సైబర్ నేరాలు: స్క్రీన్ షేర్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ సుల్తాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'' ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుకునేలా మీ ఖాతాను మార్చాలంటే , మీ కంప్యూటర్ స్క్రీన్‌ను షేర్ చేయాల్సి ఉంటుంది'' అని అవతలి వ్యక్తి ఫోన్‌లో చెబుతున్నాడు. ఆ వ్యక్తి చెప్పినట్టుగానే రాజేశ్ (నిజమైన పేరు కాదు) తన స్క్రీన్ షేర్ చేశాడు. అంతే.. క్షణాల వ్యవధిలో ఆయన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయింది.
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అయినప్పటికీ, చాలామంది ఇలాంటి మోసాలకు బాధితులుగా మారుతున్నారు.
సైబర్ నేరగాళ్లు స్క్రీన్ షేరింగ్ అనే పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. దీని ద్వారా, మీ కంప్యూటర్‌ను వారి నియంత్రణలోకి తీసుకుని, మీ అకౌంట్ నుంచి వారి అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేసుకుంటారు. అది కూడా మీ కళ్లముందే. కానీ ఈ విషయం మీరు గమనించేలోపే మీ ఖాతాలోని సొమ్మంతా మాయమైపోతుంది.
మరి రాజేష్‌లా మోసపోకూడదంటే ఏం చేయాలి. కొన్ని ముందుజాగ్రత్తలతో ఇలాంటి మోసాలబారినపడకుండా ఉండొచ్చు.
అసలు ఇంతకీ ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి? సైబర్ నేరగాళ్లు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు? దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖకు చెందిన 'సైబర్ కవచ్'లో పొందుపరిచారు.

మర్యాదగా మాట్లాడి...
రాజేష్ తన అకౌంట్ ద్వారా కొన్ని ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలనుకున్నారు. కానీ, దాని గురించి తగినంత సమాచారం రాజేష్‌కు తెలియదు. వెంటనే బ్యాంకుకు వెళ్లడం కూడా రాజేష్‌కు కుదరలేదు. ఫోన్ ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుని రాజేష్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలనుకున్నారు.
కానీ, రాజేష్ వద్ద బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా లేదు. దీనికోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఈమేరకు ఆయనకో నెంబర్ దొరికింది. ఆ నెంబర్‌ను తీసుకుని, రాజేష్ దానికి ఫోన్ చేశారు.
అవతలి వ్యక్తి చాలా మర్యాదగా రాజేష్‌తో మాట్లాడాడు. రాజేష్ చెబుతున్నదంతా క్షుణ్ణంగా విన్న ఆ వ్యక్తి, ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు లావాదేవీలు జరపడానికి తగిన సాయం చేస్తానంటూ నమ్మబలికాడు. ఈమేరకు రాజేష్ నుంచి కొంత సమాచారం తీసుకున్న తర్వాత, మీ కంప్యూటర్ ద్వారా మీ ఖాతాల్లో కొన్ని సెట్టింగులు చేయాలని చెప్పారు. ఇందుకోసం కంప్యూటర్ స్క్రీన్‌ను షేర్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. అవతలి వ్యక్తిని పూర్తిగా నమ్మిన రాజేష్ స్క్రీన్ షేర్ చేయమంటే ఏమాత్రం ఆలోచించకుండానే సరేనన్నారు.
ఎందుకంటే, రాజేష్ అవతలి వ్యక్తిని బ్యాంకు ప్రతినిధిగానే నమ్మారు. అంతేకాక తన బాధను అర్థం చేసుకున్నవ్యక్తిలాగా ఆయనకు అనిపించాడు.
ఆ వ్యక్తి చెప్పినవన్నీ చేసిన రాజేష్, కొంతసేపటి తరువాత తన కంప్యూటర్ స్క్రీన్‌ను ఆ వ్యక్తికి షేర్ చేశాడు. వెంటనే రాజేష్ కంప్యూటర్‌లో ఆ వ్యక్తి ఏదో చేశాడు. తరువాత రాజేష్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో రాజేష్ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా అయినట్లు కనిపించింది. ఆ తర్వాత బ్యాంకు ప్రతినిధిగా మాట్లాడిన వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
ఏం జరిగిందో అర్ధం చేసుకునేలోపే రాజేష్ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయింది. పైగా ఇదంతా ఎలా జరిగిందో ఆయనకు అసలు అర్థం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నేరగాళ్ల ఆట ఇది
ఈ కేసులో రాజేష్ తప్పులను మోసగాళ్లు అనువుగా తీసుకున్నారు. రాజేష్ కస్టమర్ కేర్ నెంబర్‌ను ఆన్‌లైన్ నుంచి సేకరించి తప్పు చేశారు. కనీసం ఆయన ఆ నెంబర్‌ను ధృవీకరించుకోలేదు.
