్ వచ్చే సమయానికి.. వారిద్దరూ మొదటిసారి కలుసుకుని ఆరేళ్లు అయ్యుండొచ్చు. ''నేను ఏడ్డాను, సంతోషపడ్డాను. హమ్మయ్యా అనుకున్నా. ఆమె మీద అభిమానం కలిగింది. ఆమెను చూసి గర్వంగా అనిపించింది'' అని డన్‌స్టాన్ చెప్పారు.

సహాయకుల సాయంతో కసిబ్బా కమ్యూనిటీలో నివసిస్తున్నారు. వారు ఆమెకు సంజ్ఞలు, స్పష్టమైన భాష, మర్యాదపూర్వక ప్రవర్తన గురించి తెలియజేస్తున్నారు. కసిబ్బాకు ఫ్యాషన్ అంటే ఇష్టమని, కమ్యూనిటీని తన ఇల్లులా భావిస్తున్నారని, అందరితో కలివిడిగా ఉండడాన్ని ఇష్టపడుతున్నారని ఆమె భద్రతా మేనేజర్ చెప్పారు.

''ఆమెకు అద్భుతమైన హాస్య చతురత ఉంది. మంచి మనిషి. రెండు వారాలు ఇక్కడ ఆమెతో కలిసి పనిచేసిన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అది ఐ గౌగర్ కాదు...'' అని మేనేజర్ తెలిపారు.

నేర్చుకునే సామర్థ్యం లేని ఆటిజం వ్యక్తులకు మానసిక అనారోగ్యం లేకపోతే వారిని చికిత్స కోసం నిర్బంధించకూడదనే మానసిక ఆరోగ్య బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

కసిబ్బా తన జీవితంలో ఎక్కువభాగం ఆస్పత్రిలో గడపడం విషాదకరం అని క్యామ్‌డెన్ కౌన్సిల్‌లో పెద్దల ఆరోగ్య విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెస్ మెక్‌గ్రెగర్ అన్నారు. ''నేను వ్యక్తిగతంగా క్షమించమని అడుగుతున్నా. కసిబ్బా విషయంలో అలా జరిగి ఉండాల్సింది కాదు'' అని జెస్ అన్నారు.

తాము కసిబ్బాకు అన్ని రకాల భద్రత అందించామని, కేర్ క్వాలిటీ కమిషన్ అత్యుత్తమ రేటింగ్ ఇచ్చిందని ఎన్‌హెచ్ఎస్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ తెలిపింది.

ఎవరికైనా దీర్ఘకాలిక నిర్బంధం అవసరమని తేలితే.. వారికి బెడ్‌రూమ్, బాత్‌రూమ్, లివింగ్ రూమ్, గార్డెన్‌ వంటి సౌకర్యాలతో నివాసం ఏర్పాటు చేస్తామని ఫైల్ ఆన్ ఫర్ ఇన్వెస్టిగేట్స్‌తో ట్రస్ట్ చెప్పింది.

చాలా కాలం నివిస్తున్నవారిని డిశ్చార్జ్ చేసేందుకు, వారికి మరింత భద్రత అందేలా కమ్యూనిటీకి తరలించేందుకు స్థానిక అధికారులతో కలిసి 2010 నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని ట్రస్ట్ తెలిపింది. ఇతర రోగుల కుటుంబాలు వేసిన న్యాయపరమైన కేసుతో తమ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపింది.

అవసరమైన వారిని కమ్యూనిటీకి తరలించేలా అధికారులకు సహకరించామని, ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేశామని తెలిపింది. 2023 నాటికి విజయవంతంగా ఇది చేయగలిగామని ట్రస్ట్ చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)