సావిత్రమ్మ: ఈమె పిలవగానే పులులు, సింహాలు పోటీపడి పరిగెత్తుకుంటూ వస్తాయి..

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
"చిన్నూ, బంగారి.... రండి...."
సావిత్రమ్మ పిలుపు వినగానే... ఇనుప కంచెకు అవతలి వైపు ఉన్న చిరుత పులులు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. కంచెలోంచి లోపలికి పెట్టిన ఆమె చేతిని అందుకోడానికి పోటీపడతాయి.
భారత్ అంతటా చిరుత పులులు తరచూ మనుషులపై దాడి చేస్తాయనే వార్తలు పెరుగుతున్నప్పటికీ... బెంగళూరులోని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్కులో కనిపించే దృశ్యాలు ఇవి.
బెంగళూరులోని విధానసౌధకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఉంటుంది. 1800 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ జూలో పులులు, సింహాలు, చిరుత పులులతో పాటూ ఏనుగులు, ఎలుగుబంట్లు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి.
అయితే, ప్రస్తుతం ఇక్కడున్న జంతువుల్లో చాలా వరకూ ప్రాణాపాయ పరిస్థితుల్లో అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి తీసుకొచ్చినవే ఉంటున్నాయి.
అలా చిన్నతనంలో తల్లికి దూరమవడం, తల్లి చనిపోవడం లేదా జబ్బు పడడంతో జూ హాస్పిటల్‌కు తీసుకువచ్చే చిరుత పులులు, సింహాలు, పులులు లాంటి ఎన్నో జంతువుల కూనలకు అమ్మగా మారారు సావిత్రమ్మ.


క్లీనర్ కేర్ టేకర్ అయ్యారు.
సావిత్రమ్మ కూడా ఇక్కడికి రావడం అనుకోకుండానే జరిగింది. భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం మీద ఆమెకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది.
2002లో మొదటిసారి ఉద్యోగం వచ్చినపుడు పార్కును శుభ్రపరిచే ఉద్యోగుల్లో ఒకరిగా సావిత్రమ్మ చేరారు. ఆ తర్వాత త్వరగానే అక్కడి జంతువులకు ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు. దీంతో, కొన్ని రోజులకే ఆమెను కేర్ టేకర్‌గా జూ హాస్పిటల్‌కు మార్చారు.
ఉదయం 8.30 గంటలకు జూ హాస్పిటల్లో తన దినచర్య మొదలవుతుందని సావిత్రమ్మ చెప్పారు.
''పొద్దున్నే వచ్చి ఆఫీస్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత పులి కూనలకు వేసిన బట్టలు, బెడ్డు మార్చి రెడీ చేస్తాను. పిల్లలకి పాలు కాస్తాను. ఇక్కడున్న కేజ్ అంతా శుభ్రంగా కడిగి వాటికి నీళ్లు పెట్టాలి. అప్పుడే పుట్టిన పిల్లలు, ఒకరోజు పిల్లలూ వస్తాయి. సింహం, చిరుత, పులి, జింకలు అన్నీ తీసుకొస్తారు. వాటి తల్లి వాటిని చూసుకుంటే తీసుకురారు. అవి సరిగా చూడకపోతే ఇక్కడకు తీసుకొచ్చి పెద్ద అయ్యేవరకూ పెంచి సఫారీలో వదులుతాము.'' అని సావిత్రమ్మ తెలిపారు.

దాదాపు పాతికేళ్ల నుంచీ కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాననీ, ఎప్పుడూ క్రూరమృగాల వల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు సావిత్రమ్మ.
''అవి మమ్మల్ని ఏం చేసేది లేదు. వాటిపైన మాకు నమ్మకం ఉంటుంది. మేము వెళ్లి అంత క్లీన్ చేసి వస్తాము. చిన్నపిల్లలప్పుడు నుంచి చూసుకుంటాము. దానివల్ల అవి మమ్మల్ని ఏమీ చేయవు. వాటిని చూడడానికి మేము ఎవర్ని పంపించం. ఎవరైనా వస్తే గాబరా అవుతాయి. కొన్నిసార్లు అవి మాతో ఆడేటప్పుడు, చిన్న దెబ్బలు తగులుతాయి. దానికి కొంత మందు వేసుకుంటే సరిపోతుంది.'' అని సావిత్రమ్మ చెప్పారు.

