నలంద: ఈ మహా విద్యాలయం ఎలాంటి ప్రభావం చూపింది, ప్రపంచాన్ని ఎలా మార్చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభయ్.కె
- హోదా, చరిత్రకారుడు, బీబీసీ కోసం
ఒకప్పటి నలంద భవనాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. నలంద మహావిహారం 14వ శతాబ్దం నుంచి పని చేయడం లేదు. కానీ, దాని వారసత్వం నేటికీ వివిధ అధ్యయన రంగాలలో ముందుకు సాగుతోంది.
సైన్స్, మెడిసిన్, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం, తర్కం, వ్యాకరణం, లిపి, పుస్తకాలు, అనువాదం, సాహిత్యం, కళ, వాస్తుశిల్పం అభివృద్ధిలో నలంద ముఖ్యమైన పాత్ర పోషించింది.
నలందలో మొదటి విహారాన్ని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి స్థాపించారు. మౌర్యుల కాలంలో నలంద విహారాన్ని నిర్మించినప్పుడు, విద్యార్థులు నివసించడానికి, చదువుకోవడానికి ఒక అభ్యాస సంస్థగా దానిని రూపొందించారు. ఆధునిక భాషలో దీనిని 'రెసిడెన్షియల్ సిస్టమ్' అంటారు.
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల స్క్వేర్ క్యాంపస్‌లతో సహా యూరప్‌లోని అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల డిజైన్‌లకు నలందే ప్రేరణగా భావిస్తుంటారు.
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మహావిహారంగా స్థాపించినప్పటి నుంచి నలంద ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో అభివృద్ధి చెందింది.
ఇందులో అనేక విహారాలు, మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు, చతురస్రాకార విహారాలు, అంతర్జాతీయ విద్యార్థుల కోసం సదుపాయాలు ఉన్నాయి. ఇది లౌకిక అంశాలతో సహా అనేక రకాల విషయాలను బోధించేది. ఆ కాలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు ఈ విహారంలో ఉండేవారు.
విశ్వవిద్యాలయాల భావన శతాబ్దాలుగా పరిణామం చెంది మధ్య ఆసియా, యూరప్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించిందో చెప్పడానికి నలంద ఒక ఉదాహరణ.


ఫొటో సోర్స్, Getty Images
ఆర్యభట్ట నేతృత్వంలో..
నలందలో నాగార్జున, వసుబంధు, శాంతరక్షిత, కమలాశిల వంటి గొప్ప పండితులు మధ్యయుగ శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి దారితీసిన మాండలిక తార్కిక (వాదన తర్వాత ప్రతివాదం) వ్యవస్థను అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు. ఈ విధానం మధ్య ఆసియాకు చివరికి అరబ్ ప్రపంచం, ఐరోపాకు వరకు వ్యాపించి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేసింది.
భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆర్యభట్ట ఆరవ శతాబ్దంలో నలందలో పని చేసిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన 'ఆర్యభట్టీయ' అనే మూల గ్రంథాన్ని రచించారు. సున్నాను సంఖ్యగా గుర్తించిన మొదటి గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట. ఇది లెక్కలనుసులభతరం చేసింది. తరువాత బీజగణితం, కాలిక్యులస్ విధానాలకు దారితీసింది.
ఆర్యభట్ట తర్వాత ఆయన విధానాలను బ్రహ్మగుప్తుడు ముందుకు తీసుకెళ్లారు. ఆయన 'బ్రహ్మస్ఫుట సిద్ధాంతం' రచించారు. దీనిని 8వ శతాబ్దంలో అరబిక్‌లోకి 'సింహింది' పేరుతో అనువదించారు.
ఇది భారతీయ సంఖ్యలు, బీజగణితం, కాలిక్యులస్, అల్గారిథం, భారత ఖగోళ శాస్త్రాన్ని యూరప్‌కు పరిచయం చేసింది. గణితం, ఖగోళ శాస్త్ర రంగాలలో నలంద ప్రభావం చైనాలో ఎక్కువగా ఉంది.
