కారు ప్రమాదంలో పిల్లి మృతి, దాని మీద ప్రేమతో స్థానికులు ఏం చేస్తున్నారంటే..

ఫొటో సోర్స్, Edinburgh's West End
- రచయిత, ఆంగీ బ్రౌన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎడిన్‌బ్రాలో రెండేళ్ల కిందట ఒక కారు ప్రమాదంలో చనిపోయిన ఒక పిల్లికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు స్థానికులు. ఈ మేరకు కౌన్సిల్‌లో ప్రణాళికలు సమర్పించారు.
ఎడిన్‌బ్రాలోని వీధుల్లో తరచూ కనిపించే హ్యూగో అనే పిల్లి అక్కడి స్థానికులకు బాగా సుపరిచితం.
తాము ఎంతగానో మిస్ అవుతున్న ఆ పెంపుడు పిల్లి కోసం స్థానికులు అచ్చం దాని పరిమాణంలో ఉన్న ఒక విగ్రహాన్ని ప్రతిపాదించారు. సందర్శకుల సంఖ్యను పెంచడంతో పాటు, తమ కమ్యూనిటీని ఏకం చేయాలనే ఆలోచనతో ఈ చర్యకు పూనుకున్నారు.
ఒకవేళ ఈ ప్రతిపాదనకు అమోదం లభిస్తే ఎడిన్‌బ్రాలో ఏర్పాటయ్యే 16వ జంతు శిల్పం అవుతుంది. ఎడిన్‌బ్రాలో ఇప్పటికే పురుషులు, మహిళలు కలిపి మొత్తం 79 విగ్రహాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, Alan Beattie Herriot
ఎడిన్‌బ్రా ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన 'వోజ్టెక్ ద బియర్' అనే విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అలన్ బియాటీ హెరియట్, ఈ పిల్లి విగ్రహాన్ని కూడా రూపొందించనున్నారు.
ఈ విగ్రహం నిర్మాణం కోసం ఆ కమ్యూనిటీ ప్రజలు ఇప్పటికే వేల పౌండ్లను సేకరించినట్లు తెలుస్తోంది. విలియం స్ట్రీట్‌లోని ఒక గోడపై ఈ పిల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని వారు భావిస్తున్నారు.
రాజధానిలోని పౌడర్‌హాల్ బ్రాంజ్ ఫౌండ్రీలో దీని కాంస్య నమూనాను తయారు చేస్తారు.
అరేబియన్ మవూ జాతికి చెందిన హ్యూగోను స్థానిక మహిళ జేన్ రూథర్‌ఫర్డ్ పెంచుకునేవారు. హ్యూగోకు ఆరు నెలల వయస్సున్నప్పటి నుంచి ఆమె దగ్గరే ఉంది. దోహా నుంచి ఆమె ఎడిన్‌బ్రాకు హ్యుగోను తీసుకొచ్చారు.
ఎడిన్‌బ్రాలోని వెస్ట్ ఎండ్‌లో హ్యుగో చాలా పాపులర్ అయింది. అక్కడి చాలామంది దాని బాగోగులు చూసేవారు.
ఏడేళ్ల వయస్సున్నప్పుడు 2023లో ఒక కారు ప్రమాదంలో హ్యుగో మృతి చెందింది.
హ్యుగో మరణం తర్వాత, ఒకవేళ డ్రైవర్లు పిల్లిని ఢీకొడితే రిపోర్ట్ చేసే విధంగా చట్టాన్ని మార్చాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Alan Beattie Herriot
జేన్ రూథర్‌ఫర్డ్ వయస్సు 55 ఏళ్లు. ఆ పిల్లి గురించి ఆయన మాట్లాడుతూ, ''నేను హ్యూగోను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పటికీ విలియం స్ట్రీట్‌కు వెళితే హ్యుగో కోసం వెతుకుతుంటాను. ఆ వీధిలో హ్యుగో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే హ్యుగో అన్ని పిల్లుల్లాంటిది కాదు. లక్షల్లో ఒకటి ఇలా ఉంటుంది. చాలా అమాయకురాలు హ్యుగో.'' అని జేన్ అన్నారు.
విగ్రహ ఏర్పాటుకు ఇంకా అనుమతి ఎందుకు రాలేదో తనకు అర్థం కాలేదని బీబీసీతో వెస్ట్ ఎండ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఎంగేజ్‌మెంట్ ఆఫీసర్ పాల్ హాంకాక్ అన్నారు.
''వెస్ట్ ఎండ్‌లో చాలామంది ప్రజలు ఇప్పటికీ హ్యుగోను గుర్తుపెట్టుకున్నారు. వారికి అదంటే చాలా ప్రేమ. మా ఫేస్‌బుక్ పేజీలో తరచుగా హ్యుగో ఫోటోలు కనిపిస్తుంటాయి. వెస్ట్ ఎండ్‌లో హ్యుగో అందరికీ తెలుసు. ప్రజలు హ్యుగో కోసం వెస్ట్ ఎండ్‌కు వస్తారని మేం భావిస్తున్నాం. ఇక్కడ వ్యాపారం కాస్త తక్కువగా నడుస్తోంది. సందర్శకుల రాకతో మా వ్యాపారం పెరుగుతుందని అనుకుంటున్నాం. అలాగే అందరి ప్రేమకు హ్యుగో ఒక గుర్తు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Alan Beattie Herriot
హ్యుగో విగ్రహం రూపొందించే ప్రాజెక్టుపై చాలా ఉత్సాహంగా ఉన్నానని శిల్పి అలన్ బియాటీ హెరియట్ అన్నారు.
''ఎడిన్‌బ్రాలోని వెస్ట్ ఎండ్ వీధుల్లో హ్యుగో అందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్. అలాంటి హ్యుగో విగ్రహాన్ని రూపొందించడం చాలా బాగుంది. సిటీలోకి వచ్చే సందర్శకులకు కూడా ఇదొక మంచి స్పాట్‌గా మారుతుంది. నాకు చేతనైనంత అందంగా ఆ శిల్పాన్ని తయారుచేస్తాను. ఆ విగ్రహం చాలాకాలం పాటు అక్కడే ఉంటుందని ఆశిస్తున్నా'' అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