కూనలు జబ్బు పడితే...
మూగ జీవులు అనారోగ్యానికి గురైతే ఎలా గుర్తిస్తారో సావిత్రమ్మ చెప్పారు.
''హెల్త్ బాగా లేకుంటే వాటిలో హుషారు ఉండదు. భోజనం తినవు. చప్పుడు చేయకుండా ఉంటాయి. పిల్లలను రోజూ చెక్ చేస్తుంటాం. వచ్చినప్పుడు ఎట్లుంది ఏమి అని చూస్తుంటాం. అప్పుడు ఏదైనా ఒకటి నలతగా ఉంటే వెంటనే మా డాక్టర్‌కు చెప్తాము. ఆరోగ్యం బాగాలేదు అంటే దానికి సరిచేస్తాము. వాటికి కడుపునొప్పి వచ్చింది అంటే మొదట లూజ్ మోషన్ అయ్యి, అన్నం తినవు. అప్పుడు మాకు తెలుస్తుంది. దీంతో, మేం డ్రాప్స్ వేసి మూడు నాలుగు రోజుల్లో బాగు చేస్తాము.'' అని తెలిపారు.

జూ హాస్పిటల్‌కు వచ్చే జంతువుల పిల్లలను సాధారణంగా మూడు నెలల వరకూ పాలిచ్చి పెంచుతారు. చిన్న పిల్లలకు తల్లులు బాటిల్ పాలు పట్టినట్లు అప్పుడే పుట్టిన జంతువుల పిల్లలకు పాలు తాగిస్తారు సావిత్రమ్మ.
''ఫస్ట్ పాలు తాగించేందుకు కొంత కష్టమే. సిరంజిలో లేదా నిప్పల్లో ఇస్తాము. ఒక నెల అయిన తర్వాత బాగా తాగుతాయి. అప్పుడే పుట్టిన పిల్లలు వస్తాయి, చిన్న పాపలు వస్తాయి. చిరుత పిల్లలు, పులి పిల్లలు, సింహం పిల్లలు, జింక పిల్లలు, ఆస్ట్రిచ్, కోతి పిల్లలు అన్ని వస్తాయి. చిన్న పాప నుంచి చూస్తాం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా అవి మమ్మల్ని ఏమీ చేయవు.'' అని అన్నారు.
ఇంట్లో చిన్న పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో జంతువుల పిల్లలను అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె చెప్పారు. ''పది నిమిషాలకి 20 నిమిషాలకి అలా కొంచెం కొంచెం ఆహారం ఇస్తుంటాం. అప్పుడప్పుడు వెళ్లి చూస్తుంటాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.'' అని తెలిపారు.

‘మొదట భయం, ఇప్పుడు ప్రేమ...’
సావిత్రమ్మ ఈ ఉద్యోగంలోకి అనుకోకుండా వచ్చారు.
''నా భర్త ఇక్కడ పనిచేసేవాడు. ఆయన హఠాత్తుగా చనిపోయారు. దీంతో ఆయన పని నాకు ఇచ్చారు. ఆఫీసులో శుభ్రం చేస్తుండాలని చెప్పారు. తర్వాత జంతువుల పిల్లలు ఇక్కడికి వస్తూ ఉండేవి. వాటిని చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడే 20 సంవత్సరాలు అయింది. నాకు ఇద్దరు మగ పిల్లలు. ఒకరు పనికి పోతున్నారు. ఒకరు చదువుకుంటున్నారు. నేను ఇక్కడ చేసుకుంటున్నాను. నా పెద్దకొడుకుకు పెళ్లయి, ఒక బాబు కూడా ఉన్నాడు.'' అని తెలిపారు.
బన్నేరుఘట్టలోనే ఒక అద్దె ఇంట్లో ఉంటున్న సావిత్రమ్మ.. జూ హాస్పిటల్లో జంతువుల పిల్లలను చూసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నారు.
''వీటినంత చూసుకోవడం మేము ఏదో పుణ్యం చేసుకుని ఉంటాము అనిపిస్తుంది. ఇక్కడ వీటినిపెంచి, పెద్దవి అయ్యక సఫారీలో వదిలేస్తాం. ఇక్కడ చిన్ను, బంగారి అంటాము. అక్కడికి పోయి నా గొంతు వినిపిస్తే చాలు, పరుగెత్తుకుంటూ వస్తాయి.'' అని తెలిపారు.