665, 698 ఏడీ మధ్య చైనా ఖగోళ శాస్త్ర బ్యూరో ఆ సమయంలో గౌతమ సిద్ధార్థ నేతృత్వంలో ఉంది.
ప్రభుత్వంలో ఉపయోగించే అధికారిక క్యాలెండర్‌ను రూపొందించడానికి, చక్రవర్తి అయిన వు జెటియన్ కోసం జ్యోతిష్య, అతీంద్రియ సంకేతాలకు ఖగోళ శాస్త్ర వివరణలను అందించడానికి ఆయన పనిచేశారు.
నలందలో అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధమతం 7వ, 8వ శతాబ్దాలలో చైనాలో ఒక ముఖ్యమైన శక్తిగా మారింది. చాలామంది అగ్రశ్రేణి చైనా మేధావులు ఈ విధానాన్ని అనుసరించేవారు. చాలామంది తాంత్రిక పండితులు అప్పటి చైనీస్ గణిత శాస్త్రజ్ఞులపై బలమైన ప్రభావాన్ని చూపారు.
ఐ సింగ్ లేదా యీ షింగ్ అనే వ్యక్తి చైనీస్ తాంత్రిక బౌద్ధ సన్యాసి. ఆ కాలంలో (672–717 ఏడీ) షింగ్ గొప్ప ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు. నలందలో రాసిన గణితం, ఖగోళ శాస్త్ర రచనలను ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Sugato Mukherjee/BBC
సంస్కృతిపై ప్రభావం
మాధ్యమిక, యోగాచార అనే రెండు రెండు ప్రధాన మహాయాన బౌద్ధ తత్వాల అభివృద్ధి, పరిణామాలలో నలంద ప్రధాన పాత్ర పోషించింది. నలందకు శతాబ్దాలుగా యోగాచారతో కొనసాగిన అనుబంధం యోగాచార తత్వశాస్త్రం సూత్రాలపై ఆధారపడిన ‘తంత్రాయణం’ అని పిలిచే ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటుకు దారితీసింది.
నలందలో 'యోగాచార-మాధ్యమిక' అని పిలిచే ఒక కొత్త తత్వశాస్త్రాన్ని శాంతరక్షిత అభివృద్ధి చేశారు.
నలందలో అభివృద్ధి చెందిన తత్వాలను దక్షిణ, మధ్య ఆసియా, సమీప తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలకు వ్యాప్తి చేయడంలో, ఈ దేశాల ప్రజల సాంస్కృతిక, మతపరమైన స్వభావాన్ని రూపొందించడంలో నలంద ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఐదవ శతాబ్దం నాటికి నలంద కళలకు ప్రధాన కేంద్రంగా మారింది.
నలందలో తయారైన కళాఖండాలు స్థానిక కళ స్వభావాన్ని అలాగే మథుర, సారనాథ్ ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి. 8వ శతాబ్దంలో ఇది 'నలంద స్కూల్ ఆఫ్ ఆర్ట్' అని పిలిచే ఒక ప్రత్యేక విభాగంగా పరిణామం చెందింది. ఇది తూర్పు, ఆగ్నేయాసియా దేశాల కళలపై ప్రభావం చూపింది.
వజ్రయాన తత్వశాస్త్రంలో భాగంగా తాంత్రిక బౌద్ధ సూత్రాలతో త్రిమితీయ మండలాలను రూపొందించే ఆలోచనను నలందలో అభివృద్ధి చేశారు. బిహార్‌లోని కేసరియా బౌద్ధ స్తూపాల నిర్మాణంతో పాటు జావాలోని ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్మారక చిహ్నం బోరోబుదూర్‌లో ఈ విధానాన్ని ఉపయోగించారు. అంతేకాదు, నలంద ఆచార్యులు సంస్కృతం కూడా వాడటం ద్వారా దాని అభివృద్ధికి కారకులయ్యారు.
తత్వ సూత్రాలను కాపీ చేసి వివిధ భాషల్లోకి అనువదించే సంప్రదాయం కూడా నలంద మహావిహారంలో ఉంది. ఇదిశతాబ్దాల పాటు ఇతర దేశాలకు ఉపయోగపడింది. టిబెట్ సంస్కృతి, భాష దీనికి సజీవ ఉదాహరణ. నలంద మహావిహారంలో టిబెటన్ పండితుడు తోన్మీ సంభోత చదువుకున్నారు. ఆయన దేవనాగరి, కశ్మీరీ లిపిల ఆధారంగా టిబెటన్ భాష కోసం లిపులను అభివృద్ధి చేశారు.
