సదరన్ డార్విన్స్ ఫ్రాగ్స్: తండ్రి కావడానికి 11 వేల కి.మీ. ప్రయాణించిన కప్పలు

సైన్స్, ప్రకృతి, పర్యవరణం, జంతువులు, కీటకాలు

ఫొటో సోర్స్, Zoological Society of London

ఫొటో క్యాప్షన్, అప్పుడే పుట్టిన ఈ కప్పలు కేవలం అర సెంటీమీటర్ ఉంటాయి
    • రచయిత, టిమ్ డాడ్
    • హోదా, బీబీసీ న్యూస్ క్లైమేట్ అండ్ సైన్స్

అంతరించిపోతున్న జాతికి చెందిన మగ కప్పలు అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలకు జన్మనిచ్చాయి. ఫంగల్ డిసీజ్ కారణంగా అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో ఇది కూడా ఒక భాగం.

ఈ సదరన్ డార్విన్స్ రకం కప్పలు, వాటి తండ్రి గొంతు భాగంలో ఉండే సంచుల్లాంటి నిర్మాణంలో పెరిగి చెంది, నోటి ద్వారా పుడతాయి.

పిల్లలను పొదిగే ఈ తండ్రి కప్పలు చిలీ దక్షిణ తీరప్రాంతం నుంచి లండన్‌కు జూకు చేరుకోవడానికి బోటులో, విమానంలో, కారులో...ఇలా వివిధ మార్గాల ద్వారా 11 వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కప్పలను 1834లో చార్లెస్ డార్విన్ మొదటిసారి కనుగొన్నారు. నిర్బంధ ప్రదేశాల్లో ఉంచడం వల్ల వాటికి ఆయుక్షీణం అవుతుందని (వాటి ఆయుష్షు తగ్గుతుందని), అవి నివసించే అటవీ ప్రాంతాలను కూడా సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.

అత్యంత వినాశకరమైన అంటువ్యాధుల్లో ఒకటిగా మారిన ఫంగల్ డిసీజ్ 'యాంఫీబియన్ కైట్రిడియోమైకోసిస్' దాదాపు 500లకి పైగా యాంఫీబియన్ (ఉభయచర) జాతులను ప్రభావితం చేసింది.

దక్షిణ చిలీలోని పార్క్ టంటాకో అటవీ ప్రాంతాల్లోని ఈ సదరన్ డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో సర్వేలు నిర్ధరించాయి. ముఖ్యంగా, కప్పలు ఈ వ్యాధి బారినపడతాయి. ఈ ఫంగల్ డిసీజ్ కారణంగా ఏడాదిలోపే వాటి జనాభా 90 శాతం తగ్గినట్లు తేలింది.

నిరుడు అక్టోబర్‌లో, లండన్ జూకి చెందిన కన్జర్వేటర్లు కైట్రిడ్ సోకని కప్పలను గుర్తించారు.

అయితే, వాటిని గుర్తించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే, అవి చాలా చిన్నవిగా ఉండటమే కాక, నాచులో కలిసిపోయి ఉంటాయి.

సైన్స్, ప్రకృతి, పర్యవరణం

ఫొటో సోర్స్, Zoological Society of London

ఫొటో క్యాప్షన్, సదరన్ డార్విన్స్ కప్పల జనాభా పెంచడంపై తాము చేస్తున్న ప్రయత్నాలు చిలీలో అంతరించిపోతున్న జాతుల పునరుద్ధరణకు మద్దతు అవుతుందని లండన్ జూ భావిస్తోంది

వాతావరణం వాటికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేకంగా తయారుచేసిన బాక్సుల్లో, కష్టతరమైన మార్గంలో, వేల మైళ్ల దూరం వాటి ప్రయాణం సాగింది. ఆరు గంటల పాటు బోటులో, ఆ తర్వాత చిలీ రాజధాని శాంటియాగోకి 15 గంటల రోడ్డు ప్రయాణం, ఆ తర్వాత విమానంలో యూకేలోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి.

2 గ్రాముల కంటే తక్కువ బరువు, 3 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్రతి మగ కప్ప, వాటి గొంతుభాగంలోని శిశుకప్పలు పూర్తిగా కప్పలుగా రూపాంతరం చెందేవరకూ వాటిని మోస్తూనే ఉంటుంది.

నేచురల్ హిస్టారియన్, బయాలజిస్ట్ అయిన సర్ డేవిడ్ అటెన్‌బరో రూపొందించిన నేచర్ సిరీస్ 'లైఫ్ ఆన్ ఎర్త్'లో ఈ 'సదరన్ డార్విన్స్' కప్ప జన్మిస్తున్న క్షణాలను చూడొచ్చు.

లండన్ జూలో యాంఫీబియన్స్‌కు క్యురేటర్‌గా పని చేస్తున్న బెన్ టాప్లే ఇలా అన్నారు. ''కైట్రిడ్ ఫంగస్ బారి నుంచి డార్విన్ కప్పను రక్షించేందుకు చేస్తున్న కృషిలో ఇదో మైలురాయి లాంటిది. ఈ కప్పల తండ్రులను పెంచేపని సక్సెస్ కావడం, వాటిని సంరక్షించవచ్చనే ఆశకు శక్తివంతమైన చిహ్నం లాంటిది. పర్యావరణవేత్తలు సమన్వయంతో పనిచేస్తే ఏం చేయగలరనేదాన్ని ఇది తెలియజేస్తుంది'' అని ఆయన అన్నారు.

''ఈ కప్పలు వాటి జాతి మనుగడలో కీలకంగా మారడం మాత్రమే కాదు, ఈ కైట్రిడ్ ఫంగస్‌ను ఎలా ఎదుర్కోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఉభయచరాలను ఎలా కాపాడుకోవాలనే విషయాలను మరింతగా అర్థం చేసుకునేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి'' అని జెడ్‌ఎస్ఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ రీసర్చ్ ఫెలో ఆండ్రెస్ వాలెన్జులా సాంచెజ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)