తరచూ సైబర్ నేరగాళ్లు సెర్చ్ ఇంజిన్ల ద్వారా తమ నెంబర్లను కస్టమర్ కేర్ నెంబర్ల మాదిరి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. దీంతో రాజేష్ లాంటివారు ఎవరైనా పొరపాటున ఈ నెంబర్లను ధృవీకరించుకోకుండా కాల్ చేస్తే, అవతలివారు బ్యాంకు కస్టమర్ కేర్ ప్రతినిధిలా మాట్లాడి మోసం చేస్తారు. రాజేష్ కూడా ఇలాంటి ట్రాప్‌లోనే చిక్కుకున్నారు. రాజేష్‌తో మాట్లాడింది బ్యాంకు ప్రతినిధి కాదు, సైబర్ నేరగాళ్ల గ్యాంగులోని ఒక వ్యక్తి.
మరో విషయం రాజేష్ తన సమస్యను వివరించిన తర్వాత, బ్యాంకు ప్రతినిధిగా భావించిన సైబర్ నేరగాడు చేయమన్న పనులన్నీ రాజేష్ చేశారు.రాజేష్‌ను పూర్తిగా నమ్మించిన అవతలి వ్యక్తి రాజేష్ కంప్యూటర్‌లో కొన్ని సెట్టింగ్స్ చేయాలని చెప్పాడు. సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఆన్‌లైన్ లో బ్యాంకు లావాదేవీలు చేసుకోగలుగుతారని అన్నాడు. పైగా ఆ సెట్టింగ్స్‌ను ఖాతాదారులు సొంతంగా చేసుకోలేరని, తామే ఖాతాదారు కంప్యూటర్‌లో మార్పులు చేస్తామని, ఇందుకోసం కంప్యూటర్ స్క్రీన్ షేర్ చేయాలని చెప్పాడు. కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో రాజేష్‌కు బ్యాంకు ప్రతినిధిగా మాట్లాడిన సైబర్ నేరగాడు వివరించాడు.
వాటిని రాజేష్ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయించారు. అవన్నీ చేసిన తర్వాత, స్క్రీన్‌ను షేర్ చేశారు రాజేష్. దీంతో ఆయన ల్యాప్‌టాప్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఫలితంగా రాజేష్ అకౌంట్ నుంచి వాళ్ళు డబ్బులను విత్ డ్రా చేసేశారు. ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశారు. ఎన్నోసార్లు రాజేష్ ఆ నెంబర్‌కు కాల్ చేశారు. కానీ, ఆ నెంబర్ కలవలేదు.
నిజానికి రాజేష్ కొన్ని జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ సమస్యను ఎదుర్కొనే వారు కాదేమో.
మరి ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి
రాజేష్ ఎదుర్కొన్న ఈ ఆర్థిక మోసం అంత తేలికైన విషయం కాదు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి తీసుకున్న నెంబర్‌ను రాజేష్ వెరిఫై చేసుకోలేదు.
బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ సంబంధిత బ్యాంకు పాస్‌బుక్‌పై ముద్రించి ఉంటుంది. అలాగే, సంబంధిత బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లభ్యమవుతాయి.
ఆ తర్వాత రాజేష్ తన కంప్యూటర్ స్క్రీన్‌ను షేర్ చేశారు. సైబర్ నేరగాళ్లు చెప్పినవన్నీ చేసి, నేరుగా క్రిమినల్స్ చేతికే రాజేష్ తన ల్యాప్‌టాప్ నియంత్రణను ఇచ్చారు.
ఏ బ్యాంకు ప్రతినిధులు కూడా ఖాతాదారుల కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను షేర్ చేయమని అడగరు. అలాగే, బ్యాంకు అకౌంట్ నెంబర్ లేదా పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా కోరరు.
మొబైల్ ఓటీపీలతో అనుసంధానమై, బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎవరితో కూడా ఈ ఓటీపీని షేర్ చేసుకోకూడదు. అయితే ఓటీపీలు లేకుండా కూడా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు.
అందుకే ఎవరినో నమ్మి వారిచ్చే సూచనలతో మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌లో ఎలాంటి యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.
ఏం చేయచ్చు, ఏం చేయకూడదు?
మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేయాలనుకుంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏం చేయచ్చు, ఏం చేయకూడదు అనే విషయాలపై సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారాన్ని పొందాలి.
కంప్యూటర్ల గురించి సరైన పరిజ్ఞానం ఉండటం చాలా ముఖ్యం.
పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు నడిపేటప్పుడు సాంకేతిక విషయాలు పట్టించుకోకపోవడాన్ని సైబర్ క్రిమినల్స్ ఆయుధంగా మార్చుకుంటున్నారు.
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ఏం చేయాలో చెప్పినట్లే, ఏం చేయకూడదో చెప్పాలి. ఓటీపీలు లేదా బ్యాంకు పాస్‌వర్డ్‌లు ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే, మీ కంప్యూటర్ స్క్రీన్‌ను ఎవరికీ షేర్ చేయకూడదు. లేదా ఎవరికి ఈ కంప్యూటర్‌పై నియంత్రణ ఇవ్వకూడదు.
మీ పాసు బుక్ పై ఉన్న బ్యాంకు నెంబర్లకు ఫోన్ చేసి ఏ విషయాన్నైనా ధృవీకరించుకోవాలి. అన్నింటికంటే మీ ఆన్‌లైన్ లావాదేవీల గురించి బ్యాంకుకు వెళ్లి క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యం. మీ జాగ్రత్తే మీ బ్యాంకు ఖాతాను కాపాడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