8వ,13వ శతాబ్దాల మధ్య నలంద మహావిహారానికి చెందిన 84 మంది సిద్ధులు, జైన సాధువులు అపభ్రంశ అనే భాషలో సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. దోహా, చౌపాయ్, పద్ధారి వంటి కొత్త కవితా రూపాలను అందించారు.

ఫొటో సోర్స్, Dinodia Photos/Alamy
మౌఖిక నుంచి లిఖిత
మాన్యుస్క్రిప్ట్ రైటింగ్, డ్రాయింగ్, ప్రిజర్వేషన్, కాపీ రైటింగ్ కళను అభివృద్ధి చేయడంలో నలంద ప్రధాన పాత్ర పోషించింది. ఆ విధంగా నలంద ప్రపంచవ్యాప్తంగా లిఖిత సంప్రదాయం వేగంగా మారడానికి కారణమైంది.
ప్రజ్ఞాపారమిత సూత్రంలో ఒక భాగమైన "ది డైమండ్ సూత్ర" అనేది మొట్టమొదటిగా తెలిసిన ముద్రిత రచనలలో ఒకటి. ఆచార్య నాగార్జున దీనిని నలందలో రాసినట్లు భావిస్తున్నారు. నలందకు సంబంధించిన మరొక ముఖ్యమైన ఆవిష్కరణ ధమ్మచక్ర.
నలంద వైద్య శాస్త్రం తూర్పు ఆసియా ముఖ్యంగా చైనా వైద్య సంప్రదాయాలను ప్రభావితం చేసింది. ఈ నలంద వైద్య శాస్త్రం, అక్కడ అభ్యసిస్తున్న అధునాతన నేత్ర వైద్యంతో సహా టాంగ్ చైనాకు చేరుకుంది. టాంగ్ చైనా అనేది టాంగ్ రాజవంశం సమయంలో చైనా అని అర్ధం.
తొలి శతాబ్దంలో ఆచార్య నాగార్జున రాసిన 'రసరత్నాకర'ను భారతీయ మొదటి రసాయన శాస్త్ర పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఇతర ఆరోగ్య సంబంధిత శాస్త్రాలలో నలంద ఉత్తమ విధానాలను టిబెట్, నేపాల్, చైనా, కొరియా, జపాన్, మంగోలియా సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఆమోదించారు.
8వ శతాబ్దం తర్వాత నలంద మహావిహారంలో అభివృద్ధి చేసిన వజ్రయాన సంప్రదాయానికి చెందిన తాంత్రిక బౌద్ధ గ్రంథాలలో హఠ యోగాకు సంబంధించిన ప్రారంభ సూచనలు కనిపిస్తాయి. శతాబ్దాలుగా హఠ యోగ అభివృద్ధి అనేది యోగాను ప్రజాస్వామ్యీకరించడంలో కీలక పాత్ర పోషించింది. దానిని పూర్తిగా మతపరమైన, ఆచార వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయలేదు. ఇది యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం, ప్రజాదరణ పొందడంలో సహాయపడింది.
నలందలో నాగార్జున అభివృద్ధి చేసిన విద్యా సంప్రదాయం, బోధిసత్వాలు బుద్ధుడి భావనలకు సమానంగా ఉన్నాయనే ఆలోచనను ప్రచారం చేయడంలో సహాయపడింది.
క్రైస్తవ మతం ప్రారంభ దశలో అభివృద్ధి చెందడానికి కూడా బౌద్ధ మత ప్రభావం చాలా వరకు ఉందని చరిత్రకారులు నమ్ముతారు.

ఫొటో సోర్స్, REY Pictures/Alamy
ప్రపంచవ్యాప్తంగా నలంద పేరిట సంస్థలు
14వ శతాబ్దం ప్రారంభంలో నలంద మహావిహారం కార్యకలాపాలు నిలిపి వేసినప్పటికీ, అనేక విద్యాసంస్థలు, మఠాల స్థాపనకు స్ఫూర్తినిస్తూ దాని ప్రభ కొనసాగింది. నలంద వారసత్వం సజీవంగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో దానిని పునరుద్ధరించారు.