మొదట్లో జంతువులను చూసి భయపడ్డ సావిత్రమ్మ ఇప్పుడు వాటిని తన పిల్లల్లా చూసుకుంటున్నారు.
''అప్పట్లో మేం ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లిన వాళ్ళం కాదు. ఇంట్లోనే ఉండేవాళ్లం. మొదట్లో వాటిని చూసినప్పుడు భయమేసేది. కానీ పిల్లలను చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాను. వీటి వల్లనే మేం అన్నం తింటున్నాం. ఉదయం వచ్చిన వెంటనే ఒక రౌండ్ వెళ్లి వాటితో మాట్లాడి వస్తా. నేను వచ్చి నిల్చుంటే వచ్చి నాతో మాట్లాడుతాయి. అది నాకు సంతోషంగా ఉంటుంది.'' అని తెలిపారు.
పిల్లలు పెద్దవైన తర్వాత సఫారీకి వెళ్లిపోతుంటే బాధగా ఉంటుందని సావిత్రమ్మ చెబుతున్నారు. అందుకే అప్పుడప్పుడూ సఫారీ దగ్గరకు వెళ్లి తాను పెంచిన జంతువులను చూసి సంతోషిస్తుంటానని ఆమె చెప్పారు.

‘అమ్మను చూసి గర్వంగా ఉంటుంది’
సావిత్రమ్మ పెద్ద కొడుకు శశధర్ జూలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. జూకు వచ్చే వాళ్లంతా అమ్మ గురించి అడుగుతుంటే గర్వంగా ఉంటుందని ఆయన బీబీసీతో చెప్పారు..
''మీ అమ్మ ఇలా జంతువుల పిల్లల్ని చూసుకోవడం మీకు ఎలా అనిపిస్తుందని అంటారు. నేను ఎప్పటినుంచో చూస్తున్నా. అప్పుడప్పుడు నేను కూడా మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె వాటిని సాకడం చూసి వస్తుంటా.'' అని శశిధర్ అన్నారు.

మొదట్లో జంతువుల బోన్లు శుభ్రం చేసే పని చేసిన సావిత్రమ్మ, ఇప్పుడు రెస్క్యూలో భాగంగా జూ హాస్పిటల్‌కు వచ్చిన జంతువుల పిల్లలు కోలుకోవడంలో కీలకంగా మారారని జూ వెటర్నరీ ఆఫీసర్ ఆనంద్ బీబీసీతో చెప్పారు.
''జూ నుంచి, సఫారీ నుంచి ఏదైనా జబ్బు పడ్డ జంతువు వస్తే దాన్ని మేం కొన్ని రోజులు ఇక్కడే ఉంచుతాం. ఆపరేషన్ చేసిన తర్వాత లేదా జబ్బు పడిన తర్వాత దాన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక్కడ ఇంకా కొన్ని జంతువులు ఉన్నాయి. వాటికి ఫీడింగ్, లాంటివి సావిత్రమ్మ చూసుకుంటారు.. ఇక్కడ 8 మంది జూ కీపర్స్ ఉన్నారు. వారు కూడా ఆమెకు సాయంగా ఉంటారు.'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