1951లో బిహార్‌లో న్యూ నలంద మహావిహారం స్థాపించారు. ప్రముఖ చైనీస్ యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్‌కు అంకితమిచ్చిన స్మారక మందిరం 1984లో ఇక్కడ ఏర్పాటుచేశారు.
1981లో సిక్కింలో కర్మ శ్రీ నలంద ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు. బిహార్‌లోని నలందలో 1987లో నలంద ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. 2010లో రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం స్థాపించారు.
శ్రీలంకలోని నలంద గెడిగె ఆలయం 8వ శతాబ్దానికి చెందినది. టిబెట్‌లోని లాసాకు ఈశాన్యంగా ఉన్న ఫెన్-యుల్ లోయలో సన్యాసి, స్కాలర్ కూడా అయిన రోంగ్‌టన్ షేజా కున్రిగ్ 1435లో ఫెన్పో నలేంద్ర అనే టిబెటన్ నలంద ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో 700 మంది సన్యాసులు నివసించేవారు. అక్కడికి వేల సంఖ్యలో సన్యాసులు వెళ్లేవారు. టిబెట్‌లోని వివిధ ప్రాంతాలలో దీనికి శాఖలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్ నుంచి అమెరికాకు..
1981లో లామా జోపా రింపోచే, లామా థుబ్టెన్ యేషేలు ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గల లావ్రేలో నలంద మఠాన్ని స్థాపించారు.
నలంద మహావిహార జ్ఞాపకార్థం 1989లో బ్రెజిల్‌లో నలంద బౌద్ధ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇక్కడ ఆశ్రమ సంప్రదాయాలను అనుసరించే ప్రయత్నం జరిగింది.
1999లో బ్రెజిల్‌లో నలందరామ రిట్రీట్ సెంటర్ స్థాపించారు. ఇది దక్షిణ అమెరికాలో అటవీ ధ్యానాన్ని అందించే మొదటి థేరవాద (రెండు ప్రధాన బౌద్ధ సంప్రదాయాలలో ఒకటి) కేంద్రంగా మారింది.
2000లో సువాండా హెచ్‌జే సుగుణశ్రీ కెనడాలోని టొరంటోలో 'నలంద కాలేజ్ ఆఫ్ బౌద్ధ స్టడీస్' స్థాపించారు.
2000లో దక్షిణ థాయ్‌లాండ్‌లోని హత్యాయిలో ఇంటర్నేషనల్ బౌద్ధ కళాశాల (ఐబీసీ) ఏర్పాటుచేశారు. వివిధ బౌద్ధ సంప్రదాయాలను ఒకచోట చేర్చి, ఒకరినొకరు ఎక్కువగా అర్థం చేసుకునేందుకు దీనిని నలంద నమూనాగా రూపొందించారు.

ఫొటో సోర్స్, Abhay K
2007లో మలేషియాలోని కౌలాలంపూర్ దక్షిణ శివార్లలో నలంద సంస్థను స్థాపించారు. దీనిని ఆ దేశంలో బౌద్ధ అధ్యయనాలను ప్రోత్సహించడానికి నలంద మహావిహార నమూనాగా రూపొందించారు.
2007లో అమెరికాలో సైకియాట్రిస్ట్ జో లోయిజో నలంద ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంటెంప్లేటివ్ సైన్స్‌ను స్థాపించారు, ఇది పురాతన నలంద విశ్వవిద్యాలయం నుంచి ప్రేరణ పొందింది.
ఆయన 1996లో కొలంబియా విశ్వవిద్యాలయం, వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీలలో కాంటెంప్లేటివ్ సైన్స్‌లో పరిశోధనలు చేశారు.
(ఇటీవల ప్రచురితమైన 'నలంద: హౌ ఇట్ చేంజ్డ్ ది వరల్డ్' పుస్తక రచయిత అభయ్ కె.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














